ఆడదామా హోలీ

11 Mar, 2017 23:24 IST|Sakshi


కులం... మతం... ప్రాంతం...

రంగు... రూపు... ఏదైనా...
ఆడాలి హోలీ.
మనసులు కలిసే రంగోలి...
కలర్‌ఫుల్‌ కేళీ...
ఆవో... ఖేలో... హోలీ...
రంగులతో సందడి చేసిన లావణ్యా త్రిపాఠి

‘సాక్షి’ కోసం సరదాగా హోలీ ఆడతారా?
లావణ్య త్రిపాఠి: బాబోయ్‌.. హోలీ రంగులంటే నాకు భయం. అయినా అడిగారు కాబట్టి, ఓకే.

హోలీ పండగ అనగానే మీకు గుర్తుకొచ్చేది ఏంటి?
చిన్నప్పటి విషయాలు గుర్తుకొస్తాయి. నార్త్‌లో హోలీ బాగా జరుపుకుంటారు. మా డెహ్రాడూన్‌లో అయితే పిచ్చి పట్టినట్లుగా ఆడతారు. ఉదయాన్నే నిద్ర లేచి, పక్కింటికి వెళ్లి, నిద్ర లేవని వాళ్లను లేపేసి మరీ రంగులు చల్లేవారు. నేనైతే దుప్పటి ముసుగు తన్ని నిద్రపోతుండేదాన్ని. నా నిద్ర మత్తు వదిలే లోపు రంగులు చల్లేయాలనుకునేవాళ్లు. కానీ, వాళ్లకి ఆ ఛాన్స్‌ ఇచ్చేదాన్ని కాదు. అందకుండా పరిగెత్తేదాన్ని.

అవునూ.. అసలు హోలీ అంటే మీకెందుకంత భయం?
నాకు రంగులు పూసుకోవడం పెద్దగా ఇష్టం ఉండేది కాదు. అందుకే వీలైనంతగా ఎస్కేప్‌ అవ్వడానికి ప్రయత్నించేదాన్ని. కానీ, ఫ్రెండ్స్‌ ఊరుకుంటారా? వెతికి పట్టుకుని మరీ రంగులు పూసేసేవాళ్లు. ఏడ్చినంత పని చేసేదాన్ని. ఆ వెంటనే నవ్వు కూడా వచ్చేసేది.

రంగులు పూసుకోవడం ఎందుకు ఇష్టం ఉండేది కాదు?
డ్రై కలర్స్‌ అయితే ఓకే. ఈ రంగు నీళ్లతోనే నాకు ప్రాబ్లమ్‌. బట్టలు తడిసిపోతాయ్‌. జుత్తు తడుస్తుంది. రంగు వదిలించుకోవడానికి నానా తిప్పలు పడాలి. ఒంటికి అతుక్కుపోయిన రంగు ఓ పట్టాన వదలదండీ బాబూ.

మరి... హోలీ స్వీట్స్‌ గురించి?
అవి మాత్రం ఓ పట్టు పట్టేదాన్ని. మా అమ్మగారు బెస్ట్‌ కుక్‌. మామూలు వంటల నుంచి పిండి వంటల వరకూ... అన్నీ బాగా చేస్తారు. హోలీ అప్పుడు చేసే ఖీర్, మాల్‌పువా, గుజియా... అన్నీ ఇష్టమే. అప్పుడైతే డైటింగ్‌ ప్రాబ్లమ్‌ లేదు కదా. ఎన్ని స్వీట్లయినా లాగించేసేదాన్ని.

స్వీట్స్‌ అందరికీ పంచేవారా?
కలర్స్‌ చల్లుకుంటూ ఆడటం ఇష్టం ఉండేది కాదు కానీ, స్వీట్స్‌ మాత్రం చాలా జోరుగా పంచేదాన్ని. మా వీధి వీధంతా నాకు ఫ్రెండ్సే. వాళ్లు పిండి వంటలు తెచ్చివ్వడం, నేను వెళ్లి ఇవ్వడం... భలే సరదాగా ఉండేది.

రంగుల పండగ కాబట్టి, మీకిష్టమైన రంగుల గురించి?
గాళ్స్‌ కలర్‌ పింక్‌. అదంటే నాకు ఓ స్పెషల్‌ లవ్‌. ఆరెంజ్‌ కలర్‌ అంటే చాలా ఇష్టం. ఎల్లో కలర్‌ అంటే కూడా లవ్వే. ఎల్లో కలర్‌ విషయంలో నా ఫ్రెండ్స్‌ కొంతమంది నన్ను విపరీతంగా ఆటపట్టించేవారు. ‘ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లో’ అనేవాళ్లు. ఎల్లో గురించి ఎవరేమన్నా... నాకు అదంటే ఇష్టమే. వైట్‌ కలర్‌ అన్నా ఇష్టమే. బట్‌ హోలీ రంగుల్లో వైట్‌ ఉండదు కదా. కానీ, మన మనసు మాత్రం అలా ఉండాలి.

రంగుల గురించి కొన్ని విషయాలు చెప్పండి?
ఒక్కో రంగుకి ఒక్కో మూడ్‌ ఉంటుంది. దాని గురించి నేను వివరంగా చెప్పలేను కానీ, నా మూడ్, క్లైమెట్‌ని బట్టి నేను కలర్స్‌ సెలక్ట్‌ చేసుకుంటాను. బాగా ఎండగా ఉన్నప్పుడు లైట్‌ కలర్స్, వీలైతే ఎక్కువగా వైట్‌ డ్రెస్సులు వేసుకుంటాను. చల్లని వాతావరణానికి ముదురు రంగులు బాగా నప్పుతాయి. హోలీ అంటే ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ కలర్స్‌’. ఈ సందర్భంగా అందరి జీవితం కలర్‌ఫుల్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

సినిమాల్లో మీరు చేసిన హోలీ సీన్స్‌ గురించి చెబుతారా?
నా ఫస్ట్‌ మూవీ ‘అందాల రాక్షసి’లో హోలీ సీన్‌ ఉంది. పర్సనల్‌గా రంగు నీళ్లు ఇష్టం లేకపోయినా... ప్రొఫెషనల్‌గా చేయక తప్పలేదు. ఆ సీన్‌లో పిల్లలు నా మీదకు రంగులు చల్లడానికి వస్తుంటే, నేను వద్దంటూ మొహానికి చేతులు అడ్డం పెడుతూ, వెనక్కి వెనక్కి వెళుతుంటాను. రియల్‌ లైఫ్‌లో కూడా అలానే చేసేదాన్ని. అందుకే ఆ సీన్‌ చేసేటప్పుడు నా చిన్నప్పటి విశేషాలు గుర్తొచ్చాయి. నీళ్లల్లో తడిచే సీన్లు చేయడం కష్టం. తడవడం, కాసేపటికి బట్టలు ఆరిపోవడం, మళ్లీ తడవడం... ఇదే తంతు. భలే గమ్మత్తుగా అనిపించింది. ‘భలే భలే మగాడివోయ్‌’లో కూడా ఇలాంటి సీన్‌ చేశాను. స్క్రీన్‌ మీద ఆ కలర్‌ఫుల్‌ సీన్స్‌ చూసినప్పుడు నేను ఫుల్లుగా ఎంజాయ్‌ చేసి, చేసినట్లే మీకు అనిపిస్తుంది. అంతా యాక్టింగ్‌. చెప్పాను కదా... రంగు నీళ్లు ఇష్టం ఉండదని.

హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి, డెహ్రాడూన్‌ని మిస్సవుతన్నట్లు అనిపిస్తోందా?
తెలుగు సినిమాలు చేస్తూ దాదాపు హైదరాబాద్‌లోనే ఉంటున్నాను కదా. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా పండగలప్పుడు మాత్రం మా ఊరు గుర్తొస్తుంటుంది. ఆ రోజులే వేరు అనిపిస్తుంది.

హోలీ ఆడబోయే వాళ్లకు మీరిచ్చే సలహా?
ఏ పండగైనా ముందు పిల్లలకే సలహా ఇస్తాం. పిల్లలూ జాగ్రత్తగా ఆడుకోండి. రంగు పొడులు కళ్ల మీద పడకుండా చూసుకోండి. ముక్కుకి మాస్క్‌ తగిలించుకోండి. కళ్లద్దాలు పెట్టుకుంటే కళ్లల్లో నీళ్లు పడవు. రంగు పొడులు కొనుక్కునేటప్పుడు మీరంతట మీరు వెళ్లొద్దు. పెద్దవాళ్లను తీసుకెళ్లండి. ఇక, పెద్దలకు చెప్పొచ్చేదేంటంటే... మీరు కూడా జాగ్రత్త సుమా. ఇప్పుడు కల్తీ పొడులు వస్తున్నాయట. ఆర్గానిక్‌ కలర్స్‌ కొంటే సేఫ్‌.

ఫైనల్లీ... ఈ ఏడాది మీ కెరీర్‌ ఎప్పటిలా కలర్‌ఫుల్‌గా ఉంటుందనిపిస్తోందా?
యస్‌ అండీ. గత ఏడాది ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘శ్రీరస్తు శుభమస్తు’... రెండూ పెద్ద హిట్‌. ఈ ఏడాది కూడా హిట్స్‌ గ్యారంటీ అనే నమ్మకం ఉంది. శర్వానంద్‌తో చేసిన ‘రాథ’ ఈ నెలాఖరున విడుదల కానుంది. మంచి సబ్జెక్ట్‌. నా పాత్ర బాగుంటుంది. వరుణ్‌ తేజ్‌ పక్కన చేస్తున్న ‘మిస్టర్‌’లోనూ నాది మంచి క్యారెక్టర్‌. నాగచైతన్యతో చేస్తున్న సినిమాలో కూడా మంచి పాత్రే. సో... కెరీర్‌ ఎప్పటిలా కలర్‌ఫుల్‌గా ఉంటుందనే నమ్మకం ఉంది.

హోలీ సాంగ్స్‌... కొన్ని
1 సందెపొద్దు మేఘం (నాయకుడు)
2 కొట్టు కొట్టు కొట్టు రంగుతీసి కొట్టు (మాస్‌ )
3 దిల్‌ దిల్‌ దివానా... (జెమిని)
4 రంగు రబ్బా రబ్బా... (రాఖీ)
5 హోలీ రంగోలీ హోలీ... హంగామా హోలీ (చక్రం)
6హరివిల్లే హోలీ (మహానగరంలో)
7హోలీ... హోలీ.. (శాడిస్టు)
8హోలీ.. హోలీ (దొంగోడి పెళ్లి)
9హోలీ.. హోలీ పండగల్లే ఉత్సాహమేదో ఉప్పొంగుతుంది నాలో.. (శ్రీ)

హోలీ.. కేర్‌
హోలీ వేడుకలో చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోడానికి కొన్ని సూచనలు...
రంగులు చల్లుకునే ముందు జుట్టు, ముఖం, దేహానికి కొబ్బరినూనె రాసుకోవాలి. ఇలా చేస్తే దేహానికి అంటిన రంగులను వదిలించడం సులభం.
చేతి గోళ్లకు, కాలిగోళ్లకు నెయిల్‌పాలిష్‌ మందంగా వేయాలి. గోరు చుట్టూ ఉన్న చర్మానికి కూడా పాలిష్‌ రాయాలి. ట్రాన్స్‌పరెంట్‌ నెయిల్‌పాలిష్‌లు ఉన్నాయి. కాబట్టి మగవారు కూడా హోలీ ఆడే ముందు నిరభ్యంతరంగా నెయిల్‌పాలిష్‌ వేసుకోవచ్చు.
రంగులను వదిలించుకునేటప్పుడు చర్మం మంట పుడుతుంటే కాలమైన్‌ లోషన్‌ రాసుకోవచ్చు.
సాధ్యమైనంత వరకు పొడి గులాల్‌నే వాడాలి.
ఎండలో హోలీ ఆడితే డీహైడ్రేషన్‌ బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఎండ పెరిగే లోపు ముగించాలి.
ఆర్గానిక్‌ కలర్స్‌నే వాడాలి. అవి చర్మానికి పట్టేసినా కూడా ఎటువంటి హాని కలిగించవు.
రంగులు పెదవులకు అంటకూడదు. కళ్లలోకి, ముక్కు రంధ్రాలలోకి రంగు వెళ్లినా ప్రమాదమే. కాబట్టి ఎవరికీ బలవంతంగా, మొండిగా ముఖానికి రాయడానికి ప్రయత్నించకూడదు.
హోలీ రంగులు చల్లుకోవడం పూర్తయిన వెంటనే శుభ్రంగా స్నానం చేయాలి. రంగు త్వరగా వదిలించుకోవాలనే తాపత్రయంలో మరీ వేడిగా ఉన్న నీటిని పోసుకోకూడదు. స్నానం తర్వాత చర్మం మంటపుడుతుంటే వెన్న లేదా మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.  
రంగులు వదలడానికి డిటర్జెంట్‌ సబ్బులను ఉపయోగించవద్దు. స్నానానికి వాడే జంటిల్‌ సోప్స్‌ మాత్రమే వాడాలి.
ఒంటిపై దద్దుర్లు, ఎర్రమచ్చలు, అలర్జీ వంటివి వస్తే డర్మటాలజిస్ట్‌ను కలవాలి.
 కళ్ల సంరక్షణకు...
రంగులు తళుకుమనేందుకు చమ్కీలు కలుపుతుంటారు. రంగులు, చమ్కీలు ఏవీ కళ్లలోకి వెళ్లకూడదు. కాబట్టి గాగుల్స్‌ లేదా ప్రొటెక్టివ్‌ గ్లాస్‌లను వాడాలి.
హోలీ గన్‌తో రంగు నీళ్లు చల్లుకునేటప్పుడు ముఖానికి గురిపెట్టకూడదు. తల మీద మరీ ఎక్కువ నీటిని చల్లినప్పుడు అవి కళ్లలోకి జారుతాయి. కాబట్టి ఆడేటప్పుడు రంగులు చల్లేవాళ్లు... చల్లించుకునేవాళ్ల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
కళ్లలోకి రంగు వెళ్లినట్లు గ్రహిస్తే వెంటనే పరిశుభ్రమైన నీటితో కంటిని కడగాలి.
నీళ్లతో కడిగిన తర్వాత కూడా కళ్లమంటలు అనిపించినా, కళ్లకు ఏ మాత్రం అసౌకర్యం అనిపించినా వెంటనే కంటి డాక్టర్‌ను సంప్రదించాలి.
– డి.జి. భవాని

మరిన్ని వార్తలు