అందానికి ఐదు చిట్కాలు..

21 Nov, 2019 17:32 IST|Sakshi

చలికాలం మొదలైందంటే చాలు.. చర్మం పొడిబారిపోయి గరుకుగా తయారవుతుంది. చర్మం బిరుసెక్కి అందవిహీనంగా మారుతుంది. శరీరంపై ఏ చిన్న గీతపడినా తెల్లటి చారలు ఏర్పడతాయి. ముఖం, పెదాలు కూడా కళావిహీనంగా మారుతాయి. అయితే మనం తీసుకునే చిన్నపాటి జాగ్రత్తలతో శీతాకాలంలోనూ మెరిసిపోవచ్చు. కాస్త సమయం కేటాయిస్తే పొడిబారిన చర్మం నుంచి తప్పించుకోవచ్చు. గాఢత ఎక్కువగా ఉండే కెమికల్‌ ప్రోడక్ట్‌ల జోలికి పోకుండా సహజ సిద్ధమైన ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే కోమలమైన చర్మం మీ సొంతమవుతుంది.

శరీరం డీహైడ్రేట్‌ అవకుండా ఉండటం కోసం ఎప్పుడూ నీళ్లు తాగుతూ ఉండాలి. ఇది చర్మం తేమను కోల్పోకుండా ఉండటానికి సహాయపడుతుంది. వీలైతే నిమ్మ, దోసకాయ, పుచ్చకాయ వంటి పండ్లరసాలను తాగితే మరింత మంచిది.
చర్మం పొడిబారకుండా తేమతో కూడిన ఆయిల్స్‌ను అప్లై చేయాలి. స్నానానికి వెళ్లే ముందు ఆయుర్వేద ఆయిల్‌ను ఒంటికి పట్టించుకుని ఆ తర్వాత స్నానానికి వెళ్లాలి.
బలవర్థకమైన ఆహారం తీసుకోవాలి. తాజా కొబ్బరి, బాదంపప్పు, అవకాడో, ఆలివ్‌ ఆయిల్‌, నెయ్యి, చేపలు వంటి సంతృప్తికర కొవ్వును అందించే ఆహారాన్ని రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇవి మీ చర్మాన్ని యవ్వనంగా, అందంగా కనిపించేందుకు దోహదం చేస్తాయి.
బద్ధకం వదిలి కాసేపు శరీరానికి శ్రమ కల్పించాలి. యోగా, ఎక్సర్‌సైజ్‌ ఏదైనా సరే కాసేపు వ్యాయామాన్ని చేయండి. బయట చలిగా ఉంది.. చేయలేమని చేతులెత్తేయకుండా కనీసం ధ్యానమైనా చేయాలి. ఇది మీ ఆందోళనల నుంచి బయటకు తెచ్చి ప్రశాంతతను చేకూరుస్తుంది.
గ్లిజరిన్‌లో నిమ్మరసం కలిపి గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. దీన్ని ప్రతిరోజు ఓ మాయిశ్చరైజర్‌లా అప్లై చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ముఖానికి అప్లై చేసిన గంట తర్వాత కడిగేసుకుంటే చర్మం సున్నితంగా, కాంతివంతంగా నిగనిగలాడుతుంది.

మరిన్ని వార్తలు