కోటీశ్వరి కౌసల్య

22 Jan, 2020 02:13 IST|Sakshi
రాధిక నుంచి కోటి రూపాయల చెక్కు అందుకుంటున్న కౌసల్య

విజేత

కౌసల్య ‘ప్రత్యేక ప్రతిభావంతురాలు’! ఇప్పుడు కోటీశ్వరి. ప్రపంచంలోనే ఒక గేమ్‌ షోలో కోటి గెలిచిన తొలి ‘స్పెషల్లీ చాలెంజ్డ్‌’ మహిళా కంటెస్టెంట్‌! ఆత్మవిశ్వాసం ఉంటే అంగవైకల్యం అడ్డురాదని చాటిన కౌసల్యా కార్తిక.. మాట్లాడలేరు. వినలేరు. అందుకే ఆమెలా ఆమె సాధించిన విజయం కూడా ప్రత్యేకమైనది.

కౌసల్య (31) పుట్టింది, పెరిగింది అంతా తమిళనాడులోని మదురైలో. బియస్సీ టెక్నాలజీ, ఎం.ఎస్సీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చేశారు. ఎంబిఏ కూడా. ఇన్నీ చదివిన కౌసల్య పుట్టు మూగ, చెవుడు. కౌసల్యకు భర్త, ఏడాది పిల్లాడు ఉన్నారు. కౌసల్య మదురై ప్రిన్సిపుల్‌ సెషన్స్‌ జడ్జి కోర్టులో జూనియర్‌ అసిస్టెంట్‌. చిన్న వయస్సు నుండే తెలివైన పిల్లగా గుర్తింపు తెచ్చుకుంది. ప్లస్‌ టూ వరకు నాగర్‌ కోయిల్‌ లోని బదిరుల పాఠశాలలో చదివింది. ప్రతి క్లాస్‌లోనూ ఫస్ట్‌ ర్యాంకే. బిఎస్సీ, ఎం.ఎస్సీ, ఎంబిఏలో కూడా గోల్డ్‌ మెడలిస్ట్‌.

కౌసల్యకు రెండు కలలు ఉండేవి. మొదటిది తాను చదివిన బదిరుల పాఠశాలకు సాయం చేయాలి. రెండోది ఇటలీ లేదా స్విట్జర్లాండ్‌ పర్యటన చేయాలి. ఈ రెండు కలలతో పాటు.. ఆత్మ విశ్వాసం ఇప్పుడు ఆమెను ‘కోటీశ్వరి’ని చేసింది. కలర్స్‌ చానెల్‌ వాళ్లు తమిళంలో మహిళల కోసం ప్రత్యేకంగా గత ఏడాది డిసెంబరు 23న ‘కోటీశ్వరి’ అనే గేమ్‌ షో ప్రారంభించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజూ రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఆ షో ప్రసారం అవుతోంది. సీనియర్‌ నటి రాధిక అనుసంధానకర్తగా వ్యవరిస్తున్నారు. ఈ ‘షో’లోనే కౌసల్య కోటి రూపాయలు సాధించారు.

రాధిక అడిగిన ప్రశ్నలను లిప్‌ రీడింగ్‌ ద్వారా అర్థం చేసుకుని సమాధానాలను అందించిన కౌసల్య.. సుదీర్ఘంగా జరిగిన గేమ్‌లో కోటి రూపాయల బహుమతి సాధించారు. షో మొదటి సీజన్‌లోనే కోటిరూపాయల ప్రైజ్‌ మనీ పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ప్రత్యేక ప్రతిభావంతురాలి’గా కౌసల్య నిలిచారు. కోటిరూపాయల ఫైనల్‌ ఎపిసోడ్‌ జనవరి 21 రాత్రి 8 గంటలకు కలర్స్‌ తమిళ్‌ చానెల్‌లో ప్రసారం అయింది. ‘‘ఈ షో ద్వారా నా రెండు కలలు నిజం కాబోతున్నాయి’’ అంటూ కౌసల్య ఆనందం వ్యక్తం చేశారు. ఇటువంటి ఒక ప్రత్యేక ప్రతిభావంతురాలు కౌసల్యను ప్రపంచం చూడటం ఇదే మొదటిసారి అని రాధిక అభినందనల వర్షం కురిపించారు.
– సంజయ్‌ గుండ్ల, ప్రత్యేక ప్రతినిధి, సాక్షి టీవీ, చెన్నై

>
మరిన్ని వార్తలు