సొట్టబుగ్గల రాక్షసి

26 Jul, 2015 09:54 IST|Sakshi
సొట్టబుగ్గల రాక్షసి

అందమైన అమ్మాయి ఏం చేసినా అబ్బాయిలకు బాగానే ఉంటుంది.
రాక్షసిలా సాధించినా పడబుద్ధేస్తుంది.
తను నడిచిన దారిలో ఎన్ని ప్రేమలేఖల్ని పూలలా పరిచారో!
ఆ హై హీల్స్తో 'వన్స్ మోర్' అంటూ
ఎన్ని గుండెలు తొక్కించుకున్నాయో!
సొట్టబుగ్గలతో కాటేసినా ఆ పుట్టలోన ఉండబుద్దేస్తుంది.

'ఛీ.. పో' అని చీదరించుకున్నా అయస్కాంతమై లాక్కోవాలనిపిస్తుంది.
మేడమ్ తుమ్మినా, దగ్గినా ఈ మ్యాడ్ బాయ్స్కే జ్వరం వచ్చేస్తుంటుంది.
ఇదండీ.. లావణ్య త్రిపాఠీ ఉరఫ్ కాలేజ్ క్యూటీ ఉరఫ్ అందాల రాక్షసి ఉరఫ్ లేటెస్ట్ బ్యూటీ లైఫ్.


‘అందాల రాక్షసి’గా పేరు తెచ్చుకున్నారు. ఇంతకీ మీరు తెలుగు రాక్షసేనా?
(నవ్వుతూ...) అలా రాక్షసి అనేయకండి! అసలే నేను చాలా మంచి అమ్మాయిని. సినిమా వరకూ ఓకే. అందులో అలా అనిపించుకోవడం నాకు నచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎక్కడ చూసినా ఆప్యాయంగా రాక్షసీ అని పిలుస్తుంటే అదో థ్రిల్. నేను పుట్టిందేమో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో. పెరిగింది డెహ్రాడూన్‌లో. కాలేజ్ ముంబయ్‌లో. అక్కడే ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశా.

బాగానే చదివేవారా?
యావరేజ్ స్టూడెంట్‌ని. ఎందుకంటే స్పోర్ట్స్, డ్యాన్స్ అంటే ఇష్టం ఉండేది. స్పోర్ట్స్‌లో యాక్టివ్‌గా ఉండడం వల్లేనేమో అబ్బాయిలా ప్రవర్తించేదాన్ని. అందుకని నన్ను ‘టామ్ బాయ్’ అనేవాళ్లు.

కాలేజీ రోజుల్లో ఎవరైనా ఐ లవ్ యూ చెప్పారా?
నా వెంటపడ్డ వాళ్ల జాబితా చాలానే ఉంది. కానీ నేను చాలా స్ట్రిక్ట్. కాబట్టి, డెరైక్ట్‌గా నాతో చెప్పడానికి సాహసం చేసేవారు కాదు. కొంతమంది మాత్రం వచ్చి చెప్పేవాళ్లు. నేను వాళ్ల ప్రేమను అంగీకరించకపోయినా, వాళ్ళు అలా చెప్పడాన్ని ఎంజాయ్ చేసేదాన్ని. వాళ్ల లాగా నేను ఎవరి వెనుకా పడకుండా జాగ్రత్త పడేదాన్ని.
     
మీ ఫ్యామిలీ గురించి?

అమ్మ టీచర్. నాన్న లాయర్. మా అక్క ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ కమిషనర్. తనకు డ్యాన్స్ అంటే ఇష్టం. కథక్‌లో డిప్లమో చేసింది. అన్నయ్య కూడా మంచి డ్యాన్సర్. నేను మాత్రం కథక్ జోలికి పోలేదు.  స్కూల్‌లో ప్రోగ్రామ్స్‌కు  భరతనాట్యం నేర్చుకుని, చేసేదాన్ని. మా ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. నేను, అక్క, అన్నయ్య... ఏం చేస్తామన్నా మా అమ్మానాన్న కాదనలేదు. మా వాళ్లు రాంగ్ విషయాలను ప్రోత్సహించరు. రైట్ అనిపిస్తే మాత్రం బోల్డంత సపోర్ట్ ఇస్తారు. అలాగే డిసిప్లిన్ కూడా! మా నాన్నగారు రాత్రి ఒంటి గంటకు నిద్రపోయినా ఉదయం ఆరు గంటలకు నిద్ర లేచేస్తారు. నాకు కూడా అది అలవాటైంది. అలా పంక్చువాల్టీ ఇప్పుడు చాలా హెల్ప్ అవుతోంది. లేట్ నైట్ షూటింగ్‌లో పాల్గొన్నా, మర్నాడు ఠంచనుగా నిద్ర లేచి, షూటింగ్‌కు వెళ్లిపోతాను. చెప్పిన టైమ్‌కి లొకేషన్లో ఉంటాను.
     
ఈ బుగ్గ సొట్ట ఎక్కణ్ణుంచి వచ్చింది?
 మా నాన్నగారికి ఉంది. నాకూ వచ్చింది. ఆ బుగ్గ సొట్ట భలే ఉంటుందని అంటుంటారు. నాకు కూడా చాలా ఇష్టం.
     
సినిమాల్లోకి రావాలని ఎప్పుడనుకున్నారు?
ముంబయ్‌లో కాలేజ్ పూర్తయ్యాక డెహ్రాడూన్ వెళ్లిపోయా. ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకున్నా. కాకపోతే అది అంత పాపులార్టీ తీసుకురాదు. నాకేమో ఫేమస్ కావాలని ఉండేది. అందుకని, ‘మిస్ ఉత్తరాఖండ్’ పోటీలో పాల్గొన్నా. టైటిల్ గెల్చుకోవడంతో నా ఆశ ఇంకా పెరిగిపోయింది. నా టాలెంట్‌ను ప్రూవ్ చేసుకోవడానికి పెద్ద వేదిక కావాలనుకున్నా. ముంబయ్ వెళతానని అమ్మతో అంటే ‘నువ్వింకా చిన్నపిల్లవే! ఎవరైనా ముంబయ్ నుంచి డెహ్రాడూన్ వచ్చి, అవకాశం ఇస్తే చేద్దువుగాని’ అని చెప్పింది. ముంబయ్ నుంచి ఎవరైనా డెహ్రాడూన్ వస్తారా? ఇది సాధ్యం కాదులే అనుకున్నా. కానీ ఒకరోజు ఆ మిరకిల్ జరిగింది.  ‘ష్.. కోయీ హై’ అనే టీవీ సీరియల్ దర్శక, నిర్మాతలు మా థియేటర్ వర్క్‌షాప్‌కు వచ్చి నన్ను సెలక్ట్ చేశారు. ‘నీలో మంచి నటి ఉంది. నువ్వు ముంబయ్ వస్తే చాలా అవకాశాలు వస్తాయి’ అని ఆ సీరియల్‌కు పనిచేసినవాళ్లు అన్నారు. దాంతో ముంబయ్ షిప్ట్ అయ్యా. మా అమ్మగారు కూడా నాతో పాటు వచ్చారు.
 
తెలుగులో ‘అందాల రాక్షసి’ అవకాశం ఎలా వచ్చింది?
ముంబయ్‌లో చాలా యాడ్స్‌లో నటించా. ‘లైఫ్ ఇదేనా’ అనిపించింది. చాలా బోర్ కొట్టింది. డెహ్రాడూన్ వెళ్లిపోదామనుకున్నా. ఆ సమయంలో నా ఫ్రెండ్ ఫోన్ చేసి, ‘ఓ తెలుగు సినిమాకి కథానాయిక కావాలట. మేకప్ లేకుండా రా’ అంటే, వెళ్లాను.  చాలా ఫొటోలు తీసి, అవి దర్శకుడు హను రాఘవపూడికి పంపించారు. మర్నాడు ఆయన వచ్చారు. మేకప్ లేకుండా మళ్లీ రమ్మంటే, వెళ్లాను. నాకు నచ్చినవి ఏవైనా చెప్పమంటే, చెప్పాను. ‘యు ఆర్ సెలెక్టెడ్’ అన్నారు.
     
అప్పుడేమనిపించింది?
ఈ సినిమా పూర్తయ్యేవరకూ వేరే సినిమా ఒప్పుకోకూడదనుకున్నా. వంద శాతం నా పాత్రకు న్యాయం చేయాలనుకున్నా. షూటింగ్ ఆరంభించే నెల ముందే ఇక్కడికి వచ్చేశా. తెలుగు ప్రాక్టీస్ చేశా.
     
‘అందాల రాక్షసి’ తర్వాత మీరు బిజీ అవుతారని అందరూ ఊహించారు. కానీ, అలా జరగకపోవడానికి కారణం?
నా కెరీర్ కన్నా వర్క్‌ను సీరియస్‌గా తీసుకుంటాను. ఎన్ని సినిమాలు చేశానన్నది నాకు ముఖ్యం కాదు. ‘అందాల రాక్షసి’ తర్వాత వచ్చిన అవకాశాలను ఒప్పుకుని ఉంటే, ఈపాటికి నావి పది సినిమాలు విడుదలై ఉండేవి. ఆ సినిమాల్లోని పాత్రలన్నీ ‘అందాల రాక్షసి’లో నేను చేసిన పాత్రలలానే ఉన్నాయి. అందుకే ఒప్పుకోలేదు. రోజూ ఒకే రకం ఫుడ్ తినమంటే తినలేం కదా! ‘అందాల రాక్షసి’ తర్వాత చేసిన ‘దూసుకెళ్తా’ శాటిస్‌ఫ్యాక్షన్ ఇచ్చింది. ఆ తర్వాత కొంచెం బ్రేక్ తీసుకోవాలనుకున్నా. డెహ్రాడూన్ వెళ్లిపోయి, ఆ తర్వాత ‘మనం’లో గెస్ట్ రోల్‌కు మంచి పేరొచ్చింది. తమిళంలో ‘బ్రాహ్మణ్’ అనే సినిమా చేశాను.
     
మీరు పెద్దగా పార్టీల్లో కనిపించరు. ఇండస్ట్రీలో కూడా ఎవరితోనూ ఫ్రెండ్లీగా ఉన్నట్లు కనిపించరు. ఎందుకలా?
పార్టీలంటే పెద్దగా ఇష్టం ఉండదు. ఇండస్ట్రీలో నాకు తెలిసిన వాళ్లతో ఫ్రెండ్లీగా ఉంటాను.
     
అవకాశాలు సంపాదించాలంటే పార్టీలకెళ్లి నలుగురితో పరిచయాలు పెంచుకోవాలంటుంటారు?
ఏమో నాకా విషయం తెలియదు. కానీ, అవకాశాల కోసం నేనెవరితోనూ ఫ్రెండ్‌షిప్ చేయను. అంత స్వార్థం నాకు లేదు. అలాగే, నాతో పరిచయం ఉన్న కొద్దిమందికీ నేనేంటో తెలుసు. ‘ఈ పార్టీకి లావణ్యను తీసుకెళితే బాగుంటుంది’ అని వాళ్లకు అనిపిస్తే, అప్పుడు కాదనకుండా వెళతాను. పార్టీలకు వెళ్లనంత మాత్రాన నాకు నష్టం జరగలేదు. ఇప్పుడు మూడు సినిమాల్లో నటిస్తున్నా. నాగార్జునగారితో ‘సోగ్గాడే చిన్ని నాయనా’, నానీతో ‘భలే భలే మగాడివోయ్’, నవీన్‌చంద్ర పక్కన ‘లచ్చుమీదేవికి లక్కుంటే’ చేస్తున్నా.
     
నాగార్జునకు సరిజోడీ అనిపించుకోవడానికి ఏం చేశారు?
కొంచెం బరువు పెరిగా. దాంతో మెచ్యూర్డ్‌గా కనిపిస్తా. ఈ సినిమా తర్వాత ‘భలే భలే మగాడివోయ్’ కోసం మళ్లీ నా నార్మల్ వెయిట్‌కి వచ్చేశా.

‘సోగ్గాడే..’లో మీ పాత్ర గురించి?
అందులో ‘సెక్సీ ఇండియన్ ఉమన్’ని. అలాగే, ట్రెడిషనల్‌గా ఉంటాను. చీరల్లో కనిపిస్తాను. నాగ్ సార్ అయితే, ‘లావణ్యా! నువ్వు చీర కట్టుకున్నావ్. లేడీ లాగా నడిస్తే బాగుంటుంది’ అంటుంటారు.
     
ఏదేమైనా మీకు రావాల్సినంత బ్రేక్ రాలేదనే చెప్పాలి...?

ఎక్కడో డెహ్రాడూన్ నుంచి ఇక్కడికి వచ్చి, మొదటి సినిమాతోనే ‘మన తెలుగుమ్మాయి’ అని ఇక్కడివాళ్లతో అనిపించుకున్నా. అంతకు మించిన బ్రేక్ ఏముంటుంది? ఓ పది సినిమాలు ఒప్పేసుకుని, వాటిలో ఒక్క సినిమా అయినా బ్రేక్ అవ్వకుండా పోతుందా? అని ఆలోచిస్తే, ఒక్క బెస్ట్ సినిమా కోసం తొమ్మిది వేస్ట్ సినిమాలకు ఎనర్జీ వేస్ట్ చేసుకున్నట్లవుతుంది. ఇప్పుడు నేను చేస్తున్న మూడు సినిమాలూ ఒకదానికొకటి పోలిక లేనివి. వాటిలో నావి మంచి పాత్రలు.
     
అదేంటీ! ఎందుకలా అన్నారు?
చిన్నప్పుడు నన్ను అందరూ చిచ్చరపిడుగు అనేవాళ్లు. టామ్‌బాయ్‌లా ఉండేదాన్నని చెప్పాను కదా! ఇప్పుడూ  అంతే. చీర కట్టుకున్నప్పుడు ఒద్దికగా ఉండాలి కదా. అలా ఉండను. మగరాయుడిలా ఉంటాను. అందుకే, నాగార్జునగారు అలా అన్నారు. ‘భలే భలే మగాడివోయ్’ షూటింగ్‌లో నా తీరు చూసి, ఆ చిత్ర దర్శకుడు మారుతి నన్ను ‘తమ్ముడు’ అని పిలవడం మొదలుపెట్టారు.

ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?
మంచి పాత్ర అయితే, వృద్ధురాలిగా చేయడానికైనా రెడీనే.

ఫిమెల్ ఓరియంటెడ్ మూవీస్‌కి అవకాశం వస్తే చేస్తారా?
 సినిమా మొత్తాన్నీ భుజాల మీద మోసే అవకాశం ఉంటుంది కాబట్టి, అవకాశం వస్తే ఒప్పేసుకుంటా.
     
ఒకవేళ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే బికినీ ధరిస్తారా?
చిన్నప్పుడెప్పుడో బికినీ వేసుకున్నా. ఇప్పుడు నా శరీరాకృతి బికినీకి సూట్ కాదని నా ఫీలింగ్. అందుకని యస్ చెబుతానా? నో అంటానా? అని చెప్పలేకపోతున్నా.

మరి, ఐటమ్ సాంగ్స్‌కి అవకాశం వస్తే?
ఇప్పుడు చేసే ఆలోచన లేదు. భవిష్యత్తులో ఓకే.
     
సినిమా పరిశ్రమలో మంచీ చెడూ - రెండు రకాలవాళ్లూ ఉంటారు. ఎలా డీల్ చేస్తున్నారు?
నేను కొన్నేళ్ళు ముంబయ్‌లో ఉన్నా (నవ్వుతూ). ఎవరితో ఎలా వ్యవహరించాలో నేర్చుకున్నా. హైదరాబాద్‌లో చాలా కంఫర్టబుల్‌గా ఉంది. అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. చాలామంది నన్ను సిస్టర్‌లా, కొంతమంది మంచి ఫ్రెండ్‌లా భావిస్తారు. సో... నాకు హ్యాపీగా ఉంది.

షూటింగ్స్‌కు మీతో పాటు మీ అమ్మగారు వస్తున్నట్లు అనిపించడం లేదు?
రాకూడదని కాదు. అమ్మ వస్తే, తన కంఫర్ట్ గురించి చూసుకోవాలి. ఇక, నేను షూటింగ్ చేసేదెలా? నా పదిహేడేళ్ల వయసులో టీవీ సీరియల్ చేశాను. అప్పట్నుంచీ వర్క్ చేస్తున్నా కాబట్టి, ఎవరి సహాయమూ లేకుండా నా కెరీర్‌నీ, దాని తాలూకు సమస్యలనూ ఎలా హ్యాండిల్ చేసుకోవాలో నాకు తెలుసు.
     
చాలా క్రమశిక్షణ గల అమ్మాయిని అని చెప్పారు. ఫ్రాంక్‌గా ఉంటానని కూడా అన్నారు. ఇలా మీ గురించి ఎన్నో మంచి విషయాలు చెప్పారు. కానీ, మీలో ఉన్న చెడు లక్షణాలను షేర్ చేసుకుంటారా?
(నవ్వుతూ...) నాలో ఉన్న అతి పెద్ద చెడ్డ లక్షణం ఏంటంటే... ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తాను. దానివల్ల నిందలపాలవుతాను. కాసేపు నిగ్రహించుకుంటే ఏం పోతుందని మా ఇంట్లోవాళ్లు, ఫ్రెండ్స్ అంటుంటారు.
     
కొంతమంది కథానాయికలు అందం రెట్టింపు కావడానికి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటుంటారు. మీరు కూడా..?

ప్రస్తుతానికైతే లేదు. ప్లాస్టిక్ సర్జరీ తప్పు కాదు. ఒకవేళ ఆ సర్జరీ ద్వారా ఓ అమ్మాయి కాన్ఫిడెన్స్ పెరుగుతుందనుకుంటే, చేయించుకోవడంలో తప్పూ లేదు. నా అందం, ఆత్మవిశ్వాసం విషయంలో నాకెలాంటి అపనమ్మకాలూ లేవు కాబట్టి, ప్లాస్టిక్ సర్జరీలు అవసరం లేదు (నవ్వులు).
     
ఆడవాళ్లపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి విన్నప్పుడు మీకేమనిపిస్తుంది?
సిగ్గుపడాల్సిన విషయం. అత్యాచారాలు, యాసిడ్ దాడుల గురించి విన్నప్పుడు, రగిలిపోతుంటాను. రోజు రోజుకీ ఆడవాళ్లపై దాడులు ఎక్కువ అవుతున్నాయి. చట్టంలో మార్పులు వస్తే, తగ్గుతాయని అందరూ అంటుంటారు. అలాగే మనం కూడా మారాలి. అన్యాయాన్ని ఎదిరించడానికి అందరం ఏకం కావాలి.
- డి.జి. భవాని

మరిన్ని వార్తలు