కత్తిలా బతికి వెళ్లిపోయారు...

19 Feb, 2020 04:36 IST|Sakshi
(నిలబడినవారు..ఎడమ నుంచి వరుసగా) ప్రతాప్, కేశవరావు, సుశీల, రాజా, సత్యం (కాంతారావు పిల్లలు); (కూర్చున్నవారు) కాంతారావు, హైమవతి (సతీమణి)

ఎన్‌.టి.ఆర్, ఏ.ఎన్‌.ఆర్‌లు తెలుగు సినిమాకు రెండు కళ్లు. కాని కాంతారావు ఆ మెడలో మెరిసే చంద్రహారం. కత్తి వీరుడు కాంతారావుగా జానపద చిత్రాలు చేసి సగటు ప్రేక్షకుడికి ఆయన చేరువయ్యారు. సాంఘిక చిత్రాలలో బలమైన పాత్రలు చేసి పెద్ద హీరోలను ఢీకొట్టారు. నటుడిగా ఎంత బిజీగా ఉన్నా ఇంటిని, ఇల్లాలి చేతి వంటని, పిల్లల బాల్యాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. ఆయన కనుమరుగై దాదాపు దశాబ్దం పైగానే గడిచింది. అయితేనేం చెన్నైలో ఉండే పెద్ద కుమారుడు ప్రతాప్, హైదరాబాద్‌ లో ఉండే నాలుగో కుమారుడు రాజా తండ్రి జ్ఞాపకాల పరిమళాలను ఎంతో సంతోషంగా సాక్షితో పంచుకున్నారు.

రాజా: నాన్నగారికి మేం నలుగురు మగ పిల్లలం, ఒక ఆడపిల్ల. ప్రతాప్‌ పెద్దన్నయ్య, రెండో అన్నయ్య కేశవరావు, ఆ తరవాత అక్క సుశీల, నేను, నా తరవాత తమ్ముడు సత్యం. నాకు నాలుVó ళ్లు వచ్చేవరకు మాటలు రాలేదు. కుర్తాళంలో ఉన్న జలపాతం నీటికి ఔషధ గుణాలు, మహిమలు ఉన్నాయని తెలిసినవారు చెప్పటంతో నన్ను అక్కడకు తీసుకువెళ్లారు. జలపాతం నీళ్లు నా మీద పడేలా తన భుజాల మీద ఎక్కించుకున్నారు. నీటి మహిమో, యాదృచ్ఛి కమో గానీ, వారు చెప్పినట్టుగానే నాకు మాటలు రావడంతో నాన్నగారి ఆనందానికి అవధులు లేవు. ఆ సంఘటన తరచుగా చెబుతుండేవారు. నాకు చిన్నప్పటి నుంచి ఆయనతో అనుబంధం పెనవేసుకుంది. ఆయనతో మాకు ఎన్నో తీపి అనుభవాలు ఉన్నాయి. పుట్టినరోజులు బాగా జరిపేవారు. పార్టీలకు, ఫ్రెండ్స్‌ ఇళ్లకు వెళ్లటంలాంటి అలవాట్లు ఆయనకు లేవు. అవకాశం వచ్చినప్పుడల్లా మాతో క్యారమ్స్, షటిల్‌ ఆడేవారు. వినాయకచవితికి మాతో పూజ చేయించేవారు. నాన్న ఊరు వెళ్తుంటే ఏడ్చేవాళ్లం. అప్పుడప్పుడు ఔట్‌డోర్‌ షూటింగ్‌కి తీసుకువెళ్లేవారు.

మేం షూటింగ్‌ చూసిన మొట్టమొదటి సినిమా సతీ సులోచన.  కోదాడ వెళ్లినప్పుడు అక్కడి పొలాలకు తీసుకువెళ్లేవారు. అక్కడ మమ్మల్ని చూసి ‘కాంతారావుగారి అబ్బాయి’ అని అందరూ అంటుంటే మాకు భలే సరదాగా ఉండేది. నాన్నగారు చెన్నై నుంచి హైదరాబాద్‌ వచ్చేశాక ఆయన బ్యాంకు పనులు చూడటం అలవాటు చేసుకున్నాను. హైదరాబాద్‌ వచ్చాక ఒకసారి నన్ను షూటింగ్‌కి తీసుకువెళ్లారు. వాళ్లు నన్ను ప్రొడక్షన్‌ బాయ్‌ అనుకుని, నేను అన్నం దగ్గర కూర్చున్న చోట నుంచి లేపి, మరోచోట కూర్చోమన్నారు. నాన్నగారు కోపంగా, ‘నాకు కూడా అక్కడే అన్నం పెట్టండి’ అన్నారు. ఏం జరుగుతోందో వాళ్లకు అర్థం కాలేదు. ‘వాడు మా అబ్బాయి, మీ పని నాకు అవమానంగా ఉంది’ అన్నారు. మద్రాసులో వారికి నేనెవరో తెలుసు. కాని హైదరాబాద్‌లో ఎవ్వరికీ తెలియకపోవటం వల్ల ఈ సంఘటన జరిగింది. మేం పెద్దగా చదువుకోకపోయినా, నాన్న ప్రేమను పరిపూర్ణంగా అందుకున్నాం. ‘సుడిగుండాలు’ చిత్రానికిగాను 1968లో అవార్డు అందుకున్నాను.

అవార్డు వచ్చినందుకు సంతోషపడ్డారు కానీ, అటువంటి పాత్రలు ఎన్నడూ వేయద్దు, నా కొడుకు నా కళ్ల ముందరే ఉండాలి’ అంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఆ చిత్రంలో నేను వేసిన  పాత్రలో చనిపోతాను. సినిమా రంగానికి దూరంగా ఉండమని చెప్పేవారు. హేమ ఫిలిమ్స్‌ పేరున మేం తీసిన ‘సప్తస్వరాలు’ చిత్రం ఫ్లాప్‌ కావటంతో, నాన్నగారికి గుండెపోటు వచ్చింది. ‘మీ ప్రేమే నన్ను కాపాడుతుంది. అమ్మని బాగా చూసుకో రాజా’ అన్నారు. 1971 దాకా హీరోగా చేశారు. ‘గుండెలు తీసిన మొనగాడు’ నాన్న హీరోగా చేసిన ఆఖరి సినిమా. ‘నేరము – శిక్ష’ నుంచి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారారు. నవంబరు 16వ తేదీన నాన్నగారి పుట్టినరోజు. ఆ రోజు నాన్నగారు ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పటికే నాన్న క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతు న్నారు. అక్కడ కొద్దిసేపు ఉండి, ఇంటికి బయలుదేరుతూ, అందరి ఎదుట, ‘నాన్నా రాజా! ఇంక నాకు ఈ కర్ర అవసరం లేదు. నువ్వే నా కుడిభుజం. అమ్మని జాగ్రత్తగా చూసుకో’ అని చెప్పారు. చివరికి అదే నిజం చేస్తూ ఏడాదికల్లా నాన్న కన్ను మూశారు.

ప్రతాప్‌: నాన్నగారి స్వస్థలం తెలంగాణలోని కోదాడ. రజాకార్‌ మూవ్‌మెంట్‌ టైమ్‌లో అక్కడనుంచి చెన్నై మకాం మార్చేశారు. నాన్నగారిది ప్రేమ వివాహం. అమ్మది జగ్గయ్యపేట. అమ్మ మీద నాన్నకు విపరీతమైన అభిమానం. అమ్మ చేతి కాఫీతోనే నాన్న నిద్ర నుంచి లేచేవారు. ఇంటి వ్యవహారమంతా అమ్మే చూసుకునేది. అమ్మ సింపుల్‌గా ఉండటమే కాదు, మమ్మల్ని కూడా అలాగే పెంచింది. ఇంట్లో రెండు కార్లు ఉన్నా రిక్షాలోనే వెళ్లేది. మేం కూడా సైకిల్‌ లేదా బస్సుల్లో ప్రయాణించేవాళ్లం. నాన్న చాలా బిజీగా ఉండేవారు. ఒకసారి షూటింగ్‌కి వెళ్లిపోతే వారం పదిరోజుల దాకా ఆయనను చూడటానికి కుదిరేది కాదు. ప్రతి రోజూ మూడు షిఫ్టులు పనిచేసేవారు. సంవత్సరానికి పన్నెండు సినిమాలు చేయాలనుకునేవారు.

1960 – 1971 మధ్యకాలంలో ఆయన ఎంత బిజీగా ఉన్నారంటే ఆయన కాల్షీట్లు చూడటానికి ఇద్దరు సెక్రటరీలను పెట్టుకునేంత! రోజుకి మూడు గంటలు మాత్రమే నిద్రపోయేవారు. మా చిన్నతనంలో తిరుపతి వెళ్లినప్పుడు నాకు గుండు కొట్టించారు. నేను కుదురుగా ఉండకపోవటంతో కొలనులోకి దొర్లిపోయాను. నాన్నగారు వెంటనే చూడటంతో బతికి బయటపడ్డాను. మద్రాసులో సినిమా వాళ్ల పిల్లలంతా కేసరయ్య స్కూల్‌లోనే చదివేవారు. మేం కూడా అక్కడే చదువుకున్నాం. ఆ తరవాత రామకృష్ణ మిషన్‌లో చదివాం. కాలేజీలో నా అంతట నేనే చేరాను. తమ్ముళ్లని మాత్రం నాన్న చేర్పించారు. 1957లో అనుకుంటాను. పెళ్లికి వెళ్లి, తిరుపతి నుంచి తిరిగి వస్తున్నాం.

అప్పుడు నాకు ఏడేళ్లు. ముందు సీట్లో నాన్న ఒళ్లో పడుకున్నాను. ఆయన నా మెడ మీద చేయి వేసి పడుకోబెట్టుకున్నారు. బాగా వాన పడుతుండటంతో రాణీ పేట దగ్గర కారు చక్రం స్కిడ్‌ కావటంతో యాక్సిడెంట్‌ అయ్యింది. కుడివైపు చెట్టుకి కొట్టుకుని వెనక్కి వచ్చి మళ్లీ కొట్టుకుంది. అద్దాల ముక్కలు తలలో పడ్డాయి. సరిగ్గా అప్పుడు నాన్న నన్ను కిందకి తోసేసి, తను కూడా దూకేశారు. డ్రైవర్‌ జంప్‌ చేశాడు. చెట్టు కొట్టుకోవటం వల్ల, ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాం. కారు నుజ్జునుజ్జు అయిపోయింది. కారు కండిషన్‌ చూసినవారంతా మేం ఎలా బతికి బయటపడ్డామా అనుకున్నారు. ఆ ఏడుకొండల వాడి దయ వల్ల బతికాం అని నాన్న చెప్పేవారు. 1968లో సప్తస్వరాలు సినిమా స్వయంగా నిర్మించి అందులో నటించారు. ఆ సినిమాకి కావలసిన వస్తువులు కొంటూ నాకు 150 రూపాయలు పెట్టి సీకో వాచీ కొన్నారు. ఆ వాచీ చాలా సంవత్సరాలు వాడాను, అది పాడైపోయాక మళ్లీ చాలాకాలం వాచీ కొనుక్కోలేదు. 1974లో సింగపూరు వెళ్లినప్పుడు వాచీ కొని తెచ్చుకున్నాను. గడియారం కాలాన్ని ఎంత ముందుకు తోస్తున్నా మేము మాత్రం ఎప్పుడూ నాన్న జ్ఞాపకాల్లోనే ఉంటాం. – సంభాషణ: వైజయంతి పురాణపండ

అప్పటి నుంచి మాతోనే...
నేను మొదటి నుంచి నాన్నగారి ప్రొడక్షన్స్‌ చూసుకునేవాడిని. ఎక్కడా ఉద్యోగం చేయలేదు. చెన్నైలో ఉన్నన్ని రోజులు నాన్నగారు మా దగ్గరే ఉండేవారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేవారు. నాకు ముగ్గురు అబ్బాయిలు. సాయికిరణ్, కార్తిక్, గుణరంజన్‌. ముగ్గురూ ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నా భార్య లక్ష్మి. మా అత్తవారు మేము ఇరుగుపొరుగు వారం. నాన్నగారితో వియ్యమందుకున్నాక, మా మావగారు పి. చంద్రశేఖర్‌ మా ప్రొడక్షన్‌లో భాగస్వాములయ్యారు. –  ప్రతాప్‌

నా దగ్గరే...
నేను ఒక చిన్న ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాను. అమ్మ హైమవతి నా దగ్గరే ఉంది. నా భార్య ఉషశ్రీ. వాళ్లది తణుకు. మా అబ్బాయి సాయి ఈశ్వర్‌ బిటెక్‌ చదువుతున్నాడు. అమ్మాయి ప్రియాంకకు వివాహం అయ్యింది. అల్లుడు మెరైన్‌లో పనిచేస్తున్నాడు. – రాజా

మరిన్ని వార్తలు