వారి జీవితాల్లో నిజమైన పరివర్తన

13 Jul, 2020 00:10 IST|Sakshi
ఉద్యోగాలు పొందిన సారా ప్రభావిత యువతతో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు, ఎఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఇతర పోలీస్‌ అధికారులు

‘‘నేను ఇంటర్‌ వరకు చదువుకున్నాను. కృష్ణాజిల్లా ఎస్పీ సారు నిర్వహించిన జాబ్‌ మేళాలో నాకు కాల్‌ సెంటర్‌లో ఉద్యోగం వచ్చింది. నెలకు రూ.10 వేలు ఇస్తానన్నారు. చాలా సంతోషంగా ఉంది’’ అంటోంది శ్రావణి. కృష్ణాజిల్లా పోలీసులేమిటి, జాబ్‌మేళా నిర్వహించడం ఏమిటీ అని అనుమానం వస్తోంది కదా... అదేమిటో తెలుసుకోవాలంటే... ముందుగా ఆ జిల్లాలోని గిరిజన తండాలు, మైదానప్రాంతాల్లో ఏం జరుగుతోందో, అటువంటి వారిలో మార్పు తీసుకు వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటోందో తెలుసుకుందాం. 

కృష్ణాజిల్లాలోని గిరిజన తండాలు, మైదానప్రాంతాల్లో వందలాది కుటుంబాలు నాటుసారా తయారీనే జీవనోపాధిగా చేసుకుని దశాబ్దాలుగా దుర్భర జీవితాలను గడుపుతున్నారు. దొరికిన ప్రతిసారి కటకటాల పాలవడం... బయటకు రాగానే మళ్లీ సారా తయారీ చేయడం.. అమ్ముకోవడం వారికి కులవృత్తిగా మారిపోయింది. దీంతో ఆ గ్రామాల నిరుద్యోగ యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలే కాదు చివరకు పిల్లనిచ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రాని వివక్షకు గురయ్యారు. ఇలా దశాబ్దాలుగా ఇలాంటి వారు పడిన వెతలకు చెక్‌ పెడుతూ వారి జీవితాల్లో ‘నవోదయం’ తెచ్చేందుకు ప్రభుత్వం ‘పరివర్తన’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది మిగిలిన జిల్లాలకు భిన్నంగా కృష్ణాజిల్లా పోలీసులను ఆలోచింపజేసేలా చేసింది. అరెస్టులు, కేసుల కంటె వారిలో ఉన్న ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనాన్ని పారద్రోలడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమార్గంగా తలచి ఆ దిశగా అడుగులు వేశారు. వారిలో మార్పునకు బీజం వేశారు. సైనికుల్లా పనిచేసిన ఆ పోలీసుల కథేమిటో.. వారి కృషివల్ల వీరి జీవితాల్లో వచ్చిన ‘పరివర్తన’ ఏమిటో చూద్దాం. 

వారిలో ‘పరివర్తన’కు బీజం
పైన చెప్పుకున్నట్లుగా కృష్ణాజిల్లా చాట్రాయి మండలం పోతనపల్లికి చెందిన శ్రావణి ఒక్కతే కాదు, ఆ పల్లెల్లో వందలాది నిరుద్యోగ యువత రేపటి భవిష్యత్‌ కోసం ఆశగా అడుగులు వేస్తోంది. చీకట్లను చీల్చుకుంటూ బంగారు భవితకు బాటలు వేసుకుంటున్నారు.‘సారా’ గ్రామాలుగా ముద్రపడిన ఆ పలెల్లో ‘పరివర్తన’ తెచ్చే దశగా ఏడాది క్రితం అడుగులు పడ్డాయి. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టింది మొదలు రవీంద్రనాథ్‌బాబు తరచూ ఆ గ్రామాల్లో పర్యటిస్తూ వారిలో ఉన్న ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనాన్ని పారద్రోలాలని నిర్ణయించుకున్నారు. వారిలో పరివర్తనకు బీజం వేశారు. వారిచ్చిన భరోసాతో చాట్రాయి, కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన మండలాల్లో నాలుగు దశాబ్దాలుగా సారానే వృత్తిగా చేసుకుని జీవిస్తున్న ఏడు గ్రామాల్లోని 431 ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. సారాకు దూరంగా ఉంటామని ప్రతిన బూనారు.

గిరిజనులకు భూములు.. యువతకు ఉద్యోగాలు
సారాకు దూరంగా ఉంటామని ముందుకొచ్చిన 200 గిరిజనకుటుంబాలకు గిరిజన భూములపై హక్కులు కల్పిస్తున్నారు. చదువులేని నిరుద్యోగులకు, పనులు చేయగలిగే మహిళలకు స్థానిక కంపెనీల్లో దినసరి వేతన కూలీలుగా అవకాశాలు కల్పించారు. ఇక కొద్దో గొప్పో చదువుకున్న నిరుద్యోగ యువత కోసం పీవీఎన్‌ఆర్‌ గ్రూప్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వంటి నగరాలకు 12కు పైగా కార్పొరేట్‌ కంపెనీలను ఒక వేదికపైకి తీసుకొచ్చి మెగా జాబ్‌మేళాలు నిర్వహించారు. అలా సారా ప్రభావిత గ్రామాల నిరుద్యోగ యువతలో దాదాపు 150 మందికి వారు కోరుకున్న ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కలలో కూడా ఊహించని రీతిలో కార్పొరేట్‌ కంపెనీలో జాబ్‌ ఆఫర్‌ లెటర్లు చేతికి రావడంతో వారిలో పట్టరాని ఆనందం వెల్లివిరుస్తోంది. ప్రభుత్వం తీసుకు వచ్చిన పరివర్తనతో ఆ పల్లెల్లో వెలుగు పూలు పూస్తున్నాయి. – పంపాన వరప్రసాదరావు, ఫొటోలు: అజీజ్‌ జుజ్జవరపు సాక్షి, మచిలీపట్నం

మా జీవితాల్లో వెలుగులు నింపారు..
మా తాతముత్తాల నుంచి గత్యంతరం లేక ఈ పని చేస్తున్నాం. మా అబ్బాయి ఏడుకొండలును డిగ్రీ వరకు చదివించాం. ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ మా పని వల్ల వాడికి ఉద్యోగం రాలేదు.  జిల్లా ఎస్పీ దొరగారు నిర్వహించిన జాబ్‌మేళాలో మా అబ్బాయికి చెక్‌ పోస్టులో ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది.  – మల్లవోలు శ్రీనివాసరావు, చినగొల్లపాలెం, కృత్తివెన్ను మండలం 

మరిన్ని వార్తలు