చివరి సందేశం

11 Nov, 2017 23:54 IST|Sakshi

బుద్ధుడు తన ధర్మప్రచారంలో భాగంగా ఒకసారి వైశాలికి వచ్చాడు. అప్పటికి ఆయనకు ఎనభై ఏళ్లు. అక్కడ ఉన్నప్పుడు ఆయన అనారోగ్యం పాలయ్యారు. తేరుకున్నాక బయలుదేరి బంద అనే గ్రామం చేరారు. అక్కడి నుంచి భోగనగరం చేరారు. ఆరోగ్యం మరలా దెబ్బతింది. అవసాన దశ అని ఆయనకు తెలిసింది. ఇంతవరకూ తానున్న లిచ్ఛవుల రాజ్యం నుంచి మల్లుల రాజ్యానికి వెళ్లాలని, తన నిర్యాణం అక్కడే జరగాలని వెంటనే పావామల్లుల రాజధాని పావానగరానికి వెళ్లాడు. అక్కడ చుందుని ఆహ్వానంపై బుద్ధుడు తన భిక్షువులతో కలిసి అతని ఇంటికి వెళ్లాడు.

చుందుడు వడ్డించిన పదార్థంతో రెండు ముద్దలు తిన్నాక అది సరిగా లేదని గ్రహించి మిగిలిన భిక్షువుల్ని ‘తినవద్దు’ అని వారించాడు. ఆ తర్వాత బుద్ధునికి తీవ్ర రక్తవిరేచనాలు పట్టుకున్నాయి. తర్వాత కుసీనగరానికి వెళ్దామనడంతో గుడ్డడోలీని కట్టి బుద్ధుడిని మోసుకుంటూ కుసీనగరం కేసి బయలుదేరారు భిక్షువులు. అక్కడినుంచి హిరణ్యవతి నదీతీరానికి చేరి, అక్కడున్న మల్లుల సాలవనంలో ఆగారు. అక్కడ రెండు సాలవృక్షాల మధ్య పడక ఏర్పాటు చేయించుకుని విశ్రమించాడు బుద్ధుడు. ఆయనకు సపర్యలు చేస్తూ ఆనందుడు, నందుడు ఆయన పక్కనే ఉన్నారు. ‘‘నేనిక జీవించలేను. నా మరణవార్తను మల్లులకు తెలియజేయండి’’ అని చెప్పాడు.

ఆ మాటలు విన్న ఆనందుడు దుఃఖించాడు. అప్పుడు బుద్ధుడు ఆనందునితో– ‘‘ఆనందా! కొన్ని ధాతువుల కలయికే జననం. అవి విడిపోవడమే మరణం. సంఘటితమైన పదార్థాలన్నీ నశించేవే. దుఃఖం ఎందుకు?’’ అని వారించాడు. బుద్ధుని విషయం తెలిసి సుబుద్ధుడు అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. తాను బుద్ధుడిని ఒకసారి చూడాలని అడిగాడు. ఆనందుడు ‘ఇప్పుడు సాధ్యం కాదు’ అని చెప్పాడు. ఆ మాటలు విన్న బుద్ధుడు ‘‘ఆనందా! సుబుద్ధుడిని నా దగ్గరకు పంపు’’ అని చెప్పాడు.

తన వద్దకు వచ్చి నమస్కరించి నిలుచున్న సుబుద్ధునితో ఎన్నో ధర్మవిషయాలను ప్రబోధించాడు. అవి విన్న సుబుద్ధుడు వెంటనే భిక్షు దీక్ష యాచించాడు. బుద్ధుడు అంగీకరించాడు. ఇలా బుద్ధుని చివరి సందేశం విన్న వ్యక్తిగా, బుద్ధుడు దీక్షను ఇప్పించిన ఆఖరి భిక్షువుగా సుబుద్ధుడు బౌద్ధ సంఘంలో ప్రసిద్ధుడయ్యాడు.

ఆ రాత్రి బుద్ధుడు విపశ్యనా ధ్యానంలోకి వెళ్లాడు. ఆ ధ్యానంలోని ఒక్కోదశను దాటుకుంటూ  ఇంద్రియ జ్ఞానరాహిత్య స్థితికి చేరాడు. అలా శూన్యతాయతన స్థితికి చేరి– ఆ స్థితిలోనే నిర్వాణం పొందాడు.బుద్ధుని మరణ వార్త తెలిసి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. లిచ్చవులు, బులియులు, కొలియులు, పావామల్లులు, కుసీనగర మల్లులు, శాక్యులు, కోసల, మగధ రాజ్యాల వారు ‘‘మా రాజ్యంలోనే అంత్యక్రియలు జరగాలి’’ అంటూ పోటీ పడ్డారు. తగాదాకు దిగారు. చివరికి ద్రోణుడు అనే పండితుడు వారందరి మధ్య సయోధ్య కుదిర్చాడు. చనిపోయిన కుసీనగరంలోనే దహనం చేసి, అస్థికలు ఎనిమిది సమాన భాగాలుగా పంచుకోవాలనే ఒప్పందం కుదిరింది.

ఈ గొడవ తేలేవరకూ బుద్ధుని పార్థివ దేహాన్ని నూలుబట్టల్లో చుట్టి, నూనెపాత్రలో భద్రపరిచారు. బుద్ధుడు నిర్వాణం పొందేనాటికే సారిపుత్రుడు, మహా మౌద్గల్యాయనుడు, రాహులుడూ మరణించారు. బౌద్ధసంఘంలో తదుపరి స్థానంలో ఉన్న మహాకాశ్యపుడు పావానగరంలో ఉన్నాడు. బుద్ధుని మరణ వార్తను తెలుసుకున్న మహా కాశ్యపుడు వెంటనే బయలుదేరి కుసీనగరం చేరాడు. బుద్ధుని చితికి మహాకాశ్యపుడు నిప్పంటించాడు. చివరికి అవశేషాల్ని ఎనిమిది రాజ్యాలు పంచుకున్నాయి. వారికి కొలపాత్ర (మానిక)తో పంచి ఇచ్చిన ద్రోణుడు ఆ మానికను తీసుకున్నాడు. పిప్పిలి రాజ్యం వారు మిగిలిన భస్మాన్ని తీసుకున్నారు. ఆ అవశేషాలపై ఆలా పదిస్మారక స్థూపాలు నిర్మించాడు.

– డా. బొర్రా గోవర్ధన్‌

మరిన్ని వార్తలు