బీపీ కూపీ...

2 Nov, 2016 22:55 IST|Sakshi
బీపీ కూపీ...

దీన్ని సెలైంట్‌కిల్లర్ అని కూడా అంటారు.
దీని మీద తప్పకుండా సర్జికల్ ఎటాక్ చేయాలి.
ఆచి... తూచి జాగ్రత్తగా బీపీని ఎటాక్ చేయాలి.
రక్తపోటు పెరిగేకొద్దీ కష్టం, నష్టం పెరుగుతాయి.
అందుకే ఈ బీపీ కూపీ లాగాల్సిందే.
మంచి చెడు తెలుసుకోవాల్సిందే.
ఇంక దేనికి వెయిటింగ్?
స్టార్ట్ రీడింగ్. లేకపోతే... బీపీ పెరుగుతుంది.


అసలు బీపీ అంటే ఏమిటో తెలుసుకుందాం.
రక్తం ఒకచోటి నుంచి మరోచోటికి ప్రవహించాలంటే  రక్తనాళాల్లో అది కొంత ఒత్తిడితో ప్రవహించాల్సిందే. దాన్నే బ్లడ్ ప్రెషర్ అంటారు. సాధారణ బీపీ 130 / 80 ఉండాలన్నది  అందరికీ తెలిసిన విషయమే. ఇందులో మొదటి విలువను  సిస్టోలిక్ బీపీ అని, రెండో విలువను డయాస్టోలిక్ బీపీ అని అంటారు.

రక్తనాళాల్లో ప్రవహింపజేసేందుకు రక్తానికి కాస్త ఒత్తిడి కావాలి. లేకపోతే రక్తం ముందుకు సాగదు. గుండె స్పందనల వల్ల ఈ ఒత్తిడి కలుగుతుంది. ఈ గుండె స్పందనలు రెండు దశల్లో సాగుతుంటాయి. మొదట... సైనో ఏట్రియల్ నోడ్ అనే భాగం నుంచి నుంచి ఎలక్ట్రిక్ కరెంటు వెలువడుతుంది. వెంటనే గుండె మూసుకుపోతుంది. అప్పుడు గుండె పై గదుల్లో ఉండే రక్తం మైట్రల్‌వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్ నుంచి కింది గదుల్లోకి దూసుకుపోతుంది. దీన్ని డయాస్టోల్ అంటారు. గుండె స్పందనలో ఇది కాస్త సుదీర్ఘంగా జరిగే ప్రక్రియ. ఆ తర్వాత గుండె స్పందనలోని రెండవది చోటుచేసుకుంటుంది. ఇందులో ట్రైకస్పిడ్, మైట్రల్ వాల్వ్‌లు మూసుకుపోయి రక్తన్ని వెనక్కురాకుండా ఆపడంతో పాటు పల్మునరీ, అయోర్టిక్ వాల్వ్‌లు తెరచుకొని రక్తనాళాల్లోకి రక్తం ముందుకు వెళ్తుంది. దీన్నే సిస్టోల్ అంటారు. ఇలా డయాస్టోల్, సిస్టోల్ కదలికలు వెంటవెంటనే జరుగుతూ గుండె రక్తాన్ని పంప్ చేస్తూ, రక్తనాళాల్లో అది కొంత ఒత్తిడితో సాగే ప్రక్రియ. అనుక్షణం జరుగుతుంది.

అందరికీ ఒకటే విలువా?
పదిహేను నుంచి నలభై ఏళ్ల వరకు వయసున్న వారిని అనేకమందిని పరిశీలించాక ఈ ప్రామాణిక విలువను నిర్ధారణ చేశారు. చిన్నపిల్లల్లో ఈ విలువ మరికాస్త తక్కువగా ఉంటుంది. మహిళల్లోనూ తక్కువగానే ఉంటుంది. అంటే... 110 / 70 ఉంటుంది. అందరికీ 130 / 80 ప్రామాణికం అనుకోకండి. అదే నమ్మి కాస్త ఎక్కువగా ఉంటే హైబీపీ వచ్చిందేమోనని బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగని డాక్టర్‌ను సంప్రదించకుండా నిర్లక్ష్యంగానూ ఉండకూడదు. 45 ఏళ్లు దాటాక వయసును బట్టి బీపీ కాస్త ఎక్కువగా ఉండవచ్చు. కానీ పైవిలువ 140 దాటినా, కింది విలువ 90 దాటినా తప్పనిసరిగా ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. మీ బీపీ విలువ ఏమిటో డాక్టర్‌ను నిర్ణయించనివ్వండి. మరీ బీపీ ఎక్కువ ఉంటే తప్ప  ఒక రీడింగ్‌తోనూ ఒక నిర్ధారణకు రాకండి. కనీసం రెండు రీడింగ్స్ అయినా పరిగణనలోకి తీసుకోండి.

బీపీ వల్ల కలిగే అనర్థాలివి...
బీపీ పెరగకుండా చూసుకోండి. పెరిగితే బ్రెయిన్ హేమరేజ్ రావచ్చు. మొదట్లో బీపీ  పెరుగుతున్న కొద్దీ తలనొప్పి మాత్రమే ఉంటుంది. కానీ అదేపనిగా పెరుగుతూ పోతే మెదడు రక్తనాళాల గోడలు చిట్లి  రక్తం బయటకు వచ్చి మెదడులో చేరుతుంది. దీన్నే ఇంట్రాసెరెబ్రల్ బ్లీడ్ అంటారు. ఇలా చేరే రక్తం పరిమాణాన్ని బట్టి రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. అంటే... తక్కువ పరిమాణంలో అయితే ఒకవైపు కాలూ, చేయి చచ్చుబడటం మూతి వంకరపోవడం జరగవచ్చు. అయితే ఇలాంటి పరిస్థితి వచ్చినా రోగి స్పృహలోనే ఉంటాడు. రక్తస్రావం పరిమాణం పెరుగుతున్నకొద్దీ ముందు పేర్కొన్న లక్షణాలతో పాటు రోగి స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది.

హైపర్‌టెన్షన్ ఎన్‌కెఫలోపతి: బీపీ ఒక్కసారిగా పెరిగి 200 / 120కి చేరినప్పుడు మెదడులోని అతి చిన్న రక్తనాళాలు చిట్లి రక్తం మెదడులోకి చేరుకోవచ్చు. దీనివల్ల రోగికి తలనొప్పితో పాటు ఫిట్స్ రావడం, కాలూ చేయి పడిపోవడం, స్పృహ కోల్పోవడం జరుగవచ్చు. సీటీ స్కాన్ బ్రెయిన్ ద్వారా దీన్ని నిర్ధారణ చేస్తారు.

ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ ఎటాక్ (టీఐఏ) :  దీర్ఘకాలంగా బీపీ నియంత్రణ లేకుండా ఉంటూ... మైల్డ్ నుంచి మోడరేట్ స్టేజ్‌లో ఉన్నవారిలో, మెదడులోని రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వంటి పరిస్థితి రావచ్చు. అలాంటి పరిస్థితే వస్తే మెదడులో రక్తప్రసరణ తగ్గిపోవడం వల్ల ఒక పక్క కాలూ చేయి పడిపోవడం, స్పృహ కోల్పోవడం, తూలుతూ నడవడం జరుగుతుంది. అయితే ఈ పరిస్థితి కొద్ది నిముషాల్లోనే బాగైపోతుంది. దీన్నే ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ ఎటాక్ అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సీటీ స్కాన్ (బ్రెయిన్) పరీక్ష చేస్తే నార్మల్ రావచ్చు. దీనికి చికిత్స ఇవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే... మున్ముందు రాబోయే పక్షవాతానికి ఇది నిదర్శనం. ఇలాంటి లక్షణాలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే పక్షవాతం రాకుండా నివారించవచ్చు.

ఇస్కిమిక్ స్ట్రోక్ : దీన్నే తెలుగులో పక్షవాతం అంటారు. బీపీ హైబీపీ రూపంలో నెలల తరబడి, ఏళ్ల తరబడి అలాగే నియంత్రణ లేకుండా ఉంటే...  పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. మెదడులో ఉన్న రక్తనాళాల్లో కొవ్వు చేరడం వల్ల అవి మూసుకుపోయి రక్తనాళాల నుంచి మెదడుకు రక్తప్రసరణ ఆగిపోయినప్పుడు మెదడులో అవి రక్తం చేరవేయాల్సిన సెంటర్స్ దెబ్బతింటాయి. శరీరంలోని ఏ ప్రాంతాన్ని నియంత్రించే భాగానికి మెదడులో రక్తప్రసరణ ఆగిందో... ఆ భాగం దెబ్బతింటుంది. దెబ్బతిన్న ప్రదేశాన్ని బట్టి కాలూ చేయి పడిపోవడం, చూపు మందగించడం, మూతివంకరపోవడం, తూలుతూ నడవటం, మాట మారడం జరగవచ్చు.

ఇస్కిమిక్ మైలోపతి : ఈ కండిషన్ ఉన్నవారిలో వెన్నుపాములో ఉండే రక్తనాళాలు బ్లాక్ అయినందువల్ల వెన్నుపాము దెబ్బతింటుంది. దీనివల్ల అకస్మాత్తుగా రెండు కాళ్లూ చచ్చుపడిపోవచ్చు.

ఇస్కిమిక్ రెటినోపతి: నియంత్రణలో లేకుండా బీపీ ఎక్కువకాలం ఉన్నవారిలో కంట్లో ఉన్న రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల కొందరిలో చూపు తగ్గవచ్చు. ఈ కండిషన్‌ను ఇస్కిమిక్ రెటినోపతి అంటారు.

హైపర్‌టెన్సివ్ నెఫ్రోపతి : హైబీపీతో కిడ్నీలు దెబ్బతిని హైపర్‌టెన్సివ్ నెఫ్రోపతి అనే సమస్య రావచ్చు.కేవలం హైబీపీని నియంత్రణలో ఉంచడం వల్ల పైన పేర్కొన్న అన్ని రకాల జబ్బులను నియంత్రణలో ఉంచడం సాధ్యమే అవుతుంది. కాబట్టి వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స కంటే... ముందుగానే బీపీని నియంత్రించుకోండి. వ్యాధుల నుంచి నివారణ పొందండి. చివరగా ఒక్క మాట హైబీపీ, డయాబెటిస్ మంచి ఫ్రెండ్స్. డయాబెటిస్ ఉందంటే బీపీ రావచ్చు. అందుకే డయాబెటిస్ ఉందంటే బీపీ ఉందనే అనుకోవాలి. మనిషికి ప్రకృతి రెండు కళ్లు ఇచ్చింది. బహుశా హైబీపీని ఒక కంటా... డయాబెటిస్‌ను మరో  కంటా కనిపెట్టుకొమ్మనేనేమో!     

తీవ్రతను బట్టి హైబీపీ వర్గీకరణ
బ్లడ్‌ప్రెషర్ విలువ 140 / 90 కంటే ఎక్కువ ఉంటే దాన్ని హైబీపీగా చెప్పవచ్చు.
మైల్డ్ హైబీపీ : 140 / 90 నుంచి 150 / 90 ఉన్న పరిస్థితిని మైల్డ్ హైబీపీ అంటారు.
మోడరేట్ హైబీపీ : 160 /90 లేదా 160 / 100 నుంచి 170 / 100 లేదా 180 / 100 వరకు విలువలు ఉంటే దాన్ని ఒక మోస్తరు హై-బీపీ (మోడరేట్ హైబీపీ)గా చెబుతారు.
సివియర్ హైబీపీ : 190 / 100  నుంచి 190 / 110 వరకు ఉంటే దాన్ని తీవ్రమైన హైబీపీ (సివియర్ హైబీపీ) అని చెప్పవచ్చు.
యాగ్జిలరేటెడ్ హైపర్‌టెన్షన్ : 200 / 120 నుంచి 210/ 120 ఉంటే దాన్ని మరింత తీవ్రమైన హైబీపీ (యాగ్జిలరేటెడ్ హైపర్‌టెన్షన్) అని చెప్పవచ్చు.

హైబీపీ అనర్థాలివి!
బీపీ ఉండాల్సిన లిమిట్ కంటే  కాస్త ఎక్కువగా ఉందనుకోండి. దాన్ని మైల్డ్ అంటారు.  మైల్డ్ హైబీపీ ఉన్నవారికి ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ ఒక హద్దు దాటితే అది మోడరేట్ బీపీ అంటారు. మోడరేట్ హైబీపీ నుంచి లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. తలనొప్పి, తలదిమ్ముగా ఉండటం, కళ్లు తిరగడం, తల తిరగడం, కొంతమందిలో చూపులో తేడా రావడం, వాంతులు కావడం జరుగుతుంది. ఇక ఆ హద్దు కూడా దాటిందంటే... సివియర్ హైబీపీ లేదా యాగ్జిలరేటెడ్ బీపీ. బీపీ సివియర్ స్థాయికి పెరిగి విశ్వరూపం చూపిస్తే... పక్షవాతం రావచ్చు. కొందరిలో మాట తడబడటం, ముఖంలో ఒక వైపు వంకర కావడం, ఒక పక్క కాలూ చేయీ వంకర కావడం జరుగుతుంది. ఒక్కోసారి మాట పూర్తిగా పోవడం జరగవచ్చు. మెదడుకు కలిగే నష్టంతో పరిణామమిది.

బీపీని అదుపులో పెట్టుకోవడం ఇలా...
ఆహారంలో ఉప్పును తగ్గించుకోవడం. ఉప్పు ఎక్కువగా ఉండే అప్పడాలు, పచ్చళ్లను తగ్గించడం.కొవ్వులు ఎక్కుగా ఉండే పాల ఉత్పాదనలు, మీగడ, వెన్న, నెయ్యి, స్వీట్స్, నూనె ఎక్కువగా ఉండే పదార్థాలను తగ్గించుకోవడంఒత్తిడికి గురి కాకుండా చూసుకోవడం రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం   తాజా ఆకుకూరలతో ఉండే ఆహారాన్ని తీసుకోవడం.ఉడికించిన ఆహారాన్ని తీసుకోండి. నూనెలో వేయించిన ఆహారాన్ని తగ్గించండి. చిప్స్. ఫ్రైస్, క్రిస్ప్‌స్, పిజ్జాలు, బర్గర్ల వంటి ఫాస్ట్‌ఫుడ్స్ తప్పక తగ్గించుకోవాలి. ఎప్పుడైనా ఒకసారి, అదీ చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవచ్చు. బీట్‌రూట్ తినడం వల్ల హైబీపీ కొంతవరకు తగ్గవచ్చు.

హైబీపీ... ఏం తింటే తగ్గుతుంది!
హైబీపీతో బాధపడుతున్నప్పుడు ఏమేమి తినకూడదో తెలుసుకుని జాగ్రత్త పడుతుంటారు. అయితే ఏమేమి తినాలో, ఏమేమి తినవచ్చో తెలుసుకోవడమూ అంతే ముఖ్యం. ఆహారంలో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ ఎక్కువ ఉంటూ సోడియం తక్కువగా ఉండాలి. ఇవి అధికంగా ఉన్న బ్లడ్ ప్రెషర్‌ని సహజంగా అదుపుచేస్తాయి. ఇవి ఎందులో ఉంటాయంటే... అరటిపండు, ఆపిల్, ఆప్రికాట్, ఖర్జూరం, ద్రాక్ష, మామిడిపండు, పుచ్చకాయ, కర్బూజ, కమలాలు, పీచ్ పండ్లు తీసుకోవాలి. పండ్లను రసం తీసి తాగడం కంటే పీచుతోపాటు తినడం మంచిది. ఇక కూరగాయలను చూస్తే క్యారట్, పచ్చి బఠాణి, దోసకాయ, కీరదోస, సొరకాయ, బంగాళాదుంప, పాలకూర, గెనుసుగడ్డ (చిలగడ దుంప), టొమాటో, పెరుగులో సోడియం తక్కువగా, పొటాషియం, మెగ్నీషియం వంటి సూక్ష్మపోషకాలు ఎక్కువగా ఉంటాయి.

డాక్టర్ అనిల్ కోటంరెడ్డి
వెల్‌నెస్ కన్సల్టెంట్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ 

మరిన్ని వార్తలు