మీ కేసు విషయంలో కచ్చితంగా విడాకులు వస్తాయి

9 May, 2016 09:06 IST|Sakshi
మీ కేసు విషయంలో కచ్చితంగా విడాకులు వస్తాయి

లీగల్ కౌన్సెలింగ్
నా వయస్సు 17 సంవత్సరాలు. ఇంజనీరింగ్ కోర్సులో మొన్ననే జాయిన్ అయ్యాను. నాకు తెలిసీ తెలియని వయస్సులో, అంటే 14 సంవత్సరాలపుడు మా నానమ్మ ఆఖరి కోరిక అని మా మేనత్త కొడుకుతో వివాహం జరిపించారు. తర్వాత నానమ్మ చనిపోయారు. నేను అత్తగారింటికి వెళ్లనని మొండికేశాను. మా బావతో ఏ సంబంధం లేదు. ఇప్పుడు నన్ను కాపురానికి రమ్మని గొడవపెడుతున్నారు. నాకు ఇష్టం లేదు. ఆ పెళ్లి నేను తృణీకరించాను. విడాకులు వస్తాయా? ఈ గొడవలతో నా చదువు చెడిపోయేలా ఉంది. ప్లీజ్.. మార్గం చెప్పండి.
 - హిమజ, రాజమండ్రి

 
జ: హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం అనేక కారణాల వల్ల భార్యాభర్తలు విడాకులు తీసుకోవచ్చును. అయితే భార్య విడాకులు తీసుకోవడానికి కొన్ని అదనపు సందర్భాలు వున్నాయి. మీ విషయం దానికి వర్తిస్తుంది. పదిహేను సంవత్సరాలు నిండక ముందు వివాహం జరిగి, పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండకముందే ఆ వివాహాన్ని సదరు యువతి తృణీకరించి ఉంటే అట్టి వివాహాన్ని రద్దు చేయమని ఆ యువతి కోర్టు ఆశ్రయించవచ్చు. మీకు 15 సంవత్సరాలు నిండక ముందే వివాహమైంది. 18 సంవత్సరాలు నిండకముందే వివాహాన్ని తృణీకరించారు. పైగా మీకు శారీరక సంబంధం కూడా లేదు. కచ్చితంగా విడాకులు వస్తాయి.
 
నాకు ఇద్దరు పిల్లలు. పాపకు రెండు సంవత్సరాలు, బాబుకు ఒక సంవత్సరం. నా భర్త నా నుండి విడాకులు తీసుకున్నాడు. పిల్లలు నా వద్దే ఉన్నారు. ఆర్థికంగా నా పరిస్థితి అసలు బాగోలేదు. కూలీనాలీ చేసుకుని బ్రతుకుతున్నాను. నాకు భర్త నుండి పిల్లల పోషణ ఖర్చులు లభించే అవకాశం ఉందా?
 - రుక్సానా, నెల్లూరు
 
జ: ‘విడాకులు పొందిన ముస్లిం మహిళల హక్కుల రక్షణ చట్టం 1986’ ప్రకారం మాజీ భర్త భార్యకు ‘ఇద్దత్’ కాలం అంటే మూడు ఋతుస్రావముల కాలం ముగిసే వరకు సమంజసమైన భరణం చెల్లించాలి. ఇక పిల్లలకు పుట్టిన తేదీ నుండి రెండు సంవత్సరాల కాలం వరకు వారికయ్యే ఖర్చును మాజీ భర్త చెల్లించవలసి ఉంటుంది. ఇక మీ పిల్లల కస్టడీ మీ భర్త కోరలేదనిపిస్తోంది. కనుక మీరు సిఆర్‌పిసి 125 సెక్షన్ ప్రకారం పిల్లలకోసం మెయిన్‌టెనెన్స్ కేసు వేయండి.

ఆ సెక్షన్ ప్రకారం మైనారిటీ తీరే వరకు పిల్లల పోషణ బాధ్యత తండ్రి వహించవలసిందే. మగపిల్లలకైతే మైనారిటీ తీరేవరకు, ఆడపిల్లలకైతే వివాహం జరిగే వరకు తండ్రి మనోవర్తి చెల్లించాలి. మీరు న్యాయవాదిని సంప్రదించి కోర్టును ఆశ్రయించండి. ముస్లిం పురుషులు భార్యకు విడాకులిచ్చినా, పిల్లలకు 125 సిఆర్‌పిసి ప్రకారం మనోవర్తి చెల్లించక తప్పదు.
 
నేనొక లంబాడా తండాలో అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. మా తండాలో బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఈ కేసులో అసలు శిక్షలు ఎవరికి పడతాయి? నేరస్తులు ఎవరు? దయచేసి తెలుపగలరు.
 - లక్ష్మి, నల్లగొండ జిల్లా

 
జ: ‘బాల్య వివాహ నిరోధక చట్టం’ 2006లో వచ్చింది. మగపిల్లవాడి యుక్తవయస్సు 21 సం, ఆడపిల్ల యుక్తవయస్సు 18 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. యుక్తవయస్సు రాని పిల్లలకు వివాహం చేయడం నేరం. చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం -
 ఎవరైతే మైనర్ పిల్లల వివాహం నిర్వహిస్తారో
 ఎవరైతే మైనర్ పిల్లల వివాహం నిర్దేశన జరుపుతారో
 ఎవరైతే వరుని తండ్రియో అట్టి వ్యక్తి
 ఎవరైతే పౌరోహిత్యం చేస్తారో వారు,
 ఎవరైతే మధ్యవర్తిగా ఉంటారో వారు శిక్షార్హులు.
లక్ష రూపాయిల జరిమానా, 2 సంవత్సరాల జైలుశిక్ష పడుతుంది. మహిళలకు ఈ చట్టం మినహాయింపు నిచ్చింది.
 
- ఇ.పార్వతి
అడ్వొకేట్ అండ్  ఫ్యామిలీ కౌన్సెలర్
parvathiadvocate2015@gmail.com

మరిన్ని వార్తలు