ఆర్‌ఆర్‌ఆర్‌ : ప్రచారంలో ఉన్న కథలేంటి?

17 Nov, 2018 01:00 IST|Sakshi

త్రీ ఆర్స్‌.. ఎన్టీ రామారావు, రామ్‌చరణ్, రాజమౌళి... కాంబినేషన్‌ అదుర్స్‌..టూ ఆర్స్‌... యాక్టింగ్‌తో మెస్మరైజ్‌ చేసేస్తారు.మరి.. టేకింగో.. రాకింగ్‌ మౌళి అక్కడ. కథ? డౌటే లేదబ్బా... విజయేంద్రప్రసాద్‌ కలం పదునైనది.సినిమా టైటిల్‌.. ఇంకా పెట్టలేదు. ఫిల్మ్‌నగర్‌ గాసిప్పురాయుళ్లు ‘రామరావణ రాజ్యం’ అని పెట్టేశారు.మరి.. యూనిట్‌ ఇదే కన్ఫార్మ్‌ చేసేస్తారా?వెయిట్‌ అండ్‌ సీ.అన్నట్లు... ఆర్‌ అండ్‌ ఆర్‌ (ఎన్టీ రామారావు, రామ్‌చరణ్‌) సరసన కే అండ్‌ కే (కీర్తీ సురేశ్, కియారా అద్వానీ) కథానాయికలుగా కుదిరారట. ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతున్న వార్త ఇది. ఇంకా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ గురించి ఏయే విషయాలు ప్రచారం అవుతున్నాయంటే... మ్యాటర్‌లోకి రండి.

ప్రచారంలో ఉన్న కథలేంటి?
‘ఈగ’ సినిమా ప్రారంభోత్సవం రోజున రాజమౌళి ఆ సినిమా కథంతా చెప్పేశారు. ఆ తర్వాత ‘బాహుబలి’ చిత్రం కూడా  ఫలానా అంటూ కొంచెం ఐడియా చెప్పారు. కానీ ఈ సినిమా గురించి మొత్తం టీమ్‌ అంతా సైలెన్స్‌ మెయింటైన్‌ చేస్తోంది.. అంతా సిల్వర్‌ స్క్రీన్‌ మీదే అన్నట్టుగా. కానీ ఈలోపు ఖాళీగా ఉన్న ఊహారాయుళ్లంతా విజయేంద్రప్రసాద్‌ ఏం కథ రాసి ఉండొచ్చో అని ఊహించి కొన్ని కథలు అల్లేస్తున్నారు. ఒక కథాంశం ప్రకారం.. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ అన్నదమ్ములు. అందులో ఒకరు దొంగ,  మరొకరు పోలీస్‌. ఈ దొంగా పోలీస్‌ గేమ్‌తో సినిమా సాగబోతోందని టాక్‌.ఇంకో కథాంశం ప్రకారం... 1920 ప్రాంతంలో జరిగే కథతో ఈ సినిమా సాగుతుందట. మరోవైపు ఎన్టీఆర్‌ అండ్‌ రామ్‌చరణ్‌లను బాక్సింగ్‌ చాంపియన్స్‌గా చూపించబోతున్నారన్నది ఊహల్లో ఉన్న మరో కథ. ఇలా రోజుకొకటి ‘ఇదే సినిమా కథ’ అని ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ అసలు కథేంటో విజయేంద్రప్రసాద్‌కే ఎరుక.తండ్రి విజయేంద్రప్రసాద్‌ అందించిన కథలతోనే రాజమౌళి దాదాపు అన్ని సినిమాలూ  తెరకెక్కించారు. కేవలం ‘మర్యాద రామన్న’ సినిమాకు మాత్రమే ఆయన కజిన్‌ కంచి  కథ అందించారు. ఇప్పటి వరకూ విజయేంద్రప్రసాద్‌ మాస్‌ మసాలా, స్పోర్ట్స్‌ డ్రామా, పీరియాడికల్, సైన్స్‌ ఫిక్షన్, ఫ్యాంటసీ.. ఇలా అన్ని జానర్స్‌ని టచ్‌ చేస్తూ వస్తున్నారు. రాజమౌళి తీయబోయే నెక్ట్స్‌ సినిమాకి ఎటువంటి గ్రాఫిక్స్‌ అవసరం లేని  కథను ఇస్తున్నట్లు విజయేంద్రప్రసాద్‌ ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఆయన ప్రస్తావించింది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించేనా? అనేది స్పష్టంగా తెలియదు. ఇప్పుడు చేస్తోన్న చిత్రకథాంశం ఎలా ఉండబోతోంది అని అటు ఇండస్ట్రీ ఇటు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
 

షూటింగ్‌ వివరాలు
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా గురించి గతేడాది నవంబర్‌ 18న హింట్‌ ఇచ్చారు రాజమౌళి. ఆ తర్వాత సినిమా అధికారిక అనౌన్స్‌మెంట్‌ రావడానికి దాదాపు ఏడాది సమయం పట్టింది. ఈ నెల 11న సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. షూటింగ్‌ ఈ నెల 19న స్టార్ట్‌ కానుంది. తొలుత ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల మధ్య ఫైట్‌సీన్స్‌ను షూట్‌ చేస్తారు. ఆల్రెడీ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ కొత్తలుక్‌లోకి వచ్చేశారు. కొన్ని నెలల క్రితం ఈ ఇద్దరూ లుక్‌ టెస్ట్‌ కోసం విదేశాలు వెళ్లొచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ కనిపించని కొత్త లుక్‌లో ఈ ఇద్దర్నీ చూడొచ్చని ఆశించవచ్చు.రాజమౌళి షూటింగ్‌ని తపస్సులా చేస్తాడంటారు. అందులో నుంచి బయటకు రావడానికి కూడా ఇష్టపడరట. అందుకే తాజాగా ఈ చిత్రం జరిగే షూటింగ్‌ స్పాట్‌లోనే తన ఆఫీస్‌ని కూడా ఏర్పాటు చేయించుకున్నారు. ఆఫీస్‌ మాత్రమే కాదు.. అది ఇల్లు కూడా. ఈ షూటింగ్‌ జరిగే అన్ని రోజులు అక్కడే ఎక్కువ శాతం ఉండొచ్చని టాక్‌. షూటింగ్‌ వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌ చివర గండిపేట్‌ వద్ద కొన్ని ఎకరాల్లో ఈ సినిమాకు సంబంధించిన సెట్‌ని డిజైన్‌ చేశారని సమాచారం. మరి ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే చేస్తారా? అవుట్‌ డోర్‌ లొకేషన్స్‌కు వెళ్తారో? లేదో వేచి చూడాలి.రాజమౌళి సినిమాలో కథానాయిక అవకాశం అంటే ఏ హీరోయిన్‌ అయినా నో చెప్పాలనుకోదు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు సాధించిన విజయాలు, సృష్టించిన రికార్డులు అలాంటివి. తాజాగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాలో హీరోయిన్‌గా చాలా మంది పేర్లు వినిపించాయి. ఆర్‌ ఆర్‌ ఆర్‌కు మరో ఆర్‌ కలిసేలా ప్రస్తుతం రైజింగ్‌లో ఉన్న రష్మికా మండన్నాను కథానాయికగా తీసుకుంటారని కొందరు గాసిప్‌రాయుళ్లు ఊహించారు. ‘మహానటి’ సినిమాలో సూపర్బ్‌గా నటించిన కీర్తీ సురేశ్‌ను తీసుకుంటారని కొందరు అన్నారు. అంతలోనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో వచ్చిన కథానాయిక చాన్స్‌కు సమంత నో అన్నారని వార్తలు వచ్చాయి. ‘రాజమౌళి సినిమాకు మీరు నో చెప్పారట’ అని ఆమెను అడిగితే..

రాజమౌళిగారి సినిమాకు నేనెందుకు నో చెబుతాను అని సమంత ఓ విలేకర్ల సమావేశంలో చెప్పారు. ఈ ఊహలు ఇలా ఉండగానే ఈ సినిమాను ఈ నెల 11న అధికారికంగా లాంచ్‌ చేయనున్నట్లు ప్రకటించారు ఈ చిత్రనిర్మాత డీవీవీ దానయ్య. సో.. మూవీ లాంచింగ్‌ రోజున ఆ లక్కీ హీరోయిన్స్‌ ఎవరో అందరికీ తెలిసిపోతుందని సంబరపడిన మూవీ లవర్స్‌కు నిరాశే ఎదురైంది. మూవీ ఓపెనింగ్‌ రోజు హీరోయిన్ల పేర్లను కాకుండా మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులతో సహా అందరి పేర్లను చెప్పారు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌. ఇందులో హీరోయిన్లు ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం కోసం సినీ ప్రియులు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన కియారా అద్వానీ, రామ్‌చరణ్‌కు జోడీగా కీర్తీ సురేశ్‌ నటించనున్నారని విశ్వసనీయవర్గాల తాజా సమాచారం. త్వరలోనే అనౌన్స్‌మెంట్‌ వచ్చే అవకాశం ఉంది.

రాకింగ్‌ మౌళి
సినిమా సక్సెస్‌ అవ్వడానికి సరైన సూత్రం లేదంటారు. ప్రేక్షకుడికి సినిమా ఎందుకు నచ్చుతుందో, ఎలాంటి చిత్రం ఆడుతుందో అంచనా వేయడం కష్టం. కానీ రాజమౌళి దగ్గర ఉన్న ఆ సూత్రమేంటి? ప్రతి సినిమాతో ప్రేక్షకుల మీద ఏదో మ్యాజిక్‌ జల్లుతారు. ఇప్పటివరకూ ఆయన ‘బాహుబలి’ 2 భాగాలతో కలిపి పదకొండు సినిమాలు తీస్తే అన్నీ హిట్‌. ఆ హిట్‌ సీక్రెట్‌ ఏంటి? రాజమౌళిని అడిగితే ‘ఆ ఒక్కటీ అడగొద్దు’ అంటారేమో. ఎన్టీఆర్‌ ఆయన్ను ‘జక్కన్న’ అని పిలుస్తారు. సినిమాని శిల్పం చెక్కినట్లు చెక్కుతారు. ఇప్పుడు జక్కన్న శిల్పం చెక్కే పనిలో ఫుల్‌ బిజీ. ఆ శిల్పాన్ని 2020లో సిల్వర్‌ స్క్రీన్‌పై ఆవిష్కరించబోతున్నారు. 

సాంకేతిక నిపుణలు
స్క్రీన్‌ ప్లే–దర్శకత్వం: రాజమౌళి
నిర్మాత: డీవీవీ దానయ్య
కథ: విజయేంద్ర ప్రసాద్‌
కెమెరా: సెంథిల్‌ కుమార్‌
సంగీతం: కీరవాణి
ఎడిటర్‌: శ్రీకర్‌ ప్రసాద్‌
స్టైలింగ్‌: రమా రాజమౌళి
ప్రొడక్షన్‌ డిజైనర్‌: సాబు సిరిల్‌ 
డైలాగ్స్‌: సాయి మాధవ్‌ బుర్రా, మదన్‌ కార్కీ
వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌: వి. శ్రీనివాస మోహన్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా