అడవిలో అమ్మాయిలు

12 Mar, 2018 01:00 IST|Sakshi

‘‘అమ్మాయికి తోడుగా ఎవరు వెళ్తున్నారు?’’ ఒక అమ్మాయి పని మీద బయటకు వెళ్తుంటే నానమ్మ హెచ్చరిస్తుంది. ‘‘అక్కకు తోడు వెళ్లరా’’ అని తమ్ముడిని పంపిస్తుంది అమ్మ. ఈ 21వ శతాబ్దంలోనూ ఈ మాటలనే వింటుంటాం! అలాంటిది ఓ అమ్మాయి ‘‘నాకు ఉద్యోగం వచ్చింది నానమ్మా.. బీట్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌గా’’ అంటే నానమ్మ ఉలిక్కిపడదా? ఆ ఉద్యోగానికి పంపించాలా వద్దా అని అమ్మానాన్న ఆలోచనలో పడరా? ఎవరు ఉలిక్కిపడినా, ఎవరు ఆలోచనలో పడినా.. ఈ అమ్మాయిలు వెనకడుగు వేయలేదు. ఇది మగవాళ్ల ఉద్యోగం అనే సామాజిక భ్రాంతిని మరొకసారి భళ్లున బద్దలు చేశారు.

కేరళలోని ఇడుక్కి జిల్లా, మరాయూర్‌ శ్రేణులు. వందల ఏళ్ల నాటి ఎల్తైన చందనపు వృక్షాలమయం. ఎప్పుడు స్మగ్లర్లు ఆ చందనపు దుంగలను నరికి తరలించుకుపోతారో తెలియదు. వేటగాళ్లు ఎప్పుడు పొంచి ఉండి జంతువుల మీద దాడి చేస్తారో ఊహించడం కష్టం. ఏ జంతువుకి ఎప్పుడు ఆకలవుతుందో, ఎప్పుడు మనుషులను ఓ చూపు చూస్తుందో ఆ దేవుడికే తెలియాలి. ఇలాంటి అడవులలో అడుగుపెట్టడానికి ఎవరైనా జంకుతారు. ఏ జగదేకవీరుడో తోడుగా వస్తే తప్ప ఇలాంటి చోటకు వెళ్లడానికి భయపడతారు మామూలుగా అమ్మాయిలు.

బీటెక్‌ చదివి ఫారెస్ట్‌ బీట్‌కు
‘‘భయపడితే మేమూ మామూలు అమ్మాయిలమే అయ్యేవాళ్లం. కానీ మేము అంతకంటే కొంచెం ఎక్కువే. అందుకే ఆ అడవుల సంరక్షణ బాధ్యతను ధైర్యంగా తలకెత్తుకున్నాం’’ అంటున్నారు అథిరా, శ్రీదేవి. కేరళలో బీట్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌లుగా ఎంపికైన తొలి మహిళలుగా రికార్డు కూడా వీరిదే. ఈ ఏడాది జనవరిలో కేరళ ప్రభుత్వం 40 మంది బీట్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్లను నియమించింది. వారంతా మహిళలే. వారిలో తొలి మహిళలు అథిర, శ్రీదేవి. ఇద్దరూ బీటెక్‌ గ్రాడ్యుయేట్లు. ప్రస్తుతం ఈ అమ్మాయిలు కుదుక్కాథరా డివిజన్‌లోని నచివాయల్‌ ఫారెస్ట్‌ స్టేషన్‌లో డ్యూటీ చేస్తున్నారు.

ప్రతి అడుగూ ఒక చాలెంజ్‌
ఆరువందల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అడవుల్లో ఏ ఒక్క జోన్‌ కూడా భద్రమైనది కాదు. ఫారెస్ట్‌ ఆఫీసర్‌లు స్మగ్లర్లను, వేటగాళ్లను చూసీ చూడనట్లు వదిలేయాలి లేదా ప్రాణాలకు ఎదురొడ్డి ఉద్యోగం చేయాలి. అలాంటి చోట్ల విధులు నిర్వర్తించడం గురించి మాట్లాడుతూ.. ‘‘ఇది సులభమైన ఉద్యోగం కాదు, ఆ సంగతి తెలుస్తూనే చాలెంజింగ్‌గా తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు వెనకడుగు వేయడం ఉండదు. అయితే క్షణక్షణం అప్రమత్తంగా ఉండాలని మాత్రం గుర్తు చేసుకుంటుంటాం’’ అంటోంది శ్రీదేవి.

‘‘భయాలను అధిగమించాం కాబట్టే ఈ ఉద్యోగంలోకి వచ్చాం. ప్రమాదాలనేవి లేనిదెక్కడ? ఇంట్లో ఉన్నా వచ్చేవి వస్తూనే ఉంటాయి. రోడ్డు మీద, బహిరంగ ప్రదేశాలు, ఆఫీస్‌లు అని చోట్లా ప్రమాదాలు ఎదురవుతూనే ఉంటాయి. వాటి నుంచి కాచుకుంటూ జీవిస్తుంటాం. అడవుల్లో ఎదురయ్యే ప్రమాదాలు అంతకంటే భయంకరమైనవేమీ కాదు’’ అంటోంది అథిర.   

ఒక అడ్వెంచర్‌లా డ్యూటీ!
అథిర, శ్రీదేవి ఇద్దరూ రోజంతా అడవుల్లోనే సంచరిస్తుంటారు. సాయంత్రం ఆరు నుంచి తెల్లవారు జామున ఆరుగంటల వరకు డ్యూటీ. పగలు విశ్రాంతి కూడా అడవుల్లోనే. ఖాకీ దుస్తులు, జంగిల్‌ షూస్‌ వాళ్ల డ్రస్‌. బ్యాక్‌ ప్యాక్‌లో వాకీ టాకీ, ఫ్లాష్‌లైట్లు ఉంటాయి. ‘‘ఈ డ్యూటీ చాలా అడ్వెంచరస్‌గా ఉంది. ఎంజాయ్‌ చేస్తున్నాం. అలాగే రాత్రిళ్లు ఎండుపుల్లలతో చలిమంట వేసుకున్నప్పుడు వచ్చే చందనపు పరిమళాలను కూడా’’ అంటున్నారు వాళ్లు!

– మంజీర

>
మరిన్ని వార్తలు