కోదండరామా! కల్యాణ రామా!

26 Mar, 2015 23:05 IST|Sakshi
కోదండరామా! కల్యాణ రామా!

రాష్ర్టవిభజన నేపథ్యంలో భద్రాచల రామాలయం తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వెళ్లడంతో ఆంధ్రప్రదేశ్‌లో శ్రీరామనవమి వేడుకలను అధికార లాంఛనాలతో కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయం వేదికగా నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆ ఆలయ విశేషాల పట్ల తెలుగువారిలో సహజంగానే ఆసక్తి నెలకొంది. ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా ఎన్నో విశిష్టతలను సంతరించుకున్న ఈ రామాలయం వివరాలు...
 
కోదండ రాముడి  బ్రహ్మోత్సవ కార్యక్రమ వివరాలు

27వ తేదీన వ్యాసాభిషేకం, అదేరోజు రాత్రి అంకురార్పణ కార్యక్రమం, 28వ తేదీన శ్రీరామ నవమిని పురస్కరించుకుని ధ్వజారోహణం, శ్రీరామ జయంతి, పోతన జయంతి, శేషవాహనం, కార్యక్రమాలు జరుగుతాయి.
 29వ తేదీన వేణుగానాలంకారం, రాత్రి హంసవాహనం, 30 వ తేదీన వటపత్రశాయి అలంకారం, సింహవాహనం, 31వ తేదీన నవనీత కృష్ణాలంకారం, హనుమత్సేవ,  ఏప్రిల్ 1న మోహినీసేవ, గరుడసేవ, 2న శివధనుర్భంగాలంకారం, రాత్రిపూట కాంతకోరిక, ఎదుర్కోలు, కల్యాణోత్సవం, గజవాహనోత్సవం, 3వ తేదీన రథోత్సవం, 4వ తేదీన కాళీయ మర్థనాలంకారం, అశ్వవాహనం, 5వ తేదీన చక్రతీర్థం, 6వ తేదీ సాయంత్రం ధ్వజావరోహణం, ఏకాంతసేవ, పుష్పయాగం జరుగుతాయి.
 
కడప నుంచి తిరుపతికి వెళ్లే ప్రధానమార్గంలో కడపకు 24 కి.మీ. దూరంలో మండలకేంద్రం ఉంది. ఈ గ్రామం త్రేతాయుగం నాటిదని స్థలపురాణం వివరిస్తోంది. ఒకే శిలలో సీతారామ లక్ష్మణులు చెక్కబడి ఉండడంతో ఒంటిమిట్టకు ఏకశిలానగరంగా పేరు వచ్చింది. ఆంజనేయుడు లేని రామాలయంగా ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయం దేశంలోనే పేరు గాంచింది. సుదీర్ఘచరిత్ర, అపురూపమైన శిల్పసంపద, ఆసక్తి గొలిపే స్థలపురాణం ఈ ఆలయాన్ని సమున్నత స్థానంలో నిలబెడుతున్నాయి. ఒక కథనం ప్రకారం ఈ ఆలయంలోని ప్రధాన శిలామూర్తులను జాంబవంతుడు ప్రతిష్ఠించినట్లు చెబుతారు. మరోకథనం ప్రకారం విజయనగర సామ్రాజ్యంలో ఉయదగిరి పాలనాబాధ్యతలను చూస్తూ ఉండిన కంపరాయలు ఒకసారి ఒంటిమిట్ట ప్రాంతానికి పర్యటనకు వచ్చాడు. స్థానిక బోయనాయకులైన ఒంటెడు, మిట్టెడు కంపరాయలుకు స్వాగతం పలికారు. రామలక్ష్మణ తీర్థాలుగా పిలిచే నీటిబుగ్గలను, మిట్టపై జాంబవంతుడు ప్రతిష్ఠించిన కోదండరామ, సీత, లక్ష్మణ విగ్రహాలను బోయనాయకులు, కంపరాయలకు చూపెట్టారు. వీటిని చూసిన కంపరాయలు విగ్రహాలు ఉన్న ప్రదేశంలో గుడిని నిర్మించాలని, నీటివసతి కోసం చెరువును తవ్వించాలని నిర్ణయిస్తాడు. అయితే కాశీనుంచి రామేశ్వరం వెళుతున్న బుక్కరాయలు గోదావరి తీరంలో తమకు లభించిన ఏకశిలా విగ్రహాలను ఒంటిమిట్టలో ప్రతిష్ఠించారని ఒంటిమిట్ట కైఫీయత్ ద్వారా తెలుస్తోంది.

తిరుమలకు వెళ్లే భక్తులు ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయాన్ని దర్శించి వెళ్లడం అనాదిగా జరుగుతోంది. ఎత్తైగోపురాలు, విశాలమైన ఆలయ ప్రాంగణం, సుందరమైన మండపాలు, విజయనగర సామ్రాజ్య వైభవాన్ని తెలిపే రమణీయ శిల్పసంపద పర్యాటకులకు కనువిందు చేస్తుంది. దేవాలయ ముఖమండపంలో రామాయణ, భారత, భాగవతాలలోని వివిధ ఘట్టాలను కనులకు కట్టే శిల్పాలున్నాయి. ఆలయ ద్వారపాలకులుగా జయవిజయుల శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఒంటిమిట్టకు సంబంధించి మరికొన్ని గాథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. త్రేతాయుగంలో ఒంటిమిట్ట ప్రాంతం ప్రశాంతమైన ప్రకృతి రమణీయకతతో అలరారుతుండేది. పచ్చటి అడవి, సెలయేళ్లతో మునుల తపోవనంగా విలసిల్లే ఈ ప్రాంతంలో మృకండు మహర్షి, శృంగి మహర్షులు ఒక మహత్తరమైన యాగాన్ని తలపెట్టగా రాక్షసులు దానికి ఆటంకాలు కల్పిస్తూ ఉండేవారు. ఆ మునుల ప్రార్థన మేరకు శ్రీరాముడు కోదండం, అంబులపొది, పిడిబాకులతో వచ్చి యాగరక్షణ గావించాడట. అందువల్లనే ఒంటిమిట్ట రాముడికి కోదండ రాముడని పేరు వచ్చింది.

ఒంటిమిట్ట దేవాలయంలోని గర్భగుడిలో ఆంజనేయస్వామి మనకు దర్శనమీయడు. ఎందుకంటే ఆంజనేయునికన్నా జాంబవంతుడు వయసులో పెద్దవాడు కావడం వల్ల శ్రీరామునికి ఆంజనేయుడు తారసపడకముందే జాంబవంతుడు సీతారామలక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్ఠించారని, అందువల్లే సీతారామలక్ష్మణ సమేతంగా ఆంజనేయస్వామి విగ్రహం చెక్క లేదని చెబుతారు. అయితే ఆ తర్వాత కట్టించిన సంజీవరాయ దేవాలయంలో ఆంజనేయస్వామిని ప్రతిష్ఠించారు. ప్రస్తుతం ఒంటిమిట్ట క్షేత్రపాలకుడుగా శ్రీ సంజీవరాయస్వామి పూజలందుకుంటున్నాడు.  

ఆధ్యాత్మిక సాహితీ సృజన కేంద్రం

 శ్రీ బమ్మెర పోతనామాత్యుడు ఒంటిమిట్ట కేంద్రంగా భాగవత రచన చేసి, ఆ కావ్యాన్ని ఒంటిమిట్ట కోదండ రామునికే అంకితం ఇచ్చాడట. అందుకే ఒంటిమిట్ట ఆలయంలో పోతన విగ్రహం కూడా ఉంది. అలాగే  అష్టదిగ్గజాలలో ఒకరైన రామభద్రకవి, ఆంధ్రవాల్మీకిగా పేరు పొందిన వావిలికొలను సుబ్బారావు ఒంటిమిట్ట వాసులే.

నవమినాడు ముఖ్యమంత్రి, చతుర్దశిరోజున గవర్నర్

 శ్రీరామనవమి రోజున రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒంటిమిట్టకు వచ్చి శ్రీ కోదండ రామస్వామికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. అయితే కల్యాణోత్సవ కార్యక్రమం ఏప్రిల్ 2వ తేదీన జరగనుండడంతో కల్యాణోత్సవానికి రాష్ట్రగవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. శ్రీ రామనవమి రోజున అంటే మార్చి 28న భద్రాచలంలో జరిగే కల్యాణోత్సవానికి కూడా గవర్నర్ హాజరయే అవకాశం కలుగుతోంది.
 - తవ్వా ఓబులరెడ్డి, కడప
 
ఇక్కడ కల్యాణం... చతుర్దశి నాటి రాత్రి
 
భద్రాచలంలో శ్రీరామ నవమి రోజున పగటిపూట కల్యాణం నిర్వహిస్తే  ఒంటిమిట్టలో నవమి తర్వాత 6 రోజులకు... అదీ  రాత్రిసమయంలో కల్యాణం నిర్వహిస్తారు. దీని వెనుక ఒక పౌరాణిక గాథ ఉంది.

దేవదానవులు క్షీరసాగర మథనం చేసే మయంలో గరళం, అమృతం, కల్పవృక్షం, లక్ష్మీదేవి, చంద్రుడు ఉద్భవిస్తారు. శ్రీ లక్ష్మీదేవిని శ్రీమహావిష్ణువు చేపట్టి తన వక్షస్థలంపై స్థానమిస్తాడు. చంద్రుడు కూడా తనను కరుణించమని శ్రీమహావిష్ణువుని వేడుకుంటాడు. దాంతో తాను త్రేతాయుగం శ్రీరాముడి అవతారం ఎత్తినపుడు తన పేరులో చంద్రుని పేరు వచ్చేలా శ్రీరామచంద్రుడిలా నిలబడతానని, తన కల్యాణం చూసే అవకాశం కల్పిస్తానని శ్రీమహావిష్ణువు వరం ఇచ్చాడట. ఈ మేరకు ఒంటిమిట్టలో రాత్రిపూట కల్యాణం జరుగుతోంది. ఇది విజయనగర చక్రవర్తుల కాలం నుండి ఆచారంగా వస్తోంది.

మరిన్ని వార్తలు