ఎనిమిదిరెట్ల విచారం

17 Nov, 2018 00:46 IST|Sakshi

ప్రజల కష్టసుఖాలు స్వయంగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ఓ రాజు, మంత్రి మారువేషాలలో విపణి వీధిలోంచి వెళ్తున్నారు. అది శీతాకాలం. పూలు, పళ్లు, మిఠాయిలు, అరుదైన వస్తువులు, వస్త్రాలు తదితరాలు అమ్మేవారితో వీధి అంతా కోలాహలంగా ఉంది. ఒక ఉన్ని వస్త్రాల దుకాణం ముందు ఆ దుకాణదారుడు దిగులుగా కూర్చుని ఉన్నాడు. అది చూసి రాజూ మంత్రీ అతని వద్దకెళ్లి ఎందుకంత విచారంగా ఉన్నావని అడిగారు. అందుకు అతడు ‘ఏమి చెప్పమంటారు స్వామీ, శీతాకాలం వస్తోందని నాణ్యమైన శాలువాలు కశ్మీరు నుంచి తెప్పించాను. ఈ ఏడాది చలి లేకపోవడంతో ఒక్కటీ అమ్ముడు పోలేదు. అవి అమ్మగా వచ్చిన లాభాలతో ఇల్లు గడుపుకోవాలి, వచ్చే సంవత్సరానికి కావలసిన పెట్టుబడి కూడా సమకూర్చుకోవాలి. ఇలా అయితే ఎలా?’’ అని వాపోయాడు. రాజు మరునాడు ఒక చాటింపు వేయించాడు.

ఇకనుంచి రాజసభకు వచ్చేవాళ్లందరూ శాలువాలు కప్పుకుని రావాలి, లేకుంటే జరిమానా  ఉంటుంది అని. అందరూ విధిగా రాజాజ్ఞను పాటించసాగారు. కొంతకాలం గడిచాక రాజూ, మంత్రీ తిరిగి మారువేషాలలో ఆ దుకాణదారు వద్దకు వెళ్లారు. అయితే వారు ఊహించినట్లుగా దుకాణదారు సంతోషంగా లేకపోగా మరింత విచారంగా కనిపించాడు. వారతన్ని కుశల ప్రశ్నలు వేశారు.‘‘ఏం చెప్పమంటారు స్వామీ, ఏదో అద్భుతం జరిగినట్లుగా నా శాలువాలన్నీ ఒక్కటీ లేకుండా అమ్ముడుపోయాయి’’ అని చెప్పాడు.‘‘మరి నువ్వు సంతోషంగా ఉండాలి కదా, అలా విచారంగా ఎందుకున్నావు’’అనడిగారు.

‘‘మొదట నేను సామాన్య లాభానికి అమ్మేవాణ్ణి. కానీ గిరాకీ పెరగడంతో రెట్టింపు లాభానికి కొన్నింటినీ, ఇంకా గిరాకీ ఉండటంతో నాలుగురెట్ల ధరకి అమ్మాను. ఇప్పుడు ఒకే ఒక్క శాలువా మిగిలింది. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఎలాగైనా తనకి ఆ శాలువా అమ్మమనీ, ఎంత ధర అయినా ఇస్తాననీ బతిమాలేడు. అప్పుడతనికి ఎనిమిదిరెట్లు లాభానికి అమ్మాను’’ అన్నాడు. ‘‘అంత లాభం వచ్చింది కదా, ఇంకెందుకు విచారం?’’ అన్నాడు రాజు ఆశ్చర్యంగా. ‘నేను మొదట్లోనే ఆ ధర చెప్పి ఉంటే నాకెంత లాభం వచ్చేది? మామూలుగా అమ్మడం వల్ల ఎంత నష్టం వచ్చింది?’’ అని వాపోయాడా వర్తకుడు. జీవించేందుకు ఆశ కావాలి. దుఃఖపడటానికి నిరాశ, దురాశలే కారణం. 
– డి.వి.ఆర్‌. 

మరిన్ని వార్తలు