ఆరోగ్యానికి బొట్టు బిళ్ల

15 Apr, 2015 08:46 IST|Sakshi
ఆరోగ్యానికి బొట్టు బిళ్ల

నుదుటన దిద్దుకునే బొట్టు సింగారానికి మాత్రమే కాదు, ఇక పై ఎంతోమంది స్త్రీలకు ఆరోగ్యాన్ని, జీవితాన్ని ప్రసాదించబోతోంది. రోజు రోజుకి దేశంలో పెరుగుతున్న అయోడిన్ లోపం వలన స్త్రీలు, వారికి పుట్టబోయే పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలకు లోనవుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు గాను సింగపూర్‌కు చెందిన గ్రే గ్రూప్, నాసిక్‌లోని నీల్‌వసంత్ మెడికల్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్  కలిసి ఈ బిందీ రూపకల్పన చేశారు. దాదాపు ఏడు కోట్లమందికి పైగా భారతీయులు అయోడిన్ లోపంతో బాధ పడుతున్నట్లు జాతీయ స్థాయి లెక్కలు చెబుతున్నాయి.

ముఖ్యంగా స్త్రీలలో అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్,  బ్రెస్ట్ క్యాన్సర్, ఫైబ్రాయిడ్స్‌కి దారితీసే అవకాశం ఉండగా, పుట్టబోయే పిల్లలు మానసిక ఎదుగుదల సక్రమంగా జరుగకపోవచ్చని వైద్యులు అంటున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో అయోడిన్ లోపంతో బాధపడుతున్న గ్రామీణ మహిళల కోసం ‘లైఫ్ సేవింగ్ డాట్’ పేరుతో  సింగపూర్‌కి చెందిన గ్రే గ్రూప్ పైన పేర్కొన్న బిందీని రూపొందించింది. అయోడిన్ లోపాన్ని అధిగమించడానికి పోషకాహార ఔషధాలను కొనుగోలు చేయలేని గ్రామీణ స్త్రీలకు ఈ బిందీలు  ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించనున్నాయి.

అయోడిన్ మందులకు అయ్యే ఖర్చు భరించలేని మహిళలకు ఈ బిందీలను త్వరలోనే దేశవ్యాప్తంగా అందచేస్తారు. 100-150 మైక్రో గ్రాముల అయోడిన్‌తో తయారు చేసిన ఈ బిందీ ప్యాచ్‌లను రోజులో 8 గంటలు పెట్టుకుంటే చాలు, ఒక రోజుకు కావలసిన అయోడిన్‌ను స్త్రీలు పొందగలుగుతారు. ఇటీవలే ప్రయోగాత్మకంగా మహారాష్ట్రలోని మూడు ఆదివాసీ ప్రాంతాలలో ఈ బిందీలను ఆరోగ్య శిబిరాల ద్వారా సప్లై చేశారు.
 - ఓ మధు

మరిన్ని వార్తలు