డిజిటల్‌ ఫీవర్‌

30 Nov, 2017 23:41 IST|Sakshi

మోదీతో చిన్నారి మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ అచ్చం తనలాగే ఉన్న ఒక చిన్నారిని కలుసుకున్నారు. కరచాలనం చేశారు. కబుర్లు చెప్పారు. అంతేకాదు...  మురిపెంగా ట్వీటర్‌లోనూ పంచుకున్నారు. మొన్న కచ్‌లో రెండవ విడత గుజరాత్‌ వికాస్‌ ర్యాలీ అనంతరం జరిగిన సభకు ఆఫ్‌ వైట్‌ కుర్తా, బూడిదరంగు జాకెట్, మెడకు కాషాయరంగు స్కార్ఫ్‌ ధరించి, చేతికి నల్లటి దారం కట్టుకుని, తెల్లటి గడ్డం, మీసాలు (అలా కనిపించే ఒకవిధమైన పేస్టు పూసుకున్నాడు), కళ్లద్దాలతో ఉన్న ఒక బుడతడు వచ్చాడు. ఆ చిన్నారిని ప్రధాని సంభ్రమాశ్చర్యాలతో అలానే చూస్తుండిపోయారు. అతనికి షేక్‌హ్యాండిచ్చి, కొద్దిసేపు ముచ్చటించారు. పాపం! ఆ చిన్నారి చికిత్స లేనటువంటి క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నాడట. చిన్నప్పటినుంచి ఆ బుడతడికి మోదీ అంటే అమితమైన ఇష్టమట. అక్కడి పెద్దలు అతని కోరిక (బహుశ ఆఖరి కోరిక కావచ్చు) తీర్చడం కోసం అతన్ని తన ఆరాధ్యదైవంలా, రోల్‌మోడల్‌లా అలంకరించి, మోదీని కలిసే మార్గం సుగమం చేశారట. అతని గురించి తెలుసుకున్న మోదీ కూడా కదలిపోయారట. నా చిన్నారి స్నేహితుడు చూడండి... ఎంత ముచ్చటగా ఉన్నాడో... అని ప్రధాని చేసిన ఈ ట్వీట్, ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అయింది. మోదీని కలిసిన ఈ మధుర క్షణాలు ఆ బుడతడికి మరికొద్ది రోజులు ఆయుష్షు పొడిగించాలని కోరుకుందాం.


డాగిలం గారి ఎక్సర్‌సైజులు
పోలీస్‌ జాగిలాలు రకరకాల సాహసకృత్యాలు చేయడం మనకు తెలుసు. శిక్షణ పొందిన అల్సేషన్‌ కుక్కలు కూడా రకరకాల విన్యాసాలు చేయడమూ మనం చిన్నప్పుడెప్పుడో సినిమాల్లో చూసేశాం. అయితే, ఇద్దరు పోలీసాఫీసర్లు వర్కవుట్స్‌ చేస్తుంటే, వారి మధ్యలో దూరిన ఈ డాగిలం తాను కూడా వారితో సమానంగా వర్కవుట్స్‌ చేస్తుంటే చూడముచ్చటేస్తుంది కదా! అలబామాకు చెందిన కోవాన్, హాంకాక్‌ అనే ఇద్దరు పోలీసు ఆఫీసర్లు వామప్‌ ఎక్సర్‌సైజులు చేస్తున్నారు. కొంతకాలంగా వారినే గమనిస్తూ ఉన్న నైట్రో అనే రెండు సంవత్సరాల డచ్‌ డాగ్‌ ‘నేను మాత్రం ఏమి తక్కువ తిన్నాను’ అనుకుందో ఏమో, వారి మధ్యలో దూరింది. వామప్‌ కోసం వాళ్లు తమ శరీరాలను ఎలా కదుపుతున్నారో, అచ్చం తాను కూడా అలాగే కదిలిస్తూ, వంగుతూ, లేస్తూ ఎక్సర్‌సైజులు చేసేసింది. కేవలం ఏడుసెకండ్ల నిడివి మాత్రమే ఉన్న ఈ వీడియోను ఇప్పటి వరకూ దాదాపు తొమ్మిది లక్షల ఇర వై వేల మందికి పైగా చూశారు. కొన్ని వేలమంది షేర్‌ చేశారు.


కళ్లు మూసుకోండి... కనిపిస్తాను
‘‘నన్నే తలచుకుంటూ ఒంటరిగా ఫీలవుతున్నారా? ఇప్పటికిప్పుడు వచ్చేస్తానని మీకు మాట ఇవ్వలేకపోవచ్చు కానీ, కళ్లు మూసుకుని నన్నే తలచుకోండి... నేను కనిపించకపోతే అడగండి’’ ఈ మాటలు ఏ కవో, రచయితో రాసుకున్నవి కావు. అక్షయ్‌ గిరీష్‌ అనే మేజర్, తన కుటుంబ సభ్యులకు రాసినవి. దురదృష్టవశాత్తూ ఈ వాక్యాలే అతని కుటుంబానికి ఇప్పుడు మిగిలున్నాయి. పోయిన నవంబర్‌ 29న శత్రుసైనికుల దొంగదాడిలో అమరుడయ్యాడు ఈ మేజర్‌. అతని భార్య సంగీత తన భర్త మరణించిన ఏడాది తర్వాత తమ కుటుంబ సభ్యులందరూ కలసి ఉన్న ఫొటోను ఫేస్‌బుక్‌లో పెట్టింది. తన భర్త చనిపోలేదనీ, తమ స్మృతిపథంలో చిరంజీవిగానే ఉన్నారని ఫేస్‌బుక్‌లో ఆమె చేసిన ఈ పోస్టింగ్‌ ఎందరికో స్ఫూర్తి రగిలించింది. రగిలిస్తోంది. తన తండ్రి ఫొటో కింద ‘‘కొందరు చెడ్డ అంకుల్స్‌తో చేసిన ఫైటింగ్‌లో మా డాడీకి దెబ్బలు తగిలాయి. ఇప్పుడాయన దేవుడి దగ్గర సేఫ్‌గా ఉన్నారు. నా బర్త్‌డేకి పైనుంచి వచ్చి నన్ను బ్లెస్‌ చేస్తారు’’అని చిన్నారి నైనా రాసుకున్న వాక్యాలు చూస్తుంటే కళ్లు చెమర్చని వారెవరుంటారు చెప్పండి.


భళి భళి భళీ... బాహుబలీ...
ఆ మధ్య బాహుబలి మేనియా పట్టుకుంది జనాల్ని. అప్పట్లో ఒక దుమారంలా రేగిన ఈ బాహుబలి మేనియా అంతటితో అయిపోయిందని అనుకుంటే పొరపాటే. విదేశాలలో ఇంకా బాహుబలి వీరవిహారం చేస్తూనే ఉన్నాడు. ఇటీవల ఫ్లోరిడాలోని ఆర్లాండోలో జరిగిన నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ గేమ్‌ సందర్భంగా కోర్టులో ట్రాక్‌ సాంగ్‌గా పెట్టుకున్న బాహుబలి పాటలే ఇందుకు నిదర్శనం. ఆట ముగిసిన తర్వాత ఆ యువతులందరూ బాహుబలి పాటలోని బృందం ధరించిన లాంటి వస్త్రాలే ధరించి, పాటకు తగ్గట్టు చక్కగా అభినయించారట. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ట్విటర్‌లోనూ, ఫేస్‌బుక్‌లోనూ చక్కర్లు కొడుతుంటే మన వాళ్లు అందరూ చూసి విదేశాలలో మన బాహుబలి దర్పాన్ని తలచుకుని ఆనందిస్తున్నారు.

ఈ కలల రాణి.. త్వరలో బ్రిటన్‌ పట్టపురాణి
అమెరికన్‌ నటి మేఘన్‌ మార్క్‌లే, బ్రిటన్‌ యువరాజు హేరీలు తాము త్వరలోనే ఒకటి కానున్నట్టు అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే వారి ఎంగేజ్‌మెంట్‌. ఈ విషయం తెలిసిన లక్షలాదిమంది అభిమానులు ట్విటర్‌లో తమ హర్షాతిరేకాలు ప్రకటించారు. 36 ఏళ్ల మిస్‌ మార్క్‌లే, సూపర్‌ డూపర్‌ హిట్‌ టెలివిజన్‌ షో ‘సూట్స్‌’లో రేచల్‌ జేన్‌గా చిరపరిచితురాలు. తమ హృదయాలను కొల్లగొట్టిన ఈ మేటి నటి త్వరలోనే బ్రిటన్‌ యువరాణి కిరీటం ధరించనుండటాన్ని మించిన ఆనందం అభిమానులకు ఏముంటుంది... అన్నట్టు మార్క్‌లే ఇప్పుడు బ్రిటిష్‌నెస్‌ క్విజ్‌లో  పాల్గొంటోంది. వారి వివాహ ప్రకటనకు సంబంధించిన విడియోతోబాటు ఆమె నిర్వహిస్తున్న ఈ క్విజ్‌ ప్రోగ్రామ్‌ కూడా హిట్లమీద హిట్లు కొడుతూ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


చిన్నారి నోట... జాతీయ పాట!
చిన్నారులు ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే వినడానికి ఎంతో బాగుంటుంది. అలాంటిది పాటలు పాడుతుంటే... అందులోనూ జాతీయగీతమైన ‘జనగణమన’ ను వచ్చీరాని మాటలతో ఆలపిస్తుంటే ఇంకెంత బాగుంటుందో కదా! నిండా మూడేళ్లు కూడా లేని ఒక చిన్నారి, జాతీయ జెండాను పట్టుకుని, ‘జనగణమన’ పాడింది. అందులో ఎన్నో తప్పులున్నా, ఆ పాప వయసు చూసి, పాడేటప్పుడు ఆమె చేసిన అభినయాన్నీ చూసీ మెచ్చుకోకుండా ఉండలేరెవరూ! ఈ చిన్నారి పాడిన జాతీయగీతం వాట్సప్‌లోనూ, యూట్యూబ్‌లోనూ షికార్లు చేస్తోంది.


ఛీ..! విశ్వాసం లేని మనుషుల్లారా!
విశ్వాసానికి, ప్రేమకు మారుపేరు శునకం. అలాంటి శునకాన్ని, విశ్వాసం లేని ఒక కసాయి వ్యక్తి, తన పెంపుడు శునకంపై చల్లటి నీళ్లు పోసి, నిర్దాక్షిణ్యంగా దాన్ని మంచులోకి తోసేశాడు. కొన ఊపిరితో ఉన్న ఆ శునకాన్ని చూసిన కొందరు దయార్ద్ర హృదయులు రక్షించేందుకు ప్రయత్నించారు. అయినా, లాభం లేకపోయింది. రష్యాలో జరిగిన హృదయ విదారకమైన ఈ సంఘటన సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకొచ్చింది. ఎముకలు కొరుక్కుతినేంతటి మంచుగడ్డల మధ్య శరీరమంతా గడ్డకట్టుకునిపోయి, కేవలం ఒకే ఒక్క పంజా మాత్రమే కదిలించగలిగే స్థితిలో ఉన్న ఆ శునకాన్ని ఆ దారిన పోతున్న కొందరు చూసి రక్షించబోయారు. కానీ, దురదృష్టం... వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఈ సంఘటన అంతటినీ వారు చిత్రీకరించి, ఫేస్‌బుక్‌లో పెట్టారు. ఇది చూసిన మూగజీవాల ప్రేమికులు ఆ కసాయి యజమాని మీద మండిపడుతున్నారు. వారిలో ఒక మహిళా కార్యకర్త అయితే, ‘‘చనిపోతూ ఆ మూగజీవి చూసిన చూపులను బహుశా నేను ఎప్పటికీ మరచిపోలేనేమో’’ అని వ్యాఖ్యానించింది. ఆ శునకం యజమాని మీద చర్య తీసుకోవాలని కోరుతూ, దాదాపు పదివేలమందికి పైగా రష్యన్లు పిటిషన్‌పై సంతకాలు చేశారు.

ఇంకెప్పుడూ ఇలా చేయద్దు డ్యూడ్‌!
తమ అభిమాన కథానాయకులు ఎల్తైన గోడల మీదినుంచి దూకడం, కత్తియుద్ధాలు, కర్రసాములు, ఫైర్‌ఫైట్లు చేయడం చూసి ప్రేక్షకులు చప్పట్లు చరిచి, ఈలలు వేసీ మరీ తమ హర్షాతిరేకాలు తెలియజేస్తుంటారు. అయితే, అలాంటి సీన్లు, రియాల్టీ షోస్‌లో ‘‘వీటిని ఎవరూ అనుకరించవద్దని మనవి’’ అంటూ హెచ్చరికలు కూడా కనిపిస్తాయి. తమ ఫేవరెట్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ సినిమాల్లో చేసే సాహసకృత్యాలను చూసి, ఆ స్ఫూర్తితో ఒక అభిమాని ఏకంగా 13 అడుగుల ఎత్తున్న గోడమీది నుంచి జంప్‌ చేస్తూ, తీసుకున్న విడియోతోబాటు‘‘థాంక్యూ హీరో ష్రాఫ్‌... నిన్ను చూసి నా పిరికితనాన్ని తరిమికొట్టగలిగాను’’ అని ట్వీట్‌ చేశాడు. అది చూసిన సదరు హీరో మాత్రం తన అభిమాని చేసిన ఆ సాహసాన్ని అభినందించకపోగా, తలవాచేలా చివాట్లు పెట్టాడు. పైపెచ్చు ‘‘ఇంకెప్పుడూ ఇలా చేయవద్దు... అభిమానులకు ఏమైనా అయితే మేము తట్టుకోలేము’’ అని ప్రేమతో హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ పోస్ట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వీరవిహారం చేస్తోంది.

మరిన్ని వార్తలు