ఈ హత్యకు 24 యేళ్లు

18 Jan, 2020 00:34 IST|Sakshi

విశ్లేషణ

ముప్పైఅయిదు సంవత్సరాలు సినిమా రంగాన్ని.. ఆపైన దేశవ్యాప్తంగా రాజకీయ రంగాన్ని శాసించిన రారాజు, తెలుగుజాతికి, పౌరుషానికి నిలువెత్తు రూపం, తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న నందమూరి తారక రామారావుగారి మరణం ఇప్పటికీ మర్చిపోలేని ఒక విషాదం. రోమ్‌ చక్రవర్తి ‘సీజర్‌’కు జరిగినట్లే విషాద తిరోగమనం అల్లుడి రూపంలో ఆయనకు జరగటం అత్యంత విషాదం. 
చరిత్రను ఎంత తొక్కిపెట్టినా దాగని సత్యాలు, ఆగని కాలంలో ఏదో ఒకనాడు బయటపడి వాళ్ల నిజ స్వరూపాన్ని బయటపెడతాయని చంద్రబాబును ఘోరంగా ఓడించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు రుజువు చేశారు.  మొదటి నుండి స్వార్థం, సంకుచితత్వం, కుట్రలు, అడ్డదారి రాజకీయం, పదవీలాలస, ధనాశలను డిగ్రీలుగా పొంది చంద్రబాబు చేసిన నేరాలకు అంతే లేదు. ఎంతమందినో తొక్కుకుంటూ రాజకీయ నాయకుడిగా ఎదిగి ఎన్టీఆర్‌ అల్లుడిగా ఆ ఇంట్లో అడుగుపెట్టి చివరకు ఆ ఇంటి పెద్దనే కూల్చేశాడు. The Camel and Desert అనే కథ అతనికి పూర్తిగా వర్తిస్తుంది. అయినా సిగ్గులేదు, మార్పురాదు.  ఎన్టీఆర్‌ చివరి దశను అత్యంత అవమానంగా, పెను విషాదంగా మార్చి ఒక రకంగా హత్యకు సమానమైన స్థితిని కల్పించిన ఈ ఘట్టాన్ని తెలుగువాళ్లు ఎప్పటికీ మర్చిపోకూడదనే మళ్లీ గుర్తు చేస్తున్నాను. 

మొదటినుండి పార్టీలో ఉన్న సీనియర్‌ నాయకులు దగ్గుబాటి, నాదెండ్ల, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఉపేంద్ర లాంటి వారిని తెలివిగా పక్కనపెట్టించి ప్రధాన కార్యదర్శి పదవితోపాటు సర్వాధికారాలతో 1986లో కర్షక పరిషత్తును తీసుకున్నాడు. ఈ చర్యను న్యాయస్థానం, ప్రజలు హర్షించలేకపోయారు. పర్యవసానం 1989లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్‌ ప్రభుత్వ పతనం, రాజ్యాంగేతర శక్తిగా, అవినీతిపరుడిగా ఎన్టీఆర్‌ ప్రభుత్వానికి తీవ్ర కళంకం తెచ్చాడు. ఏడుపదుల వయస్సులో చూసుకునేవారు లేక, అనారోగ్యంతో అల్లాడుతూ 1993లో ఎన్టీఆర్‌ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకుంటే నానారభస చేసి పెళ్లికి ముందూ, వెనుకా అతడు జరిపిన కుట్రలకు లెక్కేలేదు. పైకి వినయం నటిస్తూ 1994 ఎన్నికల్లో 60 మంది సభ్యులకు స్వయంగా డబ్బుపంచి తనతో ఉండాలని మాట తీసుకున్నాడు. అతని రాజగురువు రామోజీ లెక్కల ప్రకారం తెలుగుదేశం పార్టీ గెలవదని, వచ్చిన సీట్లలో తన 60మందిని వేరు చేసుకుని కాంగ్రెస్‌తో చేతులు కలపాలనే నిర్ణయంతో దుష్ట రాజకీయాలకు శ్రీకారం చుట్టాడు.  ఈరోజు జగన్‌మోహన్‌రెడ్డి గారిమీద, ఆయన ప్రభుత్వంమీద ఎలాంటి నిందలు వేస్తున్నారో ఆరోజూ అలాగే జరిగింది.

అందుకే ఎన్టీఆర్‌ ఈనాడు పత్రికను చెత్తబుట్టగా వర్ణించారు.1994 ఎన్నికల్లో వాళ్ల అంచనాలకు మించి ఎన్టీఆర్‌కు 222 సీట్లు... మిత్ర పక్షాలకు 36 సీట్లు రావటంతో అయోమయంలో పడ్డ గురుశిష్యులిద్దరూ ప్లాన్‌–2కు పన్నాగం పన్నారు. దానిలో భాగంగానే ఆయన ప్రజలకిచ్చిన హామీలు నెరవేరుస్తున్నప్పటికీ ఆయనమీద, ఆయన భార్యమీద విమర్శల దాడి మొదలయ్యింది. ఆమెనొక రాజ్యాంగేతర శక్తిగా, ఎన్టీఆర్‌ భార్యా లోలుడిగా, అసమర్థుడిగా వీళ్ల పేపర్లో అసహ్యమైన కార్టూన్లు వేయించి ప్రజలను తప్పుదారి పట్టించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పేద వర్గాలకు నవరత్నాల ద్వారా ఎన్నో మంచి పనులు చేస్తుంటే వాటిని ప్రజల మనస్సుల్లోకి వెళ్లకుండా రోజుకో గందరగోళం, మతపరంగా, ఇసుకపరంగా, అయినవాళ్లకే ఉద్యోగాలనీ, మూడు ప్రాంతాల అభివృద్ధిని అరాచకపు పాలనగా ఒకటా, రెండా ప్రభుత్వం ప్రారంభమై వారం తిరక్కుండానే వీళ్ల దుష్ట పన్నాగం మొదలయ్యింది. చంద్రబాబు చేసిన వెధవ పనులన్నిటినీ ఈ ప్రభుత్వానికి ఆపాదిస్తూ ఈ విష పత్రికల కూటమి ఎలా దండయాత్ర చేస్తున్నదో చూస్తూనే ఉన్నాం. 1994 నాటి పరిస్థితి పునరావృతమౌతున్నది. అదే సామాజిక వర్గం. అదే పెత్తందారీ వ్యవస్థ.

అదే మీడియా. అదే గురుశిష్యులు. సామాజిక అభివృద్ధితో వీళ్లకు పనిలేదు. పేదవర్గాలంటే జాలి లేదు. మంచి పనులు చేసే నాయకులంటే అసలు పడదు. విస్తరించుకున్న అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకోవటానికి ఎన్ని అల్లర్లయినా సృష్టిస్తారు. ఎన్ని హత్యలయినా చేస్తారు. వీళ్లను ఈ మీడియా కాపాడుతూనే ఉంటుంది. చెప్పాలంటే అష్టగ్రహ కూటమి అనే పదం సరిపోతుంది. అందుకే ఎన్టీఆర్‌ గవర్నమెంటును కూల్చటానికి వీళ్ల తాబేదారు యనమల రామక్రిష్ణుడు (ఈరోజు వేలకోట్లకు అధిపతి)కు స్పీకర్‌ పదవి ఇప్పించుకోవటంలో కృతకృత్యులయ్యారు. వీరి కుట్రల కోణాన్ని ఎన్టీఆర్‌ గుర్తించలేక అమాయకంగా నమ్మి మోసపోయారు. అత్యధిక మెజారిటీతో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ముఖ్యమంత్రిని 8 నెలల కాలం తిరక్కుండానే ఆయన భార్యను సాకుగా చూపించి 1995 ఆగస్టు 20న బహిరంగంగానే యుద్ధం ప్రకటించారు. ఆ సమయంలోనే ‘ఈటీవీ’ని ప్రారంభించారు. కుటుంబ సభ్యులకు విషం నూరిపోసి పార్టీ పగ్గాలు వారికే ఇస్తామని నమ్మబలికి చివరకు అధ్యక్ష పదవితోపాటు ముఖ్యమంత్రి పదవి కూడా కొట్టేశాడు. ఉప ముఖ్యమంత్రి పదవి మీద ఆశతో 40 మంది ఎమ్మెల్యేలతో వెళ్లిన దగ్గుబాటి చంద్రబాబు మోసానికి గురై వారం తిరక్కుండానే 14 మందితో తిరిగొచ్చి ఎన్టీఆర్‌ గూట్లో చేరాడు. 

ఆగస్టు 25న చంద్రబాబు హరిక్రిష్ణను వెంట బెట్టుకుని ఎన్టీఆర్‌ని కలిసి కొన్ని షరతులు పెట్టాడు. పార్వతిని వంటింట్లో ఉంచటం, ముద్దుక్రిష్ణను, బుచ్చయ్యచౌదరిని, నర్సింహుల్ని మంత్రి పదవుల్నుండి తొలగించటం లాంటి షరతుల్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించటంతో అనేక రంగులద్ది వీళ్ల పత్రికల్లో అభూతకల్పనలు రాయించారు. వైస్రాయ్‌కి క్యాంపును మార్చి ఎన్టీఆర్‌ను అధ్యక్ష పదవినుండి తొలగించి ఇటు ఢిల్లీ కాంగ్రెస్‌వారిని, అటు శాసన సభ్యులను మచ్చిక చేసుకున్నాడు. గవర్నరుకు రాష్ట్రపతి పదవి ఆశ చూపించి ఫోర్జరీ సంతకాలను ఒప్పించుకున్నాడు. దానికంటే ముందే ఆగస్టు 25వ తేదీన ఎన్టీఆర్‌ చంద్రబాబుతో సహా 5గురు మంత్రుల్ని పార్టీ నుండి సస్పెండ్‌ చేసిన లెటరు గవర్నరుకు పంపినా ఆయన దానిని బేఖాతరు చేసి చంద్రబాబుకే ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాత రోజుల్లో ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇప్పించుకున్నాడు. 1995 ఆగస్టు 26న ఎన్టీఆర్‌ చైతన్యరథం మీద ముఖ్యమంత్రి హోదాలో శాసన సభ్యులతో మాట్లాడటానికి వైస్రాయ్‌ హోటల్‌కు వెళ్తే ఆయనకు రక్షణగా ఒక్క పోలీసు కూడా లేడు. పైగా చంద్రబాబు ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్‌ వ్యక్తులు పరిటాల రవి మీద, నెహ్రూ మీద దాడి చేసారు. ఎన్టీఆర్‌ వచ్చారని తెలిసి భయంతో చంద్రబాబు తన తోకలు ఎమ్మెల్యేలను ఉసిగొల్పితే వారు ఆయనమీద రాళ్లు, చెప్పులు వేసి అవమానం చేశారు. 

అవమానంతో కుంగిపోయిన ఎన్టీఆర్‌ కళ్లనీళ్లు పెట్టుకుంటూ ‘అల్లుడని గౌరవించినందుకు నాకింత ద్రోహం చేశాడు. దేశమంతా గౌరవించిన వ్యక్తిని చెప్పులతో అవమానించాడు. ఇదంతా వాడికి పట్టిన అధికార దాహం– తెలుగు పౌరుషాన్ని చాటిన మీ అన్న దుస్థితి చూడండి. ఎన్టీఆర్‌ ఎప్పుడో చావటం కాదు. చంద్రబాబు దుర్మార్గానికి ఇప్పుడే మరణించాడు’అని విలపించటంతో అక్కడకు వచ్చిన వాళ్లంతా కళ్లనీళ్లు పెట్టుకున్నారు. దానికి కూడా సానుభూతి రానివ్వకుండా లక్ష్మీపార్వతిమీద తోసేసారు. ఆగస్టు 31న ఎన్టీఆర్‌ తీవ్ర అనారోగ్యంతో మెడిసిటీ హాస్పిటల్‌లో చేరారు. గవర్నరును పంపి బలవంతపు రాజీనామా తెప్పించుకున్నారు. ఇక్కడ ఎన్టీఆర్‌ తీవ్రమైన బాధల్లో ఉంటే కుటుంబ సభ్యులందరూ చంద్రబాబుతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొన్నారు. పార్టీ పెట్టిన పెద్దకు కన్నీరు– చంద్రబాబుకు అధికారపు పన్నీరు. ఇక్కడ గుండెల్లో మంటలు– అక్కడ ఆనందోత్సవపు భోగిమంటలు. నమ్మిన విశ్వాసం నట్టేట ముంచింది, అన్నం పెట్టిన చెయ్యినే నరికింది. అయినవారే పరాయిగా మారి గుండె లోతుల్లో గునపాలు గుచ్చితే తట్టుకోలేని రోషం, అభిమానం ఆ మంటల్లో ఆహుతి అయ్యింది. మళ్లీ గెలిచి చంద్రబాబును అండమాన్‌ జైలుకు పంపుతానన్న తన ప్రతీకారాన్ని నెరవేర్చుకోకుండానే ఆ గుండె ఆగిపోయింది. తట్టుకోలేని అవమానం ఆ గుండెను ఆపేసింది. 

‘ఇదిగో వీడే హంతకుడు. ప్రజలారా మీ అన్నను చెబుతున్నాను వినండి’ అంటూ ‘జామాతా దశమగ్రహం’ అనే ఆడియో రూపంలో, ‘ధర్మపీఠం’లో వీడియో రూపంలో తనను ఎంతో అభిమానంతో ఎన్నుకున్న తన తెలుగు ప్రజలకు ‘చివరి వీలునామా’గా అందించి 1996 జనవరి 18వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆ మహానుభావుడు అందరినీ దుఃఖంలో ముంచి వెళ్లిపోయాడు. మద్యపాన నిషేధం ద్వారా మహిళల కళ్లల్లో ఆనందం నింపిన ఆయన కళ్లు శాశ్వతంగా మూతపడ్డాయి. ఎవరు దేనికి కారకులు? తన అధికారం కోసం మామ చావుకు కారకుడైన ఈ వ్యక్తిమీద ఆయన ఆత్మ ప్రతీకారంతో రగులుతూనే ఉంది. జగన్‌మోహన్‌రెడ్డిగారు అతడిని చావుదెబ్బ కొట్టి 23 సీట్లకే పరిమితం చెయ్యడంతో బహుశా స్వర్గంలోని ఆయన ఆత్మ సంతో షిస్తూ ఉంటుంది. చంద్రబాబువంటి వ్యక్తుల్ని రాజకీయ రంగం నుండి పూర్తిగా తొలగిస్తే సమాజంలో శాంతి భద్రతలు వెల్లివిరుస్తాయి అని నమ్ముతూ... 
ఆశ్రువేదనతో... లక్ష్మీపార్వతి.
(నేడు నందమూరి తారకరామారావు వర్ధంతి)

నందమూరిలక్ష్మీపార్వతి

వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్‌ తెలుగు అకాడమీ అధ్యక్షులు

మరిన్ని వార్తలు