ఔరా... ఆవులే క్యాన్వాసులా!

28 Apr, 2014 00:03 IST|Sakshi
ఔరా... ఆవులే క్యాన్వాసులా!

కళాత్మకం
 
వేసవి వస్తే పలు ప్రాంతాల్లో పలు రకాల ఫెస్టివల్స్, కార్నివాల్స్ జరుగుతుంటాయి కదా! లగ్జెంబర్‌‌గలో కూడా ఓ ఫెస్టివల్ జరుగుతుంది. దాని గురించి తెలిస్తే కాస్త సరదాగా, కాస్త విచిత్రంగా కూడా అనిపిస్తుంది.
 
మార్చి నెల రాగానే ఆ దేశంలో సందడి మొదలవుతుంది. అందరూ ఆవుల బొమ్మలు తయారు చేయడంలో మునిగిపోతారు. పలు రకాల లోహాలు, చెక్క, కాంక్రీట్ వంటి వాటితోటి అందరూ ఆవు బొమ్మలను తయారు చేసుకుంటారు. వీటి మీద తమకు నచ్చిన చిత్రాలను గీసి, వాటికి మంచి మంచి రంగులు వేస్తారు. ఏప్రిల్ నెల వచ్చేసరికి మొదలవుతుంది అసలు సందడి. అందరూ తమ ఇళ్లముందు తాము తయారుచేసిన ఆవు బొమ్మల్ని ప్రతిష్ఠిస్తారు. వ్యాపారస్తులైతే తమ షాపుల ముందు వీటిని పెడతారు. నీ ఆవు బాగుందా, నా ఆవు బాగుందా అంటూ ఆరాలు తీస్తుంటారు. దాదాపు నవంబర్ నెల వరకూ ఈ తంతు నడుస్తుంది.
 
ఇది ఆ దేశంలో ఎంతోకాలంగా ఉన్న సంప్రదాయం. ఏటా ఆ దేశంలో రంగురంగుల ఆవుల పండుగ జరుగుతూనే ఉంటుంది. ఆ ఆవుల అందాలు చూడటానికి విదేశాల నుంచి సైతం సందర్శకులు వస్తుంటారు!
 

మరిన్ని వార్తలు