అందుకున్న కల

7 Feb, 2020 00:51 IST|Sakshi
కండక్టరుగా

పెళ్లి, పిల్లలు కుటుంబ బాధ్యతల్లోనే మహిళ జీవనం గడిచిపోతుంది. ఉద్యోగినిగా మారితే అదనపు బాధ్యత వచ్చి చేరుతుంది. ఆ బాధ్యతలు, విధుల్లో తలమునకలుగా ఉండటంతో చిన్ననాటి కలలు ఎక్కడో మరుగున పడిపోతాయి. అయితే, స్వరాజ్వలక్ష్మి తన కలల్ని విడిచిపెట్టేయలేదు. గృహిణిగా, కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూనే పరుగుల రాణిగా తన కలను తనే అందుకున్నారు.

బైరి స్వరాజ్యలక్ష్మి ఉండేది సికింద్రాబాద్‌కు చేరువలో ఉన్న మచ్చబొల్లారంలో. వయసు నాలుగు పదులు దాటింది. భర్త ధన్‌రాజ్‌ ప్రైవేటు ఉద్యోగి. ఒక్కగానొక్క కొడుకు. చిన్న కుటుంబం. చింతల్లేవు. ‘‘నాన్న రైల్వేలో ఉద్యోగి కావడంతో నేనూ రైల్వే కాలేజీలో చదువుకున్నాను. స్కూల్, ఇంటర్మీడియెట్‌ స్థాయిలో రన్నింగ్‌ కాంపిటిషన్‌లో పాల్గొనేదాన్ని. ఎప్పుడూ ఫస్ట్‌ వచ్చేదాన్ని. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పీటీ ఉషలా పేరుతెచ్చుకోవాలని కలలు కనేదాన్ని. అయితే ఇంటర్మీడియెట్‌ పూర్తికాగానే అక్కడితో చదువు ఆపేయమన్నారు అమ్మానాన్న’’ అని చెప్పారు స్వరాజ్యలక్ష్మి. చదువుతో పాటే రన్నింగ్‌ రేస్‌లలో పాల్గొనడమూ ఆగిపోయింది. ముగ్గురు అక్కచెల్లెళ్లు. వాళ్ల పెళ్లిళ్లు చేసి బాధ్యతలు తీర్చుకున్నారు స్వరాజ్యలక్ష్మి తల్లిదండ్రులు.

గ్రౌండ్‌లలో రౌండ్లు
‘‘మా వారిది ప్రైవేటు ఉద్యోగం కావడంతో, చదువుకున్నది కొంత వరకే అయినా ఖాళీగా ఉండటం ఇష్టంలేకపోవడంతో ఉద్యోగం చేస్తానని చెప్పాను. తన ప్రోత్సాహంతో ఇరవై ఏళ్ల క్రితం ఆర్టీసీలో కండక్టర్‌ చేరాను. గృహిణిగా ఇంటి బాధ్యతలు, ఉద్యోగినిగా కండక్టర్‌ విధులు, తల్లిగా పిల్లాడి పనులు.. రోజులు గడిచిపోతున్నాయి. ఆ సమయంలో.. ఎనిమిదేళ్ల క్రితం.. ఆర్టీసీ తరపున స్పోర్ట్స్‌ పర్సన్స్‌ ఎవరైనా దేశ, అంతర్జాతీయ స్థాయిల్లో జరిగే పోటీల్లో పాల్గొనవచ్చని తెలిసింది. చదువుతో ఆగిపోయిన నా కలలకు కొత్త రెక్కలు వచ్చి చేరినట్టు అనిపించింది. రన్నింగ్‌.. అనే మరుగున పyì పోయిన జ్ఞాపకం తిరిగి నా కళ్లెదుటికి వచ్చింది. ఇంట్లో ఈ విషయం చెప్పడంతోనే సపోర్ట్‌ కూడా వచ్చింది.

ఆ రోజు నుంచి నా టైమ్‌ టేబులే మారిపోయింది. ఉదయం 5 గంటలకల్లా డ్యూటీకి వెళతాను. మధ్యాహ్నం 2:30 కల్లా ఇంటికి వచ్చేస్తాను. ఓ అరగంట విశ్రాంతి. తర్వాత స్కూల్‌ నుంచి వచ్చిన బాబుకు టిఫిన్‌ పెట్టి, కాసేపు హోమ్‌ వర్క్‌ చేయించి, తిరిగి 5 గంటలకు బొల్లారంలోని పబ్లిక్‌ గ్రౌండ్‌కు వెళతాను. వారంలో ఒక్కరోజైనా ఉస్మానియా యూనివర్శిటీ గ్రౌండ్, ఇందిరా గార్డెన్‌లోనూ ప్రాక్టీస్‌కి వెళతాను. అలా ప్రాక్టీస్‌ చేస్తూనే.. రెండేళ్ల క్రితం ఇండోనేషియాలో జరిగిన రన్నింగ్‌ కాంపిటేషన్‌లో పాల్గొని బంగారు పతకంతో తిరిగి వచ్చాను. దేశీయస్థాయిలో ఢిల్లీ, రాజస్థాన్, చండీగడ్‌లలోనూ రన్నింగ్‌ పోటీల్లో పాల్గొన్నాను. 2018లో ఇండోనేషియా జకార్తాలో జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్‌ పోటీల్లో బంగారు పతకాలు, 3 కిలోమీటర్ల నడక పందెంలో కాంస్య పతకం, గతేడాది గచ్చిబౌలిలో జరిగిన రాష్ట్రస్థాయి పరుగు పోటీల్లో 100, 400, 800 మీటర్ల విభాగంలో బంగారు పతకాలు సాధించాను.

పతకాల విజేతగా

నమ్మలేకపోతుంటారు
‘‘ఈ నెలలో దేశీయ స్థాయిలో హర్యానాలో పోటీలు జరుగుతున్నాయి. 8 నుంచి 11 వరకు అక్కడ జరిగే నేషనల్‌ కాంపిటిషన్స్‌కు వెళుతున్నాను. ప్రయాణ ఖర్చుల వరకు నేను పెట్టుకొని వెళతాను. మిగతా వసతి సదుపాయాలు నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు. నా సహోద్యోగులు ‘మేం చేయలేనిది నువ్వు చేస్తున్నావ్, గ్రేట్‌’ అంటుంటారు. ‘ఈ వయసులో మాకు కాళ్ల నొప్పులు. మరి నువ్వెలా పరిగెడుతున్నావు?’ అని కొందరు అంటుంటారు. చదువుకునే రోజుల్లో ఆటలు వద్దని చెప్పిన అమ్మనాన్న, బంధువులే కాదు నాతో పాటు పెరిగిన నా చెలెళ్లు్ల కూడా ఇప్పుడు నా గురించి గొప్పగా చెప్పుకుంటుంటారు...’’  అని నవ్వుతూ అన్నారు స్వరాజ్యలక్ష్మి. అమ్మాయిలు తమ కలగన్న జీవితాన్ని అందుకోవడానికి చాలా అడ్డంకులే ఏర్పడుతుంటాయి. వాటిని అధిగమిస్తూ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగాలనుకునేవారికి స్వరాజ్యలక్ష్మి పట్టుదల ఒక స్ఫూర్తి. – నిర్మలారెడ్డి

మరిన్ని వార్తలు