ఈత చైతన్యం..!

2 Sep, 2014 23:54 IST|Sakshi
ఈత చైతన్యం..!

 అది విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్.
 ఓ వ్యక్తి చేతులను కాళ్లను తాళ్లతో కట్టేస్తున్నారు.
 ఇద్దరు వ్యక్తులు అతడిని మోసుకెళ్లి
 కృష్ణానది ఒడ్డున వదిలారు.
 ఆ వ్యక్తి మెల్లగా దేహాన్ని కదిలిస్తూ నీటిపై తేలుతున్నాడు.
 ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది?
 ఓ గజ ఈత గాడు సాహసం చేస్తున్నాడు.
 చేతులు, కాళ్లను కట్టేసుకుని నీటిలో ఈదుతున్నాడు.
 ఏకంగా ఆరుకిలోమీటర్ల దూరం ఈత కొట్టాడతడు.
 అతడే 43 ఏళ్ల లంకె ఉమామహేశ్వర రావు.
 ఇదంతా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధనలో భాగం.

 
ఈతలో విన్యాసాలు చేసే గజ ఈతగాడు లంకె ఉమామహేశ్వరరావు వృత్తిరీత్యా పోలీసు. ఆయనది గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలోని ఓలేరు గ్రామం. మనిషికి దైనందిన జీవితంలో ప్రకృతి నుంచి ఎదురయ్యే గండాలనేకం. వాయుగండం, అగ్నిగండం, జలగండం... వంటివన్నీ తప్పించుకుంటూనే ప్రకృతితో మమేకమై జీవించాలి. అదే ఆయనకు తెలిసిన ఫిలాసఫీ. ఈత నేర్చుకుంటే జలగండం నుంచి తప్పించుకోవడంతోపాటు ఇతరులనూ రక్షించవచ్చంటారు. ఈతలో విన్యాసాలు చేస్తూ ఈత పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ఈ విన్యాసాలు చేయడానికి కృష్ణాతీరమే కారణం అంటారాయన.
 
‘‘మా ఓలేరు గ్రామం కృష్ణానది తీరాన ఉన్న లంక గ్రామం. అరటి, సపోటా, మామిడి తోటలతో పచ్చగా కళకళలాడుతూ ఉండేది. గ్రామాల్లో పుట్టి పెరిగిన పిల్లలకు ఈత నేర్పడానికి శిక్షకులు ఉండరు. మక్కువ ఉంటే ప్రకృతే నేర్పిస్తుంది. ఏరు నీటితో నిండుగా ఉంటే  ఈదాలనే ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఐదో తరగతి చదివేనాటికే స్నేహితులతో కలిసి ఏటిలో అరటి బొండు మీద పడుకుని ఈత నేర్చుకున్నాను. ప్రతి మనిషీ... నీరు తాగడం ఎంత తప్పని సరో నీటిలో తేలడం కూడా అంతే తప్పని సరి - అని తెలుసుకోవాలి. ఈత నేర్చుకుంటే ఎంతటి మహాప్రళయం సంభవించినా ప్రాణాలను కాపాడుకోవచ్చు’’ అంటారు ఉమామహేశ్వరరావు.
 
ఈత పతకాల కోసం కాదు!

జీవితం మీద విరక్తితో క్షణికావేశంలో ఆత్మహత్యాప్రయత్నం చేసేవారు ఎందరో. వారిలో చాలామంది నీటిలో దూకిన తర్వాత బతకాలనే తపనతో కొట్టుమిట్టాడుతారు. ఈత వచ్చి ఉంటే వారంతా బతికి బయటపడేవారే. అలాగే ఈత వచ్చి ఉంటే ప్రకృతి వైపరీత్యాల్లో అనేకమంది ప్రాణాలతో ఒడ్డుకు చేరతారు. ప్రకృతి మనకు ప్రకృతితో కలిసి జీవించడమూ నేర్పిస్తుంది. ప్రకోపించినప్పుడూ రక్షించుకోవడమూ నేర్పిస్తుంది. ఈత నేర్చుకోవడం పతకాల కోసం కాదు, ఆత్మరక్షణ కోసమేనంటారు ఉమామహేశ్వరరావు. ఆత్మరక్షణ విషయంలో ఎక్కువమందిని చైతన్యవంతం చేయడమే తన లక్ష్యం అంటారాయన.
 
ఆ క్రమంలోనే ఆయన ప్రకాశం బ్యారేజ్ నుంచి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరాన ఉన్న హంసలదీవి వరకు ఈతకొట్టారు. ఆ తర్వాత గిన్నిస్‌రికార్డు సాధించడం పెద్ద కష్టమేమీ కాదనిపించడంతో ఇప్పుడా ప్రయత్నంలో ఉన్నారు. ‘‘నేను ప్రస్తుతం విజయవాడలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాను. గిన్నిస్ రికార్డు కోసం నా ప్రయత్నానికి మా డిపార్ట్‌మెంట్ డిఐజి సహకరిస్తున్నారు’’ అన్నారాయన.
 
ఈ తరాన్ని చూస్తూ బాధతో...

పోలీసు కానిస్టేబుల్ సెలక్షన్స్ కోసం వచ్చి ఐదు కిలోమీటర్ల దూరం పరుగెత్తలేక కుప్పకూలిపోవడాన్ని చూస్తే గుండె ద్రవించిపోతోందంటారు ఉమామహేశ్వరరావు. కాన్వెంట్‌స్కూళ్ల చదువు, తల్లిదండ్రులు అతి జాగ్రత్తతో పెంచుతూ దేహానికి వ్యాయామం లేకుండా పెంచడమే ఇందుకు కారణం. ఈ తరం యువత తాము ప్రయాణిస్తున్న బస్సు కాలువలో పడిపోతే ఈదుకుంటూ ఒడ్డుకు చేరలేని నిస్సహాయ స్థితిలో ఉందని వాపోయారు. ‘‘విజయవాడలో ముగ్గురు కాలేజీ విద్యార్థినులు అనుమానాస్పదంగా కృష్ణానదిలో మునిగి చనిపోయారు. వారికే కనుక ఈత వచ్చి ఉంటే ఏదో ఒక దశలో బతికి బయటపడేవాళ్లు. ఇలాంటివి చూసిన తర్వాత ఈత పట్ల చైతన్యం తీసుకురావాల్సి అవసరం చాలా ఉంది అనిపించింది’’ అన్నారు.
 
విన్యాసమైనా... సాహసమైనా కఠోర సాధనతోనే!

ఉమామహేశ్వరరావు చేస్తున్న విన్యాసాలు చూసి స్ఫూర్తిపొందుతున్న వారు ఎక్కువగానే ఉంటున్నారు. అయితే వారందరినీ ఆయన ‘‘ఈ విన్యాసం ఎంతో కష్టమైంది. కఠోర సాధన చేస్తే తప్ప సాధ్యం కాదు. ఎవరు పడితే వారు చేయడానికి వీల్లేదు. దేహదారుఢ్యం బాగుండాలి’’ అని హెచ్చరిస్తున్నారాయన. పోలీసు ఉద్యోగం అంటేనే అనేక సవాళ్లమయం. అవి చాలవన్నట్లు ఈ విన్యాసాలు చేస్తూ ఎప్పుడూ ప్రమాదం అంచున గడపడం గురించి చెబుతూ... ఈ విషయంలో భార్య చంద్రకళ సహకారం చాలా గొప్పదంటారు ఉమామహేశ్వరరావు.
 
‘‘ఆవిడ నా విన్యాసాలకు సంతోషించడమే కాదు, నా లక్ష్యాన్ని గౌరవిస్తూ మా పిల్లలకు ఈతనేర్పించింది. మా దివ్య ఇంటర్ సెకండియర్. అబ్బాయి శ్రీరామ్ పదో తరగతి చదువుతున్నాడు. అబ్బాయి కృష్ణానదిలో ఆగకుండా ఐదుకిలోమీటర్లు ఈదుతాడు’’ అన్నారాయన సంతోషంగా. ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇవ్వడానికి, మెళకువలు నేర్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.
 - రాజ్‌కుమార్ ఆలూరి, విజయవాడ,ఫొటోలు : పి.ఎల్. మోహన్
 
ఆత్మరక్షణ నేర్పించాలి!

పిల్లలకు మంచి తిండి, చదువుతో పాటు ఈత కూడా నేర్పించాలి. రోజుకు ఒక గంట చొప్పున కేవలం వారం రోజుల కేటాయిస్తే చాలు ఈత నేర్చుకోవచ్చు. ఈత నేర్పిస్తే దేహదారుఢ్యంతోపాటు వారికి ఆత్మరక్షణ విద్య నేర్పించినట్లువుతుంది. ఈత వస్తే ఆపదలో ఉన్నప్పుడు తనతో పాటు మరో ఇద్దర్ని రక్షించే నైపుణ్యం సాధించవచ్చు. అంతకంటే ముందుగా ప్రమాదానికి లోనయిన వెంటనే భయపడకుండా బయటపడడం ఎలా అనే ఆలోచన కలుగుతుంది.
- లంకె ఉమామహేశ్వరరావు, గజ ఈతగాడు
ఈ మెయిల్: lanke.uma@gmail.com

మరిన్ని వార్తలు