కృష్ణార్పణం

14 Aug, 2017 00:24 IST|Sakshi
కృష్ణార్పణం

కన్నయ్య వెన్నదొంగ. కన్ను పడిందా... కుండ వణికిందే! ఉట్టికెగిరి ఓ పట్టు పట్టేస్తాడు...  అంతిష్టం వెన్నముద్ద అంటే..! కానీ, పాపం! పండగ పూట చిన్ని కృష్ణయ్యకు ఈ పాట్లెందుకు చెప్పండి... బాగా వెన్నపూసను దట్టించి వెరైటీగా మీరే రకరకాల మిఠాయిలు తయారు చేయండి. ఎలా తయారు చే యాలో చెబుతున్నాముగా... చేతకావని దిగులెందుకు...   శ్రద్ధతో తయారు చేసి  ‘కృష్ణార్పణం’ అంటూ
 భక్తితో సమర్పించండి.. ఆ తర్వాత కృష్ణుడి ప్రసాదంగా... మీరు, మీ కుటుంబమంతా హాయిగా లాగించెయ్యండి. తియ్యతియ్యగా..! కార కారంగా


అక్కర వడిసాల్‌
కావలసినవి: బియ్యం–అర కప్పు; పెసరపప్పు–ఒక కప్పు; చక్కెర– ఒక కప్పు; వెన్న తీసిన పాలు– 3 కప్పులు; (ఫుల్‌ క్రీమ్‌ మిల్క్‌ కూడా
వాడవచ్చు); వెన్న తీయని పాలు– అర కప్పు; కుంకుమ పువ్వు– నాలుగు రేకలు; బాదం, జీడిపప్పు పలుకులు– టేబుల్‌ స్పూన్‌; వెన్న– ఒక కప్పు.

తయారీ: బియ్యం, పెసర పప్పు కలిపి మందపాటి పెనంలో వేసి సన్న మంట మీద వేయించాలి. మంచి వాసన వచ్చే వరకు వేయించి దించేయాలి. చల్లారిన తర్వాత శుభ్రంగా కడిగి అందులో మూడున్నర కప్పుల పాలు పోసి ఆ గిన్నెను ప్రెషర్‌కుకర్‌లో పెట్టి ఉడికించాలి. ఒక విజిల్‌ వచ్చిన తర్వాత మంట తగ్గించి ఐదు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. ఈ లోపు... ∙అరకప్పు మీగడ పాలను మరిగించి కుంకుమ పువ్వు వేసి పక్కన ఉంచాలి ∙పెనంలో రెండు స్పూన్ల వెన్న వేసి జీడిపప్పు, బాదం పలుకులను వేయించి పక్కన పెట్టుకోవాలి ∙కుకర్‌లో ఉడికించిన అన్నం, పప్పు మిశ్రమాన్ని గరిటతో మెదపాలి ∙ఇప్పుడు వెడల్పాటి పెనంలో వెన్న వేసి కరిగిన తర్వాత అన్నం, పప్పు మిశ్రమం వేసి అందులో చక్కెర కలపాలి. చక్కెర కరిగినప్పుడు అన్నం గరిటె జారుడుగా అవుతుంది. అడుగు పట్టకుండా కలుపుతూ దగ్గరయ్యే వరకు ఉడికించాలి. చివరగా కుంకుమ పువ్వు పాలను పోసి కలిపి, వేయించిన జీడిపప్పు, బాదం పలుకులతో గార్నిష్‌ చేయాలి.
గమనిక: ప్రెషర్‌ కుకర్‌లో నీటిని పోసి అందులో అన్నం, పప్పు ఉన్న పాత్రను పెట్టి ఉడికించాలి. ఈ పాత్ర చిన్నదైతే ఉడికేటప్పుడు పాలు ఒలికిపోతాయి. కాబట్టి పాత్ర సగం ఖాళీగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడు మిశ్రమం ఉడికిన తర్వాత కూడా పాత్రలో ముప్పావుకు మించదు.

శ్రీఖండ్‌
కావలసినవి : పెరుగు: మూడు కేజీలు; పంచదార: కేజి; ఏలకుల పొడి: టీ స్పూన్‌; రోజ్‌వాటర్‌: 1 టీ స్పూన్‌; లెమన్‌ కలర్‌: కొన్ని చుక్కలు; బాదంపప్పు: 2 టీ స్పూన్లు;  పిస్తా: 2 టీ స్పూన్లు

తయారి :
∙పెరుగుని మెత్తని బట్టలో కట్టి నీళ్లు పోయేటట్లు రెండు గంటలపాటు ఉంచాలి
∙ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని  పంచదార, ఏలకుల పొడి, రోజ్‌వాటర్, లెమన్‌ కలర్‌ వేసి బాగా కలియపెట్టాలి
∙ఇలా తయారైన శ్రీఖండ్‌ని ఫ్రిజ్‌లో చల్లబడేవరకూ ఉంచాలి
∙సర్వ్‌ చేసేముందు పిస్తా, బాదంతో     అలంకరించుకోవాలి.

వెన్న ఉండలు
కావలసినవి :
మైదా–కప్పు; బియ్యప్పిండి–1/4 కప్పు; పంచదార–కప్పు; ఉప్పు–చిటికెడు; వంటసోడా–చిటికెడు; నూనె– వేయించడానికి సరిపడా.

తయారి :
∙మైదాలో బియ్యప్పిండి, ఉప్పు, వెన్న, వంటసోడా వేసి బాగా కలిపి తగినన్ని వేడినీళ్లు పోసి మెత్తగా చపాతీ పిండిలా కలుపుకొని గంటసేపు నాననివ్వాలి

∙తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలుగా తయారుచేసుకొని వేడినూనెలో తక్కువ మంటమీద బంగారు రంగు వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి

∙ఒక గిన్నెలో పంచదార తీసుకొని, మునిగే వరకు నీళ్లు పోసి ఉండపాకం వచ్చే వరకు పాకాన్ని ఉడికించాలి ∙అప్పుడు వేయించిన ఉండలను పాకంలో వేసి బాగా కలిపి చల్లారనివ్వాలి.

పన్నీర్‌ లడ్డు
కావలసినవి :
పాలు: రెండు లీటర్లు; మైదా: అయిదు టీస్పూన్లు; నెయ్యి: అరకప్పు; పంచదార: రెండు కప్పులు; వెనిగర్‌: కప్పు; జీడిపప్పు: రెండు టీస్పూన్లు; కిస్‌మిస్‌: రెండు టీస్పూన్లు

తయారి :  ఒక గిన్నెలో పాలు పోసి వేడి చేయాలి ∙మరో చిన్న గిన్నెలో మైదాపిండి తీసుకొని నీళ్లు కలిపి వేడి చేసిన పాలలో పోయాలి ∙దీంట్లో వెనిగర్‌ కలిపితే పాలు విరుగుతాయి ∙విరిగిన పాలను సన్నని బట్టలో వేసి చల్లటి నీళ్లలో రెండు నిమిషాలు ఉంచాలి ∙నీళ్లు పూర్తిగా పిండేసి గట్టిపడిన మిశ్రమాన్ని ప్లేట్‌లో ఆరనివ్వాలి ∙బాణలిలో పంచదార, నెయ్యి, విరిగిన పాల మిశ్రమం వేసి కలపాలి ∙ చేతికి కొద్దిగా నెయ్యి అద్దుకొని ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ జీడిపప్పు, కిస్‌మిస్‌లను చేర్చుతూ కావల్సిన సైజులో లడ్డూలు కట్టాలి.

అజ్మీరీ కలాకండ్‌
కావలసినవి :
పాలు: అయిదు లీటర్లు;
పంచదార: అరకిలో;
నెయ్యి: అరకప్పు;
జాజికాయ పొడి: చిటికెడు.

తయారి :  ∙పాలను ఒక బాణలిలో తీసుకుని దానిలో పంచదార వేసి బాగా చిక్కగా అయ్యేవరకు మరగనివ్వాలి ∙ఆ తరువాత
నెయ్యి చేర్చి బాగా కలియపెట్టాలి . జాజికాయ పొడిని కలిపి దించాలి.

ఉప్ప సీదై
కావలసినవి :  బియ్యప్పిండి – ఒక కప్పు; (రెడీమేడ్‌గా పిండి లేకపోతే ఒకటిన్నర కప్పు బియ్యాన్ని కడిగి రెండు గంటల సేపు నానబెట్టి వడపోసి, తడి పోయే వరకు మందపాటి టవల్‌ మీద ఆరబెట్టి మిక్సీలో పొడి చేసి జల్లించాలి); మినప్పప్పు– 2 టేబుల్‌ స్పూన్‌లు; ఎండు కొబ్బరి తురుము– 2 టేబుల్‌ స్పూన్‌లు; వెన్న – ఒక కప్పు; నువ్వులు– ఒక టేబుల్‌ స్పూన్‌; ఉప్పు– తగినంత; నూనె – వేయించడానికి సరిపడినంత.

తయారీ :  మందపాటి పెనంలో మినప్పప్పును దోరగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీలో పొడి చేయాలి. బియ్యప్పిండి, మినప్పిండిని కలిపి జల్లించాలి. ఈ పిండిలో ఉప్పు, వెన్న, నువ్వులు, కొబ్బరి పొడి వేసి కలపాలి. ఇప్పుడు తగినంత నీటిని వేస్తూ ముద్ద చేయాలిబాణలిలో నూనె పోసి కాగేలోపు పిండి మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకోవాలి. నూనెలో కొద్దిగా పిండి వేసిన వెంటనే అది పైకి తేలితే నూనె కాగినట్లు. అప్పుడు ఉండలను వేసి చిల్లుల గరిటెతో కలియతిప్పుతూ బంగారు రంగులోకి వచ్చిన తర్వాత తీసేయాలి. ఇవి కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. చల్లారిన తర్వాత గాలి దూరని డబ్బాలో నిల్వ చేస్తే రెండు వారాల వరకు తాజాగా ఉంటాయి.

గమనిక
ఉండలు బఠాణి గింజల కంటే కొంచెం పెద్దవిగా ఉండాలి. మరీ పెద్దవయితే లోపల సరిగా కాలవు. అలాగే మీడియం ఫ్లేమ్‌ మీద వేయించాలి. మంట ఎక్కువైతే లోపల పచ్చిగా ఉండగానే పైన నల్లగా అవుతాయి ∙వెన్న ఉండలు మరింత మృదువుగా కావాలనుకుంటే బియ్యప్పిండిలో మైదా కూడా కలుపుకోవచ్చు. ఆరోగ్యం కోసం మైదాను మినహాయించడమే మంచిది.

మరిన్ని వార్తలు