మోదకం ముదావహం

15 Sep, 2018 02:14 IST|Sakshi

అనాదిగా వస్తున్న ఆయుర్వేదం ఆరోగ్య పరిరక్షణకు పెట్టింది పేరు. దీనికి ఆహారవిహారాలు అత్యంత ప్రాముఖ్యం వహిస్తాయి. ఔషధానికి మూడవ స్థానం మాత్రమే. ఆహార విభాగపు షడ్రసాలలోనూ ‘మధుర’ (తీపి) రసానిదే అగ్రతాంబూలం. ప్రకృతిదత్త, సహజసిద్ధ మధురపదార్థాలు ఒక కోణమైతే, మనం ఇళ్లల్లో తయారుచేసుకునే తియ్యటి పిండివంటలు మరొక పాత్ర వహిస్తాయి. పూర్తిగా తయారైన తరవాత, గుండ్రని ఆకారం సంతరించుకుంటే వాటిని ‘లడ్డూలు’ అంటాం. అంటే వృత్తాకారపు మధుర భక్ష్యాలన్నమాట. వీటి భూమికలో ప్రధానంగా ఉండేవి... వరి, గోధుమ, పప్పులలో ‘మినప, సెనగ, పెసర, కంది’ వంటివి చాలా ముఖ్యమైనవి. అనంతరం నువ్వులు కూడా శ్రేష్ఠమే.

తీపి కోసం బెల్లం, శర్కర వాడతారు. కమ్మదనం కోసం నెయ్యి ప్రధానమైనది. సుగంధ ద్రవ్యాలలో... ఏలకులు, పచ్చ కర్పూరం, కుంకుమ పువ్వు మొదలైనవి శ్రేష్ఠం. జీడిపప్పు, బాదం పప్పు, కిస్‌మిస్, ఖర్జూరాలు అతిథి ద్రవ్యాలు. ఇలాంటి లడ్డూలన్నిటినీ ‘మోదకః’ అని, పెసర పిండిని వాడినప్పుడు, ‘ముక్తా మోదకాః’ అని, సెనగ పిండి వాడినప్పుడు ‘వేపన మోదకాః’ (మోతీచూర్‌ లడ్డు) అనీ వివరించారు. ఒకవేళ ఆకారం మారితే, చిన్న ముక్కలుగా ఉన్నవాటిని ‘మంఠకం’ అని, అప్పడాల వలె ఉంటే ‘సంపావః’ అని, నిమ్కీలలా ఉంటే ‘నాలికా’ అని, మరీ పొడవుగా ఉంటే ‘ఫేనికా’ అని, పూరీలలా చేస్తే ‘శష్కులీ’ అని పేర్కొన్నారు. వాటి పోషక విలువలు, ఆరోగ్యకర విశిష్టత కూడా విపులీకరించారు.

పెసర పిండి మోదకాలు: తేలికగా జీర్ణమై చలవ చేస్తాయి. బలకరం. కంటి ఆరోగ్యానికి మంచిది. జ్వరహరం. తృప్తికరం.
(... తేన మోదకాన్‌ లఘుః గ్రాహీ త్రిదోషఘ్న స్వాదుః
శీతో రుచిప్రదః చక్షుష్యో జ్వరహర, హృద్య, తర్పణో ముద్గమోదకః)
మోతీచూర్‌ లడ్డు: బలకరం, తేలికగా జీర్ణమై శరీరాన్ని తేలికపరుస్తుంది. చలవ చేస్తుంది. జ్వరాలను, రక్త స్రావాలను అరికడుతుంది. కఫాన్ని తగ్గిస్తుంది. మలబంధం కలిగిస్తుంది.
(... వేపనమోదకాః... బల్యాః జ్వరఘ్నాశ్చ.... విష్టంభినో, కించిత్‌ వాతకఫాపహా)
పెసలు (ముద్గ): నలుపు, ఆకుపచ్చనివి శ్రేష్ఠం. తేలికగా జీర్ణమై నీళ్ల విరేచనాలను తగ్గిస్తుంది (గ్రాహి). కొంచెం వాతాన్ని పెంచి, కఫపిత్తాలను తగ్గిస్తుంది. చలవ చేస్తుంది.
(ముద్గో... రూక్షో లఘుఃగ్రాహీ కఫపిత్తహరో హిమః)
మాష (మినుములు): రుచికరం, వాతహరం మలమూత్రాలను సాఫీ చేస్తుంది. బలకరమై ధాతుపుష్టిని చేస్తుంది. శుక్రకరం. మూలవ్యాధిని (పైల్స్‌), కడుపులో వ్రణాలను పోగొడుతుంది. ముఖానికి వచ్చే పక్షవాతాన్ని (అర్దితవాతాన్ని) తగ్గిస్తుంది. స్తన్యకరం.
(మాషో... తర్పణో బల్యః శుక్రలో బృంహణః పరః...)
కందులు: (ఆఢకీ, తువరీ) (మసూరః: ఎర్ర కందులు/సార పప్పు): వాతకరం, చలవ చేస్తుంది. విరేచనాలను, పిత్త కఫరక్త దోషాలను తగ్గిస్తుంది. ఆంత్రకృతములను (కడుపులోని నులి పురుగులు) నశింపచేస్తుంది.
(మసూరో సంగ్రాహీ శీతలో లఘుః; ఆÉý కీ వాతజననీ; తువరీ గ్రాహిణీ ప్రోక్తా... కోష్ఠకృమి జిత్‌)
చణకః: (సెనగలు): రుచిగా ఉంటాయి. కడుపులో వాయువును కలుగచేసి, శుక్రమును క్షీణింపచేస్తుంది. మలబంధకరం.  
బెల్లం (గుడ): పాతబెల్లం శ్రేష్ఠం, పుష్టికరం, శుక్రకరం. అగ్ని దీపకం
(పురాణగుడో... లఘుః, మధురో, వృష్యో, అసృక్‌ ప్రసాదనః, పిత్తఘ్నో...)
సితా (మిశ్రీ పటికబెల్లం): లఘువు, శీతలం, రక్తస్రావాన్ని అరికడుతుంది. వాతపిత్తహరం.
మధుఖండ: (తేనె నుండి తయారుచేసిన శర్కర):
(మధురా శర్కరా రూక్షా గురుః; ఛర్ది అతిసార, తృట్, దాహ హరాః....)
వాంతులు, విరేచనాలు, దప్పిక, మంటలను తగ్గిస్తుంది.
ఏలా (ఏలకులు): జఠరాగ్నిని పెంచి, ఉష్ణకరమై కఫరోగాలను తగ్గిస్తుంది. దప్పిక, వాంతులను కూడా తగ్గిస్తుంది. కామోత్తేజకం. చిన్న ఏలకుల్ని గుజరాతీ ఏలకులు అంటారు.
పచ్చకర్పూరం: శీతలం, వీర్యవర్థకం, స్థౌల్యహరం, నోటి అరుచిని, దుర్గంధాన్ని తగ్గిస్తుంది. చర్మరోగాలను పోగొడుతుంది.
కుంకుమం (కుంకుమ పువ్వు): త్రిదోషహరం, రక్త దోషాలను పోగొట్టి చర్మకాంతిని పెంచుతుంది. శిరశ్శూల, వ్రణాలను తగ్గిస్తుంది. కృమిఘ్నం. కాశ్మీర ప్రాంతపు ద్రవ్యం. సూక్ష్మ కేసరాలను కలిగి ఉండి, ఎర్రగా ఉంటుంది. తామరపువ్వు వాసన కలిగి ఉంటుంది. ఇది ఉత్తమం.
గుర్తుంచుకోవలసిన సారాంశం...

మాంసకృత్తులు అధికమ్ము మాషమందు శ్రేష్ఠమౌను శాకాహార శిష్టులకును పప్పులేవైన మన దేహవర్థకంబె లడ్డులన్నియు సమకూర్చు దొడ్డ బలము

ఘృతము కర్పూర కుంకుమ ఏలకాది ద్రవ్యములకును బెల్లము తగను కల్పి మోదకములను చేయంగ ముదముగాదె అవధిమీరక తినదగున్‌ హర్షగతుల

- డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, ఆయుర్వేద వైద్య నిపుణులు

మరిన్ని వార్తలు