ఉద్యోగం మానేస్తే!

13 May, 2014 23:43 IST|Sakshi
ఉద్యోగం మానేస్తే!

వేదిక

 పెళ్లికి ముందు నేను ఉద్యోగం చేయడానికి నా అత్తమామలు, భర్త...అందరూ ఒప్పుకున్నారు. పెళ్లయిన తర్వాత కొన్నాళ్ల వరకూ ఏమీ అనలేదు. పాప పుట్టినపుడు ఓ ఏడాది విరామం తర్వాత మళ్లీ ఉద్యోగంలో చేరాను. ఇప్పుడు మా అత్తగారు ఉద్యోగం చేయొద్దంటున్నారు.  నా భర్త కూడా అదే మాట చెబుతున్నారు. ఉద్యోగం మానేయడం పెద్ద పని కాదు. కానీ, తర్వాత నా భవిష్యత్తు తలుచుకుంటుంటేనే భయంగా ఉంది. ఆయన చాలా ఖర్చు మనిషి. చేతిలో ఎంత డబ్బు ఉన్నా ఆగదు.

ఉద్యోగంపై పెద్దగా శ్రద్ధ ఉండదు. నా పెళ్లయిన తర్వాత ఐదారు ఉద్యోగాలు మారారు. దీనికి తోడు మద్యానికి బానిస. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడే నా చేతిలో చిల్లిగవ్వ ఉండనిచ్చేవారు కాదు. అలాంటిది ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంటే చిన్న చిన్న ఖర్చులకి డబ్బులు నేను ఎవరిని అడగాలి. ఈ విషయం గురించి మా అత్తగారితో మాట్లాడితే ‘నువ్వు ఉద్యోగం మానేస్తే వాడే దారిలోకి వస్తాడు’ అంటారు.

 నిజానికి ఆమె నన్ను ఉద్యోగం మాన్పించడం వెనకున్న కారణం... మా పాపని పగలంతా చూడడం ఆమెకు ఇష్టం లేదు. ‘ఎంచక్కా పదయ్యేసరికి ఆఫీసుకెళిపోతుంది. సాయంత్రం ఆరైతేగాని ఇంటికి రాదు. ఈలోగా ఈ పిల్లతో నానాపాట్లు పడుతున్నాను. హాయిగా విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో నాకు ఈ తిప్పలు ఏమిటో అర్థం కావడం లేదు’ అని చాన్నాళ్ల నుంచి మా అత్తగారు మా పక్కింటామెతో అంటున్నారట. ఇక మావారి సమస్య ఏమిటంటే...మద్యం తీసుకోవద్దని, జీతాన్ని ఆదా చేయమని నేను మాటిమాటికీ చెప్పడం ఆయనకి నచ్చడం లేదు. ఈ విషయంపై మేమిద్దం ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటాం.

‘నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు’ అంటారు.  ‘మరి నా జీతం మొత్తం మీరు తీసుకుంటున్నప్పుడు మీ జీతం ఏం చేస్తున్నారో నేను తెలుసుకోకూడదా’ నేను ప్రశ్నించేదాన్ని. ఎన్ని రకాలుగా అడిగినా ఆయన సమాధానం ‘నీకు అనవసరం’ అనే. పాప భవిష్యత్తు గురించి అస్సలు ఆలోచించరు. ఇక ఇప్పుడు నేను ఉద్యోగం మానేస్తే ఆయనకు నాపోరు తప్పుతుంది. మా అత్తగారికి చాకిరి తప్పుతుంది. నా భవిష్యత్తు మాత్రం అంధకారం అవుతుందనడంలో సందేహం లేదు. మా అమ్మానాన్నలు నా తరపున మాట్లాడుతుంటే వాళ్లని నానా మాటలు అని నోళ్లు మూయిస్తున్న మా అత్తింటివారి వేధింపుల నుండి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు. అలాగని కాపురం పాడుచేసుకోలేను.

 - శ్రావ్య, పఠాన్‌చెరువు, హైదరాబాద్.

>
మరిన్ని వార్తలు