జీవితం కూడా ఒక ధ్యానమే

20 Feb, 2018 00:12 IST|Sakshi

చెట్టు నీడ

‘నా సాధన అద్భుతంగా సాగుతోంది.  ఆలోచనల మీద నియంత్రణ దొరికింది.  ఇప్పుడు ఎంతసేపు కూర్చున్నా వెన్నులో  నొప్పేమీ రావడం లేదు. నా మనసు  తాజాగా ఉంటోంది. కొత్త ఆనందం  ఏదో తెలుస్తోంది...’

ఒక యువకుడు కొత్తగా ధ్యానం నేర్చుకోవడానికి ఒక గురువు దగ్గరికి వచ్చాడు. కొన్ని రోజుల సాధన తర్వాత ఒకరోజు గురువు దగ్గరికి వెళ్లి తన గోడును వెళ్లబోసుకున్నాడు. ‘ఆచార్యా! నాకు ఏమాత్రం ఏకాగ్రత కుదరడం లేదు. ఏవేవో ఆలోచనలు నన్ను చికాకు పరుస్తున్నాయి. అదేపనిగా కూర్చుంటే వెన్నులో నొప్పి వస్తోంది. ఒక్కోసారి కూర్చునే నిద్రలోకి జారుకుంటున్నాను...’దానికి ఎక్కువగా స్పందించకుండా, ‘అదే పోతుంది’ అన్నాడు గురువు.మళ్లీ కొన్నాళ్లు గడిచాయి.ఒకరోజు మళ్లీ గురువు దగ్గరికి వెళ్లి శిష్యుడు తన ఆనందాన్ని ఇలా ప్రకటించాడు.

‘నా సాధన అద్భుతంగా సాగుతోంది. ఆలోచనల మీద నియంత్రణ దొరికింది. ఇప్పుడు ఎంతసేపు కూర్చున్నా వెన్నులో నొప్పేమీ రావడం లేదు. నా మనసు తాజాగా ఉంటోంది. కొత్త ఆనందం ఏదో తెలుస్తోంది...’దానికి కూడా గురువు ఎక్కువగా స్పందించకుండా, ‘అదీ పోతుంది’ అన్నాడు గురువు. గురువు ఆంతర్యం గ్రహించడానికి శిష్యుడు కొంత సాధన చేయాల్సివచ్చింది. అతిగా స్పందించడం అనేది సాధకుడి లక్షణం కాకూడదని గ్రహించాడు. అది ఒక్క ధ్యానానికే కాదు, జీవితంలో దేనికైనా వర్తిస్తుందని కూడా గ్రహించాడు. అవును, జీవితం కూడా ఒక ధ్యానమే! 

మరిన్ని వార్తలు