క్షమాపణ నా పిల్లలకు చెప్పక్కర్లేదు

18 Mar, 2020 08:23 IST|Sakshi
కూతురికి కోర్ట్నీ ముద్దు

కోర్ట్నీ కర్దేషియన్‌ అమెరికన్‌ మీడియా ప్రముఖురాలు. మోడల్‌. కాలిఫోర్నియాలో ఉంటారు. అయితే ఏ రోజూ ఆమె గురించి వినని దేశమే ఉండదు. ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. కిమ్, క్లో అని ఆమెకు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ఫ్యాషన్‌ రంగంలో ప్రసిద్ధులు వాళ్లు. కోర్ట్నీకి 40ఏళ్లుంటాయి. 2006లో పెళ్లయింది. ముగ్గురు పిల్లలు. కొడుకు, కూతురు, మళ్లీ ఒక కొడుకు. భర్త స్కాట్‌. కోపం వచ్చినప్పుడు భార్యాభర్తలు విడిపోతుంటారు. ఎడబాటుగా అనిపించినప్పుడు తిరిగి కలుస్తుంటారు. జీవితంలో తనకేవీ పశ్చాత్తాపాలు లేవంటారు కోర్ట్నీ. ఈ సంగతిని ఆమె తరచు టీవీ రియాల్టీ షోలలో చెబుతుంటారు. నిన్ననో, మొన్ననో కోర్ట్నీని మళ్లీ ఎవరో అడిగారు. అయితే వేరేలా అడిగారు. ‘‘మీ జీవితంలో మీరు చేసిన.. ‘క్షమాపణ చెప్పనవసరం లేని పని’ ఏమిటో ఒకటి చెప్పండి’’ అని! ఆ ప్రశ్నకు కోర్ట్నీ చెప్పిన సమాధానమే ఆమెను మళ్లీ వార్తల్లోకి తెచ్చింది.

‘‘ఒక పనికి మాత్రం నేను ఎప్పటికీ క్షమాపణ చెప్పనవసరం లేదు’’ అన్నారు! క్షమాపణ చెప్పనవరసం లేని ఆ పనిని కోర్ట్నీ తన పిల్లల విషయంలో చేశారట! బహుశా తండ్రిని అప్పుడప్పుడు పిల్లలకు దూరం చేయడం ఆమె చేసిన‘ క్షమాపణ చెప్పనవసరం లేని పని’ అని మనం అనుకోవచ్చు. కానీ అది కాదట. ‘‘నా పిల్లల్ని నేను వారి మూతిపై ముద్దు పెట్టుకున్నాను. అందుకు మాత్రం వారికి క్షమాపణ చెప్పక్కర్లేదు’’ అని నవ్వేశారు కోర్ట్నీ. తర్వాత పేరెంటింగ్‌ గురించి కొద్దిసేపు మాట్లాడారు. పదేళ్ల కొడుకు, ఏడేళ్ల కూతురు, ఐదేళ్ల కొడుకు. ఇక కోర్ట్నీ కన్నా పెద్ద పేరెంట్‌ ఎవరుంటారు? కోర్ట్నీ లాంటి తల్లులు తప్ప. ‘‘ఈ ఏజ్‌లోని పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి. పిల్లలు మాట వినరు కదా. నా కష్టమేదో నేను పడుతున్నాను. అప్పటికీ ఎవరో ఒకరు నాకు అక్కర్లేని సలహాలు ఇస్తుంటారు.. పిల్లల్ని అలా పెంచాలి, ఇలా పెంచాలి అని. అప్పుడు నాకు ఒళ్లు మండిపోతుంది’’ అన్నారు కోర్ట్నీ. మండినందుకు కూడా ఆమె క్షమాపణ చెప్పక్కర్లేదు. పిల్లల పెంపకంలో ఒకరి అనుభవం ఇంకొకరికి పనికి రాదు కదా.

మరిన్ని వార్తలు