గాతా రహే మేరా దిల్...

27 Sep, 2014 23:26 IST|Sakshi

లత పాటలుపది
 
కాలం కడుపుతో ఉండి లతా మంగేష్కర్‌ను కంది. మరి నిజంగానే కాలం అలాంటిది. దేశం విడిపోయింది. రెండు ముక్కలయ్యింది. పాకిస్తాన్, ఇండియా అట. ఇక ఈ దేశం వాళ్లు ఇటు ఆ దేశం వాళ్లు అటు అట. ‘మల్లికా-ఎ- తరన్నుమ్’ బిరుదాంకితురాలు, పాటల పూలరుతువు నూర్జహాన్ ఇక ఇక్కడ ఉండలేనంటూ బిడారు వెంట పాకిస్తాన్ బయలుదేరింది. ‘మల్లికా-ఎ-గజల్’ పాటల తేనెచినుకు బేగం అఖ్తర్ ఎవరినో పెళ్లి చేసుకొని ఆ పెద్దమనిషి ఆంక్షల వల్ల పంజరంలో కోకిలలా మారింది.  సింగింగ్ సూపర్‌స్టార్, నల్ల పిల్ల, నవ్వుల కోహినూర్ సురయ్య ఒక వెలుగు వెలిగి, దేవ్ ఆనంద్‌తో ప్రేమలో చిక్కుకుని, చికాకులో ఇరుక్కుని ఫ్లాపులు ఇవ్వడం మొదలుపెట్టింది.ఇప్పుడు దేశానికి ఒక పాట కావాలి. పాట కోసం మాత్రమే బతికే పాట. పాటను వదలక సాగే పాట. పాటంటే కనులుదించి, పెదాలు కూడబలుక్కునేలా చేసి, కంఠానికి కాసింత గంధాన్ని రాసుకొని, మెత్తగా హాయిగా తీగను సుతారంగా తాకినట్టుగా, ఎక్కడ దాచారో తెలియని అత్తరు డబ్బీ నుంచి ఆగి ఆగి తాకే మల్లె పరిమళంలా... దేశానికి ఒక పాట కావాలి. అది లతా మంగేష్కరే కావాలి. అప్పటికే తండ్రి లేడు. లంకంత సంసారం నెత్తిన పడింది. చెల్లెళ్లు... తమ్ముడు..దేవుడు కొన్ని ఆల్చిప్పల నుంచి స..ప..సలను ఏరి మెడలో ముత్యాలుగా కూర్చి పంపాడన్న ధీమా తప్ప వేరే ఏ ధైర్యం లేదు.ముందుకు సాగాల్సిందే. పాటను తెడ్డుగా చేసి భవసాగరాన్ని ఈదాల్సిందే. ఏవో కొన్ని ప్రయత్నాలు జరిగాయి. వాళ్లూ వీళ్లూ సరేనమ్మా పాడు అంటున్నారు. రికార్డింగ్ థియేటర్లు తారసపడుతున్నాయ్. కొంచెం నూర్జహాన్‌లా పాడుతున్నావ్ పర్లేదు పైకొస్తావ్ అని ఆశీర్వదిస్తున్నారు. కాని తగలాలి. జాక్‌పాట్ కొట్టాలి. ఒక పాట దేశమంతా మార్మోగాలి. అది ఏది?
ఆయేగా... ఆయేగా... ఆనేవాలా ఆయేగా...

నవాబుగారు కమాల్ అమ్రోహి భావుకుడో, సరసుడో, సినిమా ప్రేమికుడో ఇంకా తేలలేదు. కాని అతడు సినిమాలు తీస్తే చూస్తారు. అతడు అంతవరకూ అందరూ అద్దం ముక్క అనుకున్నదానిని వజ్రం అని నమ్మించగలడు. మహల్- 1949లో అతడు తీసిన సినిమా. అంత వరకూ ఫ్లాప్‌లలో ఉన్న లలన మధుబాలకు స్క్రీన్ టెస్ట్ చేసి కొత్త స్టిల్ తీసి దేశం మీద వదిలితే అది ఇప్పటికీ బేచిలర్ కుర్రాళ్ల గదులలో వెలుగుతోంది. ఇక సంగీత దర్శకుడు ఖేమ్‌చంద్ ప్రకాష్‌తో లతా మంగేష్కర్‌కు పాడించే ఆవకాశం ఇస్తే ఆ పాట- ఆయేగా... ఆయేగా... ఆనేవాలా ఆయేగా... దేశాన్ని దుమారంలా చుట్టుముట్టింది. ఎటువాళ్లు అటు కొట్టుకుపోయారు. తప్పుకోండి. లతా వచ్చేసింది.
 
ఏ జిందగీ ఉసీకి హై...

సి.రామచంద్రకు ఎన్ని పేర్లున్నాయో చెప్పలేము. చితల్కర్, రామ్ చితల్కర్, అన్నా సాహెబ్, ఆర్.ఎన్. చితల్కర్... బోలెడన్ని. కాని అతడి పాట ఒకటే. హిట్ పాట. చేయి వేస్తే బంగారం అంటారు చూడండి. గోల్డెన్ హ్యాండ్. మట్టి ముద్ద మంగేష్కర్. ఆ స్వరానికో కల్పన కావాలి. స్వర కల్పన చేయగలిగే చేయి. ఫిల్మ్‌స్తాన్ వాళ్లు ‘అనార్కలి’ (1953) తీస్తూ సి.రామచంద్రను మ్యూజిక్ డెరైక్టర్‌గా పెట్టుకున్నారు. హీరో ప్రదీప్ కుమార్ ఎలాగూ అందగాడు సరే ఏం హీరోయిన్ బీనారాయ్ తక్కువా? ఆ పలువరుస... ఆ నవ్వు? నా గొంతు కూడా సుమా అని లతా మంగేష్కర్ తోడయ్యింది. ఏ జిందగీ ఉసీకి హై... జో కిసీక హోగయా... ప్యార్ హీ మే ఖోగయా.... పాటతో ప్రేక్షకులు ముడిపడ్డారు. గొంతుతో గుండెలు లంకె పడ్డాయి. ఇక ఇది ఆగదు.
 
మైతో కబ్ సే ఖడీ ఇస్ పార్

సలీల్ చౌధురి. వేళ్ల చివర నిజంగానే మంత్రదండం ఉన్నవాడు. ఆర్కెస్ట్రా ఎదుట అతడు నిలిచి  రెండు చేతుల్నీ ఆమ్మని ఊపితే అక్కడ పాట పుట్టి పొదై పెరిగి పూలు విదిల్చి గలగలమని రాల్చి మనల్ని ఊపేస్తుంది. బెంగాలు జానపద మెరుపు. ఆ గంగలో తుళ్లిపడే చేపపిల్ల కులుకు. రెంటినీ కలిపి లతకు అందిస్తే మరి పాట. మధుమతి (1958) బిమల్ రాయ్‌కు పేరు తెచ్చింది. సలీల్ చౌధురికి పేరు తెచ్చింది. వైజయంతి మాల, దిలీప్‌కుమార్‌లకు పేరు తెచ్చింది. కాని శ్రోతలకు మాత్రం లతా మంగేష్కర్ అనే ఒక పండగ తెచ్చింది. ఆజారే పర్‌దేశీ... మైతో కబ్ సే ఖడీ ఇస్ పార్... ఏ అఖియా థక్ గయే పంఖ్ నిహార్....
 
ప్యార్ కియాతో డర్నా క్యా

ఏంటి ఆ పిల్ల పాడేది... ఉర్దూనా... నోట్లో మరాఠి వేసి ముక్కలు కొట్టినట్టుగా ఉంది అని వెక్కిరించాడు దిలీప్ కుమార్ అలియాస్ యూసఫ్ ఖాన్. నాలుక మీద రుచిమొగ్గలు సరిగ్గా ఉండాలేగాని ఏ తేనె అయితే ఏమిటి జుర్రడానికి. ట్యూటర్‌ని పెట్టుకుంది. అలీఫ్ బే తే... నేర్చుకుంది. నౌషాద్ సాహెబ్... నేను రెడీ అంది. నౌషాద్ అలీ... సంగీత ప్రపంచానికి బెబ్బులి. ‘మొఘల్-ఏ- ఆజమ్’ (1960)లో పాటను సవాలుగా విసిరాడు. అది అక్బర్ షెహెన్‌షా దర్బారులో ఖంజరులా దిగబడింది. కుంచెడు గజ్జెలతో ఝల్లున మోగింది.  ఓహ్... మధుబాల నిలదీస్తోంది. వాహ్... లతా తన కంఠాన్ని చూపుడు వేలు చేసి ఆడిస్తోంది. ప్రేక్షకులు ధన్యులం గురో అని కళ్లప్పగించి చూస్తున్నారు. ప్యార్ కియాతో డర్నా క్యా... జబ్ ప్యార్ కియాతో డర్నా క్యా.. ప్యార్ కియా కోయి చోరి నహీ కీ...
 
అజీబ్ దాస్‌తా హై ఏ...

జైకిషన్ గుజరాత్ నుంచి హార్మోనియం పెట్టెతో వచ్చాడు. శంకర్ హైదరాబాద్ నుంచి తబలా పట్టుకొని దిగాడు. ఇద్దరికీ వసారా ఇచ్చి వానకు తడవకుండా చేసి రాజ్‌కపూర్ ‘బర్సాత్’ హిట్‌తో కలెక్షన్ల కుంభవృష్టి కురిపించుకున్నాడు. ఇవి ఒట్టి పోయే మేఘాలు కావు. ఈ కడవలు ఖాళీ కావు. కూచుంటే పాట. లేస్తే పాట. శంకర్, జైకిషన్, హస్రత్ జైపురి, శైలేంద్ర... ఈ నాలుగు వేళ్లకు ఐదో వేలుగా లతాసమకూరి వీళ్లు పిడికిలిగా మారారు. దిల్ అప్‌నా ప్రీత్ పరాయ్(1960)... ఎవరు చూశారో ఎవరు చూళ్లేదో తెలీదు. కాని చెవులున్న ప్రతి ఒక్కరూ అందులోని పాటలు విన్నారు. లతను విన్నారు. అంతం లేని ఆ విందు ఆరగిస్తూనే ఉన్నారు. అజీబ్ దాస్‌తా హై ఏ...  కహా షురూ కహా ఖతమ్... ఏ మంజిలే హై కౌన్ సీ... నా ఓ సమజ్ సకే నా హమ్...
 
 ఆప్ కే నజరోంనే సంఝా...

ఒక తమ్ముణ్ణి తల్లిదండ్రులిచ్చారు. ఒక తమ్ముణ్ణి సంగీతం ఇచ్చింది. మదన్ మోహన్ లతా మంగేష్కర్‌కు దేవుడిచ్చిన తమ్ముడు. దీదీ... దీదీ.. అంటూ లతా లేనిదే పాట కట్టేవాడు కాదు. జీవితంలో ఒక్క  హిట్ సినిమా చేయలేదు. కాని ఒక్క ఫ్లాప్ పాటా ఇవ్వలేదు. పైకి రాని దురదృష్టవంతుడు. లతే పెద్ద పెన్నిధిగా మారిన అదృష్టవంతుడు. వీళ్లిద్దరి ప్రతీ పాటా ఒక సరోవరం. ఇరుచేతులూ కలిసిన ముకుళిత హస్తం. ఏమో... దప్పిక గొన్నవారిని సేద తీర్చే దోసిలి కూడా కావచ్చు. వెతుకులాడేవారి అంతిమ గమ్యమూ కావచ్చు. అన్‌పడ్ (1962) ఎందరికి తెలుసు? కాని ఈ పాట? అందరికీ తెలుసే! ఆప్‌కి నజరోంనే సంఝా... ప్యార్ కే కాబిల్ ముఝే...  దిల్ కి ఏ ధడ్‌కన్ ఠహెర్ జా... మిల్ గయీ మంజిల్ ముఝే...
 
రహేనా రహే హమ్ మెహెకా కరేంగే

హృతిక్ రోషన్‌కు తాత ఒకడున్నాడు. రోషన్. రాగాలను జవనాశ్వాలుగా చేసి అధిరోహించినవాడు కూడా హీరోనే. పాపిలా అతడు చిరాయువు కాడు. పువ్వులా పుట్టి వికసించి పరిమళాలిచ్చి నిశ్శబ్దంగా రాలిపోయాడు. లతాతో చాలా మంచి పాటలు చేశాడు. రఫీ-లతాల డ్యూయెట్ జో వాదా కియా ఓ నిభానా పడేగా... వింటూనే ఉన్నాం కదా. లతా ఇతడి సంగీతాన్ని ఎంత ఇష్టపడిందంటే ఇతడి సంగీత దర్శకత్వంలో ‘భైరవి’ అనే సొంత సినిమా కూడా తీద్దామనుకుంది. కుదరలేదు. కాని ఒక్కోసారి పాట నచ్చితే ఫీజు ఒక్క రూపాయే తీసుకునే అదృష్టాన్ని అతడికి ప్రసాదించింది. మమత (1966) ఒక సో సో సినిమా. కాని అందులోని పాట! రహేన రహే హమ్ మెహెకా కరేంగే... బన్‌కే కలీ.. బన్ కే సభా... బాగ్ ఏ వఫా మే....
 
హోటోంపె ఐసీ బాత్

ఎస్‌డి బర్మన్ సంగతి మాట్లాడకపోతే ఆయనా ఊరుకోడు. లతా కూడా ఊరికే ఉండదు. దాదా బర్మన్. ఈ బక్కపలచటి మనిషి పాటల మాటెత్తితే పర్వత సమానుడైపోతాడే! చిన్న హమ్ చేసి పాడూ అనంటే ఆ బరువుకి ఎదురుగా ఉన్న గాయకులు నేలకంటాల్సిందే. ఏ పాటకు ఎవరు కరెక్టో వారికే దక్కుతుంది పాట. రికమండేషన్లు చెల్లవు. తేరే మేరే మిలన్ కీ ఏ రైనా... కిశోర్ పాడాల్సిందే. తేరీ బిందియా రే.. రే హాయ్ హాయ్... రఫీ పాడాల్సిందే. రెంటిలోనూ లతా జోడి కట్టాల్సిందే. జువెల్ థీఫ్ (1967) క్లయిమాక్స్ పాట కోసం వైజయంతీ మాల తనకు బాల్యం నుంచి ఉన్న నృత్యానుభవం అంతా పణంగా పెడదామనుకుంది. లతా ఏం తక్కువా? ఊహ తెలిసినప్పటి నుంచి చేసిన తపస్సు వల్ల కలిగిన అపరిమిత శక్తి నుంచి ఇదో చిన్న వరం. అంతే! హోటోంపె ఐసీ బాత్ మై దబాకే చలి ఆయి... ఖుల్ జాయే వహీ బాత్ తో దుహాయి హై దుహాయి...
 
చల్‌తే చల్‌తే యూహీ కోయి మిల్ గయా థా

గులాం ముహమ్మద్ ఈ పాటలతో అమీర్ కావాల్సింది. సినిమా రిలీజ్ ఆలస్యం కావడంతో గరీబుగా మారి జబ్బు పడి రిలీజ్‌కు ముందే చనిపోయాడు. పోయాడు కదా అని ఇంత మంచి పాటలు చేసినా ఫిలిమ్ ఫేర్ ఇవ్వలేదు. పోనివ్వండి. అతడికి నిజమైన అవార్డు ఏమిటి? లతా పాడటమే. పాకీజా (1972)లో గులాం ముహమ్మద్ కోసం లతా పాడిన ప్రతి పాటా ఒక సురాయి జామకాయ. ఇన్ హీ లోగోంనే... ఒక పాట. మరొకటి- మౌసమ్ హై ఆషికానా... వీటితో పాటు కైఫీ ఆజ్మీ అత్యుత్తమ సృజన... లక్నోలో తాను చూసిన తవాయిఫ్‌లను తలుచుకుని పాడిన పాట... ఆ వేదనను- దారిన పోయే ప్రతి ఒక్కరితో గడపవలసిన ఆవేదనను- లతా పలికించిన తీరూ అదిమి పెట్టిన కన్నీటి కంఠమూ... చల్‌తే చల్‌తే యూహీ కోయీ మిల్ గయా థా సరే రాహ్ చల్‌తే చల్‌తే....
 
తేరే బినా జిందగీ సే కోయీ

లత గొప్పతనం ఏమిటి? ఒక గీత రచయిత రాస్తే, ఒక స్వరకర్త రాగం కూర్చితే తను గాయనిగా ఆ పాటను వారిరువురి సృష్టి నుంచి ఒక ఆకాశం ఎత్తుకు పెంచడం. ఏడవ ఆకాశానికి చేర్చడం. బయటకు వచ్చి శ్రోతకు చేరే సమయానికి పాటను అద్భుతంగా మార్చడం. ఒకటి వాస్తవం. లతకు ముందు సంగీత దర్శకులందరూ గాయనీమణుల పరిమితులను దృష్టిలో పెట్టుకుని పాటను కట్టేవారు. లత వచ్చాక ఈ సంకెలలు తెగిపోయాయి. పాటను ఎంత స్వేచ్ఛగా ఎంత విహారప్రాయంగా అయినా కట్టవచ్చు. ఏమిటి బెంగ? లతా ఉందిగా. హిందీ పాటలో ఉచ్చమూ నీఛమూ రెండూ చూపిన ఆర్.డి.బర్మన్ కూడా లతాతో చాలా గొప్ప మెలడీలు రికార్డ్ చేశాడు. అది గుల్జార్ అతడికి పెట్టిన భిక్ష. లేదా లతా మనకు ప్రసాదించిన తిరిపెం. ఆలోచించలేం... ఆమె లేకుండా పాటను ఆలోచించలేం... ఆమె వినా.. ఆమె బినా... నో..నో.. నహీ నహీ. ఆంధీ (1975)లో ఆమె పాడిన పాటతో ముగిద్దాం.
 
తేరే బినా జిందగీ సే కోయీ... షిక్‌వా... తోనహీ
 షిక్‌వా నహీ... షిక్‌వా నహీ... షిక్‌వా నహీ....


 - ఖదీర్
 

మరిన్ని వార్తలు