నేను పెద్ద రౌడీనైనప్పటికీ...

16 Apr, 2018 01:20 IST|Sakshi

సాహిత్య మరమరాలు

కిన్నెరసాని పాటలు రాశాక వాటిని ఇతరులకు చేర్చడానికి ఉబలాటపడేవారు విశ్వనాథ సత్యనారాయణ. ఒకసారి బందరులో ప్రత్యేకంగా చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి శిష్యుల కవితాగానం ఏర్పాటు చేశారు. చాలామంది కవులు వచ్చి తమ ఛందోబద్ధ పద్యాలు చదివారు. చెళ్లపిళ్ల ఎంతో సంబరపడ్డారు. తర్వాత విశ్వనాథ వంతు రాగానే, కిన్నెరసాని పాటలు పాడి వినిపించారు. అయితే, అవి ఎందుకో చెళ్లపిళ్లకు అంతగా నచ్చలేదు. అదే సమయంలో టేబుల్‌ మీద పెట్టిన గ్లాసు ఒలికిపోయింది. దాన్నే ఆశువుగా చెళ్లపిళ్ల– 
ఒలికింది ఒలికింది కలికి కిన్నెరసాని

తడిసింది తడిసింది పొడిది మేజాగుడ్డ – అని చదివారు. 
దీనికి ఉడుక్కున్న విశ్వనాథ, ఒక రౌడీ కథ చెప్పారు. ‘ఒక ఊరికి అతడు ఎంత పెద్ద రౌడీ అయినా కావొచ్చు. ఆ రౌడీకి గురువు ఆ ఊరు వచ్చాడంటే తన మొత్తం రౌడీతనాన్ని ప్రదర్శించలేడు; ఏదో రెండు కుప్పిగంతులు, ఒక లంఘనం ప్రదర్శిస్తాడు. నేనూ అంతే’ అని కూర్చున్నారు తనదైన గడుసుతనంతో.
(మీకు ఇలాంటి మరమరాలు తెలిస్తే మాకు రాయండి.) 

మరిన్ని వార్తలు