కదిలించే కథలు

19 Oct, 2019 01:42 IST|Sakshi

వంద పదాల సారాన్ని ఒక్క దృశ్యం చూపిస్తుంది. జీవితకాలపు సందేశాన్ని పదిసెకండ్ల ఫిల్మ్‌ ప్రొజెక్ట్‌ చేస్తుంది. ఇప్పుడు సెల్యులాయిడ్‌ తరం కాదు.. సెల్యులర్‌ టైమ్‌! ఏదైనా అరచేతి ఫోన్‌లో ప్రత్యక్షం కావాలి. సెకన్లలో తెలిసిపోవాలి. ఇవ్వాళ్టి మార్కెట్‌ స్ట్రాటజీ కూడా బ్రివిటీనే. ఈ జనరేషన్‌ కోరుకుంటున్న ఆ డిమాండ్‌ను అనుసరించే ఫేస్‌బుక్‌ ఓ కొత్త ప్రయత్నాన్ని పోస్ట్‌ చేసింది. దాని పేరే థంబ్‌స్టాపర్స్‌. పదిసెకన్లలో కమర్షియల్‌ యాడ్స్‌ను ప్రమోట్‌ చేసే సిస్టమ్‌. ‘‘షార్ట్‌స్టోరీస్‌ మూవ్‌ హార్ట్స్‌’’ పేరుతో వాటిని ప్రదర్శించడం మొదలు పెట్టేసింది కూడా. ప్రముఖ దర్శకురాలు కిరణ్‌రావు తీసిన రెండు షార్ట్‌ఫిల్మ్స్‌తో.

ధైర్యం చేయడానికి క్షణం  చాలు..
గృహహింసకు వ్యతిరేకంగా  కిరణ్‌రావు  తీసిన   షార్ట్‌ఫిల్మ్‌కి క్యాప్షన్‌ అది.  భర్త చేతిలో శారీరక హింసకు గురైన ఓ గృహిణికి ఒక యువతి ఫోన్‌ ఇస్తుంది .. 100 నంబర్‌ డయల్‌ చేసి. ఒక లిప్తపాటు తాత్సారం చేసి ప్రెస్‌ బటన్‌ నొక్కుతుంది ఆ గృహిణి. అప్పుడు వస్తుందీ కాప్షన్‌.. ధైర్యం చేయడానికి క్షణం చాలు అని.

ఇంటి నుంచే మొదలవ్వాలి..
ఇది ఆమె తీసిన ఇంకో షార్ట్‌ఫిల్మ్‌... జెండర్‌ డిస్క్రిమినేషన్‌ మీద. ఒక అమ్మ తన కొడుకు, కూతురికి రెండుగ్లాసుల్లో పాలు పోసి ఇస్తుంది. కూతురి గ్లాస్‌లో కన్నా కొడుకు గ్లాస్‌లో పాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని గమనించిన ఆ అబ్బాయి తన గ్లాస్‌లోంచి చెల్లి గ్లాస్‌లోకి పాలు వంపి.. రెండు గ్లాసుల్లో పాలను సమం చేస్తాడు. మార్పు మొదలవడానికి రెండు క్షణాలు చాలు అనే వ్యాఖ్యతో ఈ షార్ట్‌ఫిల్మ్‌ ముగుస్తుంది.

గొంతుచించుకోకుండా నిరసన తెలపొచ్చు..
సిటీబస్‌లో.. నిలబడ్డ ఒక అబ్బాయి తన ముందు సీట్లో కూర్చున్న అమ్మాయి ఛాతీ వంక అదేపనిగా చూస్తూంటాడు. ఆ అమ్మాయి పక్కనే కూర్చున్న ఇంకో అబ్బాయి అది గమనించి తన షర్ట్‌ కాలర్‌ను ఛాతి కిందకు జారుస్తూ ‘‘ఇప్పుడు చూడు’’అన్నట్టుగా సైగ చేస్తాడు నిలబడ్డ అబ్బాయితో. అంతే అతను గతుక్కుమని చూపు తిప్పుకుంటాడు. ‘‘నాట్‌ ఆల్‌ ప్రొటెస్ట్స్‌ ఆర్‌ లౌడ్‌’’ అనే కాప్షన్‌ వస్తుంది.

మాతృత్వానికి జెండర్‌ లేదు..
రుతుక్రమం గురించి నెట్‌లో సెర్చ్‌ చేసి కూతురికి వివరిస్తూంటాడు తండ్రి. ‘‘మదర్‌హుడ్‌ హాజ్‌ నో జెండర్‌’’ అనే మెస్సేజ్‌తో ముగుస్తుంది ఈ షార్ట్‌ఫిల్మ్‌.

సామర్థ్యమే ముఖ్యం
జిమ్‌లో.. ఒక స్థూలకాయురాలు.. అలవోకగా శీర్షాసనం వేస్తుంది అందరూ ఆశ్చర్యపోయేలా. అప్పుడు వస్తుంది కాప్షన్‌ ఎబిలిటీ మ్యాటర్స్‌ అని.

అందమైన లోకం
ఒక ట్రాన్స్‌ ఉమన్‌ పెట్టుకున్న చెవి జుంకాలు చూసి  ‘‘ఎక్కడ కొన్నావ్‌.. చాలా బావున్నాయ్‌.. నీ అందాన్ని పెంచేలా’’ అంటూ  కితాబిస్తుంది ఓ యువతి.  ఆనందంగా ‘థాంక్స్‌’ చెప్తుంది ఆ ట్రాన్స్‌ ఉమన్‌. ‘‘యాన్‌ ఈక్వల్‌ వరల్డ్‌ ఈజ్‌ ఎ బ్యూటిఫుల్‌ వరల్డ్‌’’ అనే వ్యాఖ్యతో ఎండ్‌ అవుతుంది ఆ షార్ట్‌స్టోరీ.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా