రాజుగారికి నచ్చిన అబద్ధం

3 Jun, 2018 00:21 IST|Sakshi

షేక్‌ సాదీ (అలై రహ్మా) గొప్ప పండితులుగా పేరు గడించారు. ఆయన చెప్పిన గాథలు సమాజ సంస్కరణ కోసం ఎంతో ఉపయోగపడేవి. ఆయన చెప్పినదే ఈ గాథ. ఓ రాజుగారు ఫలానా ఖైదీని ఉరితీయండి అని తలారిని ఆజ్ఞాపించారు. ఈ మాటలు విన్న ఖైదీ ప్రాణం మీద ఆశలు వదులుకున్నాడు. రాజుగారి మీద కోపం కట్టలు తెగింది. ఎలాగూ చావు తప్పదని రాజుగారిని తనదైన భాషలో నానా దుర్భాషలాడటం మొదలెట్టాడు. ఆ విధంగా రాజుగారి మీద కక్ష తీర్చుకున్నాడు.

రాజుగారికి ఖైదీ మాటలు అర్థంకాక పక్కనే ఉన్న మంత్రులను అడిగారు. అందులో నుంచి ఒక మంత్రి కలగజేసుకొని ‘‘ఈ ఖైదీ మిమ్మల్ని దీవిస్తున్నాడు. ‘‘తమ కోపాన్ని దిగమింగేవారు, ఇతరులను క్షమించేవారంటే అల్లాహ్‌కు ఎంతో ఇష్టం’’ అనే ఖుర్‌ఆన్‌ వచనాన్ని వల్లిస్తున్నాడు’’ అని రాజుగారికి మంత్రి వివరించాడు. మంత్రి చెప్పిన ఈ మాటలతో రాజుగారికి ఖైదీ మీద కోపం చల్లారింది. ఆ ఖైదీ ఉరిశిక్షను రద్దుచేస్తూ  క్షమాభిక్ష పెట్టారు.

పక్కనే ఉన్న మరోమంత్రి కలగజేసుకుని ‘‘ఈ ఖైదీ దీవెనలు ఇచ్చింది, క్షమాపణలు కోరింది అంతా పచ్చి అబద్ధం. రాజుగారికే అబద్ధం చెబుతావా! రాజుగారూ ఈ ఖైదీ మిమ్మల్ని నానా దుర్భాషలాడాడు’’ అని నిజం చెప్పాడు. రెండోమంత్రి నిజం చెప్పినా అతని మాటలు రాజుగారికి నచ్చలేదు. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ ‘‘నువ్వు చెప్పిన నిజం కంటే మొదటి మంత్రి చెప్పిన అబద్ధం నాకెంతో నచ్చింది. ఎందుకంటే మొదటి మంత్రి అబద్ధం చెప్పినా అతని సంకల్పం సత్యంపై ఉండింది. నువ్వు నిజం చెప్పినా నీ సంకల్పం నాకు నచ్చలేదు.’’ అన్నారు. మొదటి మంత్రిని అభినందించారు.

–  అమ్మార్‌

మరిన్ని వార్తలు