తెలుగు సాహిత్య దర్శిని ‘విమర్శిని’

10 Dec, 2018 00:20 IST|Sakshi
ఆచార్య కొలకలూరి ఇనాక్‌

ఆచార్య కొలకలూరి ఇనాక్‌ రచించిన సాహిత్య విమర్శ గ్రంథం ‘విమర్శిని’కి 2018 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. ఆయనకు ఆరు దశాబ్దాల సాహిత్య జీవితముంది. ఆయన కవి, కథకుడు, నవలాకారుడు, నాటక రచయిత, పరిశోధకుడు, విమర్శకుడు, మంచి వక్త. ‘తెలుగు వ్యాస పరిణామం’ అంశం మీద పరిశోధన చేశారు. సాహిత్య పరామర్శ, ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం, జానపదుల సాహిత్య విమర్శ, శూద్రకవి శంభుమూర్తి వసుచరిత్ర వైశిష్ట్యం, సాహిత్య దర్శిని, పత్రత్రయి మొదలైన విమర్శ గ్రంథాలు ప్రచురించారు.

విమర్శినిలో మూడు భాగాలున్నాయి. 1.తెలుగు వెలుగులు. 2. తెలుగు నవల. 3. తెలుగు కథానిక. తెలుగు వెలుగులులో ప్రాచీన ఆధునిక కవిత్వం, రచయితలు, సాహిత్యాంశాల మీద రాసిన పదహైదు వ్యాసాలున్నాయి. వాటిలో మౌలికమైన ప్రతిపాదనలు ఉన్నాయి. పరవస్తు చిన్నయసూరి బ్రాహ్మణులతో తిరస్కరింపబడినా, వాళ్లు నెత్తిమీద పెట్టుకునే బాలవ్యాకరణం, పంచతంత్రం రాశారన్నాడు. భద్రిరాజు తెలుగులో నాలుగు మాండలికాలు ఉన్నాయంటే కొలకలూరి ఆరు మాండలికాలు ఉన్నాయన్నాడు. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర మాండలికాలుగా భద్రిరాజు విభజిస్తే– తెలంగాణ, రాయలసీమకు పూర్వాంధ్ర మాండలికం, గోదావరి మాండలికం, సర్కారు మాండలికం, నెల్లూరు చిత్తూరు కొంత ఒంగోలుతో కూడిన మాండలికాలను జత చేశారు. 

‘వలస రచయితలు’ అంశం మీద రాసిన కొలకలూరి, ఒక ప్రాంతంలో పుట్టి పెరిగి కొత్త జీవితం వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లిన రచయితలు, వెళ్లిన ప్రాంతం గురించి రాయకుండా తమ ప్రాంతం గురించే ఎందుకు రాస్తారు అనే అంశాన్ని చర్చించారు. వెళ్లిన ప్రాంతపు భాషను కొంత ఒంటబట్టించుకోగలమే గానీ ఆ జీవితాన్ని ఆకళింపు చేసుకోలేమని ఆయన అభిప్రాయం. పైగా సొంత ప్రాంతం గురించి రాసి మెప్పించినంతగా ఉంటున్న ప్రాంతం గురించి రాసి మెప్పించడం కష్టమని కూడా ఆయన ఉద్దేశం.

శ్రీ కృష్ణదేవరాయలు– రాజ్యం, రాసిక్యం, మతం కూడలి అన్నారు. ఏ దేశ ప్రజలయినా వాళ్ల మాతృభాషలో విద్యాబోధనం జరిగితేనే విశిష్ట మానవులుగా అవతరిస్తారని చెప్పారు. 1909లో వచ్చిన ‘మాలవాండ్ర పాట’ మీద 2009లో వ్యాసం రాస్తూ ఆ పాట రచయిత దళితుడే అయ్యుండాలని కొలకలూరి ఊహించారు. ఆ తర్వాత ఆ ఊహ నిజం కాదని తేలింది. దాని రచయిత మంగిపూడి వెంకట శర్మ. బోయి భీమన్న మీద రాసిన వ్యాసంలో భారతదేశంలో జాతీయభావన రాజకీయ అవసరాల కోసం ఏర్పడిందే తప్ప ప్రజల మీద ప్రేమతో కాదని అన్నారు. ఈ భాగంలో సినారె, కీలుబొమ్మలు లాంటి అంశాల మీద రాసిన వ్యాసాలున్నాయి.

కొలకలూరి దృష్టి ద్రావిడ దృష్టి. దళిత బహుజన దృష్టి. చారిత్రక వాస్తవిక దృష్టి. చాలామంది భావించినట్లు కందుకూరి ‘రాజశేఖర చరిత్ర’ను తొలి తెలుగు నవలగా ఆయన ఆమోదించలేదు. ఆయన దృష్టిలో శ్రీ రంగరాజ చరిత్ర తొలి తెలుగు నవల. అందులో లంబాడీ జీవిత చిత్రణ, కులాంతర ప్రేమ అనే ప్రగతిశీల అంశాలున్నాయని గుర్తించారు. రాజశేఖర చరిత్ర మౌలిక రచన కాదని కూడా అన్నారు. ప్రగతిశీలవాదులు మాలపల్లి నవలను అభ్యుదయ నవలగా గుర్తిస్తే, కొలకలూరి అందులో హిందూమత ప్రచార స్వభావం ఉందన్నారు. మాలపల్లిలో బ్రాహ్మణ వ్యవస్థను తిరస్కరించే జస్టిస్‌ పార్టీని తిరస్కరించే లక్షణముందన్నారు. విశ్వనాథను హైందవత్వ ప్రతినిధి రచయితగానే ఆయన గుర్తించారు. విశ్వనాథ దళిత జీవితం వస్తువుగా రాసిన నవలల్ని కూడా ఆయన ఆమోదించలేదు. విశ్వనాథ దళితుడు దళితుడిగా ఉంటేనే వాళ్ల శౌర్యాన్నీ పరాక్రమాన్నీ అంగీకరిస్తారు. వీరవల్లడు గొప్పవాడే, తమకు దాస్యం చేసినంత కాలం. చేయకపోతే వీరవల్లడు ఉట్టి వల్లప్ప అవుతాడు.

తొలినాళ్లలో తెలుగు నవలల్లో బ్రాహ్మణ జీవితమే వస్తువు కావడం గురించి కొలకలూరి చర్చించారు. త్రిపురనేని గోపీచంద్‌తోనే తెలుగు నవలల్లోకి అబ్రాహ్మణ జీవితాలు ప్రవేశించాయన్నారు. చలం, కొడవటిగంటి కుటుంబరావు స్త్రీ విముక్తి కోరినా అది బ్రాహ్మణ స్త్రీ విముక్తే అన్నారు. కానీ వాళ్లు అబ్రాహ్మణ స్త్రీ స్వేచ్ఛను తిరస్కరించలేదన్నారు. తెలుగు కథా వికాసాన్ని పరామర్శించిన కొలకలూరి, గురజాడ అప్పారావు దిద్దుబాటు(1910) తొలి తెలుగు కథ అనే అభిప్రాయాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించి, బండారు అచ్చమాంబ ‘ధన త్రయోదశి’ని తొలి తెలుగు కథానికగా నిర్ణయించారు. అంతేగాక దిద్దుబాటు ఓ.హెన్రీ రాసిన ఆంగ్ల కథానికకు అనుసరణ అన్నారు. గురజాడ కథానికల్లో ‘మీ పేరేమిటి?’, ‘పెద్ద మసీదు’ మాత్రమే తెలుగు జీవితాన్ని ప్రతిబింబిస్తున్నాయని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. తొలినాళ్లలో స్త్రీ స్వేచ్ఛను కోరే కథానికలు ఎక్కువగా రావడం మీద ఆంగ్ల సాహిత్య ప్రభావం బలంగా ఉందని కొలకలూరి సిద్ధాంతం.

అబ్రాహ్మణ దృక్పథంతో ‘ఆంధ్ర దేశంలో ముగ్గురి జీవితం చిత్రించిన కథానికలే తెలుగు కథానికలుగా చలామణి అయ్యాయి. నూటికి ముగ్గురి సాహిత్యం నూరుగురి సాహిత్యమయింది’ అన్నారు. అరసం సమాజంలో నూత్న ఆలోచనలు రేకెత్తించిందంటూ చాసో మొదలైనవారి కథలను విశ్లేషించారు. అభ్యుదయ, విప్లవ, స్త్రీ, గిరిజన, మైనారిటీ, బహుజన, ప్రాంతీయ అస్తిత్వ కథలను విపులంగా చర్చించారు. తెలుగు నవలలకన్నా తెలుగు కథానికను కొలకలూరి మరింత లోతుకి వెళ్లి చర్చించారు.

పుస్తకం చివర్లో కొన్ని అనుబంధాలు పెట్టారు. అవి ఆయన ఎప్పుడో రాసినవి. ఒకదానిలో ఆధునిక కథానిక గురజాడతోనే ఆరంభమయింది వంటి అభిప్రాయం మనల్ని ఆకర్షిస్తుంది. కొలకలూరికి తెలుగు జానపద, ప్రాచీన, ఆధునిక సాహిత్యాల అధ్యయన పరిజ్ఞానం ఉంది. సాహిత్య విమర్శకులకు ఒక ప్రాపంచిక దృక్పథం, ఒక నిబద్ధత, ఒక తాత్విక నేపథ్యం ఉండటం ఎంత అవసరమో విమర్శిని ద్వారా రుజువు చేశారు. విశ్వనాథ, కొ.కు., కేతు, శ్రీశ్రీ, వల్లంపాటి వలె కొలకలూరి ఒకవైపు సృజనాత్మక రచనలు చేస్తూ, మరోవైపు సాహిత్య విమర్శను సుసంపన్నం చేశారు. ఆయన సవ్యసాచి.
రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

మరిన్ని వార్తలు