ప్రముఖుల లేఖలు: చలం

30 Jun, 2014 23:04 IST|Sakshi
ప్రముఖుల లేఖలు: చలం

కన్యాకుమారి ఇంద్రజాలం
 రామేశ్వరం- 25-5-1934


ఈ ద్వీపమంతా తిరిగాం. ఏ ప్రదేశం నుంచి అయినా సరే కొబ్బరి తోపుల్లో నుంచి నీలంగా సముద్రం మెరుస్తో కనబడుతుంది, ఎంతో అందంగా. ఏ చోటనైనా సరే ఇసిక బంగారం మల్లే మెరుస్తో కనబడుతుంది. ఈ ద్వీపమంతా శ్రీరాముడు తిరిగిన చిహ్నలతో ప్రజ్వరిల్లుతోంది. భక్తి ఏమాత్రం లేని నాకు ఆలయం చూస్తే ప్రేమ. జాజిపువ్వులు...పువ్వుల్లో కెల్లా ఇష్టమైనవి. చందనం, నాదస్వరం, హారతి అన్ని నాకు అమితంగా ఇష్టం. ఏమీ లేని బైరాగి, పెద్ద స్తంభాలు, ప్రాకారాలు, మెత్తని కాంతి, శ్రావ్యమైన సంగీతం, గొప్ప గోపురాలు, విగ్రహాలు, ఆస్పత్రుల నర్సుల వలే ఎప్పుడూ సేవ చేస్తో తిరిగే పూజార్లు. అట్లా ఆ ప్రదేశానికి అతుక్కుని పోతారు. ఇవాలో రేపో కుర్తాళం వెడుతున్నాం, అక్కణ్ణించి ఇంకా దక్షిణానికి, బహుశా కన్యాకుమారి దాకా. తోవలో రామనాథ్ చూస్తాం, రాముడితో నిండిన ఇంకో ప్రదేశం.
       
తిరువనంతపురం, పబ్లిక్ గార్డెన్    
9-6-1034


ఈ తోట అద్భుతమైన అందాలు ఒలికే ప్రదేశం. ఈ పరగణానికి ఎండాకాలం అనేది లేదు. కన్యాకుమారి దివ్యమైన లావణ్యాన్ని చూడగలిగాను. ఆకారంలో, రంగులలో ఇంత అందమిచ్చే స్థలాన్ని వొదిలి వెళ్లవలసి రావడం హృదయాన్ని చీల్చేస్తుంది. ఈ సముద్రాన్ని, అడవుల్ని, కొండల్ని వొదిలి బెజవాడలో సిరా మచ్చల బల్లముందు కూచోవడం తప్పదనుకుంటే బతుకు మీద రోత కలుగుతుంది. ఈ సౌందర్యాన్ని చూసి, జీవితమంతా ఈ జ్ఞాపకంతో బాధపడే గతిని తప్పించుకున్న మిమ్మల్ని తలచుకొని ఈర్ష్యపడతాను. బీదరికంలోనూ, ఈ దేశపు స్త్రీల ముఖం మీద తృప్తిలో మునిగిన మాధుర్యం కనబడుతుంది. మీరు ఉంటే ఎంత బావుండేది! కన్యాకుమారి ఇంద్రజాలమల్లే ఉంది.
 - చింతా దీక్షితులుకు చలంగారి ఉత్తరాల నుంచి.
 

మరిన్ని వార్తలు