లైలా..మజ్ను

1 Oct, 2019 13:03 IST|Sakshi

చరిత్రలో నిలిచిపోయిన అమర ప్రేమికులలో లైలా, మజ్నుల జంటది ప్రత్యేక స్థానం. అమర ప్రేమికుడు మజ్ను అసలు పేరు కైస్‌ ఐబిన్‌ అల్‌ ముల్లా. కైస్‌ పుట్టిన వెంటనే అతడి తండ్రి షా అమారి ఓ జ్యోతిష్కుడి దగ్గరకు తీసుకెళతాడు. అప్పుడా జ్యోతిష్కుడు ‘నీ కొడుకు ప్రేమ కోసమే పుట్టాడు’ అని చెప్తాడు. పేదవాడైన అమారికి ఈ ప్రేమ, దోమా అంటే నచ్చదు. అందుకే కుమారుడ్ని ప్రేమ జోలికి పోకుండా చూసుకుంటుంటాడు. కైస్‌ పెరిగి పెద్దవాడైన తర్వాత.. ఓ రోజు మసీదు వద్ద లైలాను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు.. ఆమెను మెప్పించి తన ప్రేమలో పడేస్తాడు. స్వతహాగా కవి అయిన కైస్‌..లైలా మీద ప్రేమ పద్యాలు, కవితలు రాసి ఆమెకు అంకితమిస్తుంటాడు.

అతడి స్నేహితులకు విషయం తెలిసి కైస్‌ను ఆటపట్టిస్తుంటారు. ఇద్దరూ తలమునకలయ్యే ప్రేమలో తేలిపోతుంటారు. ఆమె తండ్రి దగ్గరకు వెళ్లి కూతుర్ని తనకిచ్చి పెళ్లి చేయమని కైస్‌ అడుగుతాడు. కానీ, ఒకే జాతికి చెందినప్పటికి హోదాలు వేరైన కారణంగా వీరి పెళ్లికి లైలా తండ్రి అంగీకరించడు. ఒకరినొకరు చూసుకోకుండా దూరం చేస్తాడు. ఆ వెంటనే సంపన్నుడైన వ్యక్తికి లైలాను ఇచ్చి పెళ్లిచేస్తాడు. లైలాకు పెళ్లి జరిగిపోయిందని తెలుసుకున్న కైస్‌ గుండె ముక్కలవుతుంది. ఆమె కోసం పిచ్చివాడిలా తయారవుతాడు. రేయి, పగలు అని తేడా లేకుండా ఇసుకలో లైలా పేరును రాస్తూ గడుపుతుంటాడు. అక్కడ లైలా పరిస్థితి కూడా అలాగే ఉంటుంది.

రాజభోగాల మధ్య ఉన్నా ముళ్లమీద కూర్చున్నట్లుగానే ఉంటుంది ఆమెకు. మనసు ఎల్లపుడూ కైస్‌ చుట్టూనే తిరుగుతుంటుంది. కొన్నేళ్లకు భర్తతో కలిసి ఆమె ఇరాక్‌ వెళ్లిపోతుంది. కొద్దిరోజులకే అక్కడ అనారోగ్యం కారణంగా లైలా కన్నుమూస్తుంది. లైలా మరణవార్త తెలుసుకున్న కైస్‌ మిత్రులు విషయం అతడికి చెప్పాలని ఎంతో ప్రయత్నిస్తారు. కానీ, కైస్‌ జాడ దొరకదు. కొద్దిరోజుల తర్వాత ఓ చోట కైస్‌ ఆచూకీని కనుగొంటారు. వాళ్లు అక్కడికి వెళ్లి చూడగా.. కైస్‌! లైలా సమాధి దగ్గర ప్రాణం లేకుండా పడి ఉంటాడు. లైలా కోసం పిచ్చివాడిలా తిరగటం వల్లే కైస్‌కు మజ్ను అనే పేరు వచ్చింది. ‘‘మజ్ను లైలా’ అంటే లైలా కోసం పిచ్చివాడిలా తిరిగిన వాడు అని అర్థం వస్తుంది. లైలా.. మజ్నులు మరణించి వందల ఏళ్లు అవుతున్నా.. ప్రేమ రూపంలో శాశ్వత స్మరణీయులే.  

మరిన్ని వార్తలు