దైవారాధన విధానం తెలిపినదేవదూత జిబ్రీల్

10 Jul, 2016 00:51 IST|Sakshi
దైవారాధన విధానం తెలిపినదేవదూత జిబ్రీల్

ప్రవక్త జీవితం
తిరస్కారుల వ్యంగ్యవ్యాఖ్యలకు సమాధానమా అన్నట్లు, దైవదూత జిబ్రీల్ (అ) దైవవాణి తీసుకొని రానే వచ్చారు. వెలుగులు విరజిమ్మే పగలు సాక్షిగా ! ప్రశాంతంగా అవతరించే రాత్రి సాక్షిగా! (ఓ ప్రవక్తా ! ) నీ ప్రభువు నిన్ను ఏమాత్రం విడిచి పెట్టలేదు. నీపట్ల ఆయన అసంతృప్తి కూడా చెందలేదు. నిశ్చయంగా రాబోయేకాలం నీ కొరకు గత కాలం కన్నా మేలైనదిగా ఉంటుంది. త్వరలోనే నీకు నీ ప్రభువు నువ్వుసంతోష పడే అంత అధికంగా ప్రసాదిస్తాడు. నువ్వు అనాథగా ఉండడం చూసి ఆయన నీకు ఆశ్రయం కల్పించలేదా? నువ్వుమార్గమేదో తెలియని వాడిగా ఉన్నప్పుడు ఆయన నీకు సన్మార్గం చూపించాడు. నువ్వు నిరుపేదగా ఉన్నప్పుడు ఆయన నిన్ను ధనవంతుణ్ణి చేశాడు. కనుక నువ్వు అనాథల పట్ల కఠినంగా వ్యవహరించకు. యాచకుణ్ణి కసురుకోకు. నీప్రభువు వరాలను బహిర్గతం చెయ్యి. (అజ్ జుహా .1-11) అవును, దైవం ఆయన్ని విడిచి పెట్టలేదు. ఆయనపట్ల అసంతృప్తీ చెందలేదు. పైగా ఆయన్ని అమితంగా ప్రేమించాడు. తన కారుణ్య ఛాయతో ఆయన్ని కప్పేశాడు. తన అనుగ్రహాలను ఆయనపై కురిపించాడు.

 దైవవాణి క్రమం తప్పకుండా అవతరిస్తూనే ఉంది. దైవాదేశాలను తీసుకొని జిబ్రీల్ (అ)ఆయన వద్దకు వస్తున్నారు. ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్నవిషయాలను బోధపరుస్తున్నారు. దైవప్రార్ధనకు ముందు వజూ (ముఖం, కాళ్ళూచేతులు నియమబద్ధంగా కడగడం) ఎలా చేయాలి, నమాజ్ ఎలా ఆచరించాలి? అన్నవిషయాలనూ ఆయనే నేర్పారు. ఒకరోజు ముహమ్మద్ (స) మక్కా శివార్లలో దైవదూతకోసం నిరీక్షిస్తూ పచార్లు చేస్తున్నారు. భవిష్యత్ కార్యక్రమాలను గురించి ఆయన మనసులో రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా దైవ ప్రార్ధన విషయంలో మార్గదర్శకం కోసం ఆయన మనసు తహతహలాడుతోంది. సరిగ్గా అప్పుడు జిబ్రీల్ ఆయన వద్దకు వచ్చారు. నమాజ్ ఆచరించడానికి ముందు ఇలా వజూ చేయాలి, అంటే పరిశుభ్రతను ఇలా పొందాలి. అని ఆయనకు చెప్పారు. చెప్పడం మాత్రమేకాదు, స్వయంగా జిబ్రీల్ (అ) వజూ చేసి చూపించారు. ముహమ్మద్ (స)కూడా ఆయన చేసినట్లుగానే వజూ చేశారు. తరువాత జిబ్రీల్ (అ) నిలబడి నమాజు చేసి చూపించారు. ముహమ్మద్ (స) కూడా అలాగే నమాజ్ ఆచరించారు. తరువాత జిబ్రీల్ వెళ్ళిపోయారు.

 ముహమ్మద్ (స) ఇంటికి వచ్చి, శ్రీమతికి అంతా వివరించారు. జిబ్రీల్ దూత నేర్పినవిధంగా నమాజ్ చేయడానికి, పరిశుభ్రతను పొందే విధానం ఇదీ అని శ్రీమతికి చెబుతూ, ఆమె ముందు వజూచేశారు. వెంటనే బీబీ ఖదీజా కూడా ఆయన చేసినట్లుగానే వజూ చేశారు. తరువాత ఆయన నమాజు కోసం ఉపక్రమించారు. బీబీ ఖదీజ కూడా ఆయన అనుసరణలో నమాజ్ ఆచరించారు. ముహమ్మద్ (స) సంరక్షణలో, వారిఇంట్లోనే ఉన్న పదేళ్ళ అలీకి ఈ నమాజ్ ఆచరణ కొత్తగా, వింతగా అనిపించింది. సంభ్రమాశ్చర్యాలకు లోైనెు తిలకించసాగాడా బాలుడు. మునుపెన్నడూ ఎక్కడా చూడని ప్రార్ధనా విధానం, శ్రవణానందమైన పారాయణ మధురిమ ఆతన్ని మంత్రముగ్ధుణ్ణి చేసింది. ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది.

 - ముహమ్మద్  ఉస్మాన్‌ఖాన్  (మిగతా వచ్చేవారం)

మరిన్ని వార్తలు