న్యాయకోవిదుని హృదయ స్పందన నీవు మాకు ఆదర్శం

28 Nov, 2014 23:27 IST|Sakshi
న్యాయకోవిదుని హృదయ స్పందన నీవు మాకు ఆదర్శం

మనిషికి ఏం కావాలి? తిండీ బట్టా గూడు. అవి బతకడానికి. కాని జీవించడానికి? సంస్కారం కావాలి. అది తన వరకు సరిపోతుంది. మరి నలుగురి కోసం? అందుకు స్పందన కావాలి. అనాదిగా సాహిత్య సారస్వతాలు చేస్తున్న పని అదే. మనిషికి సంస్కారం ఇవ్వడం. స్పందన నొసగడం. కులం ఏదైనా మతం ఏదైనా జాతి ఏదైనా వర్గం ఏదైనా అట్టడుగున చూస్తే ప్రతి మనిషికీ కావలసినవి ఇవే- స్పందనా సంస్కారాలు. వాటిని కోరే, ఆశించే, అందుకోసం కాసింత కదలికను తీసుకువచ్చే, అందుకై పరితపించే ఏ సాహిత్యమైనా కచ్చితంగా మంచి సాహిత్యమే. న్యాయకోవిదులైన జస్టిస్ చంద్రకుమార్ వృత్తిరీత్యానే కాదు ప్రవృత్తి రీత్యా కూడా సమాజంలోని మంచి చెడులను, న్యాయాన్యాయాలను, హెచ్చుతగ్గులను, పీడనా దుర్మార్గాలను, అందుకు హేతువులను దర్శించే చక్షువు కలిగినవారు. తన చేతిలోని కలం న్యాయం పలికే తీర్పును రాయడానికే కాదు, ధర్మం చెప్పే కవిత్వాన్ని రచించడానికి కూడా ఉందని ఆయన గ్రహించారు. అందుకే గేయరచనతో మొదలైన ఆయన ప్రస్థానం మంచి కవిత్వాన్ని రాసే దిశగా కొనసాగుతోంది. క్షమ, కరుణ, నిస్వార్థత, రుజుమార్గం, పరోపకారం వెరసి మానవతా విలువలు ఆయన మౌలిక కవితా వస్తువులు.

‘పుట్టేటప్పుడు గిట్టేటప్పుడు నలుగురి సహకారం కావాలి కనీసం అందుకైనా నిస్వార్థంగా నలుగురికీ తోడ్పడాలి’ అంటారాయన.
 అలా పని చేసే మనిషి ఎవరనేది ఆయనకు నిమిత్తం లేదు. నిజానికి సమాజానికి కూడా అలాంటి నిమిత్తం ఉండాల్సిన పని లేదు. ‘సత్యం ఎవరు చెప్పినా సమ్మతమే మాకు సంఘ శ్రేయస్సు ఎవరు కోరినా అదే శాస్త్రం మాకు కారణ్యం ఎక్కడున్నా అదే ఆదర్శం మాకు
 మానవత్వమెక్కడున్నా అదే మతం మాకు’ అంటారాయన. అలాంటి సమాజం కావాలంటే సంకుచితాలు వదిలేయాలి. ద్వేషాన్ని రగిలించే పని మానుకోవాలి. ప్రతి మనిషీ తన మనిషే అనుకోగలగాలి. అందుకు చంద్రకుమార్ చాలా ఉన్నతంగా చెట్టును తన ఆదర్శంగా తీసుకుంటారు. ప్రతి మనిషీ ఒక అడవి వృక్షం వలే మారగలిగితే అంతకు మించి కావలసింది ఏమైనా ఉందా?

 ‘బతికినన్నాళ్లు నీడ కోరితే చల్లని నీడ గూడు కోరితే వెచ్చని గూడు   పండు కోరితే పండు   కలప కోరితే కలప - కాదనక ఇచ్చేవు. బతికినా చచ్చినా   ఎవ్వరినీ ఏమీ అడగకుండా ఏది కావాలంటే అది ఇచ్చే   అడవిలోని వృక్షమా   ఆదర్శం నీవు మాకు’
 ‘ఇచ్చుటలో ఉన్న హాయి’ అని గతంలో ఒక కవి అన్నట్టు చంద్రకుమార్ కూడా ‘ఇవ్వడంలోని సంతోషాన్ని’ తెలుసుకోమంటారు. అయితే ఈ ఆదర్శాలను బుజ్జగించి చెప్పడం మాత్రమే కాదు తనకు నచ్చనివాటి మీద నిరసన ప్రదర్శించటం, తిరుగుబాటు ప్రదర్శించడం కూడా చూస్తాం. ఈ కవిలో కృత్రిమ భేషజాలను ఇష్టపడని ఒక అచ్చమైన స్వచ్ఛమైన పల్లె స్వభావం ఉంది. అందుకు సూటూ బూటుల మీద ఆయన రాసిన ‘నీకర్థం కాదు’ కవిత తార్కాణం.

‘నా మెడలోని టై ఉరితాడులా నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది’ అంటారాయన. ఇలాంటి పల్లీయ స్వభావంతో నిరాడంబర జీవితంతో ప్రకృతిలా (మదర్ థెరిసాలా) ఇవ్వడమే తెలిసిన గుణంతో జీవించే సమాజం కోసం జస్టిస్ చంద్రకుమార్ చేసిన అక్షర ఆకాంక్ష ‘నీవు మాకు ఆదర్శం’.

 నీవు మాకు ఆదర్శం- జస్టిస్ బి. చంద్రకుమార్ కవిత్వం
 వెల: రూ.60; ప్రతులకు- 8501901270, 8332874874
 

మరిన్ని వార్తలు