మహిళకు కక్ష్యాబంధన్

7 Jun, 2015 22:47 IST|Sakshi
మహిళకు కక్ష్యాబంధన్

ఈ కాలంలో అమ్మాయి బయటకెళ్లిందంటే చాలు... అమ్మా నాన్నలకు మది నిండా గుబులే... మొన్నటికి మొన్న దేశ రాజధానిలో ‘నిర్భయ’ ఘటన... నిన్న హైదరాబాద్‌లో ‘అభయ’ ఉదంతం... తాజాగా మళ్లీ ఢిల్లీలో ఒంటరి మహిళపై ఉబర్ ట్యాక్సీ డ్రైవర్ బరితెగింపు! అతివలకు ఇది కాని కాలమే! అదృష్టమేమిటంటే... కాలం మారుతోంది. అనుభవాల పాఠాలు టెక్నాలజీలుగా మారుతున్నాయి! నింగిలోని 24 ఉపగ్రహాల జీపీఎస్ వ్యవస్థే మహిళకు రక్ష... రక్ష.. రక్ష అంటున్నాయి!
 
పద్దెనిమిది నిమిషాలకు ఓ మానభంగం.. గంటకో కిడ్నాప్.. చెప్పుకునేందుకు సిగ్గుపడాల్సిన గణాంకలివి. తప్పొప్పుల లెక్క కాసేపు పక్కనబెడితే నిర్భయ లాంటి సంఘటనలను నివారించేందకు టెక్నాలజీ ఎంతో సాయపడుతుందన్నది మాత్రం వాస్తవం. అందరికీ స్మార్ట్‌ఫోన్లు వాటిల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అందుబాటులో ఉండటం ఒక కారణమైతే... అప్లికేషన్లను అభిద్ధి చేయడం కూడా సులువైపోవడం మరో కారణమవుతోంది. అప్లికేషన్‌లను ఓపెన్ చేసి... అవసరమైన బటన్లు చూసుకుని నొక్కాల్సిన అవసరమూ లేకుండా కొన్ని అప్లికేషన్లు కేవలం... స్మార్ట్‌ఫోన్‌ను గట్టిగా అటుఇటూ కదిలిస్తే లేదంటే.. గట్టిగా అరచినా... ఆప్తులకు మీరున్న ప్రాంతపు సమాచారం అందించేలా అప్లికేషన్లు ఉన్నాయి.

ఉమన్ సేఫ్టీ షీల్డ్ ప్రొటెక్షన్: అత్యవసర పరిస్థితుల్లో ఆప్తులకు సమాచారం పంపడంతోపాటు మీరున్న ప్రాంతం తాలూకూ ఫొటోలు తీసి పంపగలగడం ఈ అప్లికేషన్ ప్రత్యేకత. దీంట్లో ఉన్న ‘వాక్ విత్ మీ’ ఫీచర్ ద్వారా మీరు ఏ రూట్ ద్వారా ఎక్కడికి వెళ్లిందీ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

పుకార్... ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు... జీపీఎస్ ట్రాకర్‌లా మారిపోయి... మీ సమాచారాన్ని ముందుగా నమోదు చేసిపెట్టుకున్న ఐదు కాంటాక్ట్స్‌కు పంపడం ఈ అప్లికేషన్ ప్రత్యేకత. ప్రస్తుతానికి ఇది రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పనిచేస్తుంది. పోలీస్ కంట్రోల్ రూమున్న ప్రాంతాన్ని సిటీమ్యాపులో చూపుతుంది కూడా.
 
టోటెమ్ ఎస్‌ఓఎస్:
పోలీస్ కంట్రోల్ రూమ్‌కు డయల్ (100) చేయడంతోపాటు పదిసెకన్లు ఒకసారి ఫొటోలు తీయడం, ఆడియో రికార్డు చేయడం టోటెమ్ ఎస్‌ఓఎస్ అప్లికేషన్‌లోని ప్రధాన ఫీచర్లు. మూడు బటన్లు ఉండే ఈ అప్లికేషన్‌లో ఎరుపు బటన్‌ను ప్రెస్ చేసిన వెంటనే కంట్రోల్ రూమ్‌కు కాల్ వెళుతుంది. ఎల్లో బటన్ ప్రెస్ చేస్తే మీ జీపీఎస్ లొకేషన్.. మీరు ముందుగా స్టోర్ చేసి పెట్టుకున్న కాంటాక్ట్స్‌కు నిర్దిష్ట వ్యవధిలో వెళుతూ ఉంటాయి.

రక్ష: అప్లికేషన్‌ను ఆన్ చేసి.. బటన్లు వెతుక్కునే పని లేకుండా కేవలం వాల్యూమ్ బటన్‌ను ప్రెస్ చేసి పట్టుకుంటే పనిచేసే అప్లికేషన్ ఇది. పోలీసులకు (100) కాల్ చేయడంతోపాటు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లు, హాస్పిటల్స్ తాలూకూ వివరాలను గూగుల్ మ్యాప్‌పై చూపుతుంది.
 
ఐగో సేఫ్లీ: ఫోన్‌ను వేగంగా అటుఇటూ కదిపితే చాలు... మీరు ప్రమాదంలో ఉన్నట్లు వెంటనే బంధు మిత్రులకు సమాచారం పంపే సౌకర్యమున్న అప్లికేషన్ ఇది. లేదీ హెడ్‌ఫోన్ పిన్‌ను డిస్‌కనెక్ట్ చేసినా సరిపోతుంది. మీరు ఆఫ్ చేసేంతవరకూ ప్రతి నిమిషం జీపీఎస్ లొకేషన్, ఇతర వివరాలు బంధు మిత్రులకు వెళుతూనే ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో చేసిన 30 సెకన్ల ఆడియో రికార్డింగ్ కూడా మీ లిస్ట్‌లోని వారికి ప్రసారమవడం విశేషం.

సేఫ్‌లెట్... ఈ బ్రేస్‌లెట్... బ్లూటూత్‌తో స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అయి ఉంటుంది. ఆపత్కాలంలో బ్రేస్‌లెట్‌కు రెండువైపులా ఉన్న బటన్స్‌ను నొక్కితే చాలు.. మీరు ముందుగా స్టోర్ చేసి పెట్టుకున్న కాంటాక్ట్స్‌కు ఎస్‌ఎంఎస్ వెళుతుంది. అవసరమైతే పోలీసులకూ అలర్ట్ పంపవచ్చు. మీరు బటన్ నొక్కిన వెంటనే స్మార్ట్‌ఫోన్‌లోని మైక్రోఫోన్ పనిచేయడం మొదలవుతుంది. శబ్దాలను రికార్డు చేస్తుంది.

లీఫ్ సేఫర్: ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు తయారు చేసిన లేటెస్ట్ సేఫ్టీ టెక్నాలజీ ఇది. చూసేందుకు నెక్లెస్ మాదిరిగా ఉన్నా... ఇది సేఫ్‌లెట్ మాదిరిగానే పనిచేస్తుంది. బంధుమిత్రులతోపాటు... మీరున్న ప్రాంతంలో ఇదే టెక్నాలజీని ఉపయోగిస్తున్న వారికీ అలర్ట్‌లు పంపడం దీని ప్రత్యేకత. జ్ట్టిఞట://ఠీఠీఠీ.్ఛ్చజఠ్ఛ్చీట ్చఛ్ఛట.ఛిౌఝ/ వెబ్‌సైట్ ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు.

జీపీఎస్ పనిచేసేదిలా...
గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్.. కుప్తంగా జీపీఎస్ మానవ మేధ సృష్టించిన అద్భుతాల్లో ఒకటని చెప్పేందుకు అనుమానమే అక్కరలేదు. అగ్రరాజ్యం అమెరికా తన మిలటరీ అవసరాల కోసం అభివృద్ధి చేసుకున్నా... ప్రస్తుతం ఈ వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం మొదలుకొని... పర్యావరణ పరిరక్షణ వరకూ అనేక రంగాల్లో ఉపయోగిస్తున్నారు. జీపీఎస్‌లో స్పేస్, కంట్రోల్, యూజర్ సెగ్మెంట్లని మూడు భాగాలుంటాయి. మొదటి రెండింటిని అమెరికా ప్రభుత్వం పర్యవేక్షిస్తూంటుంది.

స్పేస్ సెగ్మెంట్‌లో దాదాపు 24 ఉపగ్రహాలుంటాయి. భూమికి దాదాపు 20 వేల కిలోమీటర్ల ఎత్తులో తిరుగు తూంటాయి. ఒక్కో ఉపగ్రహం రోజుకు రెండుసార్లు ప్రత్యేక కక్ష్యలో భూమిని చుట్టేస్తూంటాయి. అంతేకాకుండా ఇవి నిరంతరం రేడియో సంకేతాల ద్వారా తమ స్థానం, సమయం వంటి వివరాలను ప్రసారం చేస్తూంటాయి. ఈ 24 ఉపగ్రహాల స్థానం, కక్ష్యల ఫలితంగా భూమ్మీద మనకు ఏ క్షణంలోనైనా కనీసం మూడు ఉపగ్రహాల సంకేతాలు అందుబాటులో ఉంటాయి!  మన స్మార్ట్‌ఫోన్లతోపాటు కొన్ని ప్రత్యేకమైన పరికరాల్లో ఈ జీపీఎస్ సంకేతాలను అందుకునే సౌకర్యం ఉంటుంది. కాంతివేగంతో ప్రసారమయ్యే జీపీఎస్ సంకేతాలను అందుకునే స్మార్ట్‌ఫోన్లు.. ఆ సమయాన్ని నమోదు చేసుకుని... ఆ ఉపగ్రహానికి, తనకూ మధ్య ఉన్న దూరాన్ని లెక్కవేస్తాయి.   కనీసం మూడు ఉపగ్రహాల నుంచి ఉన్న దూరాన్ని లెక్కవేస్తే...ఆ స్మార్ట్‌ఫోన్ లేదా జీపీఎస్ రిసీవర్ భూమ్మీద ఏ అక్షాంశం, రేఖాంశంపై ఏ స్థానంలో ఉందో స్పష్టంగా తెలిసిపోతుంది.

ఆప్స్ డౌన్‌లోడింగ్ ఇలా...
స్మార్ట్‌ఫోన్లలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసేవి దాదాపుగా 90 శాతం వరకూ ఉన్నాయి. ఐఫోన్, విండోస్ ఫోన్లలో కొన్ని ఆండ్రాయిడ్ ఓఎస్‌తోనూ పనిచేస్తాయి. మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌ను వాడుతూంటే అప్లికేషన్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు గూగుల్ ప్లే స్టోర్ (జ్ట్టిఞట://ఞ్చడ.జౌౌజ్ఛ.ఛిౌఝ) వెబ్‌సైట్‌కు వెళ్లండి.
  హోమ్ పేజీలో ఎడమవైపు పైభాగంగా ఆప్స్, మూవీస్, గేమ్స్, బుక్స్, న్యూస్‌స్టాండ్, డివెజైస్ అన్న ఆప్షన్లు కనిపిస్తాయి. ఆప్స్‌పై క్లిక్ చేస్తే... స్మార్ట్‌ఫోన్‌లో మన పనులు సులువు చేసే అనేకానేక అప్లికేషన్లు కనపడతాయి.  మీకు కావాల్సిన అప్లికేషన్ పేరును, లేదా కీవర్డ్స్‌ను సెర్చ్ బార్ (పైభాగంలో భూతద్దం గుర్తు ఉన్నచోటు)లో టైప్ చేస్తే కింది భాగంలో అవి కనిపిస్తాయి.  నచ్చిన అప్లికేషన్‌ను క్లిక్ చేస్తే ముందుగా పర్మిషన్స్ (మీ వివరాలు సేకరించేందుకు ,వాడుకునేందుకు అనుమతి) కోరుతూ ఒక బాక్స్ ప్రత్యక్షమవుతుంది. యాక్సెప్ట్ ఆప్షన్‌ను నొక్కితే అప్లికేషన్ మీ స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్‌లోడ్ అవడం మొదలవుతుంది.  డౌన్‌లోడింగ్ పూర్తయిన తరువాత ఫోన్‌లోని ఆప్స్ బాక్స్‌లో ఉన్న ఐకాన్‌ను నొక్కి పట్టుకుని హోం స్క్రీన్‌పైకి తెచ్చుకోండి. దీంతో అప్లికేషన్ మీరు ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు లెక్క!
- గిళియార్
 
‘‘జంట నగరాల్లో మహిళల భద్రత కోసం షీ టీమ్ అనేక టెక్నాలజీలను వాడుతోంది. హాక్‌ఐ పేరుతో హైదరాబాద్ పోలీసులు అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్ వీటిల్లో ఒకటి మాత్రమే. దీంతోపాటు షీటీమ్ ఓ ఫేస్‌బుక్ పేజీ (జ్ట్టిఞట://ఠీఠీఠీ.జ్చఛ్ఛిఛౌౌజు.ఛిౌఝ/ టజ్ఛ్ట్ఛ్చిఝజిడఛీ) ని కూడా నిర్వహిస్తోంది. మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఇందులో పోస్ట్ చేయవచ్చు. వెంటనే తగిన చర్యలు చేపడతాం. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు ‘100’ నెంబరుకు ఫోన్ చేస్తే చాలు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న పోలీస్ వాహనం వెంటనే రంగంలోకి దిగుతుంది. ఆదుకునే ప్రయత్నాలు మొదలుపెడుతుంది. వీటితోపాటు నగరంలో ప్రజలు రవాణా కోసం ఉపయోగించే వాహనాలన్నింటిలో (ఆటోలు, బస్సులు, ట్యాక్సీలు వగైరా..) జీపీఆర్‌ఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగా మోటార్ వెహికల్స్ చట్టంలో మార్పులు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాము. ఇది అమల్లోకి వస్తే.. నేర నియంత్రణ మరింత సులువు అవుతుంది.’’
- స్వాతి లక్రా,
షీటీమ్, ఏసీపీ హైదరాబాద్

మరిన్ని వార్తలు