గృహహింస కేసు ద్వారా మీ అన్నయ్యను దారిలోకి తీసుకు రావచ్చు!

28 Dec, 2015 01:10 IST|Sakshi

నేను, నా భర్త విడాకులు తీసుకున్నాము. తర్వాత నేను మరలా వివాహం చేసుకున్నాను. నా భర్త కూడా మరలా వివాహం చేసుకున్నాడు. ఇది జరిగి పది సంవత్సరాలైంది. నా మొదటి భర్త ద్వారా నాకొక పాప. ఆమె నా దగ్గరే పెరుగుతుంది. ఇటీవల నా మొదటి భర్త యాక్సిడెంట్‌లో పోయారని తెలిసింది. ఆయనకు చాలా ఆస్తులు ఉన్నాయి. అతని రెండవ భార్యకూ ఒక పాప ఉంది. ఆయన వీలునామా రాయలేదు. నేను నా పాపకు తండ్రి నుండి ఆస్తి వచ్చే ప్రయత్నం చేయవచ్చా? పాపకు హక్కులున్నాయా?
                                                                                   - నివేదిత, ఆదిలాబాద్

 మీ పాపకు తన తండ్రి ఆస్తిలో తప్పకుండా వాటా ఉంటుంది. మీ విడాకులకూ ఆస్తి సంక్రమణకూ ఎలాంటి సంబంధం లేదు. హిందూ వారసత్వ చట్టం 1956 అనుసరించి పాపకు ఆస్తిహక్కు ఉంటుంది. చట్టప్రకారం ఒక హిందూ పురుషుడు వీలునామా రాయకుండా మరణిస్తే, అతని ఆస్తికి అతని తల్లి, భార్య, కూతురు, వితంతువైన కోడలు ప్రథమశ్రేణి వారసులౌతారు. కనుక మీ పాపకు చనిపోయిన తండ్రి ఆస్తిలో న్యాయబద్ధమైన వాటా వస్తుంది. ముందుగా మీరు ఆస్తికి సంబంధించిన వివరాలు సేకరించి, ఒక లీగల్ నోటీస్ అతని రెండవ భార్యకు జారీ చేయండి. సామరస్యంగా పరిష్కారమైతే మంచిది. లేకుంటే కోర్టులో ‘ఆస్తివిభజన దావా’ వేయవలసి వస్తుంది.

 
 నా వయస్సు 19 సం॥బీటెక్ చదువుతున్నాను. నాన్నగారు చనిపోయారు. నేను, అమ్మ, అన్నయ్య కలసి ఉంటున్నాము. అన్నయ్య చదువు ఇంకా పూర్తి కాలేదు. సమస్యేమిటంటే,  నాన్న చనిపోయాక అన్నయ్య చాలా మారిపోయాడు. నాపైనా, అమ్మపైనా ఎన్నో ఆంక్షలు విధించాడు. మా మీద పెత్తనం చలాంచడమేగాక, అమ్మపై, నాపై చేయి కూడా చేసుకుంటున్నాడు. ఎవరికైనా చెబుతామంటే పరువు పోతుందని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాము. అన్నయ్యపై మేము చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చా?
                                                 - వీణ, వేజెండ్ల


 మీ అన్నయ్య ప్రవర్తన ‘గృహహింస చట్టం’ కిందకు వస్తుంది. రక్త సంబంధీకులైన మగవారు, వివాహసంబంధం ద్వారా బంధువులైన మగవారు మహిళలను హింసకు గురిచేసినపుడు, అంటే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, లైంగికంగా హింసించినప్పుడు, ఈ చట్టాన్ని అనుసరించి తగిన ఉపశమనాలు పొందవచ్చు. మీ అన్నయ్య మీకూ, అమ్మకూ రక్త సంబంధీకుడౌతాడు. కనుక ఈ  చట్టపరిధిలోకి వస్తాడు. మీరు మీ జిల్లాలోని ‘ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్’ ఆఫీస్‌కి వెళ్లి, అక్కడ వారిని సంప్రదించి కేస్ వేసి మిమ్ములను, అమ్మనూ వేధించకుండా మీపై చేయి చేసుకోకుండా ‘రక్షణ ఉత్తర్వులు’ పొందవచ్చు. మీరు కేస్ వేయగానే మీ అన్నయ్యను పిలిపించి ‘కౌన్సెలింగ్’ ఇచ్చి సమస్య పరిష్కరిస్తారు. వినకుంటే కేస్ వేసి కోర్టుకు పంపిస్తారు. అక్కడ మీరు విచారణ అనంతరం ఉత్తర్వులు పొందవచ్చు.

 
 నా వయస్సు 30 సం॥పెళ్లి విషయంలో మహిళలే కాకుండా పురుషులు కూడా మోసపోతున్నారనడానికి నా పెళ్లే పెద్ద ఉదాహరణ. ఎన్నో ఆదర్శాలతో కట్నం ఆశించకుండా పెళ్లి చేసుకున్నాను. అమ్మానాన్నలను ఆదరించే అమ్మాయి చాలనుకున్నా. నా భార్య పెళ్లినాటికే కాస్త బొద్దుగా ఉన్నా, మంచి కుటుంబమని చేసుకున్నాను. పెళ్లి రిసెప్షన్‌నాడే ఒక నమ్మకస్తుడి ద్వారా నా భార్య గర్భవతి అని తెలుసుకుని దిగ్భ్రాంతి చెందాను. నమ్మలేదు. కానీ ఎంతో ఆప్తులైన ఆ వ్యక్తి సాక్ష్యంతో సహా చూపించాడు. అమ్మాయినీ, తల్లిదండ్రులను నిలదీశాను. ఒప్పుకోలేదు. నన్ను పోలీసులకు పట్టిస్తానని బెదిరించారు. ఇది జరిగి రెండునెలలైంది. మామధ్య శారీరక సంబంధం లేదు. అమ్మానాన్న మంచమెక్కారు. అక్కలు భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నేను ఏమి చేయాలో సలహా ఇవ్వగలరు.
 - శేఖర్, హైదరాబాద్


 సెక్షన్ 12 హిందూ వివాహచట్టం 1955 ప్రకారం వివాహమయ్యే నాటికే భార్య గర్భవతిగా ఉండి, ఆ సంగతి భర్తకు తెలియకుండా ఉండి, తెలిసిన తర్వాత శారీరక సంబంధం లేకుండా ఉంటే ఆ వివాహాన్ని ‘చెల్లకూడని వివాహం’ (నల్ అండ్ వాయిడ్)గా ప్రకటించమని వివాహమైన సంవత్సరంలోగా కోర్టును ఆశ్రయించవచ్చు. తగిన సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించవలసిన బాధ్యత మీదే.
 

మరిన్ని వార్తలు