కృష్ణ లీలలు కథలు కాదు సమాజసేవ

4 Sep, 2015 23:30 IST|Sakshi
కృష్ణ లీలలు కథలు కాదు సమాజసేవ

ఇవాళ కృష్ణాష్టమి. ఆయన జగద్గురువు. ఇవాళ టీచర్స్ డే కూడా. జగతిలోని గురువులందరికీ వందనాలు. మనకు ఉన్నదే జ్ఞానము అనుకోవడం మూర్ఖత్వం. జ్ఞానం ఉన్నవారిని అనుసరించకపోవడం అవివేకం. చాగంటివారు చల్లని గురువు. జ్ఞానమూ ఉంది, పరిజ్ఞానమూ ఉంది. పరులకు పంచిపెట్టే ప్రజ్ఞా ఉంది. జగద్గురువుకు, జగద్గురువులకు, జగమెరిగిన గురువులకు...
 సాదర ప్రణామాలు.  
 
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని సాక్షి టీవీ,దినపత్రిక కోసం ‘ఎమెస్కో బుక్స్’ అధినేత దూపాటి విజయకుమార్  ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు.   విజయకుమార్:  మీ వ్యక్తిగత వివరాలు వినాలని ఉత్సుకతగా ఉంది... దయచేసి చెబుతారా? చాగంటి: మా నాన్నగారు గొప్ప పండితులు, కవి. పశ్చిమగోదావరి జిల్లా చాటపర్రులోని ఒక ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా జీవితాన్ని సాగించారు. జీతంలో కొంత భాగాన్ని పేదపిల్లల చదువుకు వినియోగించేవారు. భక్తి తత్పరులు. ఆయన దృష్టిలో భక్తి అంటే సమాజాన్ని ప్రేమించడం. మా అమ్మ సుశీలమ్మ భర్తను అనుకరించడం మినహా ఏమీ తెలియని సాధ్వి. నాకు ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్లు. అందరూ చదువుకున్నారు. నేను ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేస్తున్నాను. వృత్తి రీత్యా అధికారిని అయినా, ప్రవృత్తి రీత్యా సాయంకాలం ప్రవచనం చేయడాన్ని ఒక అలవాటుగా స్వీకరించాను. నా భార్య సుబ్రహ్మణ్యేశ్వరి రాష్ట్రప్రభుత్వంలో పనిచేస్తూ నాకన్ని విధాలుగా చేదోడువాదోడుగా ఉంటోంది. నా కొడుకు, కూతురు ఇంజినీర్లే. భగవంతుడు నాకన్నీ ఇచ్చాడు. సంతోషంగా ఉన్నా.
 
విజయకుమార్: ధర్మం అంటే సమాజ హితం అన్నారు. అది ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుందా? మారుతుందా? అసలు ధర్మం స్వరూపం ఏమిటి?

 చాగంటి: ధర్మం అందరికీ అన్వయిస్తుంది. ప్రత్యేకించి మనిషి జన్మ ఎత్తిన వాడికి ధర్మాన్ని అనుష్ఠించడం అత్యంత అవసరం. పశువులన్నింటికీ ఒకటే ధర్మం. ఆకలేస్తే తింటుంది, భయం వేస్తే భయపడుతుంది, నిద్ర వస్తే పడుకుంటుంది, సంతానం కావాలనుకుంటే కంటుంది, చివరికి శరీరాన్ని వదిలిపెడుతుంది. మనిషి అలా కాదు. మారే ధర్మాన్ని నిరంతరం పట్టుకోవాలి. ధర్మం నాలుగు విషయాల ఆధారంగా మారిపోతుంటుంది. అవి దేశం, కాలం, వర్ణం, ఆశ్రమం. దేశం అంటే.. నేను ఇంట్లో ఉంటే చేసే పనులను ఇంకో ఊరు వెళితే చేయలేను. ఇంట్లో అందుబాటులో ఉన్న వ్యవస్థ వేరే ఊళ్లో ఉండదు. మానసికంగా ధ్యానం చేసి సంతోషించాలి. ఇంట్లో చేసే పూజలో పదోవంతు ఇక్కడ చేస్తే చాలు.

కాలం.. ఒక కాలంలో ఉన్నది ఇంకో కాలంలో ధర్మం అవదు. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు పారణ ధర్మం. వర్ణం.. యజ్ఞోపవీతం ఉన్న వాడికి సంధ్యావందనం ధర్మం, యజ్ఞోపవీతం లేకపోతే సూర్యుడికి నమస్కారం చేస్తే చాలు. ఎవరికి ఉండే అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారికలా విధించింది శాస్త్రం. ఆశ్రమం.. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి. ఒక్కొక్కరిది ఒక్కో ధర్మం. గృహస్థు దానం పడతాడు. బ్రహ్మచారి దానం పట్టకూడదు. వానప్రస్థుకి కుటుంబంతో తాదాత్మ్యత ఉండదు. గృహస్థు తన భార్యాబిడ్డల గురించి పట్టించుకోవాలి. అందుకనే ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంటుంది. ఈ ధర్మాన్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకున్నవాడు చిట్టచివరికి మారనటువంటి సత్యంగా మారిపోతాడు. సత్యమే ఈశ్వరుడు. నాకు ఒకటి ధర్మం అనిపిస్తే, మరొకరికి మరొకటి ధర్మం అనిపిస్తుంది. వ్యక్తుల అవకాశాన్ని బట్టి ధర్మాన్ని నిర్ణయించే అవకాశాన్ని విడిచిపెట్టలేదు భగవంతుడు. ధర్మానికి శాస్త్రమే నిర్ణేత. ఒక పని చెయ్యాలా, చెయ్యకూడదా, చేస్తే ఎలా చేయాలనేది శాస్త్రం చెబుతుంది. అది చదువుకోవడం, పట్టుకోవడం మనిషి అభ్యున్నతికి కారణాలవుతాయి. ప్రతిరోజూ ధర్మానుష్ఠానం చేసి ధార్మిక జీవితం గడిపితే తను ప్రశాంతంగా ఉంటూ తన చుట్టూ ఉన్న వాళ్లకు ప్రశాంతంగా ఉండే అవకాశం ఇచ్చి చివరికి సత్యమై నిలిచిపోతాడు.

 విజయకుమార్: ఆచారం ధర్మానికి మూలం. మరి ఆచారం కూడా నిరంతరం మారుతూ ఉండాలి కదా?
 చాగంటి: నిజమే. ధర్మం ఎలా మారుతుందో ఆచారం కూడా అలా మారుతుంది. మనిషి స్థితిని దృష్టిలో పెట్టుకుంది శాస్త్రం. ఇలాగే చేయాలి అంటే అందరూ అన్ని వేళలా అలా చెయ్యలేకపోవచ్చు. ఉదాహరణకు 20 మంది కలిసి కాశీ యాత్రకు వెళ్లారు. అందులో ఒక వ్యక్తికి 104 జ్వరం రావడంతో స్నానం చేయలేదు. మిగిలినవాళ్లు స్నానం చేశారు. 20 మందీ తిరిగివచ్చారు. వారిలో కాశీలో గంగాస్నానం చెయ్యకుండా తిరిగివచ్చిన అతను కూడా గంగాస్నానం చేసినట్లా.. కాదా... అంటే... గంగాస్నానం కోసమే అతను కాశీకి వెళ్లాడు. శరీరానికి వైక్లబ్యం వచ్చింది. శరీరాన్ని వదిలిపెట్టేసి స్నానం ఎలా చేస్తాడు? కానీ కాశీకి వెళ్లిందే గంగాస్నానం కోసం కాబట్టి అతను కూడా గంగాస్నానం చేసినట్లే. అందుకే మనిషి స్థితిని బట్టి ఆలోచన చేయాలి. ఆరోగ్యంగా ఉంటే తల స్నానం చెయ్యి. జ్వరమొస్తే నడుం వరకూ, ఆ ఓపికా లేకపోతే మూడుసార్లు నీళ్లు చల్లుకో. అది కూడా చేయలేని పరిస్థితి అయితే విభూతి చల్లుకో చాలు. అదీ చేయలేకపోతే మంచం మీదే పడుకుని గోవింద నామం చెప్పు. అదీ చేయలేని స్పృహ లేని పరిస్థితి అయితే కొడుకు పక్కనే కూర్చుని గోవింద అంటే చాలు. తండ్రి స్నానం చేసినట్లే. ఇప్పుడు ఆచారం మారిందా, లేదా! మారింది. మనిషి మనసును ప్రశాంతంగా ఉంచడం కోసం ఆచారకాండ వచ్చిందే తప్ప బాధపెట్టడానికి కాదు. ఆచారం ప్రధాన ఉద్దేశం మనసును పవిత్రం చేయడం. మనసును పవిత్రంగా ఉంచుకోవాలనే తాపత్రయం ఉంది కాబట్టి ఆచారం పాటించాలి. రమణమహర్షి పంచెకట్టుకున్నాడా లేదా అని ఎవరూ అడగరు. గోచి పెట్టుకున్నా ఆయన పరమేశ్వరుడే. ఆ స్థితికి వెళ్లిపోయాక ఆచారంతో సంబంధంలేదు. అప్పటివరకూ ఆచారాన్ని వదిలిపెట్టవద్దు. ఎందుకంటే అది మనసును పవిత్రంగా ఉంచి మనిషిని మనిషిగా బతకడానికి మార్గం చూపిస్తుంది.

విజయకుమార్: బట్టతలలు, తెల్లజుట్టు వాళ్లు కనిపించే మీ సభల్లో ఈ మధ్య కుర్రాళ్లు ఎక్కువగా కనపడుతున్నారు. దేవాలయాలకూ కుర్రాళ్లు ఎక్కువగా వస్తున్నారు. పిల్లలు భక్తి మార్గానికి ఎక్కువగా వస్తున్నారు. సమాజంలో వచ్చిన మార్పు వల్ల ఈ తరం ఐడెంటిటీ క్రైసిస్‌ను ఎదుర్కొంటోంది. కానీ వారికి సమాజ హితమే భక్తి అని చెప్పడానికి మీరేం చేస్తారు?

చాగంటి: మనిషికి మనిషితో అనుబంధం ఏర్పడడానికి రెండు కారణాలుంటాయి. సోదరభావం, స్నేహభావం. సోదర భావానికి మన ప్రయత్నం అక్కర్లేదు. నాతో కలిసిపుట్టినవాడు, నా అక్కచెల్లెళ్లున్నారు. వాళ్ల మీద నాకు ప్రేమ. ఎక్కడ ఉన్నా నేను వాళ్లను స్మరించుకుంటే నా మనసు ఆర్ద్రత పొందుతుంది. వాళ్లేదైనా కష్టంలో ఉంటే నా ఖర్చు తగ్గించుకుని వాళ్లకి సాయం చేయాలనిపిస్తుంది. వాళ్లిళ్లలో ఏదైనా శుభకార్యం జరిగితే వెళ్లి పాల్గొనాలనిపిస్తుంది. ఈ సంబంధానికి మూలం మేమంతా ఒక్క తల్లితండ్రీ బిడ్డలం కాబట్టి. భక్తికి ప్రారంభం దేశంలో ఎక్కడుందంటే మేం అంతా ఒక్క తల్లితండ్రుల బిడ్డలమనే. ఎవరా తల్లితండ్రులు? లక్ష్మీనారాయణులనండి, పార్వతీ పరమేశ్వరులనండి, ఏ పేరైనా పెట్టుకోండి. జాతీయ సమైక్యతకు, సెక్యులరిజానికి మూలాలు ఈ దేశంలో ఎక్కడున్నాయి? భక్తిలో ఉన్నాయి. భక్తి మౌఢ్యం ఎప్పుడూ కాదు. యువతకు భక్తి ఉండి తీరాలి. భక్తిలో రెండు భిన్నమైన విషయాలు ఏకీకృతమవుతాయి. పిల్లలు దేవాలయాలకు వెళ్లడానికి, వినడానికి కారణం అదే. నేను చాలా భయపడుతున్నాననుకోండి ధైర్యంగాలేనని. నేను ధైర్యంగా ఉన్నాననుకోండి, భయంగాలేనని. కానీ భక్తి ఉన్నవాడికి భక్తి, ధైర్యం రెండూ ఉంటాయి. నేను భక్తుణ్ణి అంటే రోజూ వెయ్యి మారేడు దళాలు తెచ్చి పూజ చేస్తానని కాదు. భక్తి అంటే నేను భగవంతుడిని నమ్మానని. తప్పు చేయకుండా నియంత్రించేది భక్తి ఒక్కటే. అందుకే ఈ దేశంలో ఒకప్పుడు ఇంటికి తాళం కప్పలేదు. ఎందుకు లేదంటే తలుపు తీసి వెళ్లిపోయినా ఇంకో వ్యక్తి ఆ ఇంట్లో వస్తువును తీసుకోడు. ఇంకొకడి వస్తువు నాకు బెడ్డ ముక్క. అది నాకు ఈశ్వరుడు ధార్మికంగా ఇస్తే తృప్తి. ఇది మనిషికి తృప్తి, సంతోషం, శాంతినిస్తుంది. దీనివల్ల పక్కవాణ్ణి ఇబ్బంది పెట్టడు, పాడు చేయడు, పాపపు పని చేయడానికి భయపడతారు. దేశమంతా శాంతిభద్రతలుంటాయి. అందుకే భారతదేశం అంటే ఒకప్పుడు శాంతికి పర్యాయపదం. ఇప్పటికీ శాంతిసూక్తం చెబితే, మనుషుల శాంతి గురించి మాట్లాడారు. అంతరిక్ష శాంతి, గోశాంతి, భూశాంతి, వాయుశాంతి. వాయువు ప్రకోపించకూడదు. భూమి ప్రకోపించకూడదు. ప్రజల మనోభావాలు, సంస్కృతి వల్ల పంచభూతాలు ప్రశాంతంగా ఉంటాయి. ఆరోగ్యవంతమైన భయం భక్తిలో ఉంటుంది. ధైర్యం భక్తిలో ఉంటుంది. భక్తి కలిగిన దేశం కాబట్టే ఈ దేశం ప్రపంచంలో మిగిలిన దేశాలకు నాయకత్వం వహించింది. ఇవాళ మళ్లీ యువత భక్తిలోకి రావడం, భక్తి వల్ల ఆరోగ్యవంతమైన భయాన్ని, ధైర్యాన్ని పొందడం ఎంతో సంతోషించదగ్గ విషయం.

 నేను ఒకప్పడు భాగవతం గురించి చెబుతూ కృష్ణలీలలన్నీ కథలు కాదు సమాజసేవని చెప్పాను. పూతన సంహారం సమాజసేవ. కాళీయమర్దనం యమునానది నీళ్లు పాడవకుండా చేసిన సమాజ సేవ. కృష్ణుడు సమాజ సేవలో సంతోషం పొందాడు. అవే మనం నేర్చుకోవాలని చెప్పా. ఆ తర్వాత కొద్దిరోజులకి ప్రవచనానికి వెళ్లిపోతుంటే ఒక పిల్ల వచ్చింది మా ఇంటికి. ఎవరు నువ్వనడిగితే బీటెక్ చదువుకుంటున్నాను, మీకు నమస్కారం చేయాలని వచ్చానంది. నేను ప్రవచనానికి వెళుతున్నానమ్మా మళ్లీ వెనక్కివచ్చి నీతో మాట్లాడే సమయం లేదన్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీరు కనబడ్డారు చాలు నమస్కారం అంది. ఇద్దరం లిఫ్టులో దిగుతుండగా నాకు నమస్కారం పెట్టాలని ఎందుకు అనిపించిందని అడిగాను. మీ మాటల వల్ల ప్రేరణ చెందానని చెప్పడంతో ఆశ్చర్యపోయి ఏం ప్రేరణ చెందావని అడిగా. మీరు చెప్పిన కృష్ణలీలలు సమాజ సేవన్నారు అది ప్రేరణ కల్పించిందని, నా స్థాయిలో సమాజ సేవ చేశానంది. కారెక్కబోతున్నవాడిని ఆగి ఏం సమాజ చేశావని అడిగాను. ప్రతిరోజూ ఒక గంట సేపు గవర్నమెంట్ హాస్పిటల్‌కు వెళ్లి ఓపీ కౌంటర్ దగ్గర కూర్చుంటానని, నిరక్షరాస్యులు, రూపాయి లేని వాళ్లకి, ఓపి టికెట్ రాయడం రానివారికి సహాయపడతానని చెప్పింది. వాళ్లకి వార్డులు చూపించి డాక్టర్ వద్దకు తీసుకెళ్లి, మందులిప్పించి పంపిస్తానంది. ఈ మధ్య ఇంట్లో కాలుజారి పడిపోయిన ఒక గర్భిణీని ఇక బతకదు అన్న స్థితిలో తీసుకొచ్చారు. ఆ సమయంలో తాను చేసిన ఉపకారం వల్ల ఆవిడ బతికి ఆడపిల్లకు జన్మనిచ్చిందని, ఆ పిల్లకు తన పేరు పెట్టుకున్నారని, అది తనకు ఎంతో తృప్తినిచ్చిందని చెప్పింది.

 నేను కారెక్కి వెళ్లిపోతున్నవాడిని ఆగి ఆ పిల్లని వెనక్కి తీసుకెళ్లి పసుపు కుంకుమలు, బట్టలూ ఇచ్చి పంపాను. దీన్ని ఒకసారి టీవీ లైవ్‌లో చెప్పాను. దాన్ని చూసి చాలామంది పిల్లలు ఇది తమకు నచ్చిందంటూ తాము కూడా సమాజ సేవ చేస్తున్నామని ఉత్తరాలు రాశారు. ఇప్పుడు చెప్పండి. యువత మంచి ప్రేరణ పొందట్లేదా? ఉపకారాలు చేయట్లేదా..? ధైర్యంతో ఉండడం లేదా? భక్తి మనిషిని నిలబెడుతుంది. లక్షల సంవత్సరాలుగా ఈ జాతి గౌరవ ప్రతిష్ఠలు భక్తి చేతనే ఉన్నాయి. సేవ చేయడానికి పెద్ద ఆలోచనలు అవసరమా. ఎంత అవలీలగా చేసేసింది.

 విజయకుమార్: భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి మూలకారణాలు వేదాలు, ఉపనిషత్తులు. వీటిని కోట్ చేస్తూ, మీరు, మీతోపాటు అనేక మంది ప్రవచనాలు చెబుతున్నారు. మీరు మాట్లాడే ప్రతిమాటకు శాస్త్ర ప్రమాణం ఉందనుకునే మాట్లాడుతున్నారా?

చాగంటి: నాకు తెలిసున్నంతవరకూ నా బుద్ధికి తోచినట్లు మాట్లాడే ప్రయత్నం చేయాలన్న సంకల్పం కూడా నాకుండదు. ఒకవేళ నా బుద్ధికి తోచిన విషయం గురించి చెప్పాలనుకున్నా ఎవరూ అభ్యంతర పెట్టరు కదా. సీతారామకళ్యాణం గురించి చెప్పమన్నారంటే కథ తెలియక వాళ్లడగడంలేదు. అందులో ఏదో ధర్మసూక్ష్మం ఉందని, దాన్ని తెలుసుకుని ఆచరించాలని వాళ్ల తాపత్రయం. అప్పుడు అందులో ప్రామాణికంగా ఏ విషయం అంతర్లీనమై ఉందో, పెద్దల చేత అంగీకరింపబడిందో దాన్నే ప్రస్తావించాలి తప్ప నా బుద్ధికి తోచినట్టుగా చెప్పడం అనేది మంచిది కాదు. అందుకనే నేను ప్రమాణానికి కట్టుబడతాను. నాకు తెలిసినంతవరకూ ప్రమాణాన్ని విడిచి స్వబుద్ధికి తోచినవి చెప్పాలనే ఆలోచన నాకు తడుతుందని నేననుకోవడంలేదు. ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున అన్నానేమో తెలియదు. కానీ నా సంకల్పం ఎప్పుడూ ప్రమాణానికి కట్టుబడాలనే ఉంటుంది.
 సమన్వయం: ఫణికుమార్ సాక్షి, విజయవాడ
 
 విజయకుమార్: ప్రపంచీకరణ ఒక ఉప్పెనలా వచ్చి కొత్త సంస్కృతిని తెచ్చిపెట్టింది. ప్రపంచీకరణలో దేవుడు పర్సనల్ అయ్యాడు. పర్సనల్ గాడ్, ఎటర్నల్ కాస్మిక్ పవర్ మధ్య ఎట్లా ఒక వారధిని నిర్మించుకోవాలి? కొత్త జనరేషన్ పిల్లలు దీన్నెలా అర్థం చేసుకోవాలి?

చాగంటి: ఇందులో ఒక గంభీరమైన విషయం నిబిడీకృతమై ఉంది. ప్రపంచమంతా నా కుటుంబం. అందరూ బావుండాలి. ఏ సంస్కృతి, సంప్రదాయానికి చెందినవారైనా సంతోషంగా ఉండాలి. సంస్కృతిని మాత్రం పాడు చేయకూడదు. ఒక ఉదాహరణ చెబుతాను. రాముడు వానరులు- సుగ్రీవాదులు, రాక్షసులు- విభీషణాదులు, గుహుడు లాంటి ఆటవికులతో స్నేహం చేశాడు, వాళ్లంతా ఆయనకు వశవర్తులు. కానీ ఆయన ఏరోజూ కిష్కింధకు వెళ్లి ఈ సంస్కృతేమిటి, ఈ అల్లరేమిటి, ఈ జీవనం ఏమిటి, మిమ్మల్ని కొంతమందిని నేను కొన్ని సమూహాలుగా అయోధ్యకు తీసుకెళ్లి శిక్షణా తరగతులు పెడతానని చెప్పలేదు. వారి సంస్కృతిని విడిచిపెట్టమని వారికి చెప్పలేదు. అధర్మాన్ని విడిచిపెట్టమన్నాడు. ఎవరి సంస్కృతిని వాళ్లని కాపాడుకోమని చెప్పాడు తప్ప సంస్కృతిలో వేలు పెట్టలేదు. అందరి సంస్కృతి, సంప్రదాయాన్ని గౌరవించాడు. ప్రపంచీకరణ దోషం అని నేను అనను. విశాలదృక్పథంతో ఉండండి. కానీ సంస్కృతిని విడిచిపెట్టకండి. ఇతర సంస్కృతుల వెంటపడి మన సంస్కృతిని నాశనం చేసుకోకూడదు. కాపాడుకోవాలి. ఇంగ్లీషులో మాట్లాడు, ఫైల్ రాయి. ఇంటికొచ్చి కొడుకుతో పోతన పద్యం చెప్పు. దేవాలయానికెళ్లేటప్పుడు పంచె కట్టుకో. యువతకు ఆ కోణంలో చెప్పాలి.
 
 ఎమెస్కో విజయకుమార్
 

మరిన్ని వార్తలు