వితంతు కోడళ్లూ భరణానికి అర్హులే

22 Sep, 2015 23:46 IST|Sakshi
వితంతు కోడళ్లూ భరణానికి అర్హులే

లీగల్ కౌన్సెలింగ్
నేను నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మాకు ఒక బాబు పుట్టాడు. వాడికి ఏడాది అయినా గడిచిందో లేదో  దురదృష్టవశాత్తూ మా వారు ఓ యాక్సిడెంట్‌లో చనిపోయారు.  అప్పటినుంచి నేనూ, బాబూ అనాథలమైనాము. ఇప్పుడు బాబుకు మూడేళ్లు. మాది కులాంతర వివాహం కావడంతో నాకు పుట్టినింటి నుంచి ఏ అండా లేదు. అత్తింటి వారేమో మా కొడుకే పోయాక మీకూ మాకూ ఇక సంబంధం ఏమిటని నన్ను ఈసడించుకుంటున్నారు. నేను డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. ఉద్యోగం వస్తుందన్న ఆశ లేదు.

అటు పుట్టింటి అండాలేక, అత్తింటి ఆదరణా లేక చాలా ఇబ్బందిపడుతున్నాను. మా అత్తమామలు ధనవంతులు. ఏ బాధ్యతలూ లేనివారు. నాకు ఆస్తికోసం వారితో పోట్లాడటం ఇష్టం లేదు. మా ఇద్దరికీ నెలవారీ ఖర్చులకు సరిపడా మెయింటెనెన్స్ ఇస్తే చాలు. నాకు ఏదైనా ఆధారం దొరికాక అది కూడా అక్కరలేదు. నన్ను ఏం చేయమంటారు? కోడలిని పోషించవలసిన బాధ్యత అత్తమామలకు లేదా?
- ఒక సోదరి, హైదరాబాద్

 
మీ పరిస్థితి దయనీయం. మీ ఆత్మగౌరవం హర్షణీయం. వితంతువైన కోడలు అత్తమామలనుంచి మెయింటెనెన్స్ పొందవచ్చు. మీరే కాదు, మీ బాబు కూడా. మీరు ఆశ్రయించవలసిన చట్టం ది హిందూ అడాప్షన్ అండ్ మెయిన్‌టెనెన్స్ యాక్ట్ 1956. ఈ చట్ట ప్రకారం తనను తాను పోషించుకోలేని, పోషణకు ఏ ఆధారమూ, ఆస్తిపాస్తులూ, ఆదాయమూ లేని వితంతువైన కోడలు మామగారి నుంచి సెక్షన్ 19ను అనుసరించి మెయింటెనెన్స్‌ను పొందవచ్చు. మీరు వెంటనే కోర్టును ఆశ్రయించండి. మీ వారికి రావలసిన ఆస్తిని కూడా మీ మామగారు ఇవ్వలేదు. కనుక ఈ పిటిషన్ వేసిన తర్వాత ఆయనే స్వచ్ఛందంగా ఆస్తి ఇచ్చే అవకాశం కూడా ఉంది.
 
నేను నా భర్తపై 498-ఎ కేస్ వేశాను. అది కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈలోగా నా భర్త, మా ఇరు కుటుంబాల వారు మాట్లాడుకుని, కేస్ కాంప్రమైజ్ అవ్వాలని, దానికి గాను అతను 15 లక్షలు శాశ్వత మనోవర్తి ఇచ్చేలా, ఇరువురూ కంసెంట్ విడాకులు తీసుకునేలా నిర్ణయించారు. నా సమస్యేమిటంటే విడాకుల పిటిషన్ దాఖలు చేసేనాడు 10 లక్షలు డి.డి. ఇస్తామని, విడాకులు మంజూరు చేసేనాడు మిగతా 5 లక్షలు ఇస్తామని అంటున్నారు. నాకేమో మోసపోతానని భయంగా ఉంది. ఏం చేయమంటారు?
- సౌమ్య,  విశాఖపట్నం

 
మీరు చెప్పిన విషయాలు పిటిషన్‌లో రాసుకోవాలి. భయపడే అవసరం లేదు. మొదటి విడత డబ్బులు ఎలాగూ ఇచ్చేస్తారు. రెండో మొత్తం మీకు ముట్టిన తర్వాతనే ముట్టిందని జడ్జిగారు నిర్ధారించుకున్న తర్వాతనే మీకు విడాకులు వస్తాయి. మీకు మొత్తం సొమ్ము ముట్టకుండా విడాకులు రావు. ఒకవేళ మోసం చేసే ప్రయత్నం చేస్తే ఎటూ క్రిమినల్ కేసు ఉండనే ఉంది. ముందు విడాకుల కేసు, తర్వాత క్రిమినల్ కేసు ఉండేలా చూసుకోండి. అప్పుడే మీరు క్రిమినల్ కేస్ కాంప్రమైజ్ కావచ్చు.
 
నా పేరు మంగ్లీ. నా మాజీ భర్త పేరు జామియా. మేము ఒక ట్రైబల్ తండాకు చెందినవారం. మాకు ఒక పాప ఉంది. కొన్ని కారణాల వల్ల మేమిరివురము మా తండా పెద్దల కుల పంచాయతీ ద్వారా విడాకులు తీసుకున్నాము. తర్వాత నేను మారు మనువు చేసుకున్నాను. నేను మా తండాలోనే అంగన్‌వాడీ వర్కర్‌గా పనిచేస్తున్నాను. పాప కూడా నా దగ్గరే ఉంది. నా భర్త బస్‌డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఒక రోజు నా మాజీ భర్త పాపను చూసి వెళ్తానని అడిగితే అంగన్‌వాడి స్కూల్ దగ్గరకు రమ్మని చెప్పి పాపను చూపించి పంపించాను. అది తెలిసిన నా భర్త నన్ను అనుమానించి, చిత్రహింసలపాల్జేసి అసలు మా వివాహం చెల్లదని, రద్దు చేయవలసిందిగా ప్రకటించమని కోర్టును ఆశ్రయించాడు. నేనసలు మొదటి భర్త నుండి విడాకులు తీసుకోలేదని అతని వాదన. నేను అతనికి అన్నీ చెప్పే వివాహం చేసుకున్నాను. నాకు సలహా ఇవ్వండి.
- మంగ్లీ, ఆదిలాబాద్

 
అతని వాదనలో నిజం లేదు. మీ రెండవ వివాహం చెల్లుతుంది. ఎందుకంటే మీరు మొదటి భర్త నుండి తీసుకున్నది ‘కస్టమరీ డైవర్స్’ అంటే కొన్ని ‘గుర్తించబడిన కులాలకు/తెగలకు’ వారి ఆచారాలను, సంప్రదాయాలను తరతరాలుగా వస్తున్న పద్ధతులను అనుసరించి కులపెద్దల సమక్షంలో విడాకులు తీసుకునే కట్టుబాటు ఉంటుంది. వీరి వివాహ పద్ధతులు, సంప్రదాయాలు ఆచారాలు భిన్నంగా ఉంటాయి. సెక్షన్ 29 (2) హిందూ వివాహ చట్టం కుల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల ప్రకారం వివాహాన్ని రద్దు చేసుకోవడానికి ఉన్న హక్కును మార్పు చేయదు. ఆచారాల ప్రకారం విడాకులు తీసుకునే పద్ధతి అమలులో ఉంటే చట్టం దానిని రక్షిస్తుంది అని అర్థం. కనుక మీరు మీవారి పిటిషన్‌ను అడ్డుకోవచ్చు. మీ వర్షన్‌కు ఫేవర్‌గా ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్‌వారు లోయ పద్మజ వర్సెస్ లోయ వీర వెంకట గోవిందరాజులు కేస్‌లో తీర్పునిచ్చారు. 1999 (6) ఎఎల్‌డి 413 (డిబి).
 
మా పెళ్లయ్యి పాతికేళ్లయింది. మా పిల్లలిద్దరూ అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మా వారు బ్యాంక్‌మేనేజర్. ఇటీవలే వి.ఆర్.ఎస్ తీసుకున్నారు. నా సమస్యేమిటంటే, పెళ్లయినప్పటినుంచి ఇన్ని సంవత్సరాల వరకు నేను మా వారిని, పిల్లలను ఎంతో శ్రద్ధగా చూసుకున్నాను. కుటుంబం కోసం నా ఆరోగ్యాన్ని, వ్యక్తిగత ఆనందాన్ని కూడా లెక్క చేయకుండా అవిశ్రాంతంగా పని చేశాను. నేను చేసిన పనులను మా వారు ఏనాడూ గుర్తించక పోగా ఎప్పుడూ ఏదో ఒక దానికి దెప్పి పొడిచేవారు. నన్ను ఒక మనిషిగా కూడా గుర్తించేవారు కాదు. పిల్లల కోసమే నేను ఆయన పెట్టిన హింసలను ఇన్నాళ్లూ ఓపిగ్గా భరించాను. అయితే ఇటీవల కాలంలో ఆయన నేను ముసలిదాన్నయ్యాననీ, తనేమో ఇంకా ఫిట్‌గా ఉన్నాననీ, ఈ వయసులో కూడా అమ్మాయిలు తనంటే పడి చస్తున్నారనీ నన్ను తీవ్రమైన మానసిక వేదనకి గురి చేస్తున్నారు. నేనది సహించలేకపోతున్నాను. ఆయన ఉనికి కూడా భరించలేకపోతున్నాను. నాకు తగిన సలహా ఇవ్వండి.
- ఎ. సావిత్రి, విజయవాడ

 
ఈ వయసులో మిమ్మల్ని ఆయన మీద కేసు పెట్టమని కానీ, విడాకులివ్వమని కానీ నేను మీకు సలహా ఇవ్వలేను. కానీ మీకు ఒక పరిష్కారం సూచించగలను. మీరు మొట్టమొదట మీ వారి ఉనికిని భరించలేకపోతున్నారు. ఒక ఇంట్లో ఆయనతో కలిసి ఉండలేకపోతున్నారు. అతని మానసిక వేధింపుల నుంచి తప్పించుకుని ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి మీరు పై కారణాలన్నీ వివరిస్తూ, ఫ్యామిలీ కోర్టులో జుడీషియల్ సెపరేషన్ కోరుతూ పిటిషన్ వేయండి. సెక్షన్ 10, హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం దీనిని విడాకులు లేకుండా విడిపోవడం అంటారు. కోర్టువారు విచారణ తర్వాత విడివిడిగా జీవించడానికి మీకు డిక్రీ ఇస్తారు.

ఇందువల్ల మీ వివాహ బంధం రద్దు కాదు. ఆస్తిహక్కులకు ఏ ముప్పూ వాటిల్లదు. కేవలం శారీరక సంబంధాలు మాత్రం రద్దవుతాయి. ఇద్దరూ కలిసి జీవించే హక్కు తాత్కాలికంగా రద్దవుతుంది. అయితే ఒకే ఇంట్లో నివసించకుండా మీరు విడివిడిగా జీవించవలసి ఉంటుంది. ఈ సెక్షన్‌లోని అంతరార్థం ఏమిటంటే పునరాలోచించుకుని లోటుపాట్లను సవరించుకుని మరలా కలిసి జీవించడానికి అవకాశం ఇవ్వడం. మీ భర్త తన ప్రవర్తనను మార్చుకుని, మిమ్మల్ని సక్రమంగా చూస్తానని మీకు నమ్మకం కలిగిస్తే, మీరు మరలా అతనితో మీ వివాహ బంధాన్ని కలుపుకుని కలిసి కాపురం చేయవచ్చు. ప్రయత్నించి చూడండి.
 
ఇ.పార్వతి
అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్

మరిన్ని వార్తలు