గద్దెనొదిలిన రాజు

22 Dec, 2018 00:32 IST|Sakshi

చెట్టు నీడ / క్రిస్మస్‌ స్పెషల్‌

కన్నకొడుకైన అబ్షాలోము తిరుగుబాటు చేస్తే దావీదు చక్రవర్తి తన వందలాది మంది అనుచరులతో రాత్రికి రాత్రి కట్టుబట్టలతో రాజధాని వదిలి యోర్దాను నది దాటి అక్కడి అరణ్యంలో తలదాచుకున్నాడు. కాని అన్ని వందలమందికి ఆ మహారణ్యంలో ఆహారం తదితర అవసరాలు తీరేదెలా? నేను ఆకాశానికెక్కినా, పాతాళంలో పడుకున్నా, ఎక్కడున్నా దేవుడు తనను వదలడంటూ దావీదు అంతకు మునుపు ఒక కీర్తన రాసుకున్నాడు (కీర్తన 139). అతను విశ్వసించినట్టే, దావీదు సింహాసనాన్ని వదిలేసినా దేవుడు దావీదును వదల్లేదు. చిన్న రొట్టెముక్క కూడా దొరకని ఆ భీకారణ్యంలో గిలాదు వాడైన బర్జిల్లయి అనే 80 ఏళ్ల వృద్ధ ధనికుడు మరో ఇద్దరితో కలిసి.. దావీదు, అతని వందలమంది అనుచరులకు పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలు, కాయధాన్యాలు, చిక్కుడు కాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు... ఇంకా మరెన్నో పుష్కలంగా సమకూర్చాడు (2 సమూ 17:28, 29). ఇంత ధారాళంగా, ఆనందంగా, అడక్కుండానే సమకూర్చడానికి ధనముంటే సరిపోదు.

ఔదార్యం, దేవుని పట్ల ప్రేమ కూడా ఉండాలి. అవి బర్జిల్లయికి పుష్కలంగా ఉన్నాయి. రాజునైనా గద్దెనొదిలేస్తే లోకం లోకువగానే చూస్తుంది. పైగా దావీదుకు సాయం చేస్తే అబ్షాలోముకు శత్రువునవుతామన్న భయమూ ఉంటుంది. కాని బర్జిల్లయి దావీదు పట్ల తన విధేయతను, ప్రేమను కష్టకాలంలో క్రియల రూపంలో ప్రకటించాడు. పదిరూపాయలిచ్చి పదివేలు రాబట్టే స్వార్థపూరితమైన లోకంలో, రాజవంశస్తుడయ్యే భాగ్యాన్ని కూడా వదిలేసుకున్న ప్రతిఫలాపేక్షలేని ఔదార్యం, ఆదర్శ జీవితం బర్జిల్లయిది. అతనికి ఇవ్వడమే తప్ప తీసుకోవడం; చెయ్యడమే తప్ప చేయించుకోవడం అలవాటు లేదు. బర్జిల్లయి లాగా ఇవ్వడమే, ఆదుకోవడమే శ్వాసగా బతికేవాడే నిజమైన విశ్వాసి. 
– డా. సుభక్త 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు