ఆకు మొక్కలు!

17 Dec, 2019 02:14 IST|Sakshi
రాజరత్నం నర్సరీలో నాటిన ఆకులు

ఆకును నాటి, 10 వారాల్లో జన్యుస్వచ్ఛతతో కూడిన నాణ్యమైన ‘ఆకు మొక్క’ల ఉత్పత్తి

తమిళనాడులో నర్సరీ రైతు అద్భుత ఆవిష్కరణ

నాణ్యమైన పూలు, పండ్ల మొక్కల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నర్సరీలపై ఆధారపడే పరిస్థితికి స్వస్తి చెప్పే రోజులు వస్తున్నాయా? అంటు కట్టకుండానే, టిష్యూ కల్చర్‌తో పని లేకుండానే రైతులే, 9–10 వారాల్లో అత్యంత సులువుగా జన్యుస్వచ్ఛతతో కూడిన నాణ్యమైన మొక్కల్ని తయారు చేసుకోవచ్చా?? రాజరత్నం అద్భుత ఆవిష్కరణ గురించి తెలుసుకుంటే ఈ ప్రశ్నలన్నిటికీ‘‘అవును’ అనే సమాధానం వస్తుంది. ఇంతకీ ఆ ఆవిష్కరణ ఏమిటంటారా.. ‘ఆకును నాటి మొక్కను తయారు చేసుకోవడం (లీఫ్‌ కల్చర్‌)’! ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. రాజరత్నం ఎవరో.. ‘ఆకు మొక్కల’ కథా కమామిషు ఏమిటో చదవండి మరి..

రాజరత్నం స్వస్థలం తమిళనాడు కోయంబత్తూరు జిల్లా మెట్టుపాళయం. వ్యవసాయ కుటుంబంలో పుట్టి అప్లయిడ్‌ సైన్సెస్‌లో డిగ్రీ చదివిన రాజరత్నం మక్కువతో 6 ఎకరాల భూమిలో నర్సరీని ఏర్పాటు చేశారు. 1989 నుంచి ఈడెన్‌ నర్సరీ గార్డెన్స్‌ను నిర్వహిస్తున్నారు. షూట్‌ టిప్‌ కల్చర్‌లో నైపుణ్యం సాధించారు. ఏటా 10 లక్షల మొక్కల్ని విక్రయిస్తూ రూ. కోటిన్నర టర్నోవర్‌ సాధించారు. ఈ పూర్వరంగంలో సులభమైన రీతిలో మొక్కల ఉత్పత్తి పద్ధతులు అన్వేషిస్తూ ఈ నర్సరీ రైతు వినూత్నమైన ‘లీఫ్‌ కల్చర్‌’ పద్ధతిని ఆవిష్కరించారు. పచ్చి ఆకును నాటి, వేర్లు మొలిపించడం ద్వారా అత్యంత నాణ్యమైన మొక్కను తయారు చేయడం(లీఫ్‌ కల్చర్‌) అనే అద్భుత ఆవిష్కరణతో ఆయన నర్సరీ రంగంలో సంచలనం రేపుతున్నారు. ఈ ఏడాది ప్రతిష్టాత్మక చిన్నికృష్ణన్‌ ఇన్నోవేషన్‌ అవార్డు పొందారు.లీఫ్‌ కల్చర్‌పై పేటెంట్‌ కోసం ధరఖాస్తు చేసుకున్నారు.

నర్సరీ కార్యకలాపాల్లో నైపుణ్యాన్ని మరింత పెంపొందించుకోవాలన్న దృష్టితో 2010లో తమిళనాడు వ్యవసాయ వర్సిటీలో 4 వారాల టిష్యూ కల్చర్‌ కోర్సు చేశారు. టిష్యూకల్చర్‌ పద్ధతిలో నాణ్యమైన మొక్కలను ఉత్పత్తి చేయడానికి రూ. లక్షల ఖరీదైన ప్రయోగశాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, అతి తక్కువ ఖర్చుతో మొక్కలను ఉత్పత్తి చేసే మార్గమే లేదా? విత్తనాలతో, షూట్‌ టిప్‌ కటింగ్స్‌తో, ఇతరత్రా కణజాలాలతో నాణ్యమైన మొక్కలను ఉత్పత్తి చేయగలుగుతున్నప్పుడు..  పచ్చి ఆకును నాటి ఎందుకు మొక్కను ఉత్పత్తి చేయకూడదు? అన్న మెరుపు వంటి ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ప్రయోగాలు ప్రారంభించాడు. ఈ క్రమంలో ఎదురైన వైఫల్యాలను అధిగమిస్తూ ఎట్టకేలకు 2013 నాటికి పచ్చి ఆకులు నాటి కొద్ది వారాల్లోనే చక్కని మొక్కలను ఉత్పత్తి చేయగలిగాడు.  

దేశంలోనే తొలి సేంద్రియ నర్సరీ
రాజరత్నం నర్సరీలో ప్రధానంగా షూట్‌ టిప్‌ కటింగ్స్‌ ద్వారా గుండు మల్లి, బొడ్డు మల్లె, సన్నజాజి, కనకాంబరం, ఐక్సోరా వంటి పూల జాతులతోపాటు నిమ్మ, జామ, దానిమ్మ, నేరేడు, నోని, బొప్పాయి తదితర పండ్ల జాతుల మొక్కలు, తమలపాకు మొక్కలను ఏటా లక్షల సంఖ్యలో ఉత్పత్తి చేస్తుంటారు. మొక్కలను పూర్తి సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేస్తూ, దేశంలోనే తొలి సేంద్రియ నర్సరీగా రాజరత్నం నర్సరీ గుర్తింపు పొందింది కూడా. నర్సరీ మొక్కల పెంపకానికి ఎటువంటి సేంద్రియ ఎరువులు కూడా వాడటంలేదు, రిజర్వాయర్‌ ఒండ్రు మట్టినే వాడుతున్నారు.

గుండు మల్లితో లీఫ్‌ కల్చర్‌ ప్రారంభం
తమిళనాడులో రైతులు ఎక్కువగా సాగు చేసే ‘గుండు మల్లి’ రకంతో ‘లీఫ్‌ కల్చర్‌’ను రాజరత్నం విజయవంతంగా ప్రారంభించారు. ప్రస్తుతం గుండుమల్లితోపాటు నూరు వరహాల(ఐక్సోరా) రకం పూల జాతి మొక్కలను ఆకుల ద్వారా ఉత్పత్తి చేసి ఆయన విక్రయిస్తున్నాడు. గుండుమల్లి, నూరువరహాల పూల మొక్కల విషయంలో అన్ని పరీక్షలూ విజయవంతంగా పూర్తయ్యాయన్నారు. ఆకుతో ఉత్పత్తి చేసిన గుండుమల్లి మొక్కల ద్వారా దిగుబడి 20% పెరిగింది. అధిక నీటిని తట్టుకునే శక్తి పెరిగింది. ఒక గుత్తిలో పూల సంఖ్య దాదాపుగా రెట్టింపైంది. కొమ్మల కత్తిరింపు అవసరం ఏడాదికి 3 నుంచి ఒకసారికి తగ్గిందన్నారు.

పూర్తి ఫలితాలకు 3–5 ఏళ్ల సమయం
నేరేడు, జామ, నోని, తమలపాకు, మిరియాలు పనస తదితర పది పంట జాతుల ఆకుల నుంచి తయారు చేసిన మొక్కలను రైతులకిచ్చి ప్రయోగాత్మకంగా సాగుచేయిస్తున్నామన్నారు. ఈ ఫలితాలు పూర్తి స్థాయిలో రావటానికి మరో 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుందని రాజరత్నం వివరించారు. దీర్ఘకాలిక పంటలు కావడంతో పండ్ల మొక్కల విషయంలో అనేక కోణాల్లో ఫలితాలను నిర్థారించుకున్న తర్వాతే రైతులకు అందించాల్సి ఉంటుందన్నారు.
‘లీఫ్‌ కల్చర్‌’పై ఏ విశ్వవిద్యాలయమూ ఇంతవరకూ పరిశోధనలు ప్రారంభించలేదన్నారు. ఏ విశ్వవిద్యాలయమైనా ఆసక్తి చూపితే సంతోషంగా కలిసి పనిచేస్తానని రాజరత్నం ఫోన్‌ ఇంటర్వ్యూలో ‘సాగుబడి’తో చెప్పారు.

ఆకుకు వేర్లు మొలిపించేది ఇలా..
1.    తొలుత ఎంపిక చేసుకున్న ఆకులు నాటడానికి మట్టి మిశ్రమం నింపిన చిన్న పాలిథిన్‌ గ్రోబ్యాగ్‌లు సిద్ధం చేసుకోవాలి. వీటిని తొలి రోజుల్లో పెట్టడానికి షేడ్‌ నెట్‌ హౌస్‌ను ఏర్పాటు చేసుకోవాలి.

2. షేడ్‌ నెట్‌ హౌస్‌ లోపల అవసరం మేరకు టన్నెల్‌ మిస్ట్‌ ఛాంబర్‌లను ఏర్పాటు చేసుకోవాలి. ఛాంబర్‌ను 8 ఎం.ఎం. ఇనుప ఫ్రేమ్‌తో రూపొందించుకోవాలి. ఇది 2.5 అడుగుల ఎత్తు ఉండాలి. అవసరాన్ని బట్టి కావల్సినంత పొడవు పెట్టుకోవాలి. ఒక టన్నెల్‌ మిస్ట్‌ ఛాంబర్‌లో రాజరత్నం 3 వేల పాలిథిన్‌ గ్రోబ్యాగ్‌లు ఏర్పాటు చేసుకొని, వాటిలో ఆకులు పెడుతున్నారు.

3.    తొలుత, మీకు అవసరమైన చెట్టు/మొక్క నుంచి పచ్చి ఆకును తొడిమతో పాటు తుంచాలి.

4.    ఆ ఆకును లేత కొబ్బరి నీటిలో అరగంట సేపు నానబెట్టాలి. కొబ్బరి నీటిలో సీజన్‌ను బట్టి, ప్రాంతాన్ని బట్టి పోషకాల హెచ్చు తగ్గులుంటాయి. దీన్ని బట్టి లీఫ్‌ కల్చర్‌లో ఫలితాలు ఆధారపడి ఉంటాయి.

5.     కాబట్టి, కొత్తగా ఆకుతో మొక్కను ఉత్పత్తి చేసుకునే రైతులు ఖచ్చితమైన ఫలితాలను పొందేందుకు ఐ.బి.ఎ.(ఇండోల్‌ బటైరిక్‌ యాసిడ్‌) అనే రూటింగ్‌ హార్మోన్‌ను ఉపయోగించడం ఉత్తమం.

6. పాలిథిన్‌ బ్యాగ్‌లలోని మట్టిలోకి తొడిమె పూర్తిగా వెళ్లేలా ఆకును పెట్టాలి. ఆకుకు వేర్లు పుట్టడానికి మట్టిలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. తర్వాత టన్నెల్‌ మిస్ట్‌ ఛాంబర్‌లోకి అసలు గాలి చొరబడకుండా పాలిథిన్‌ షీట్‌ను బిగించి, అన్నివైపులా మట్టికప్పాలి.

7.పాలిథిన్‌ గ్రోబ్యాగ్‌లోని మట్టిలో తేమ చాలినంత ఉందో లేదో ప్రతి 5 రోజులకోసారి సరిచూసుకోవాలి. అవసరం మేరకు ఈ గ్రోబాగ్‌లపై నీటిని తగుమాత్రంగా పిచికారీ చేయాలి.

8. 4–5 వారాల్లో ఆకుకు వేర్లు మొలుస్తాయి. మరో 4–5 వారాల్లో ఆకు పక్కనే మొక్క పెరుగుతుంది. మూడు, నాలుగు ఆకులు వస్తాయి. ఆ దశలో టన్నెల్‌ మిస్ట్‌ ఛాంబర్‌పైన పాలిథిన్‌ షీట్‌ను తొలగించాలి. మొక్కలను షేడ్‌నెట్‌ హౌస్‌లో కొన్ని రోజులు ఉన్న తర్వాత.. ఆరుబయట ఎండలోకి మార్చాలి.

9.    ఆరుబయట మొక్కలు బాగా ఎదిగిన తర్వాత పొలంలో నాటుకోవచ్చు.

10. నాటిన ఆకు ఎండిపోకుండా ఉండటానికి, చక్కగా వేరు పోసుకోవడానికి 30 డిగ్రీల ఉష్ణోగ్రత (2 డిగ్రీలు అటూ ఇటుగా), గాలిలో తేమ 70% ఉంటే అనువుగా ఉంటుందని రాజరత్నం అంటున్నారు.

లీఫ్‌ కల్చర్‌పై రైతులకు ఉచిత శిక్షణ!
ఆకులతో మొక్కల్ని ఉత్పత్తి చేయడం చాలా సులువు. రైతులెవరైనా సులువుగా నేర్చుకోగలరు. స్కూలు పిల్లలు కూడా ఇది నేర్చుకోగలుగుతారు. యంత్రాలు, ప్రయోగశాలలు అవసరం లేదు. విద్యుత్తు అవసరం లేదు. పెద్దగా పెట్టుబడి ఏమీ అవసరం లేదు. రూ. 20 వేల నుంచి 30 వేలు చాలు. షేడ్‌నెట్‌ హౌస్, మిస్ట్‌ ఛాంబర్‌ ఉంటే చాలు. రైతులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు అనుదినం మా నర్సరీని సందర్శిస్తూనే ఉంటారు.

ఇప్పటికే సుమారు వంద మందికి ఆకులతో మొక్కల్ని ఉత్పత్తి చేసే పద్ధతిపై శిక్షణ ఇచ్చాను. రూపాయి కూడా ఫీజు చెల్లించనక్కరలేదు. రైతులంతా ఈ పద్ధతి నేర్చుకోవాలని, మొక్కల్ని కొనకుండా తామే ఉత్పత్తి చేసుకునేలా తోడ్పడాలనేదే నా అభిమతం. శిక్షణ పొందాలనుకునే వారు ఎవరైనా మా ఊరు బయలుదేరే ముందు సమాచారం కోసం నాకు ఒకసారి ఫోన్‌ చేస్తే చాలు. రైతులు ఎక్కువగా సాగు చేసే పూలు, పండ్ల జాతులతోపాటు అంతరించిపోతున్న చెట్ల జాతులు, ఔషధ మొక్కలపై పరిశోధనలు చేస్తున్నాను. నర్సరీపై వచ్చే 25% ఆదాయంలో  లీఫ్‌ కల్చర్‌పై పరిశోధనలకు వెచ్చిస్తున్నాను.
– ఎస్‌. రాజరత్నం, (94860 94670) నర్సరీ రైతు, కురుప్పాయమ్మల్‌ తొట్టం, వెల్లియపాళయం రోడ్డు, మెట్టుపాళయం, కోయంబత్తూరు జిల్లా, తమిళనాడు www.edennurserygardens.com  


ఆకులు నాటితే 10 వారాల్లో సిద్ధమైన మొక్కలు

మరిన్ని వార్తలు