పుట్టుక వెక్కిరించినప్పుడు

16 Dec, 2019 00:07 IST|Sakshi
ప్రిసన్‌ బేబీ: ఎ  మెమోయిర్‌, డెబొరా జియాంగ్‌ స్టయన్‌

కొత్త బంగారం 

డెబొరా జియాంగ్‌ స్టయన్‌ రాసిన, ‘ప్రిసన్‌ బేబీ: ఎ మెమోయిర్‌’లో, పన్నెండేళ్ళ డెబొరా– అమెరికా, సియాటెల్‌లో ఉండే యూదులైన ఇంగ్లిష్‌ ప్రొఫెసర్ల జంట దత్తత తీసుకున్న పిల్ల. నవలికకి కథకురాలు డెబొరాయే. ఆమె దత్తు తల్లిదండ్రులు తెల్లవారు. ఆమె చామనఛాయతో, బహుళజాతి రూపురేఖలున్నది. డెబొరా తన గతం గురించి ప్రశ్నించినప్పుడల్లా, తల్లిదండ్రులు సమాధానం ఇవ్వకుండా దాటవేసేవారు. ఆమె ఆరవ తరగతి చదువుతున్నప్పుడు, ఒకరోజు వారి పడగ్గదిలోకి వెళ్తుంది. ‘డెబొరా జనన ధృవీకరణ పత్రాన్ని మార్చేయండి. తను వర్జీనియా జైల్లో ఉన్న, హెరాయిన్‌ వ్యసనానికి లోనైన తల్లికి పుట్టిందని తెలియకూడదు. సియాటెల్‌లోనే పుట్టిందని రాయండి. ఆమె మా హృదయాల్లో పుట్టిన పిల్లే కదా! తనకు నిజం తెలిస్తే, తల్లి గురించీ, తను రెండు మూడేళ్ళున్న పెంపుడిళ్ళ గురించీ ప్రశ్నిస్తుంది’ అంటూ, దత్తు తల్లి తన లాయరుకు రాసిన ఉత్తరం కంటబడుతుంది. ‘నా తల్లిదండ్రుల పడగ్గదిలో టేబుల్‌ అరలో ఉన్న ఆ కాగితాన్ని చదివి, వెనక్కి తోసేశాను. అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు, నా శరీరం అతిబరువుగా అనిపించింది’ అంటారు రచయిత్రి.

ఆమె తనను తాను ద్వేషించుకుంటుంది. ‘జైల్లో ఉన్నవారిని ప్రేమించేదెవరు?’ అని ప్రశ్నించుకుంటుంది. ప్రతీ అవసరాన్నీ ప్రేమతో తీర్చే పెంపుడు తల్లి గానీ, తనకు రెండు సంవత్సరాల ముందట, తల్లిదండ్రులు దత్తత తీసుకున్న అన్న తెల్లరంగు జోనాథన్‌ తనను ముద్దుగా చూసుకుంటాడని గానీ గుర్తురాదు. పైగా, ఊచల వెనకున్న జీవసంబం«ధి అయిన తల్లిని కలుసుకోవాలన్న కోరిక హెచ్చవుతుంది. ‘1960ల వరకూ, వెయ్యి తెల్ల కుటుంబాలు కూడా నల్ల పిల్లలను దత్తు తీసుకోలేదని దత్తత పరిశోధన సర్వేక్షణలు సూచిస్తాయి. నా మార్గదర్శక తల్లిదండ్రులు నన్ను దత్తత తీసుకుని, ఆ పరిమితులను దాటారు. నా పంచదార పాకపు రంగు, బొత్తాం ముక్కు, బాదం ఆకారపు కళ్ళ గురించి అడిగినప్పుడల్లా– తను నన్ను ప్రేమిస్తోందనీ, నేను కుటుంబంలో భాగమే అనే చెప్పేది అమ్మ. నేనిప్పుడు, దేనికీ భాగం అనుకోవడం లేదని చెప్పాలంటే భయం వేసేది’ అంటారు.

ఆ సంఘటన తరువాత, రక్తంలో హెరాయిన్నిండి పుట్టి, తొలి ఏడాది ఖైదులో ఆ వాతావరణంలోనే గడిపిన డెబొరా– తన సొంత తల్లిని అనుకరిస్తూ, సులభంగానే మాదక ద్రవ్యాలకు అలవాటుపడతారు. 19 ఏళ్ళొచ్చేటప్పటికి వాటిని సరఫరా కూడా చేసేవారు. దత్తు తల్లిదండ్రులతో సాన్నిహిత్యం కోల్పోతారు.
‘మాదక ద్రవ్యాలు సామాజిక వినోదం, మద్యం కేవలం పానీయం కావు నాకు. అవి నాకు మత్తు కలిగించే మాసికలా, మందులా అయి స్వస్థపరిచి– స్వేచ్ఛ కలిగించాయి. ఎడ్రినలిన్‌ వేగం మిగతా ప్రతీదాన్నీ ముంచేసేది.’ డెబొరా తన 30లకు చేరినప్పుడు, వ్యసనం వదిలిపెట్టడానికి అవసరమైన సహాయాన్ని పొందారు. పెంపుడు కుటుంబంతో తిరిగి సంబంధం పెంపొందించుకుని, తన జీవితపు ఉనికితో రాజీపడ్డారు. తను పుట్టిన జైలుకెళ్ళి– అక్కడ సహాయం అందించడం, ఉపన్యాసాలివ్వడం మొదలుపెట్టారు. అప్పటికి ఆమె సొంత తల్లి మరణించి ఉంటారు. పుస్తకపు చివర్న, తన కూతుళ్ళ గురించి ప్రస్తావిస్తారు రచయిత్రి. అయితే, పెళ్ళి గురించి గానీ, పిల్లలెప్పుడు పుట్టారో అన్న వివరాలు గానీ ఇవ్వరు.

2012లో– జైళ్ళలో ఉండే స్త్రీలకు అక్షరాస్యతను అందించే, ‘అన్‌ప్రిజన్‌ ప్రాజెక్ట్‌’ ప్రారంభించారు డెబొరా. ‘వారు జైలు నుండి బయట పడి, తిరిగి వెనక్కి వచ్చే అగత్యం లేకుండా, విజయవంతమైన జీవితం గడిపేందుకు– ఏదో ఒక ప్రావీణ్యత నేర్పే పనిది’. ఇప్పుడు పేరు పొందిన వక్తయిన యీ రచయిత్రి, తన ఉపన్యాసాలను  అమెరికా జైళ్ళ సంస్కరణ, పట్టుదల, రెండవ అవకాశాలు, ఆశకుండే శక్తిపైన కేంద్రీకరిస్తారు.
176 పేజీలుండి, నిజాయితీగా రాసినదనిపించే, స్ఫూర్తినిచ్చే ఈ ఆశ్చర్యకరమైన సంస్మరణను బీకన్‌ ప్రెస్‌ 2014లో ప్రచురించింది.     
కృష్ణ వేణి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా