మేము ఇవీ నడపగలం!

12 Feb, 2014 00:01 IST|Sakshi
మేము ఇవీ నడపగలం!

 బజారుకెళ్లడమే తెలియని రోజుల నుంచి మహిళలు బండిపై తిరిగే రోజులకు వచ్చేశాం. టూ వీలర్, ఫోర్ వీలర్, బస్సు, రైలు....అన్నీ నడిపేస్తున్నారు. అన్నీ కూడా ఉపాధి పేరుతోనో, అవసరం కోసమో చేస్తున్నవే. కానీ బైక్ రైడింగ్ మహిళల కోటాలోకి వస్తుందా? అదీ మగవాళ్లు నడిపే బళ్లపై అలా సరదాగా రోడ్డుపై చక్కర్లు కొట్టగలరా? ఎందుకు చేయలేమంటూ ఎంతోమంది మహిళలు ముందుకొస్తున్నారు. హైదరాబాద్‌లో ‘ఉమెన్ బైక్ రైడింగ్ క్లబ్’లోని మహిళల్ని పలకరిస్తే ఆసక్తిర  విషయాలెన్నో తెలుస్తాయి.
 
 ఉమెన్ బైక్ రైడింగ్ క్లబ్‌ని మొదట పుణేలో ‘ఊర్వశీపాటిల్’ అనే మహిళ మొదలుపెట్టారు. ఆమెకు చిన్నప్పటి నుంచి గేర్‌బైక్ నడపడం అంటే చాలా ఇష్టం. పెద్దయ్యాక పట్టుదలతో నేర్చుకుంది. గేర్‌బైక్‌పై ఊర్వశి రోడ్డుపై వెళుతుంటే చాలామంది అమ్మాయిలు ముందు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమెకు ఆదర్శంగా తీసుకుని వారు కూడా గేర్‌బైక్‌లను నడపడానికి ప్రయత్నించారు. ఊర్వశీపాటిల్‌ను మిగతా మహిళలు అనుసరించడాన్ని పురుషులెవరూ ప్రోత్సహించలేదు. ఎవర్నీ లెక్కచేయకుండా ఊర్వశీపాటిల్ 2011లో ఉమెన్ బైక్ రైడింగ్ క్లబ్‌ని ఏర్పాటు చేశారు. గేర్ బైక్ నడపడం వచ్చిన మహిళల్ని అందులో చేర్చుకున్నారు. ఆమె గురించి వచ్చిన వార్తాకథనాలకు స్పందించిన ఇతర నగరాల్లోని మహిళలు కూడా ఎవరికి వారు ‘ఉమెన్ బైక్ రైడింగ్ క్లబ్’లను ఏర్పాటు చేసుకున్నారు.
 
 హైదరాబాద్‌లో...
 గత ఏడాది (మార్చి 8) మహిళా దినోత్సవం రోజు ఇక్కడ జయభారతి అనే ఆర్కిటెక్ట్ ఉమెన్ బైక్ రైడింగ్ క్లబ్‌ని స్థాపించారు. ‘‘క్లబ్ అంటే ఆఫీసులాంటిది ఏమీ ఉండదు. కేవలం సభ్యులకు ఇచ్చే గుర్తింపు మాత్రమే అది. మొదట ఆరుగురితో ఇక్కడ క్లబ్‌ని ఏర్పాటు చేశాను. ప్రసన్న, అమూల్య, రుజుత, సన, నిక్కి, హర్షితలతో ఆ రోజు అనంతగిరి నుంచి వికారాబాద్ వరకూ 80 కిలోమీటర్లు రైడ్ చేశాం. నాకు తెలిసి మన నగరంలో అదే మొదటిసారి అనుకుంటా ఓ నలుగురు ఆడవాళ్లు కలిసి గేర్ బైక్‌లు నడపడం’’ అని జయభారతి చెప్పారు. ‘‘మేము అలా బైక్స్‌మీద రోడ్డుపై వెళుతుంటే అందరూ ఆశ్చర్యంగా చూశారు. అమ్మాయిలైతే వింతగా వింతగా చూసిన దృశ్యం నాకు ఇప్పటికీ గుర్తొస్తుంటుంది’’ అని గుర్తుచేసుకున్నారు జయభారతి.
 
 దేనికోసం...
 ఏ పనిచేయాలన్నా బలమైన కారణమో, ప్రయోజనమో ఉండాలి. మనదగ్గర ‘ఉమెన్ బైక్ రైడింగ్ క్లబ్’ వెనకున్న విషయం ఏమిటని అడిగితే ఓ ప్రైవేటు కంపెనీలో సిఇఓగా పనిచేస్తున్న ప్రసన్న మాట్లాడుతూ...‘‘ఎన్ని రంగాల్లో తన ప్రతిభను చాటినా...ఇంకా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరగాల్సిన అవసరం చాలా ఉంది. మా బైక్ రైడింగ్ దానికి ఎంతోకొంత ఉపయోగపడుతుందని మా అభిప్రాయం. ఇప్పటికీ చాలామంది అమ్మాయిలు ఆడవాళ్ల బళ్లను నడపడానికి భయపడుతున్నారు. అలాంటివారు గేర్‌బళ్లపై మహిళల్ని చూస్తే వారి అపోహల్ని పోగొట్టుకోవచ్చు’’ అని చెప్పారు ప్రసన్న. కేవలం రోడ్లపై నడిచేవారికి తమలోని ఆత్మవిశ్వాసాన్ని చాటుకోవడం కోసమే వీళ్లు రైడ్ చేయడం లేదు. గత నెలలో ఓ స్వచ్ఛందసంస్థ వారు ‘సేవ్ గర్ల్ చైల్డ్’పై ఒక ర్యాలీ చేయాలనుకున్నారు. అప్పుడు వాళ్లు ‘ఉమెన్ బైక్ రైడింగ్ క్లబ్’ని సంప్రదించడంతో వెంటనే ఒప్పుకుని కొందరు అబ్బాయిల్ని కూడా కలుపుకుని ఓ అరవైమంది సికింద్రాబాద్ దగ్గర బైక్ ర్యాలీ చేశారు. ప్రస్తుతం పదిహేనుమందితో కొనసాగుతున్న ఈ క్లబ్‌లో చేరాలంటే మీక్కూడ గేర్‌బైక్ నడపడం వస్తే చాలు. ప్రతి నెల వీకెండ్‌లో సుదీర్ఘ ప్రయాణాలు చేస్తున్న ఈ క్లబ్‌మెంబర్స్‌తో పాటు మీరు కలిసి ప్రయాణించవచ్చు. ఆసక్తి ఉన్నవారు ్జ్చజీఛజ్చిట్చ్టజిజీఃజఝ్చజీ.ఛిౌఝను సంప్రదించవచ్చు.        - భువనేశ్వరి

మరిన్ని వార్తలు