చీకటి దారిలో వెలుగు పాట

2 Mar, 2020 04:03 IST|Sakshi
వీడియో పాటలో శివభక్తుడిగా నటించిన శ్రీనివాస్‌

అమ్మానాన్నలు లేక అనాథగా మిగిలినా.. రెండు కళ్లు శాశ్వతంగా చీకటిమయమైనా బతుకుపోరులో వెలుగు దారులు వెతుక్కుంటూ ముందుకుసాగుతున్నాడు. అన్నీ ఉన్నా ఇంకా ఏదో లేదనే నిరాశవాదులకు మిట్టపల్లి శ్రీనివాస్‌ జీవితం ఒక దిశా నిర్ధేశం చేస్తుంది.

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పయ్యపల్లెకు చెందిన గాయకుడు మిట్టపల్లి శ్రీనివాస్‌. తూర్పున సూర్యుడు ఉదయించినా.. తనకు మాత్రం బతుకంతా చీకటే. బాల్యంలోనే అమ్మానాన్నల మరణం అతడిని ఒంటరిని చేసింది. కష్టాలు నీడలా వెన్నంటి ఉన్నా.. కళ్లులేని చీకటి బతుకు వద్దని ఏనాడు అనుకోలేదు అతడు. బతుకు దారిలో వెలుగు రాదనీ తెలిసినా.. తన గాత్రంతో లోకాన్ని చూడాలనే సంకల్పం తనను ముందుకు నడిపిస్తోందంటున్నాడు మిట్టపల్లి శ్రీనివాస్‌.

మట్టి వినాయకుల తయారీ..
అనాథగా మిగిలి ఒంటిరిగా అద్దె ఇంట్లో ఉంటూ తన కాళ్ల మీద తాను నిలబడుతున్నాడు. ఇంటి పనులతోపాటు బట్టలు ఉత్కుకోవడం దగ్గరి నుంచి అన్నం, కూర వండుకుని తినడం వంటి  అన్ని పనులు తానే స్వయంగా చేసుకుంటాడు. చిన్నతనం నుంచే పర్యావరణాన్ని కాపాడాలంటూ అవగాహన కల్పిస్తూ, రెండు కళ్లు చూడలేకపోయినా పద్నాలుగేళ్లుగా మట్టి వినాయకులు తయారుచేసి వాటిని విక్రయిస్తూ ఎవరిపైనా ఆధారపడకుండా ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

శాపమైన పేదరికం

మిట్టపల్లి శ్రీనివాస్‌

నిరుపేద కుటుంబంలో పుట్టిన శ్రీనివాస్‌కు తన పదమూడో ఏట నుంచే కష్టాలు మొదలయ్యాయి. అందరి పిల్లలాగే పుస్తకాలతో బడికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి చేరాక అమ్మతో బీడీలకు దారం కట్టేవాడు. నాన్న బీమండిలో సాంచాలు నడుపుతూ తన రోగాలకు, నొప్పులకుపోను మిగిలిన సొమ్ముతో ఆరు నెలలకు ఒకసారి ఇంటికి వచ్చేవాడు. పదమూడేళ్ల వయసులో ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు  ఎడమ కన్నులో పువ్వు ఏర్పడి కన్ను మసకగా కనపడడం మొదలైంది. కానీ రెక్కాడితేగాని, డొక్కాడని బతుకులు. తన అంధత్వానికి పేదరికం ఎలా నిలిచిందో చెబుతూ – ‘నాన్న లక్ష్మీరాజం బీమండిలో సాంచాలపై పనిచేస్తుంటే అమ్మ లక్ష్మీ ఇంట్లో బీడీలు చుట్టి కుటుంబాన్ని వెళ్లదీసింది. ‘అమ్మా, కన్ను మసకబారుతోంది’ అంటే ‘అయ్యో..’ అని బాధపడింది. అప్పుడు ఆపరేషన్‌కి రూ.70 వేల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. ఏ పూటకాపూటే తినే రోజుల్లో ఆస్పత్రికి పోయే ఆర్థిక స్తోమత లేదని తెలిసి కాలం కరిగిపోయింది. ఏడాది తిరిగేలోగా కన్ను పూర్తిగా కానరాకుండ అయింది. అప్పటికే అమ్మ కూడా లోకాన్ని విడిచిపోయింది. తొమ్మిదో తరగతిలో నరాలు క్షీణించి మరో కన్నుసైతం మసకబారింది. పరీక్ష రాయలేని పరిస్థితిని గమనించి, మా సారు నాన్నకు కబురు పంపాడు. అక్కడా ఇక్కడా అప్పు పుట్టిన పదిహేను రోజుల్లోనే ఉన్న ఒక్క కన్నూ పూర్తిగా కానరాక పోయింది’అని తన జీవితంలో చీకట్లు కమ్ముకున్న తీరును గుర్తు చేసుకున్నారు మిట్టపల్లి శ్రీనివాస్‌.

బడిలో మొదలైన బతుకు పాట..
తొమ్మిదో తరగతిలో చూపు కోల్పోయిన శ్రీనివాస్‌ చదువుకోవాలనే ఆశను  కోల్పోలేదు. స్రై్కబ్‌ సాయంతో పది, ఇంటర్‌ పరీక్షలు పూర్తిచేశాడు. శ్రీనివాస్‌ చిన్ననాటి నుంచే పాఠశాల వార్షికోత్సవం, జాతీయ పండుగల్లో పాటలు పాడేవాడు. ఇంటర్‌ పూర్తిచేసిన శ్రీనివాస్‌ పాటలో తన ప్రతిభకు పదును పెట్టుకుంటూ సాగుతున్నాడు. ఆరో తరగతిలోనే జిల్లాస్థాయి పాటల పోటీల్లో పాల్గొని మొదటి బహుమతి అందుకున్నాడు. డ్రాయింగ్‌ కాంపిటిషన్‌లో సైతం బహుమతులు కూడా  గెలుచుకున్నాడు. పాటలే జీవితంగా సింగర్‌గా మారాలని అప్పుడే అనుకున్నాడు. రెండు కళ్లు పోయినా సింగర్‌ కావాలనే తన కలను చంపుకోలేదు. తన మధురమైన గొంతుతో పాటలు పాడుతూ తన కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటివరకు భక్తీగీతాలు, ఆల్బమ్‌ పాడిన శ్రీనివాస్‌ ఇప్పుడు టీవీ షోలలో రాణిస్తున్నాడు. ప్రముఖ టీవీ చానళ్లతో పాటు యూట్యాబ్‌లో శ్రీనివాస్‌ పాటలు ల„ý లాది మంది నుంచి ఆదరణ లభిస్తోంది. శ్రీను పాడిన ‘రాత  రాసే బ్రహ్మదేవుడా..’ పాటతో పాటు శివరాత్రి సందర్భంగా ఇటీవల మైక్‌ టీవీ విడుదల చేసిన  ‘బోళా శంకరా.. ఈశ్వరా.. శంబోశివా..’ పాటతో శ్రీనివాస్‌ గొంతు మరింత ప్రాచుర్యం పొందింది. యశ్‌పాల్‌ రాసిన ఈ పాట యూట్యూబ్‌లో మార్మోగింది.

పాటతోనే లోకాన్ని చూస్తున్నా
రెండు కళ్లు లేవనే బాధ కన్నా కంటికి రెప్పలా కాపాడే అమ్మానాన్న ఇద్దరూ నన్ను అనాథను చేసి వెళ్లిపోయారనే బాధ ఎక్కువగా ఉంది. చీకటి పడిందంటే అడుగుబయటపెట్టేవాన్ని కాదు. రాత్రిపూట అమ్మ నన్ను విడిచి ఎక్కడికీ వెళ్లేది కాదు. అర్ధరాత్రి వరకు అమ్మ బీడీలు చేసి, వచ్చిన పైసలతో బతుకె వెళ్లదీసింది. నాన్న భీమండిలో సాంచాల పనిచేసేవాడు. అమ్మ పోయిన తర్వాత నాన్న నాకోసం ఇంటికి వచ్చి, కంటికి రెప్పలా చూసుకున్నాడు. నాన్న కూడా మరణించాక ఇప్పుడు చీకటే లోకంగా బతుకుతున్న. పాటతో లోకాన్ని చూడాలని, నిరుపేదల బతుకుల్లో చీకటి తొలగించే వెలుగుదివ్వెగా నా పాట ఉపయోగపడాలన్నదే నా సంకల్పం. – మిట్టపల్లి శ్రీనివాస్‌

ఒంటరి జీవితం.. స్వయం పాకం..
29 ఏళ్ల శ్రీనివాస్‌ గత పద్నాలుగేళ్లుగా చీకటేæలోకంగా బతుకు వెళ్లదీస్తున్నాడు. తల్లి లేదు తండ్రీ లేడు, రెండు కళ్లు లేవు, ఇల్లు లేదు, జాగ లేదు.. అయినా ఏనాడూ బతుకు భారం అనుకోలేదు. ఇంకొకరికీ భారంగానూ ఉండాలనుకోలేదు. అలాగని ఆత్మహత్య ఆలోచనను తన దరికి రానీయలేదు. కష్టాలు, కన్నీళ్లు దిగమింగుకుంటూ కాలంతో పోటీపడుతున్నాడు. తన తొమ్మిదో ఏట తల్లి లక్ష్మి, పదిహేడో ఏట తండ్రి లక్ష్మిరాజం అనారోగ్యంతో మరణించారు. పద్నాలుగేళ్లుగా శ్రీనివాస్‌ ఒంటరి జీవితం గడుపుతున్నాడు. తనకు తానే అన్ని పనులు చేసుకుంటాడు. తానే అన్నం, కూరలు వండుకుంటాడు. వంటకు అన్ని సరుకులు ఒక్క దగ్గర పెట్టుకుని చేతి స్పర్శతోనే ఉప్పు కారం మోతాదు అంచనా వేసుకుని కూర వండుకుంటాడు. అన్ని వేలలా స్నేహితులే అండగా ఉంటున్నారని వారి సాయంతోనే ప్రోగ్రాంలకు పాటలు పాడేందుకు వెళ్లగలుగుతున్నానని అంటాడు శ్రీనివాస్‌. – పాదం వెంకటేశ్, సాక్షి, జగిత్యాల ఫొటోలు : జవ్వాజి చంద్రశేఖర్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు