కోమలవల్లిని మళ్లీ జయం వరిస్తుందా?

20 Dec, 2015 22:52 IST|Sakshi
కోమలవల్లిని మళ్లీ జయం వరిస్తుందా?

మొన్నటి వరదలు జయను వివాదాల్లో ముంచెత్తాయి  వివాదాలు ఆమెకు కొత్తేం కాదు  అయినా పళ్లిచ్చే చెట్టుపై కాకపోతే
 ముళ్ల చెట్లపై రాళ్లు పడతాయా?!  జయలలిత సినిమాల్లో రాణించింది  రాజకీయాల్లో మహరాణిస్తోంది  పదేళ్లకోసారి ఈమె సి.ఎం. అవుతూ వస్తున్నారు  ఈసారి కోమలవల్లి.. అంటే, జయలలిత...  ఐదేళ్లకే జయిస్తారా అనే చర్చ ముమ్మరంగా జరుగుతోంది!
 
ఇప్పుడెందుకు?!
ఇప్పుడనేముందీ! ఎప్పుడైనా... చెన్నై అనుదిన ఆహారం జయలలిత. పేపర్‌లా, పాలప్యాకెట్‌లా.. పురుచ్చి తలైవి ఒక ప్రాణాధారం. డెయిలీ బ్రెడ్ ఆఫ్ తమిళనాడు. ముత్తువేల్ కరుణానిధి ప్రశాంతంగా నిద్రించాలన్నా రోజూ రొటీన్‌గా జయపై మీడియాలో ఏదో ఒక కుండపోత ఉండాల్సిందే. అయితే ఆయన కునికిపాట్ల భగ్నదేవత కూడా జయలలితే! అనుకున్నది సాధించే వరకు జయ నిద్రపోరు. అదీ కరుణానిధి భయం. ఆయన భయాన్ని బట్టి చూసినా జయ 2016 మే వరకు నిద్రపోకూడదు.

పురుచ్చి తలైవి కంటినిండా నిద్రపోని మాటైతే వాస్తవం. అయితే మరో ఐదు నెలలో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికలు గానీ, ఆమెకేవో ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం గానీ అందుకు కారణం కాదు. పార్టీ క్యాడర్‌లో మితిమీరిన ఉత్సాహం అమెను తరచు చికాకు పెడుతుంటుంది. తాజా ఉదాహరణ: చెన్నై వరదలు! చెన్నై వరదల్లో జయ చెయ్యాల్సింది చేశారు. ఆమె క్యాడర్ చెయ్యకూడనిది చేసింది! ‘బాహుబలి’లో శివగామి.. శిశువును చెయ్యెత్తి పట్టుకున్నట్లు... శివగామి ప్లేస్‌లో ‘అమ్మ’ ఫొటో పెట్టి పోస్టర్‌లు ప్రింట్ చేయించారు పార్టీ కార్యకర్తలు. అపోజిషన్‌కి లడ్డు దొరికింది! ఇంటింటికీ ఇంత పంచి పెట్టమని ఆ లడ్డును మీడియా చేతిలో పెట్టింది. బ్యాడ్ నేమ్! ఇలాంటిదే లేటెస్టుగా ఇంకో చెడ్డ పేరు.. రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురిని విడుదల చేయాలని ఆదేశిస్తూ ఏడాదిన్నర క్రితం జయలలిత ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టేయడం. ఇదీ ఒకందుకు మంచిదే. ఆమె ప్రయత్నంలోని ‘చిత్తశుద్ధి’ ఏ మాత్రం శంకించడానికి వీలు లేనిదని ఎల్.టి.టి.ఇ. అర్థం చేసుకుంటుంది.

దేవ, నకుల, కళ, మాల
వండలూర్ జూలో తెల్లపులికి పుట్టిన రెండు మగ పిల్లలకు, రెండు ఆడపిల్లలకు గత ఆదివారం (డిసెంబర్ 13) జయలలిత పెట్టిన పేర్లివి. తమిళనాడులో పిల్లలకైనా, పులిపిల్లలకైనా, తమిళపులులకైనా జయ ఆశీస్సులు ఉండాల్సిందే. జయ బ్లెస్సింగ్ ఉంటే ఎవరైనా సరే పనీర్ సెల్వంలా ‘అసిస్టెంట్ చీఫ్ మినిస్టర్’లు అవుతారు. జయకు కోపం తెప్పిస్తే.. కళైంగర్ కరుణానిధి అంతటి వారైనా అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా ‘ఎత్తిపోత’లకు గురవుతారు. (2001 నాటి  ఆయన ఆరెస్టు సన్నివేశాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి).

జయలలిత నిర్ణయం ఏదైనా ఏక్షపక్షంగా ఉంటుంది. మంచిదనుకుంటే చేస్తారు. మంచిది కాకున్నా చేయాలనుకుంటే చేసేస్తారు. బహుశా అది... రాజకీయ జీవితం ఆమెను నేర్పిన పాఠం కావచ్చు. సినిమా జీవితంలో ఆమె నేర్చుకోలేక పోయిన పాఠాలూ కావచ్చు. ఏ ఫీల్డ్‌లో ఉన్నా ఆమె నెంబర్ 1 గానే ఉన్నారు. స్థాన బలిమిలో నెంబర్ 1గా లేనప్పుడు... వ్యక్తిత్వ కలిమిలోని నెంబర్ 1 స్థానంతో నెగ్గుకుంటూ వచ్చారు. జయలలిత ఫస్ట్ టైమ్ ముఖ్యమంత్రి అయింది 1991లో. రెండోసారి 2001లో. మూడోసారి 2011లో. ఒకటో నెంబరు ఆమెకు కలిసివస్తోందా? అదేమోకానీ ఇప్పటి రాజకీయాల్లో వన్ అండ్ ఓన్లీ డిటర్‌మైండ్ లేడీ.. జయలలిత.  

దిగ్భ్రాంతికర ఘటన
అంతమాత్రాన జయలలిత రాజకీయ జీవితమంతా సాఫీగా సాగిపోయిందని చెప్పేందుకు లేదు. 1989లో ప్రతిపక్ష నేతగా (ఒక మహిళగా కూడా) తమిళనాడు అసెంబ్లీలో జయలలితకు ఘోర అవమానం జరిగింది. ఆరోజు తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడు తున్నారు. పాలక, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు చెప్పులు, షూలు, ముష్టిఘాతాలు విసురుకుంటున్నారు. ఆ సమయంలో ఒక మంత్రిగారు ఆవేశంతో ఊగిపోతూ జయలలిత చీర పట్టుకుని లాగారు! ఆ ఘటనతో దేశం దిగ్భ్రాంతికి గురయింది. తర్వాత 1991లో జరిగిన ఎన్నికల్లో జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు.

వి‘జయ’సంకేతాలు
జయ రాజకీయ గురువు ఎం.జి.రామచంద్రన్. 1960, 70లలో ఆయన తమిళ సినీ సూపర్‌స్టార్. తమిళ సినిమాలకు స్ట్రిప్టు రాస్తుండే ఎం.కరుణానిధి, రామచంద్రన్ మంచి స్నేహితులు. వారిద్దరి మధ్య వైరంతో, వైరుధ్యాలతో తర్వాత్తర్వాత తమిళనాడులో ప్రభుత్వాలు ప్రధానంగా ఎ.ఐ.ఎ.డి.ఎం.కె., డి.కెం.కె.. పార్టీల మధ్యే ఏర్పడుతూ వస్తున్నాయి. వీళ్లు పదవిలో ఉన్నప్పుడు వాళ్లు, వాళ్లు పదవిలో ఉన్నప్పుడు వీళ్లు ఒకరిపై ఒకరు పగ, ప్రతీకారం తీర్చుకునేవారు. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

2011లో మూడోసారి ముఖ్యమంతి అయ్యాక.. గత నాలుగేళ్లుగా జయలలిత ఒడిదుడుకులు లేని అధికారంలో ఉన్నారు.  ప్రభుత్వ ఆర్థిక సహకారంతో అంతా మహిళలే నిర్వహిస్తున్న ‘అమ్మ’ క్యాంటీన్ తమిళనాడు అంతటా విజయవంతంగా అతి తక్కువ ధరకు ఇడ్లీలు అమ్ముతోంది. చురుకైన రాజకీయ సలహాదారుల నేతృత్వంలో ఆమె పథకాలన్నీ చక్కగా అమలవుతూ ప్రజల ఆదరణను చూరగొంటున్నాయి. ఇవన్నీ రాబోయే ఎన్నికల వి‘జయ’ సంకేతాలే.

బిగ్ ఉమన్
జయలలిత బయోపిక్ తీయడం కష్టం. జయలలిత బయోబుక్ తేవడం కష్టం. పిక్‌లకు, బుక్‌లకు అందని బిగ్  ఉమన్ జయ. జయలలిత సినిమా జీవితం, రాజకీయ జీవితం ఒకదాన్ని మించి ఒకటి అందమైనవి. వేరెవరికీ అందనివి. బహుశా అందుకోలేనివి కూడా. ఆమె బర్త్, బ్రింగింగ్ అప్ అలాంటివి. 67 ఏళ్ల జయలలిత తమిళనాడులో మాత్రమే కాదు, జాతీయస్థాయిలోనూ పొలిటికల్ జెయింట్. కేంద్రంలో ఎవరికెన్ని సీట్లు వచ్చినా... ఎప్పుడూ సెంటర్‌పాయింట్‌లో ఉండేది జయలలిత ఎంపీలే.

మహిళ, సినీతార, బ్రాహ్మలమ్మాయి, కన్నడిగుల పిల్ల.. ఇవేవీ జయలలిత వ్యక్తిత్వాన్ని, నాయకత్వాన్ని డిఫైన్ చేసేంత బలమైనవి కావు. ఒకవేళ అంత బలం ఎవరికైనా ఉందీ అంటే అది ఒక్క.. ఎం.జి.రామ చంద్రన్‌కే. ఆమె గురువు ఆయన. అయితే ‘ఆయన నా సినిమా గురువు మాత్రమే’ అని జయ ఎప్పుడైనా అని ఉంటే ఆమె రాజకీయ నైతికతను ఎవరూ ప్రశ్నించన వసరం లేదు. తనేమిటో ఆమెకు తెలుసు. తను కానిది ఏమిటో కూడా తెలుసు. అయినదానికీ, కానిదానికీ మధ్య జయ ఎప్పుడూ ఊగిసలాడరు. ఆమె ఇష్టం లేకుండా సినిమాల్లోకి వచ్చారు. ఇష్టపడి రాజకీయాల్లోకి వచ్చారు. తన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా రెండు చోట్లా స్టార్ అయ్యారు.
 పదిహేనేళ్ల వయసులో జయ ‘సినిమాల్లోకి వెళ్లను, కాలేజీకి వెళ్తాను’ అని పట్టుపట్టింది. గొప్ప లాయర్ అయి, బాగా సంపాదించాలని ఆ పిల్ల జీవిత ధ్యేయం. ఆమెను సినీ నటిని చేయాలని తల్లి ప్రయత్నం. అలా ‘చిన్నడ గొంబె’ (కన్నడం) జయ తొలి చిత్రం అయింది. మైసూర్  నుంచి మద్రాస్‌కు షిఫ్ట్ అయ్యాక జయ తమిళ హీరోయిన్ అయింది. తమిళ సూపర్ స్టార్ ఎం.జి.ఆర్.తో 28 సినిమాల్లో నటించింది. తమిళ స్క్రీన్ మీద తొలిసారి స్కర్ట్‌తో కనిపించిన నటి కూడా జయేనంటారు.

జయలలిత నటించిన చివరి చిత్రం ‘నదియై తేడి వంద కాదల్’ (1980). తర్వాత ఏడాది గ్యాప్‌తో 34 ఏళ్ల వయసులో 1982లో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. ఎఐఎడియెంకెలో చేరారు. జయ తమిళ్, ఇంగ్లిష్, తెలుగు, కన్నడ, హిందీ ఫ్లూయెంట్‌గా మాట్లాడగలరు. ఇంగ్లిష్ ఆమెను రాజ్యసభకు పంపింది. తమిళ్ ముఖ్యమంత్రిని చేసింది. హిందీ జాతీయ నాయకురాలిని చేసింది. తెలుగు, కన్నడ భాషలు అభిమానులను సంపాదించి పెట్టాయి.
 - కొట్ర నందగోపాల్, బ్యూరో చీఫ్, సాక్షి, చెన్నై
 
మహిళలకు రోల్ మోడల్

 తల్లితోపాటూ షూటింగులకు వచ్చేప్పుడే ఆమెలోని నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపించేవి. తన వారంటూ తోడుగా ఎవ్వరూ లేకున్నా జీవితంలో ఎదురీదడం అలవాటు చేసుకున్నారు.  తనదైన శైలిలో సాగే జయలలిత ఎందరో మహిళలకు రోల్‌మాడల్.  
 సీనియర్ తమిళ నటి సచ్చు (జయలలిత తల్లి సంధ్యతోను, ఆ తర్వాత జయతోను అనేక చిత్రాలలో నటించిన సీనియర్ నటీమణి)ఆమె విజయం మాకు గర్వకారణం జయలలిత సాధన మా లాంటి వారికి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. తాను అనుకున్నది సాధించి తీరే మనస్తత్వం జయలలితది. తను ఒంటరి పోరాటం చేస్తూ ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నారు. ఇంకా ఇంకా బాగా చేసి మరింత పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను.
  - కె ఆర్ విజయ (ప్రఖ్యాత సినీ నటి)
 
వెరీ ఇంట్రెస్టింగ్!

జయలలితకు భరతనాట్యం, మోహినీ ఆట్టం, కథక్, మణిపురి వచ్చు. ప్రదర్శనలు కూడా ఇచ్చారు. నాలుగేళ్ల వయసులోనే కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. తను నటించిన కొన్ని సినిమాల్లో తనే పాటలు పాడారు. జయలలితకు పెద్ద పర్సనల్ లైబ్రరీ ఉంది. చార్ల్స్ డికెన్స్, జేన్ ఆస్టిన్, ఆస్కార్ వైల్డ్, జార్జి బెర్నార్డ్ షా, సిడ్నీ షెల్డ్డన్, డానియెల్ స్టీల్, పెర్ల్ ఎస్ బక్, జేమ్స్ హాడ్లీ ఛేస్ ఆమె అభిమాన రచయితలు. షూటింగ్ విరామ సమయంలో ఆమె వీళ్ల పుస్తకాలు చదివేవారు.
     
ఆర్థిక పరిస్థితుల కారణంగా తల్లి ఒత్తిడితో జయ సినిమాల్లోకి రావలసి వచ్చింది. కర్ణాటక నుంచి తమిళనాడుకు షిఫ్ట్ కావలసి వచ్చింది. జయ దాదాపుగా అందరు దక్షిణాది సూపర్‌స్టార్‌లతో (ఎం.జి.రామచంద్రన్, శివాజీ గణేశన్, ఎన్టీరామారావు, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, జెమినీ గణేశన్) నటించారు. హీరోయిన్‌లు నిండుగా చీరలో మాత్రమే కనిపించే ఆ కాలంలో జయ చొరవ చూపి షార్ట్ స్లీవ్స్, స్కర్ట్స్, టైట్ పాంట్స్‌తో నటించారు. జయ 13 ఏళ్ల వయసులో ‘ఎపిస్టైల్’ అనే ఇంగ్లిష్ మూవీలో నటించారు. 1961లో విడుదలైన చిత్రం అది. తమిళ్‌లో జయ నటించిన తొలి చిత్రం ‘వెన్నిర ఆడై’. అందులో ఆమె స్క్రీజోఫ్రెనియా ఉన్న వితంతువు పాత్రను పోషించారు.    హిందీలో జయ తొలి చిత్రం ‘ఇజ్జత్’ (1968). హీరో ధర్మేంద్ర. తెలుగులో తొలి చిత్రం ‘గూఢచారి 116’. హీరో కృష్ణ. పటౌడీకి జయ పిచ్చి ఫ్యాన్. ఎక్కడ మ్యాచ్ జరిగినా అక్కడికి బైనాక్యులర్స్‌తో వెళ్లేది. కేవలం పటౌడీని చూడ్డానికే! జయకు ఇంకా నారీ కాంట్రాక్టర్ (క్రికెటర్), రాక్ హడ్సన్ (హాలీవుడ్ యాక్టర్) అంటే ఇష్టం.
 
అనుకోని అనుబంధం
జయ, శశిల మధ్య ఉన్న సాన్నిహిత్యం 1991లో జయ సి.ఎం అయ్యాక తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. అప్పట్లో వీడియో క్యాసెట్ల దుకాణం నడుపుతున్న శశికళకు, ప్రభుత్వోద్యోగి అయిన ఆమె భర్త నటరాజన్ ద్వారా జయలలితతో తొలి పరిచయం ఏర్పడింది. ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జయలలిత ఆ పార్టీకి ప్రచార కార్యదర్శిగా ఉండేవారు. శశికళ ఆ ప్రచారానికి సంబంధించిన వీడియో క్యాసెట్లు తీసుకుని వచ్చి జయలలితకు అందజేసేవారు. తరువాత వీరిద్దరి మధ్య స్నేహం కుదరడంతో శశికళ, జయలలిత దగ్గరే ఉండిపోయారు.  
 
 

మరిన్ని వార్తలు