అమ్మా! మియ్యావ్‌

31 Jan, 2018 00:06 IST|Sakshi

చెట్టు నీడ 

ప్రకృతిని కూడా పుస్తకాల్లోనే చూసి
నేర్చుకోవడం అలవాటైపోయింది!
అయితే పుస్తకాలు తెరవకముందే
పిల్లల ఆలోచనల్ని తెరిపిస్తుంది ప్రకృతి.

‘‘బుక్‌లో ఏమేమున్నాయి? చూద్దామా కృతి బంగారూ’’ గారంగా కూతుర్ని ఒళ్లోకి తీసుకుంది అమ్మ.అమ్మ చేతిలోని ‘మై ఫస్ట్‌ ఎబిసి’ బుక్‌ లాక్కుని తనే ఓపెన్‌ చేసింది కృతి. సి పేజీ ఓపెన్‌ అయింది.క్యాట్‌ అని చెప్పాలా... మాతృభాషలో పిల్లి అని నేర్పించాలా... తల్లికి మీమాంస.‘‘అమ్మా! మియ్యావ్‌’’ అంటూ రెండు చేతులను గొంతు కిందకు చేర్చి కళ్లు పెద్దవి చేసి మూతిని సున్నాలా చుట్టింది ఒకటిన్నర ఏళ్ల కృతి.పేజీలు తిప్పుతున్నారిద్దరూ. హెచ్‌ పేజీలో కోడి ఉంది. ‘హెన్‌’ పలకడం ఈజీ, మాటలు పూర్తిగా నేర్చుకున్న తర్వాత ‘కోడి’ అని నేర్పించవచ్చు... అనుకునే లోపే...‘‘అమ్మా! బోబు... బో బ్బో బ్బో... కొక్కొక్కో...’’ రెక్కలు విచ్చినట్లు చేతుల్ని చాచి చెప్పింది కృతి.

తల్లి మురిపెంగా చూసింది కృతిని.పిల్లలకు తల్లే తొలి గురువు. తల్లి కంటే ముందు ప్రకృతే గురువు. ఆ తల్లికి చిన్నప్పుడు నేర్పించింది కూడా ప్రకృతే. పెద్దయ్యాకే పుస్తకాలు నేర్పించాయి. పుస్తకాలతో నేర్చుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి ప్రకృతిని కూడా ప్రకృతిలో కాకుండా పుస్తకాల్లోనే నేర్చుకోవడం అలవాటైపోయింది! అయితే పుస్తకాలు తెరవకముందే పిల్లల ఆలోచనల్ని తెరిపిస్తుంది ప్రకృతి.ప్రకృతిలో భాగంగానే నేర్పేవారు ఉంటారా లేక ప్రకృతే నేర్పుతుందా అని వర్డ్స్‌ వర్త్‌ ఓ చోట సంశయపడతాడు. నేర్పేవారు ఎవరైనప్పటికీ నేర్చుకోవడం అన్నది మనిషి ప్రవృత్తి. ఆ ప్రవృత్తే మనిషిని ప్రకృతి దగ్గరకు తీసుకెళుతుంది. ఆ తర్వాతే పుస్తకాలు. గురువర్యులు.

మరిన్ని వార్తలు