ఒక మిత్ర విమర్శ

6 Jan, 2020 01:06 IST|Sakshi
2010లో విశాఖపట్నంలో జరిగిన 40 ఏళ్ల విరసం, నూరేళ్ల శ్రీశ్రీ ర్యాలీలో ప్రసంగిస్తున్న చలసాని ప్రసాద్‌. చిత్రంలో వరవరరావు, కల్యాణరావు, చెంచయ్య, భూపాల్‌ ఉన్నారు.

స్త్రీవాదంతో విరసానికి పూర్తిస్థాయి ఏకీభావం ఉండే ఆస్కారం లేనట్లే స్త్రీవాదానికి కూడా  ‘మార్క్సిస్ట్‌ లెనినిస్ట్‌ మావో ఆలోచనా విధానం’తో పూర్తిస్థాయి ఏకీభావం ఉండే అవకాశం లేదు. ఇవి విడివిడి సైద్ధాంతిక అవగాహనలుగా ఉనికిలో ఉన్నాయీ అంటేనే వాటి లక్ష్యంలోనో ఆచరణలోనో భిన్నత్వం ఉన్నట్లు. ఒకదాన్ని మరొకటి పూర్తిగా ఒప్పేసుకుంటే రెండో అవగాహన అవసరమే లేనట్లు. ఈ రెండు భావజాలాల ఐక్యత, ఘర్షణలను పరిశీలించడానికి విరసం యాభై ఏళ్ల ప్రయాణం ఒక సందర్భం.

స్త్రీల సమస్యలకి విడిగా సైద్ధాంతిక స్థాయి ఇచ్చి ఉండకపోవచ్చు, సూక్ష్మస్థాయి అవగాహన లేకపోవచ్చు. కానీ స్త్రీలకి కుటుంబ, సామాజిక చైతన్యాన్ని సమకూర్చిపెట్టడంలో విరసం, ఇతర కమ్యూనిస్టు పార్టీల దోహదం గొప్పది. తొలితరం స్త్రీవాదుల్లో చాలామందికి, మార్క్సిస్ట్‌ నేపథ్యం, విరసంతో అనుబంధం ఉన్నాయి.  

స్త్రీలకి అదనంగా ఉండే పునరుత్పత్తి బాధ్యతలని, నిర్మాణాల్లో ఉండే పితృస్వామ్యం వంటి  అంశాలను ప్రశ్నిస్తూ స్త్రీవాదం రాగానే ఘర్షణ ఏర్పడింది. విప్లవోద్యమాన్ని డైల్యూట్‌ చేయడానికి వచ్చిన పెట్టుబడిదారీ కుట్రగా స్త్రీవాదం విమర్శకి గురయింది. ఓల్గా వంటి స్త్రీవాదులు,   మార్క్సిస్టులైన కాత్యాయనీ విద్మహే, విరసం రత్నమాల, విమల వంటివారు భిన్న ప్రక్రియల ద్వారా సమాజంలో, విప్లవ పార్టీల్లో, సంఘాల్లో ఉన్న పితృస్వామ్యాన్ని చర్చకి పెట్టారు. స్త్రీవాదం పట్ల విరసం దృష్టికోణాన్ని 1992లో ఒక ఇంటర్వ్యూలో వివి స్పష్టంగా మాట్లాడారు. స్త్రీవాదం స్త్రీలలో తెచ్చే చైతన్యం సమస్త మానవ శ్రమ విముక్తికీ అంతిమంగా మేలు చేసేదేనని స్పష్టమయ్యాక స్త్రీవాదపు పరిమితులు కూడా మిత్ర విమర్శగా చర్చలోకి వచ్చాయి.

స్త్రీ పురుష సంబంధాల సంక్లిష్ట ఘటనల్లో విరసం– అనవసర జోక్యపు తడబాటుకి లోనవడమూ వాస్తవమే. విరసం వ్యవస్థాపక సభ్యులు ఒకరు అటువంటి తప్పుని ఒప్పుకోవడమూ గమనించాలి. విరసం ఏర్పాటులో భాగమైన శ్రీశ్రీ, రావిశాస్త్రిలాంటి పీడిత పక్షపాత రచయితలు కూడా ‘స్త్రీ హితం’ కాని భాషని వాడారు. ఇప్పటి విరసం వాటిని అధిగమించింది. సంస్థ వ్యక్తీకరణ పద్ధతుల మీద స్త్రీవాద ప్రభావం కూడా ఉంది.

ఆధిపత్య కులం, మతం, ప్రాంతం, దేశభక్తి, సంస్కృతి పరిరక్షణ – తమ కక్ష సాధింపుకి స్త్రీల లైంగికత మీద దాడులు చేయడం పరిపాటి అయిపోయిన వర్తమానంలో ఉన్నాం. స్త్రీలు, క్రూరమైన అమానవీయమైన హింసకి గురైనపుడు అక్కున చేర్చుకునే విరసం, లైంగిక వ్యక్తిత్వాల ఎదుగుదలకి జీవితంతో అనేక ప్రయోగాలు చేస్తున్న ఆధునిక మహిళల హక్కులపట్ల ఇదేస్థాయి సహనంతో ఉంటోందా? సైద్ధాంతికంగా ఒప్పుదల ఉన్నప్పటికీ ఆచరణలో నైతికమైన అవరోధాలను దాటలేకపోతోందా? అన్నది పరిశీలించాలి.

యాభై ఏళ్లకాలంలో సంస్థ లోపల ఎంతమంది స్త్రీలు నిర్ణాయక స్థానాల్లోకి రాగలిగారన్నది మరొక ప్రశ్న. విప్లవ నిర్మాణాల్లోనూ స్త్రీల ప్రాతినిధ్యం రెండవ తరగతిగానే ఉండడం నిరాశని కలిగిస్తుంది. చైతన్యపు స్థాయి ప్రాతిపదిక అయితే అటువంటి చైతన్యాన్ని పెంచడం కోసం నిర్మాణాలు తమ పనివిధానాలని  సమీక్షించుకోవడానికి విరసం నమూనాగా ఉండాలన్న ఆకాంక్ష సహజం. గలగలా పారే తేటనీటి అడుగున చిన్నచిన్న గులకరాళ్ళు కూడా స్పష్టంగా కనపడతాయి.  వాటినే ఏరుకుని ప్రవాహాన్ని మరిచి పోవడమంటే అర్ధశతాబ్ది సూరీడుకి అరచేతిని అడ్డుపెట్టినట్లే. సాంస్కృతిక రంగంలో ఇటువంటి ఒక సంస్థ ఇచ్చే భరోసా– మొత్తం సమాజపు గమనంలో కూడా అత్యంత విలువైనది.  
- కె.ఎన్‌.మల్లీశ్వరి

మరిన్ని వార్తలు