దృశ్య పరిమళం!

4 Dec, 2013 23:40 IST|Sakshi

ఫొటోగ్రఫీలో కొత్త ప్రయోగాలు  ఎన్నో చేసిన లాంగ్‌జంగ్‌సాన్ కొన్నిసార్లు సాధారణమైన చిత్రాల్లోనే అసాధారణమైన అందాన్ని సృష్టించాడు. ఆ దృశ్యాలు కవిత్వం వినిపిస్తాయి. అపరిచిత పరిమళం ఒకటి ఆత్మీయంగా పలకరిస్తుంది!
 
 చిత్రంతో కవిత్వం సృష్టించడం సాధ్యపడే పనేనా? ‘ఇదేదో విచిత్రంగా ఉందే’ అనుకోనక్కర్లేదు. తమ చిత్రాలతో మౌనకవిత్వం చెప్పించిన వాళ్లు చాలామంది ఉన్నారు. చైనీస్ ఫొటోగ్రాఫర్ లాంగ్‌జింగ్‌సాన్ అచ్చంగా ఆ కోవకే చెందిన కళాకారుడు. ఆయన చిత్రాలు మౌనంగా ఉన్నట్లే ఉంటాయి. కానీ అవి మాట్లాడతాయి. కంటికి ఇంపుగా ఆశుకవిత్వాన్ని అందిస్తాయి. పొగమంచు వేళల్లో పడవల నడకలు ఏం చెబుతాయి? చెట్టు కొమ్మ మీద వాలిన పిట్ట చూపులోని మర్మం ఏమిటి? ఇలా ఎటు నుంచి ఎటు చూసినా గాలి వీచినంత సహజంగా కవిత్వం! దృశ్యకవిత్వం!!
 
 నిండా నూరేళ్ల  పరిపూర్ణ జీవితాన్ని చూశాడు లాంగ్. అతడి ఫొటోలలో  కూడా అంతే పరిపూర్ణత కనిపిస్తుంది. షాంగైలోని నన్‌యాంగ్ హైస్కూలో చదివేటప్పుడు కళతో తొలి పరిచయం ఏర్పడింది లాంగ్‌కు. రకరకాల బొమ్మలను సేకరించడం అలవాటుగా ఉంటేది. ఖాళీ సమయం దొరికితే చాలు తన కృషిని పెయింటింగ్, కాలిగ్రఫీ, ఫొటోగ్రఫీల మీదకు మళ్లించేవాడు.
 
 ‘చైనీస్ ఫొటోగ్రఫీ సొసైటీ’ పరిచయం అతని సృజనకు కొత్త అడుగులు నేర్పింది. అక్కడ తాను ఎంతో కొంత నేర్చుకున్నాడు. ఆ తరువాత షాంగై ‘టైమ్స్’ ఫొటోగ్రాఫర్‌గా పనిచేశాడు. అప్పుడు అతని ప్రపంచం మరింత విశాలంగా మారింది. తనకు ఫొటోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు వచ్చింది. లాంగ్ తీసిన ఎన్నో ఫొటోలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గుర్తింపు పొందిన పత్రికలలో ప్రచురితమయ్యాయి. మొదట్లో పువ్వులు, పక్షులు, రకరకాల ప్రజల స్టిల్-లైఫ్ మీద ఫోకస్ చేశాడు. 1930 నుంచి కొత్తరీతులలో ప్రయోగాలు ప్రారంభించాడు. అందులో ఒకటి... నెగటివ్‌కు బ్రష్‌వర్క్ జత చేయడం. చైనీస్ భౌగోళిక అందాలను ఫొటోగ్రఫిక్ ఫామ్‌లో పెయింటింగ్ చేశాడు. తన టెక్నిక్‌ను ఆయన ‘కంపోజిట్ ఫొటోగ్రఫీ’ అనేవాడు.
 
 ‘ది నేషనల్ ఆర్ట్ మ్యూజియం ఆఫ్ చైనా’ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ఫాదర్ ఆఫ్ ఆసియా ఫొటోగ్రఫిక్’ లాంగ్‌జింగ్‌సాన్ ఫొటోల ఎగ్జిబిషన్ జరుగుతోంది.
 

మరిన్ని వార్తలు