మళ్లీ కలవాలంటే పెళ్లి చేసుకోవలసిందే!

1 May, 2016 23:13 IST|Sakshi
మళ్లీ కలవాలంటే పెళ్లి చేసుకోవలసిందే!

లీగల్ కౌన్సెలింగ్
మా పెళ్లయి ఆరేళ్లైంది. మా ఆవిడకు నాపై చాలా అనుమానం. నా సంపాదనంతా మా అమ్మానాన్నలకు ఇస్తున్నానని, తన అవసరాలు పట్టించుకోనని అపోహలు. తనను నమ్మించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. నా జీతం స్లిప్స్ చూపించాను. మా అమ్మానాన్నల ఆస్తిపాస్తుల వివరాలు తెలియజేసి, వారికి నా డబ్బుతో అవసరం లేదని స్పష్టపరిచాను. అయినా తను కన్విన్స్ అవలేదు. చివరకు నా ఏటీఎం కార్డు కూడా తనకే ఇచ్చాను. ఇంకా ఆమె ప్రవర్తన మారలేదు.

ఈసారి నాపై కొత్త ఆరోపణలు మొదలెట్టింది. నా కొలీగ్స్‌తో అక్రమ సంబంధాలు అంటగట్టి, నన్ను సతాయించడం ప్రారంభించింది. ఈ విషయం మా అత్తామామలకి చెప్పాను. మొదటినుంచి ఆమె స్వభావం అదేనని, కొంతకాలం ఓర్చుకోమనీ చెప్పారు. కనీసం నా ముఖం చూపించకుండా ఉంటే అయినా, తను మారుతుందేమో, నా ఉనికికి దూరమైతే రియలైజ్ అవుతుందేమోనని జుడీషియల్ సపరేషన్ కేస్ వేశాను. నాకు ఫేవర్‌గా ఆర్డర్ వచ్చింది. తనకు ఏ లోటూ లేకుండా స్వంత ఇంట్లోపూ ఉండే ఏర్పాటు చే సి, నేను అద్దె ఇంటికి మారాను. ఇది జరిగి రెండేళ్లు అయింది. అయినా మా ఆవిడ లో ఏమార్పూ రాలేదు. నా భవిష్యత్ మాటేమిటి? మాకు పిల్లలు కూడా లేరు. నన్నేం చేయమంటారు?

 - ఎం. సాంబశివరావు, తెనాలి

 
కోర్టుద్వారా జ్యుడీషియల్ సపరేషన్ ఆర్డర్ పొందిన రెండేళ్ల వరకు కూడా మీ పరిస్థితులు చక్కబడనప్పుడు, ఆ కారణ ంగా మీరు విడాకులు మంజూరు చేయమని కోర్టును ఆశ్రయించవచ్చు. భార్యాభర్తలు పునరాలోచించుకోవడానికి కోర్టు ఇచ్చే అవకాశమే జ్యుడీషియల్ సపరేషన్. ఆ టైమ్‌లో ఒకరి లోటుపాట్లను ఒకరు ఆలోచించుకొని, సమస్యను పరిష్కరించుకుని, కాపురం చక్కదిద్దుకునే సమయం దొరుకుతుంది. తీరిగ్గా, ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా మంచి నిర్ణయం తీసుకోవచ్చు. మీ భార్య విషయం చూస్తే ఆమెలో ఏ మార్పూ లేదని తెలుస్తోంది. మరోసారి ఆమెతో మాట్లాడి చూడండి. ఆమె ససేమిరా అంటే మీకు విడాకులే మార్గం.
 
మా పెళ్లయి రెండు సంవత్సరాలు. నా భర్త చెన్నైలో ఉద్యోగం చేస్తున్నారు. నేను ఒక ఏడాదిపాటు చెన్నైలో అతనితో కలిసి ఉన్నాను. సంవత్సరం తర్వాత కుటుంబ పోషణకు తన ఆదాయం సరిపోవడం లేదని అప్పులున్నాయని నన్ను తన తల్లిదండ్రుల దగ్గర ఉండమని అడిగారు. మా అత్తామామలది మారుమూల పల్లెటూరు. వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.  నా అవసరం వారికి లేదు. నేను మొదటినుండి సిటీలోనే ఉన్నాను. పైగా ఇటీవలే మా నాన్న చనిపోయారు. అమ్మ ఒంటరిదైంది. నేనే ఏకైక సంతానాన్ని. అందువల్ల అమ్మ దగ్గర ఉంటాను, లేదంటే చెన్నైలో ఏదైనా ఉద్యోగం చూసుకుని అతని ఆర్థికభారాన్ని తగ్గిస్తానన్నాను. అతను దేనికీ ఒప్పుకోలేదు. నన్ను బలవంతంగా మా అత్తగారింట్లో దింపి వెళ్లారు. నేను కొన్ని రోజులుండి, అత్తమామలకు చెప్పి అమ్మదగ్గరికి వచ్చాను. అతను ఇంతవరకు నన్ను చూడటానికి రాకపోగా, తరచు ఫోన్ చేసి, నాపై రిస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కేసు వేస్తానని నన్ను తక్షణం అత్తగాంటికి వెళ్లమని వేధిస్తున్నాడు. నాకు భయంగా ఉంది. అసలు ఈ విషయమై చట్టం ఏమి చెబుతుందో వివరించగలరు.
 - సుమలత, ఆదోని
 
మీరు చెప్పిన వివరాలను పరిశీలిస్తుంటే మీవారికి మీతో కాపురం చేసే ఉద్దేశ్యం లేదనిపిస్తోంది. దశలవారీగా మిమ్మల్ని వదిలించుకునే ప్రయత్నంలో ఉన్నట్లున్నారు. అయితే, ఆయనకు తెలియని విషయమేమిటంటే, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ మీ వారికి వర్తించదు. భర్త లేకుండా అత్తగారింట్లో ఉండమని ఏ కోర్టూ ఆర్డర్ ఇవ్వదు. ఆ సెక్షన్ ఉద్దేశ్యం వేరు. సమేతుకమైన కారణం లేకుండా భర్త భార్యను విడిచి దూరంగా ఉన్నా, భార్య భర్తను విడిచి దూరంగా ఉన్నా ఈ కేసు వేసుకోవచ్చు.

దీనినే కాపురం హక్కుల పునరుద్ధరణ కేసు అంటారు. మీ విషయంలో మీరు భర్తను వదిలి రాలేదు. ఆయనే మిమ్మల్ని వెళ్లమన్నారు. ఒకవేళ అతను కేసు వేస్తే మీరు లక్షణంగా అతని వద్దకు వెళ్లండి మీరు కూడా అదే కోరుకుంటున్నారు కదా! భర్త లేకుండా అత్తమామల దగ్గర దగ్గర ఉండమని ఎవరూ చెప్పరు.
 
మా వివాహమైన సంవత్సరం తర్వాత మావారు తన కొలీగ్‌తో అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను వేధించారు. తీవ్రమనస్థాపానికి లోనైన నేను విడాకులకు అప్లై చేశాను. కోర్టు నాకు విడాకులు మంజూరు చేసింది. ఇది జరిగి నాలుగేళ్లయింది. నేను తర్వాత వివాహ ప్రయత్నం చేయలేదు. నేను ప్రభుత్వ ఉద్యోగిని. నా మాజీ భర్త తన కొలీగ్‌తోనే సహజీవనం సాగిస్తున్నాడని, వారికి ఒక పాప కూడా ఉందని తెలిసింది. మొన్నీమధ్య అతను నన్ను కలిశాడు. తన కొలీగ్ ప్రవర్తన బాగోలేదని, ఆమెను వదిలేశానని, ఇక ఆమెతో తనకు ఏ సంబంధం లేదని, మరల నాతో కలిసి ఉంటానని ప్రాధేయపడుతున్నారు. నాకూ ఒక తోడు కావాలని ఉంది. మేం ఒకప్పుడు భార్యాభర్తల మే కదా! తన కొలీగ్ మెడలో అతను తాళి కట్టలేదు కదా! ఏం చేయమంటారు? సలహా ఇవ్వగలరు.
 - మేరీ, కర్నూలు

 
అడల్టరీ గ్రౌండ్స్ మీద మీకు విడాకులు వచ్చాయి. అంతటితో ఆ బంధం చట్టబద్ధంగా రద్దయిపోయింది. తర్వాత మీ భర్త ఆ స్త్రీతో సహజీవనం చేశారు. సంతానం పొందారు. ఇప్పుడు ఆమె ప్రవర్తనను శంకించి మళ్లీ మీకు ఎర వేస్తున్నారు. మీతో మరల సంబంధం ఎలా కొనసాగిస్తారు? అలా అయితే ఈసారి మీ ఇద్దరిపై క్రిమినల్ కేసు వేసే అవకాశం మీ మాజీ భర్త సహజీవన భాగస్వామికి వస్తుంది. మీరు పునర్వివాహం చేసుకోలేదని, డబ్బు కూడబెట్టి ఉంటారని ఐడియా కావచ్చు. మీతో కొన్నాళ్లు పబ్బం గడుపుకొని మరలా మీ క్యారక్టర్ మంచిది కాదంటే ఏం చేస్తారు? చట్టబద్ధంగా విడిపోయిన భార్యాభర్తలు మరలా కలవాలంటే వివాహం చేసుకోవలసిందే. లేదంటే న్యాయపరమైన చిక్కులు రావచ్చు.

మరిన్ని వార్తలు