మృత్యుఖేల

24 May, 2020 23:42 IST|Sakshi
యుకియో మిషిమా

కొత్త బంగారం

దాదాపు పాతిక నవలలు రాసిన జపాన్‌ రచయిత యుకియో మిషిమా కేవలం రచయితే కాకుండా– కవి, నాటకరచయిత, నటుడు, మోడల్, దర్శకుడు కూడా. సాహిత్యంలో నోబెల్‌ ప్రైజ్‌కి ఇతని పేరు పలుమార్లు పరిశీలించబడింది కానీ కొద్దిలో తప్పిపోయింది. వీటన్నిటికీ తోడుగా, తన దేశంపట్ల అభిమానంతో ఒక దళాన్ని ఏర్పాటుచేసి పోరాటం సల్పినవాడు కూడా. దురదృష్ణవశాత్తూ, ఆ పోరాటప్రయత్నాలు విఫలమై నలభై అయిదేళ్ల వయసులో (1970) ఆత్మహత్య చేసుకున్నాడు. 1968లో జాపనీస్‌ ప్లేబాయ్‌ పత్రికలో సీరియల్‌గా ప్రచురించబడిన ఈ ‘లైఫ్‌ ఫర్‌ సేల్‌’ నవలకి ఇంగ్లీష్‌ అనువాదం 2019లో జరిగింది. సాహిత్యతనీ, కాలక్షేపపుతనాన్నీ సమపాళ్లలో కలగలుపుకొని ఏ వర్గానికీ పూర్తిగా చెందని ఒక తమాషా డార్క్‌ కామెడీ రచన ఇది. ఇంకా చెప్పాలంటే – ఉన్నతమైన విలువలతో సాగే రచన సాదాసీదా విషయాలవైపు చూపు సారించే ‘బాతోస్‌’ తరహా ప్రక్రియకి మంచి ఉదాహరణ ఈ నవల. 

ఒక అడ్వర్‌టైజింగ్‌ సంస్థలో కాపీరైటర్‌గా పనిచేస్తుండే హానియో యువకుడు, బ్రహ్మచారి, తెలివితేటలున్నవాడు, సంపాదనాపరుడు. చూసినవారికి అసూయ పుట్టించగల హాయైన జీవితం. ఓ రోజు హోటల్లో కూచుని హానియో పేపర్‌ని చూస్తున్నప్పుడు ఆ పేపర్‌మీద ఒక బొద్దింక కనబడటమూ, ఆ తర్వాత పేపర్‌లోని అక్షరాలన్నీ అసంఖ్యాకమైన బొద్దింకల్లాగా మారిపోయినట్టు అనిపించడమూ అతని అంతరంగంలో అస్పష్టమైన అలజడి సృష్టిస్తుంది. జీవితం నిరర్థకంగానూ అర్థరహితంగానూ అనిపించడమే కాకుండా, నిరాసక్తంగా గడుస్తున్న రోజులు ‘‘చచ్చి వెల్లికిలా పడివున్న కప్పల తెల్లటి పొట్టల వరుసలాగాం’’ అనిపించి అతనిలో ఎగ్జిస్టెన్షియల్‌ ఘర్షణ మొదలవుతుంది. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న హానియో, తన మొదటిప్రయత్నంలో విఫలమవుతాడు. ఇలా చావడం కంటే, ఈ పనిని వేరేవాళ్లకి అప్పగించడం సులువని భావించి ఒక ప్రకటన ఇస్తాడు: ‘‘అమ్మకానికి జీవితం. మీకు కావలసినట్టుగా నన్ను ఉపయోగించుకోగలరు. నాకు ఇరవై యేడేళ్లు. విషయాలు రహస్యంగా ఉంచబడును. ఇబ్బందులేవీ ఉండవు.’’ 

అక్కడి నుంచి మరణప్రయాణం ఆరంభమౌతుంది. మొదటి క్లైంట్‌తో బేరం కుదుర్చుకున్నాక, క్లైంట్‌కి కావలసినది జరుగుతుంది కానీ, హానియో ఎలాంటి ప్రమాదమూ లేకుండా బయటపడతాడు. ఆ తర్వాత, అరుదైన పుస్తకం విషయమై ఒక లైబ్రేరియన్‌ కేసు. తర్వాత వచ్చిన ఒక వాంపైర్‌ కేసులో కుటుంబబంధం అన్నది అనుభవంలోకి వస్తుంది కానీ, హానియోకి మరణాన్ని చవిచూసినంత పనవుతుంది; చివరికి హాస్పిటల్లో మళ్లీ కోలుకుంటాడు. కోలుకున్నాక మళ్లీ అదే ప్రయాణం. విదేశీ గూఢచారులూ, రహస్య సందేశాలూ, విషపూరితమైన క్యారట్‌ ముక్కలూ వగైరా వ్యవహారాలతో కథ పరుగులు పెడుతుంది. రీకో అనే డ్రగ్‌ అడిక్ట్‌తో జీవితం ఇక స్థిరబడబోతోందనుకున్నప్పుడు, తన మరణాన్ని ఆమె శాసించబోతున్నదన్న విషయాన్ని గ్రహిస్తాడు హానియో.  మరణం గురించి తన అభిప్రాయాలన్నీ పునస్సమీక్షించుకోవలసిన అవసరం కలుగుతుంది. పాత్ర ప్రయాణంలో ఇది కీలకమైన ఘట్టం.

చిన్నచిన్న ఎపిసోడ్స్‌గా కథ సాగుతోందని అనిపించినప్పటికీ, వీటన్నిటి వెనక ఒక గ్రాండ్‌ డిజైన్‌ ఉండటం అనేది ఆసక్తికరమైన విషయం కాగా, ఈ ప్రయత్నాలన్నీ అయ్యాక హానియో తను అనుకున్నది సాధించగలుగుతాడా అన్నది అసలు విషయం. జీవితాన్ని ముగించుకోవాలన్నంత ప్రబలమైన కోరిక హానియోకి ఎందుకు కలిగిందన్నది నవలలో బలంగా చెప్పకుండా, పాఠకుల ఊహాశక్తికే రచయిత దాన్ని చాలా మేరకు వదిలేశాడు. 

సమురాయ్‌లు పాల్పడే సాంప్రదాయిక ‘సెప్పుకు’ (ఆత్మాహుతి)ని ఈ నవలా రచయిత తన స్వంత జీవితంలో నిర్వహించిన తీరుని గురించి చదివితే భయంకరంగా ఉంటుంది. మరణం వస్తువుగా సాగే ఈ నవల రచయిత మరణానికి రెండేళ్ల ముందే రావడం బహుశా యాదృచ్ఛికం కాకపోవచ్చు. రచయిత అంతశ్చేతనకి సంబంధించిన కనిపించని మాయాజాలం కావచ్చు. హాస్యమూ, అపహాస్యమూ; వాస్తవికతా, అధివాస్తవికతా; తత్త్వచింతనా, మనస్తత్వ పరిశీలనా విడదీసి చూపటానికి వీలులేనట్టు ఉండే ఈ రెండువందల పేజీల నవల ఏకబిగిన చదివించగలదంటే, అందులో అనువాదకుడు స్టీవెన్‌ డాడ్‌ పాత్ర కూడా చాలా ఉంది! - ఎ.వి. రమణమూర్తి

నవల: లైఫ్‌ ఫర్‌ సేల్‌
రచన: యుకియో మిషిమా
జాపనీస్‌ నుంచి ఇంగ్లిష్‌ అనువాదం: స్టీవెన్‌ డాడ్‌
మూలం ప్రచురణ: 1968
అనువాద ప్రచురణ: 2019 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా