పెళ్లి కాలానికి మళ్లీ వెళ్తే...

5 Mar, 2018 00:34 IST|Sakshi

కొత్త బంగారం
అమెరికన్‌ రచయిత్రి రెయిన్‌బో రవెల్‌ రాసిన ‘లాండ్‌లైన్‌’లో– జోర్జీ మిక్కోల్‌ పెళ్ళయి, ఇద్దరు పిల్లలున్న స్త్రీ. టీవీ సీరియళ్ళ రచయిత్రి. లాస్‌ ఏంజెలెస్‌లో ఉంటుంది. భర్త నీల్‌ ఉద్యోగం వదిలేసి, ఇంటినీ పిల్లల్నీ చూసుకుంటుంటాడు. భాగస్వామీ, స్నేహితుడూ అయిన సెఠ్‌తో కలిపి రాయవలసినది చాలా ఉండటంతో, భర్తతో కలిసి క్రిస్మస్‌ జరుపుకోవడానికి ఒమహాలో ఉన్న అత్తగారింటికి వెళ్ళలేనని జోర్జీ నిశ్చయించుకుంటుంది. ప్రయాణానికి రెండు రోజుల ముందు తన నిర్ణయాన్ని భర్తకి తెలిపినప్పుడు, అతను మౌనం వహిస్తాడు. తమ మధ్య సంబంధం తెగిపోతోందని ఆమె భావిస్తుంది..

భర్తా, ఇద్దరు కూతుళ్ళూ ఎయిర్‌ పోర్టుకి వెళ్ళిపోయిన తరువాత తన నిర్ణయం తప్పేమో అన్న సందేహం పుడుతుంది జోర్జీకి. ఒక వారంపాటు అసలేమీ రాయలేకపోయి, భర్తతో మాట్లాడ్డానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను ఫోన్‌ ఎత్తడు. ఒంటరిగా ఉండటం ఇష్టంలేక తల్లి ఇంటికి వెళ్ళినప్పుడు, అల్లుడు కూతుర్ని వదిలిపెట్టాడని తల్లి అనుకుంటుంది. అక్కడ జోర్జీ ఐఫోన్‌ పాడయినప్పుడు, తన పాతగదిలో ఉన్న ‘లాండ్‌లైన్‌’తో అత్తగారింటికి ఫోన్‌ చేసి నీల్‌తో మాట్లాడుతుంది.

వేలితో నంబర్లు తిప్పే ఆ పసుప్పచ్చటి ఫోన్‌ కాలయాన పరికరం అయి, ఆమెని గతంలోకి తీసుకెళ్తుంది. తను మాట్లాడుతున్నది భర్త అయిన 2013 సంవత్సరపు నీల్‌తో కాదనీ, 1988 సంవత్సరంలో తనకి కాలేజీలో తెలిసిన 22 ఏళ్ళ నీల్‌తోననీ రెండోరోజు గుర్తిస్తుంది. ఏది యథార్థమో, ఏది భ్రమో తెలుసుకోని పరిస్థితి ఏర్పడుతుంది. ‘నీ చుట్టూ ఉన్న దాని పట్ల నాకున్న అసహ్యం కన్నా, నీమీద నాకున్న ప్రేమ ఎక్కువ’ అని నీల్‌ తనకి చెప్పాడని సంభాషణ వల్ల గుర్తొస్తుంది.

వాళ్ళిద్దరూ ఎలా కలుసుకుని ప్రేమలో పడ్డారో, కాలం గడిచేగొద్దీ ఎలా దూరం అయ్యారో పాఠకులకి తెలుస్తుంది. తనను పెళ్ళి చేసుకొమ్మని అడిగేటందుకు, గతంలో అతను ఒమహా నుంచి లాస్‌ఏంజెలెస్‌కి 27 గంటలు డ్రైవ్‌ చేసుకుంటూ వచ్చాడని గతకాలపు నీల్‌ ఫోన్లో చెప్పినప్పుడు, జోర్జీ తను రాయవలిసిన స్క్రిప్ట్‌ వదిలి– భర్త, కుటుంబంతోపాటు క్రిస్మస్‌ జరుపుకోవడానికి వెళ్తుంది. జోర్జీ, నీల్‌– రాజీపడి, భవిష్యత్తులో సమస్యలని కలిసే పరిష్కరించుకుందామని నిర్ణయించుకుంటారు.

సంబంధాలు ఎలా మారతాయో, మనుష్యులు పలుమార్లు ఒకరినొకరు కోల్పోయి తిరిగి ఎలా ఒకటైపోతారో, ముఖ్యమైన సంబంధాల పట్ల నిబద్ధత ఎలా పాటిస్తారో అని చెప్పే ఈ నవల అధికభాగం సంభాషణలతోనే సాగుతుంది. ఏ తిట్లూ, దూషణలూ లేకపోయినా వైవాహిక జీవితంలో కూడా రాపిడీ, ఘర్షణా ఉన్నప్పుడు ఆ సంబంధం చిక్కులు పడే ఉంటుందన్న సంగతిని పుస్తకం చెబుతుంది. నవల్లో జోర్జీ పడిన మీమాంస అందరికీ వర్తించేదే: ఉద్యోగమా, కుటుంబమా?

చదవడానికి తేలికగా ఉండే ఈ పుస్తకం– ప్రేమనీ, పెళ్ళినీ నిర్వచిస్తూ, ‘సంబంధంలో కేవలం ప్రేమ ఉంటే సరిపోతుందా!’ అనే ప్రశ్నలని కూడా గుప్పిస్తుంది. రచయిత్రి స్వరం, జోర్జీ మానసిక స్థితినే కాక చుట్టుపక్కలున్న వారందరి అభిప్రాయాలనీ కూడా వ్యక్తపరుస్తుంది. ఇది రవెల్‌ నాలుగవ నవల. పబ్లిష్‌ అయినది 2014లో. ‘గుడ్‌రీడ్స్‌ ఛాయిస్‌ అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ ఫిక్షన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ గెలుచుకుంది. ఆడియో పుస్తకం కూడా ఉంది.
- కృష్ణ వేణి 

మరిన్ని వార్తలు