మూడు రెక్కల దేవత

13 Jun, 2020 05:52 IST|Sakshi

సేవారథి

దేవతలకు రెండు రెక్కలు ఉంటాయి. మణిపూర్‌లోని లైబి ఓయినమ్‌కు మూడు రెక్కలు ఉన్నాయి. వాటిని మూడు చక్రాలుగా మార్చి ఆటో నడుపుతుంటుంది. కష్టంలో సాయం చేస్తే మనిషి అనొచ్చు. దైన్యావస్థలో ఆదుకుంటే దేవత అనాలి. లైబి ఓయినమ్‌ను ఇప్పుడు మణిపూర్‌లో దేవత అనే అంటున్నారు. ఆమె ఎటువంటి సహాయం చేసిందో తెలిస్తే మీరూ అంటారు.

జూన్‌ 1, 2020. సాయంత్రం ఆరు గంటలకు.
మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లోని తూర్పు ప్రాంతం డ్యూలాలాండ్‌లో ఒక అంబులెన్స్‌ ఆగింది. అందులో నుంచి ఒక అమ్మాయిని, ఆమె తండ్రిని దించేసి వెళ్లిపోయింది.
‘మమ్మల్ని ఇంటి దాకా దించుతామన్నారు కదా’ అన్నారు తండ్రీ కూతుళ్లు.
‘ఇక్కడ నుంచి జిల్లా మారిపోతుంది. జిల్లా లోపలి వరకే దించాలి. దాటకూడదని రూలు’ అని వెళ్లిపోయాడు అంబులెన్స్‌ డ్రైవర్‌.
తండ్రీ కూతుళ్లు నిశ్చేష్టులయ్యారు.
ఒకవైపు చూస్తే చీకటి పడుతోంది. అమ్మాయి పేషెంట్‌. కోవిడ్‌ బారిన పడి పద్నాలుగు రోజులు ఇంఫాల్‌లోని ప్రసిద్ధ వైద్య సంస్థ జె.ఎన్‌.ఐ.ఎమ్‌.ఎస్‌లో చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయ్యింది. తీసుకెళ్లడానికి తండ్రి వచ్చాడు. వాళ్లది ఇంఫాల్‌ నుంచి 140 కిలోమీటర్ల దూరం ఉన్న కాంజోంగ్‌ జిల్లాలో స్కిప్‌ అనే గ్రామం. అక్కడకు వెళ్లాలి. ఎలా?
తండ్రి తన కూతురిని రోడ్డు పక్కన నిలబెట్టి టాక్సీల కోసం పరిగెత్తాడు. మొదట అందరూ వస్తామన్నారు. బేరం చేశారు. తీరా తీసుకెళ్లాల్సింది పేషెంట్‌ని అని తెలిశాక వెనక్కు తగ్గారు.
‘మా అమ్మాయికి కరోనా తగ్గిపోయింది. ఇప్పుడు లేదు. భయపడకండి’ అని తండ్రి చెప్పినా ఎవరూ వినలేదు.
‘అమ్మో.. మేము రాలేం’ అని తప్పించుకున్నారు.

ఇప్పుడు ఏం చేయాలి?
వీళ్ల బాధ చూసిన ఎవరో లైబి ఓయినమ్‌కు ఫోన్‌ చేశారు. లైబి ఓయినమ్‌ ఇంఫాల్‌లో తొలి మహిళా ఆటోడ్రైవర్‌. అంతకు ముందు ఆమె స్ట్రీట్‌ వెండర్‌గా అవీ ఇవీ రోడ్డు పక్కన అమ్ముతూ ఉండేది. ఇప్పుడు ఆటో డ్రైవర్‌ అయ్యింది. ఇద్దరు పిల్లల తల్లి. భర్త ఉన్నా కుటుంబానికి తన సంపాదన ఆధారం.
‘కోవిడ్‌ పేషెంట్‌ను ఇంటికి తీసుకెళ్లాలి’ అని చెప్పారు వాళ్లు.
‘వారికి అభ్యంతరం లేకపోతే తీసుకెళతాను’ అంది లైబి.
కాని ఆమెకు ఉన్నది ఆటో మాత్రమే. వెళ్లాల్సిన దూరం పెద్దది. అంత దూరం ఆటోలో వెళ్లడం సాధ్యమా? పైగా చీకటి పడిపోయింది. తోడు కోవిడ్‌ నుంచి బయటపడ్డ అమ్మాయి. రకరకాల ఆలోచనలు వచ్చినా లైబి ధైర్యం చేసి భర్తకు ఫోన్‌ చేసింది. ‘నాతో తోడురా. బేరం వచ్చింది’ అని చెప్పింది. భర్త ఆమెను చేరుకున్నారు. ఇద్దరూ కలిసి ఆ తండ్రీ కూతుళ్ల దగ్గరకు వెళ్లారు.
‘పదండి పోదాం’ అన్నారు.

లైబి, ఆమె భర్త ముందు కూర్చుంటే వెనుక బాధితురాలు, ఆమె తండ్రి కూచున్నారు.
ప్రయాణం మొదలైంది. గంట కాదు... రెండు గంటలు కాదు... ఎనిమిది గంటల పాటు నిరంతరాయంగా ఆటోను నడిపింది లైబి. రాత్రి రెండున్నర ప్రాంతంలో పేషెంట్‌ను సురక్షితంగా ఇల్లు చేర్చింది. ఆమె చేసిన పనికి ఆ కుటుంబం శతకోటి నమస్కారాలు పెట్టింది.
లైబి భర్తతో అప్పటికప్పుడు తిరిగి వచ్చేసింది.
కాని ఈ విషయం వెంటనే పత్రికల ద్వారా లోకానికి తెలిసింది. లైబి చేసిన పనిని ఇంఫాల్‌లోనే కాదు దేశ విదేశాల్లో ఉన్న చాలామంది, ముఖ్యంగా మణిపూర్‌ వాసులు మెచ్చుకున్నారు. ఆమెకు కానుకగా ఇవ్వడానికి అందరూ డబ్బు పంపారు. అవన్నీ లక్షా పది వేల రూపాయలు అయ్యాయి. వాటిని జూన్‌ 11న మణిపూర్‌ సి.ఎం. ఎన్‌.బిరేన్‌ సింగ్‌ ఆమెకు అందజేశాడు. ఆమెకు శాలువా కప్పి సత్కరించాడు.
లైబి ఆ పేషెంట్‌ను దింపి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ సూచనల ప్రకారం తన భర్తతో కలిసి క్వారంటైన్‌లో ఉంటోంది. డిశ్చార్జ్‌ అయిన కోవిడ్‌ పేషెంట్‌తో అంత సేపు ఉన్నందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఈ పని చేసింది.
మణిపూర్‌లో తొలి మహిళా ఆటో డ్రైవర్‌ అయిన లైబి మీద రెండేళ్ల క్రితం ‘ఆటో డ్రైవర్‌’ పేరుతో డాక్యుమెంటరీ తయారైంది. దానికి ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ‘స్త్రీలకు స్ఫూర్తి కలిగించే విధంగా ఆమె జీవితం ఉంది’ అని ఆ డాక్యుమెంటరీ చూసినవాళ్లంతా అన్నారు.
ఇప్పుడు తన సేవాభావంతో కూడా ఆమె చాలామందికి స్ఫూర్తి కలిగిస్తోంది. దేవతలు తెల్లటి బట్టల్లో ఉండరని, సాదాసీదా ఖాకీ యూనిఫామ్‌ వేసుకు తిరుగుతుంటారు లైబిని చూస్తే మనకు అర్థమవుతుంది.

 
శాలువాతో సత్కరిస్తున్న సీఎం. ఎన్‌.బిరేన్‌


తనను ఇంటికి చేర్చిన లైబీతో ప్రయాణికురాలు

మరిన్ని వార్తలు